Saturday, November 18, 2017

ఇందిర అరుదైన వ్యక్తిత్వం :వనం జ్వాలా నరసింహారావు

ఇందిరా గాంధి శతజయంతి సందర్భంగా
ఇందిర అరుదైన వ్యక్తిత్వం
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (19-11-2017)
1941 లో భారత స్వాతంత్ర్య సంగ్రామం ఉధృత రూపం దాలుస్తున్న సమయంలో, బ్రిటీష్ ప్రభుత్వంతో తాడో-పేడో తేల్చుకోవాలని సమరయోధులు భావిస్తున్న తరుణంలో, విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న జవహర్లాల్ నెహ్రూ కూతురు ఇందిరా ప్రియదర్శిని స్వదేశానికి తిరిగొచ్చింది. తల్లి కమలా నెహ్రూ మరణించిన తర్వాత ఇందిర ఆక్స్ ఫర్డ్ లో చేరింది. అనారోగ్యం వల్ల ఎక్కువ కాలం స్విట్జర్లాండులో చికిత్స కొరకు వెళ్ళాల్సి వచ్చినప్పటికీ, ఆక్స్ ఫర్డ్ లో వున్నన్నాళ్ళు, బ్రిటీష్ లేబర్ పార్టీ విద్యార్థి విభాగం కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే ది. రెండవ ప్రపంచ యుద్ధం రోజుల్లో, రెడ్ క్రాస్ వాలంటీర్ గా చేరి, కొంతకాలం అంబులెన్స్ డ్రైవర్ కూడా పనిచేసింది. స్వదేశానికి తిరిగొచ్చే సమయంలో ఆమె వెంట, చిన్ననాటి స్నేహితుడు, కాంగ్రెస్ పార్టీలో అప్పటికే చురుగ్గా పాల్గొంటున్న అలహాబాద్ పాత్రికేయుడు ఫిరోజ్ గాంధీ కూడా వున్నారు. తామిద్దరం వివాహం చేసుకుంటామని ఇందిర ప్రకటించడంతో కుటుంబ సభ్యులు ఇబ్బందికి లోనయ్యారు. ఇరువురి దీ ఒక మతం కాదు-ఒక కులం కాదు. అయినా, ఇద్దరి వివాహం జరగడం, కొద్ది కాలంలోనే ఇరువురు జైలు జీవితం గడపాల్సి రావడం, ఆ తర్వాత విడుదలై వైవాహిక జీవితం గడపడం, రాజీవ్-సంజయ్ లు పుట్టడం ఒకటి వెంట ఒకటి జరిగింది నాలుగేళ్లలోపు.

కారణాలే వైనా, ఇందిరా గాంధీకి ఎందుకో గాని, తల్లి కమల పట్ల ఇతర నెహ్రూ కుటుంబ సభ్యుల ప్రవర్తన నచ్చలేదని అంటుండేదట. పాశ్చాత్య నాగరికత పుణికి పుచ్చుకున్న వారి మధ్య సాంప్రదాయ నేపధ్యం నుంచి వచ్చిన కమల ఇమడ లేకపోవడంతో, బాల్యం నుంచే ఆమెలో "భారతీయత" భావాలు పెంపొందినట్లు ఆమే చెప్పుకునే వారు. హిందూత్వ భారతీయురాలిగా తల్లి వారసత్వాన్ని పొందిన ఇందిరా గాంధీ తనపై ఆమె ప్రభావం ఎంతగానో వుందని చెప్పడానికి, తల్లి వలె తాను తన మనసును నొప్పించుకోదల్చుకోలేదని అంటుండేదట. బాల్యంలో ఆ సంఘర్షణల మధ్య, జైలులో వున్న తండ్రి జవహర్లాల్ నెహ్రూ తనకు రాసిన ఉత్తరాలలో వర్తమాన ప్రపంచ చరిత్రతో పాటు ప్రాచీన, భవిష్యత్ దర్శనం కలిగే విధంగా ఎన్నో విషయాలను తెలుసుకోగలిగింది. తండ్రితో తనకేర్పడిన సహవాసం ఉత్తరాల ద్వారా అని, అవెంతో విలువైనవని అనేదామె. జవహర్లాల్ జైలునుంచి మధ్య-మధ్య విడుదలై అటో-ఇటో తిరుగుతున్నప్పటికీ, ఇరువురి అనుబంధం నెహ్రూ ఆమెకు చూపిన "ప్రపంచ దర్శిని" ద్వారా బలపడ సాగింది. సంజయ్ గాంధీ పుట్టిన సంవత్సరంలోనే నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తండ్రి దగ్గరకు వచ్చే వారికి ఆతిథ్యం సమకూర్చే బాధ్యతలను, అనధికారికంగా ఇందిర చేపట్టాల్సి వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగింది. ఇష్టంగానో-అయిష్టంగానే ఆమె తన బాధ్యతలను కర్తవ్య పరాయణ తో నిర్వర్తించింది. తండ్రితో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం ఏర్పడడంతో, ఆమె అవసరం నెహ్రూకు కూడా పెరిగి పోవడంతో, ఫిరోజ్ తో గడిపే వీలు తగ్గి, చివరకు వేర్వేరుగా జీవించే పరిస్థితి కలిగింది. ఆయన చనిపోయేంతవరకూ అంతే కొనసాగింది.

