లంక బహుముఖ ఐశ్వర్యానికి
మురిసిపోయిన హనుమ
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం
జ్వాలానరసింహారావు
సూర్య దినపత్రిక
(31-07-2017)
చీకటనేది రాకుండా వుండేందుకై, నవరత్న ఖచిత ఇండ్ల సముదాయంతో నిర్మించిన లంకానగరంలో
ప్రవేశిస్తున్న కోతిని లంకాదిదేవత లంఖిని తన సహజ రూపంతో చూసింది. అదే సమయంలో ఆమెనూ
చూసాడు హనుమంతుడు. తక్షణమే కోపంతో వూగిపోతూ అసహ్యమైన ముఖాన్ని, భయంకరమైన
రూపాన్ని, దాల్చిన “లంక” హనుమంతుడికి అడ్డంగా నిల్చి గర్జిస్తూ,
“నువ్వెవరివి? ఎందుకొచ్చావు? నీవు చావక ముందే చెప్పు” అని ప్రశ్నించింది. ఎల్ల
వేళల, అన్ని ప్రదేశాలలో, రావణుడి
సేనలతో రక్షించబడుతున్నలంకా నగరంలోకి దేవతలే ప్రవేశించలేనప్పుడు ప్రవేశించినా
బ్రతకలేనప్పుడు, హనుమంతుడేలా రాగాలిగాడని నిలదీస్తుంది.
"సరే నాసంగతి
తర్వాత చెప్తాను. వికారపు కన్నులతో, లంకా
నగర వాకిట్లో వున్న నీవెవ్వరవు? ఇక్కడెందుకున్నావు? నాకెందుకు అడ్డుపడ్తున్నావు? ఊరంటూ వుంటే ఎవరో ఒకరు
రాకుండా వుండరు కదా!" అని ఎదురు ప్రశ్న వేస్తాడు
ఆంజనేయుడు. ఆమాటలు విన్న "లంక"
మండిపడి, మారుతిని చూసి కోపంతో, భయంకరంగా మాట్లాడడం మొదలెట్టిందీవిధంగా:
"రావణాసురుడి
ఆజ్ఞను శిరసావహించి, ఈపట్టణాన్ని ఎల్లవేళలా రక్షిస్తున్నాను.
నాకళ్లు కప్పి నువ్విందులోకి రాలేవు. అది
సాధ్యపడే విషయం కాదు. ఓ కోతీ, నువ్విప్పుడే
చస్తావు. నేనే లంకనురా! ఇది నాసంగతి. మరి నువ్వెవరివో చెప్పు."
"లంకిణి"
మాటలకు ఏ మాత్రం అధైర్యపడలేదు హనుమంతుడు. స్త్రీ
ఆకారంలో వున్న ఆమెను చూస్తూ, ఏమాత్రం సందహించకుండా:
"సైన్యంతో, ప్రాకారాలతో, గోపురాలతో, వెడల్పైన ఇండ్ల ముంగిళ్లతో, తోటలతో, అందంగా వున్న, ఈ లంకను
చూసిపోదామన్న కోరికతో వచ్చాను" అని చెప్పాడు. తనను గెలవకుండా ద్రోహబుధ్ధిగల హనుమంతుడు రావణుడు రక్షించే లంకా నగరంలోకి
ఎట్లా పోతాడో చూస్తానని కఠినంగా అంటుంది లంకిణి. ఏదేమైనా
తాను లంకను చూసి శీఘ్రంగా వచ్చిన దారిలోనే పోతానన్న హనుమంతుడిపై మండిపడుతూ,
భయంకరమైన ధ్వని చేస్తూ, అరచేత్తో ఆయన్ను
కొడుతుంది. దెబ్బతిన్న మారుతి, కేకపెట్తూ,
ఆడదానిపై తన ప్రతాపం ఎందుకు చూపాలని అనుకుంటూ పెద్దగా కోప్పడక,
తన ఎడమచేతి పిడికిలితో లంకిణిని పొడుస్తాడు.
