కొరవడుతున్న సహకార
సమాఖ్య స్ఫూర్తి
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (30-11-2017)
కేంద్రప్రభుత్వం
సమస్త అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోకుండా,
రాష్ట్రాలకు వికేంద్రీకరించి, సుపరిపాలనకు మార్గం సుగమం చేయాల్సిన తరుణం
ఆసన్నమైంది. షెడ్యూల్డ్ కులాల, తెగల,
మైనారిటీల రిజర్వేషన్లు పెంచే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్
రావును శ్లాఘిస్తూ, ఆయన సామాజిక న్యాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు గొప్పవని తమిళనాడు
డీఎంకే నాయకుడు ఎంకె స్టాలిన్ పత్రికా ప్రకటన విడుదల చేయడం,
దరిమిలా కేసీఆర్ ఆయనకు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలపడం, హైదరాబాద్
వచ్చిన మరుక్షణం ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించి “సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం కట్టుబడి వుంటుంది”
అని ప్రధాని మోడీ చెప్పడం, కేంద్ర రాష్ట్ర సంబంధాలలో, సహకార సమాఖ్య మనుగడలో నూతనాధ్యాయానికి తెరదించుతుంది. పెంచిన
రిజర్వేషన్లు అమలుకొరకు, రాష్ట్రాల హక్కులకొరకు, అవసరమైతే
దేశంలోని ఇతర రాష్ట్రాల నాయకులను కలుపుకుని, భారత రాజధాని డిల్లీలో జంతర్-మంతర్
దగ్గర కేసీఆర్ సారధ్యంలో ధర్నా నిర్వహించే అంశం కూడా స్టాలిన తన పత్రికా ప్రకటనలో
ప్రస్తావించారు. సహకార సమైఖ్య సిద్ధాంతాలప్రాతిపదికగా,
విభిన్న దృక్ఫదాల రాజకీయ నాయకుల ఆలోచనాసరళులకు అవకాశం కలిగించే రీతిలో, సర్దుబాటు
ధోరణిలో పనిచేసే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. కాకపోతే ఏమేరకు ఈ సహకార
సమాఖ్య విధానం ఆచరణలో పనిచేస్తున్నదనేది సమాధానం దొరకని ప్రశ్న.
రెండేళ్ళ క్రితం
చైనాలో జరిగిన ప్రపంచ ఆర్ధిక సమావేశంలో మాట్లాడిన సీఎం భారత సమాఖ్య వ్యవస్థను
గట్టిగా సమర్థించారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నందున
దాన్ని గుర్తించిన కేంద్రం రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో నిధులు, అధికారాలు ఇవ్వనున్నట్లు ఆ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ఆ
క్రమంలోనే ప్రణాలికా సంఘం స్థానంలో నీతీ ఆయోగ్ ఏర్పాటైందనీ,
అందులో రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ సభ్యులనీ, ప్రధానమంత్రి
దాని అధ్యక్షుడనీ, దాన్నే “టీం ఇండియా” గా పిలుస్తారనీ సీఎం చెప్పారు. ఇలా
ఏర్పాటైన నీతీ ఆయోగ్ దేశాభివృద్ధికి, రాష్ట్రాల అభివృద్ధికి
అవసరమైన ప్రణాలికా రచన చేస్తుంది. దీనర్థం సమాఖ్య స్ఫూర్తితో పనిచేసే భారత దేశంలో
రాష్ట్రాలకు గణనీయమైన పాత్ర వుందని.
ఇదిలా వుండగా, ఈ
నెల జరిగిన రాష్ట్ర శాసనసభ సమావేశాలలో మైనారిటీ సంక్షేమంమీద జరిగిన లఘు చర్చలో
పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రాలకు
అధికారాల బదిలీ విషయం పునరుద్ఘాటిస్తూ, 70 సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం,
కేంద్ర-రాష్ట్రాల అదికారాలను కూలంకషంగా
సమీక్షించి, దేశాన్ని సమీకృతంగా ముందుకు తీసుకుపోవడానికి
చాలా విషయాలలో అధికారాలను రాష్ట్రాలకు బదలాయించాలని అన్నారు. అధికారాలు
కేంద్రీకృతం కాకూడదని ఆయన చెప్పారు. రాష్ట్రాల సోషల్ కాంపోజిషన్ మారుతున్నదనీ,
స్వతంత్రం వచ్చినప్పుడున్న పరిస్థితులకూ, ఇప్పటి
పరిస్థితులకూ తేడా వున్నదనీ, ప్రజల ఆశలు,
డిమాండ్లు పెరుగుతున్నాయనీ, తదనుగుణంగా
అధికార వికేంద్రీకరణ జరగాలని నొక్కిచెప్పారు. ఎస్సీల,
ఎస్టీల, మైనారిటీల సామాజిక వెనుకబాటుదనం దృష్టిలో
పెట్టుకుని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా,
వారి రిజర్వేషన్ శాతం పెంచాలని అంటూ, తమిళనాడు
లాగానే తమ విషయంలో కూడా దాన్ని రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్ లొ చేర్చాలని,
లేదా, కేంద్రం తిరస్కరిస్తే అత్యున్నత న్యాయస్థానం మెట్లు తొక్కుతామనీ అన్నారు.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణా పార్లమెంట్ సభ్యులు సభలో భయంకరమైన పోరాటం
చేస్తారని కూడా ఆయన హెచ్కరించారు.