ఆ మాత్రం పిడికిటి పోటుకే, లంకిణి
నోరు తెర్చుకుని, నేలమీద పడిపోయింది.
హనుమంతుడు దాన్ని జాలిగా్, దయతో చూశాడు. లంకిణి గర్వమణిగి హనుమంతుడితో: "వానరేంద్రా!నన్ను రక్షించు. నామీద దయ చూపు. నువ్వు చాలా పరాక్రమవంతుడవు. బలవంతులు స్త్రీలను
చంపరాదన్న నీతికి కట్టుబడ్తారు. నేనే "లంకిణి" ని. యుధ్ధంలో
సాహసంతో, బలపరాక్రమాలతో, నన్నే
గెలిచావు. నీకు రాక్షసులు ఇక అడ్డమా? లంకా
నగర ప్రతిష్ఠ సమయంలో నాకు బ్రహ్మదేవుడు వరమిస్తూ, సీతాదేవిని
వెతికేందుకు వచ్చే కోతి నిన్నెప్పుడు గెలుస్తాడో, అప్పుడే
లంక నాశనమౌతుందని చెప్పాడు" అంటుంది.
తాను సత్యం
చెప్తున్నాననీ, బ్రహ్మ దేవుడు యదార్ధం చెప్పాడనీ, ఆయన మాటలు తప్పు కావనీ, సీతాదేవి కారణాన రాక్షసులకు,
రావణుడికి చావు మూడిందనీ, హనుమంతుడు నగరంలోకి
పోయి పట్టణమంతా కలియతిరిగి, తన ఇష్ఠ ప్రకారం చేయదల్చుకున్న
పనులన్నీ చేయవచ్చని హనుమంతుడికి చెప్తుంది లంకిణి. పతివ్రతల
శాపానికి గురైన లంకలోకి ప్రవేశించి సీతను చూసేందుకు కోరిక తీరేవరకు సుఖంగా లంకలో
తిరగమని కూడా సలహా ఇస్తుంది.
లంకలో
ప్రవేశిస్తున్న హనుమంతుడికీ, అడ్డుతగిలిన లంకిణికీ, యుధ్ధం జరుగుతున్నప్పుడు, వారు
కొట్టుకున్టున్నప్పుడు, ఆకేకలు వూళ్లో వున్న రాక్షసులకు
ఎందుకు తెలియలేదని సందేహం రావచ్చు. గ్రామదేవతల గుళ్లు ఊరిబయట
వుంటాయి. వూళ్లోకి రావటానికి వీల్లేని వ్యక్తులను, పొలిమేరదాటకుండా చేసేటందుకే వీరు అక్కడ కాపలా కాస్తుంటారని శాస్త్రం
చెప్తున్నది. లంకిణికి, హనుమకు మధ్య
జరిగిన గొడవ వూరిబయట జరిగింది. అదీ రాత్రివేళ. వూళ్లోవారి అరుపుల మధ్య ఇవి వినపడే అవకాశం లేదు. మరో
విషయం, ఎవ్వరూలేని ప్రదేశం గుండా లంకలోకి ప్రవేశించే
ప్రయత్నం చేసాడు హనుమండు. ఇకపోతే , హనుమంతుడు
చెప్పక పోయినప్పటికీ, బ్రహ్మదేవుడి మాటలను గుర్తుచేసుకున్న
లంకిణి, హనుమంతుడు సీతాదేవికొరకే వచ్చాడని
నిర్ధారించుకుంటుంది.
("లం"
అనేది పృధివీ బీజాక్షరం. కాబట్టి
పృధివీతత్వాన్ని తెలుపుతున్నది. అది కలది "లంక". లంకంటేనే "దేహం". హనుమంతుడు లంకను జయించాడంటే, తనలోని ఆత్మను
వెతికేవాడు, మొదట దేహాన్ని జయించాలన్న అర్ధం స్ఫురిస్తున్నది.
దేహాన్ని జయించనివాడికి ఆత్మావలోకనం జరగదు).