ఈ నేపధ్యంలో ఒక్కసారి భారతదేశంలో
సహకార సమాఖ్య ఆవిర్భావం, పరిణామక్రమం,
క్రమేణా పరిస్థితులు మారిపోయి ఆకారణలో తిరోగమనానికి దారితీయడం, ఏక కేంద్రక
ప్రభుత్వం దిశగా అడుగులు వేయడం లాంటి అంశాలమీద విశ్లేషణ జరగడం అవసరమేమో! అవసరాల
అనుగుణంగా, నెలకొన్న పరిస్థితుల ఆధారంగా,
సమాఖ్య పద్దతిగానైనా, ఏక కేంద్రక
పద్దతిగా నైనా, పనిచేసే విధంగా కేంద్రంలో ప్రభుత్వం నడవడానికి
భారతరాజ్యాంగం వీలుకలిగించింది. కాలక్రమేణా, భిన్నమైన రాజకీయ పోకడల కారణంగా,
ఉదాత్తమైన సహకార సమాఖ్య దిశగా కాకుండా, పటిష్టమైన ఏక కేంద్ర పోకడల దిశగా కేంద్ర
ప్రభుత్వం పయనించడం గమనార్హం. నీతీఆయోగ్ ఏర్పడినప్పటికీ, ఈ
విషయంలో పెద్దగా మార్పు కనపడిన దాఖలాలు అంతగా లేవు. రాష్ట్రాలను ఆదుకునే విషయంలో
కానీ, ఉదారంగా నిధులు విడుదల చేసే విషయంలో కానీ,
అధికారాలను వికేంద్రీకరించే విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను
కాపాడుతున్నట్లు కనిపించడం లేదు.
ఉదాహరణకు,
నూతన రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ పారిశ్రామిక విధానాన్నే తీసుకుందాం. దీనికి
అనుకున్న ప్రోత్సాహం కేంద్రం నుంచి రావడం లేదు. పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా
నిర్మిస్తున్న రెండు పడక గదుల పథకానికి ఉదారంగా రావాల్సిన నిధుల జాడ లేదు.
మంచినీటి పథకానికి తెలంగాణ విరివిగా ఖర్చు చేస్తున్నది...సాగునీటి ప్రాజెక్టులకు
భారీ నిధుల కేటాయింపున్నది...అనేక సంక్షేమ కార్యక్రమాలను,
దేశంలో ఎక్కడా అమలుకాని విధంగా తెలంగాణాలో అమలవుతున్నాయి. వీటన్నిటికీ అందాల్సిన
మోతాదులో, అందునా సహకార సమాఖ్య అని చెప్పుకుంటున్న నేపధ్యంలో, కేంద్ర సహాయం అందడం లేదనేది అక్షర సత్యం.
సహకార సమాఖ్యకు చారిత్రాత్మక
నేపధ్యం వుంది. రాచరిక వ్యవస్థ వేళ్లూనుకున్న రోజుల్లోనే సమాఖ్య స్ఫూర్తితో,
స్థానిక స్వపరిపాలనలో రాజులు-చక్రవర్తుల జోక్యం చేసుకోలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ
పాలనా వ్యవహారాల్లో నాటి ఆంగ్లేయ ప్రభుత్వం క్రమబద్ధీకరణ-నియంత్రణ విధానాన్నే
పాటించింది కాని నిరంతరం జోక్యం చేసుకోలేదు. భారత ప్రభుత్వ 1919 చట్టం కూడా “డైఆర్ఖీ”
పేరుతొ సమాఖ్య భారత దేశాన్ని పేర్కొన్నది. రాష్ట్రాలతో “సహకారం, సంప్రదింపులు” అనే
సిద్ధాంతాన్నే జవహర్లాల్ నెహ్రూ చెపుతుండేవారు. సంస్తానాలన్నీ భారత యూనియన్ లో
అంతర్భాగం కావడం సహకార సమాఖ్య స్ఫూర్తితోనే!
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సుమారు
రెండు దశాబ్దాలు ఎకచ్చత్రాదిపత్యంగా, అటు కేంద్రంలోనూ, ఇటు
రాష్ట్రాలలోను, భారత జాతీయ కాంగ్రెస్ పాలన వుండేది. దరిమిలా
కాంగ్రెసేతర పరభుత్వాలు కొన్ని రాష్ట్రాలలో ఏర్పడడంతో సమాఖ్య వైపు కొంత మళ్లడం
జరిగింది. మరికొంత కాలానికి కాంగ్రెసేతర ప్రభుత్వాలే కాకుండా, అటు
కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ,
సంయుక్త-సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడంతో మరికొంత మార్పు సమాఖ్య దిశగా కనిపించినా,
అదే స్ఫూర్తితో, అది ఎంతో కాలం కొనసాగలేదు. రాజ్యాంగంలోని
కేంద్ర ప్రభుత్వ జాబితా అంశాలు, ఉమ్మడి
జాబితాలోని అంశాలు, ఇంకా ఇప్పటికీ భారత రాజ్యపాలన విధానాన్ని శాసిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ జాబితా అంశాలు వెనుకంజలోనే వున్నాయి. ఈ పధ్ధతి మారకపోతే,
సరిదిద్దుంపు చర్యలు చేపట్టకపోతే, సహకార
సమాఖ్య కాస్తా ప్రతిఘటన వ్యవస్థగా రూపాంతరం చెంది, రాష్ట్రాలు
మరిన్ని వికేంద్రీకరనాధికారాలు కావాలని దిమాడు చేయడం తప్పదు.
రాజ్యాంగంలో మూడు రకాల ప్రభుత్వ జాబితాలున్నాయి.
కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా,
ఉమ్మడి జాబితా. వాస్తవానికి అవశేష అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే
వుంటాయి. కేంద్ర ప్రభుత్వ జాబితాలో వున్నా 100 అంశాలు రాజ్యాంగం ఏడవ షెడ్యూల్ లో
వుంటాయి. వీటికి సంబంధించి చట్టం చేసే అధికారం సంపూర్ణంగా పార్లమెంటుది మాత్రమే.
వీటిలో మిగతావాటితో పాటు, రక్షణ,
విదేశాంగ వ్యవహారాలు, పౌరసత్వం, రైల్వేలు,
జాతీయ రహదారులు లాంతి వాటితో పాటు రాష్ట్ర జాబితాలో, ఉమ్మడి
జాబితాలో చేర్చని అన్ని అంశాలు వుంటాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో 61
అంశాలున్నాయి. అయినప్పటికీ వీటికి సంబంధించిన ఎలాంటి చట్టం రాష్ట్ర చట్ట సభల్లో
చేయాలన్నా, వాటి చట్టబద్ధత మాత్రం పార్లమెంట్ సర్వసత్తాక
అధికారానికి లోబడే వుంటుంది ఒక విధంగా. కాకపోతే, ఉమ్మడి
జాబితాలోని అంశాలకు సంబంధించి రాష్ట్ర శాసనసభ చేసిన చట్టానికి రాష్ట్రపతి ఆమోదం
లభిస్తే దానికి చట్టబద్ధత వుంటుంది. రాష్ట్ర జాబితాలో పోలీసు,
జైళ్ళు, స్థానిక స్వపరిపాలన, ప్రజారోగ్యం,
విద్యుత్ లాంటివి వున్నాయి. అదే విధంగా ఉమ్మడి జాబితాలోని 52 అంశాలున్నాయి.
భారత రాజ్యాంగంలో ఎక్కడాకూడా
“సమాఖ్య” అన్న పదం లేదు. కాకపోతే, సమాఖ్యకు
వుండాల్సిన అన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి: కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు; అధికారాల
పంపకం; వ్రాతపూర్వక రాజ్యాంగం;
రాజ్యాంగానికుందాల్సిన సంపూర్ణ ఆధిపత్యం; దృఢమైన
రాజ్యాంగం; స్వతంత్ర న్యాయవ్యవస్థలు; ఉభయ
సభల శాసన నిర్మాణ వ్యవస్థ. ఇన్ని ఉన్నప్పటికీ, సమాఖ్య తరహా, ఏక
కేంద్రక స్ఫూర్తి వున్న భారత దేశాన్ని “రాష్ట్రాల సంయోగ వ్యవస్థ” (Union of States) అనే సంబోధిస్తారు.
కేంద్ర ప్రభుత్వ సహాయంతో అమలు
కావాల్సిన అనేక పథకాల నిధుల ఉపయోగం విషయంలో పూర్తీ అధికారం రాష్ట్రాలకే బదలాయిస్తే
సమాఖ్య స్ఫూరికి అర్థం వుంటుంది. అలా చేస్తే ఆ పథకాల అమలు శాస్త్రీయంగా,
రాష్ట్రాల అవసరలాకు అనుగుణంగా జరిగే వీలుంది. ప్రధానమంత్రి జేఏఎస్ సదస్సు
సందర్భంగా హైదరాబాద్ విమానాశ్రయంలో మాట్లాడుతూ, సహకార
సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం కట్టుబడి వుందని అన్నారు. అలాగే నీతీఆయోగ్ మొదటి
సమావేశంలో మాట్లాడుతూ సహకార సమాఖ్య అంశాన్ని పడే-పడే ప్రస్తావించారు. రాజకీయాలకు
అతీతంగా కేంద్ర ప్రభుత్వాన్ అసలు-సిసలైన సహకార సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరిస్తేనే
రాష్ట్రాల భివృద్ధి, తద్వారా
దేశాభివృద్ధి సాధ్యపడుతుంది.