రాక్షస సంచారం లేని ప్రదేశం ద్వారా హనుమంతుడు లంక లోనికి ప్రవేశించాడంటే, లంకా పరాజయం (లంకిణీ పరాజయం) రాక్షసులకు తెలిసే అవకాశం లేదనుకోవాలి. శతృ
స్థానాలలోకి దొడ్డిదారి ("అద్వారం") నుండే ప్రవేశించాలన్నది రాజనీతి. హనుమంతుడదే
పనిచేసాడు. జరాసంధుడితో యుధ్ధం చేసేందుకు పోయిన కృష్ణ,
భీమార్జునులు అదే పని చేసారు.
(ఇలా చేయడం వెనుక "ముముక్షు" వైన "యోగి" చర్య ఎలా వుండాలో సూచించ బడింది. వివరం లోకి పోతే: "ఆత్మావలోకన పరుడు" సత్య
విక్రముడై వుండాలి. "సత్యం" అంటే,
"అహింస, సత్యం, అస్తేయం,
బ్రహ్మచర్యం, అపరిగ్రహం" అనే "యమము" లన్నింటికీ
ఉప లక్షణం. ఆత్మ, సత్యం వల్ల, తపస్సు వల్ల, జ్ఞానం వల్ల్, బ్రహ్మచర్యం
వల్ల లభిస్తుంది. ఇవన్నీ హనుమంతుడిలో
వున్నాయి. కాబట్టి "సత్యం" అనేది
అన్నింటికీ ఉప లక్షణం. బలహీనులకు "ఆత్మ" లభించదు.
"లంక"నే దేహం ప్రకృతి పరిణామం.
అది కామ రూపిణి. "లంక" శబ్దానికి "రంకుటాల" అనే అర్ధం కూడా వుంది. ఈ జీవుడిని యీ జన్మలో అనుసరించిన దేహం, మరో జన్మలో
మరో జీవుడిని ఆశ్రయిస్తుంది. అంటే యీ దేహం రంకుటాల లాంటిది.
తపస్సుతో దేహాన్ని గెలవాలే కాని సౌమ్య మార్గంలో కాదు. నశించేది దేహం. దేహంలోకి పోయేందుకు "నవ" ద్వారాలున్నాయి. ఆత్మలో
మనస్సు పోవడానికి యీ ద్వారాలు పనికి రావు.)
శత్రు దేశంలోకి
ప్రవేశించేటప్పుడు ఎడమకాలు ముందుంచాలి. కాబట్టి
సుగ్రీవుడి మేలుకోరి శత్రు స్థావరం చేరుతున్న హనుమంతుడు ఆ పద్ధతినే అనుసరిస్తాడు. మేలుకోరేవారింట్లోకి పోయేటప్పుడు కుడికాలు ముందుంచాలని అంటారు. ఊళ్లోకి పోయ్యేందుకు పూలతోను, ముత్యాలతోను, అందంగా కనిపిస్తున్న రాచబాటకు చేరిన హనుమంతుడు, మనోహరమైన
ఆ పట్టణాన్ని నాలుగు దిక్కులనుండి చూసి, దాని బహుముఖ ఐశ్వర్యానికి మురిసిపోయాడు. విశేషంగా
ధ్వనిస్తున్న వీణానాదంతో, మేళ, తాళ
ధ్వనులతో, పకపక నవ్వుల అతిశయంతో, వజ్ర
వైడూర్యాలు నిండిన ఇళ్లతో, తెల్లని మేఘకాంతి కల్గి అతిశయ
మహిమగల "స్వస్తికం", "పద్మం",
"వర్ధమానం"అనే ఆకారాలున్న రాక్షస
గృహసముదాయాలతో, చిత్రమైన మాల్యాలతో, భూషణాలతో,
కాంతివంతమైన లంకా నగరాన్ని చూసాడు హనుమంతుడు. చూసిన
వెంటనే సుగ్రీవుడి మేలుకోరి రామకార్యార్ధమై లోనికి పోయేందుకు ప్రయత్నిస్తూ
సంతోషిస్తాడు.
No comments:
Post a Comment