తమ ధోరణికి అనుకూలించడనుకున్న మొరార్జీ కాకూడదనే ఆలోచనతో, తమ అదుపు ఆజ్ఞల్లో-కనుసన్నల్లో నడుచుకుంటుదన్న ధీమాతో కామరాజ్ నాడార్, నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి లాంటి వారు ఇందిరా గాంధీ వైపు మొగ్గు చూపారే కాని, భవిష్యత్ లో ఆమె నుంచి పొంచి వున్న ప్రమాదాన్ని పసికట్ట లేకపోయారు. అనిశ్చిత పరిస్థితుల నడుమ, ఒకటి-రెండు కఠోర నిర్ణయాలను తీసుకోగలిగినా, నిలదొక్కుకొన డానికి ఇబ్బందులకు గురవుతూనే వుండేది ఇందిర.  ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించడంతో భవిష్యత్ పై దృష్టి సారించింది ఇందిరా గాంధీ. జాతీయ స్థాయిలో యావత్ భారత దేశ ప్రజలంగీకరించే ఏకైక నాయకురాలు తానేనని గ్రహించింది ఆమె. పార్టీ ప్రక్షాలణకు సమయం ఆసన్నమైందని, ప్రజలకు తాను మరింత చేరువ కావాలంటే, సామ్యవాద పంథాలో పయనించడం మినహా మార్గం లేదని విశ్వసించింది. తదనుగుణంగా ప్రభుత్వ పథకాల రూపకల్పనకు అంకురార్పణ చేయసాగింది.

అకస్మాత్తుగా మరణించిన రాష్టపతి జకీర్ హుస్సేన్ స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో పార్టీలోని విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఇందిరా గాంధీని విమర్శించే నీలం సంజీవరెడ్డిని ఇందిర వ్యతిరేక కాంగ్రెస్ అధిష్టాన వర్గం అభ్యర్థిగా నిర్ణయించింది. నామినేషన్ పై ఆయననే ప్రతిపాదించిన ఇందిరా గాంధీ, ఓటింగులో, స్వతంత్ర అభ్యర్థి వీవీ గిరికి మద్దతును బహిరంగంగానే ప్రకటించి, తన వారందరినీ ఆయనకే ఓటెయ్యమని సూచించింది. ఆమే నెగ్గింది. నీలం ఓటమి పాలయ్యారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు, తన వ్యతిరేక వర్గానికి చెందిన మొరార్జీ దేశాయ్ ని మంత్రివర్గంలోంచి వెళ్లిపోయే పరిస్థితులు కలిపించింది. క్రమశిక్షణను ఉల్లంఘించిందన్న ఆరోపణపై, వృద్ధ నాయకత్వం ఆమెను పార్టీ నుంచి తొలగించడంతో, వారందరినీ అభివృద్ధి నిరోధక శక్తులు గాను-సామ్యవాద పథకాలను అడ్డుకునేవారి గాను చిత్రించింది ఇందిరా గాంధీ. పార్లమెంటరీ పార్టీ ఆమె పట్ల విశ్వాసం ప్రకటించడంతో, ఆమె ప్రధాన పదవికి ఢోకా లేకపోగా, పార్టీ చీలిపోయింది-ఇందిర పార్టీని చీల్చింది. ఏడాది ముందే 1971 లో ఎన్నికలకు పోయి, అఖండ విజయం సాధించి పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించింది.

భారత-పాకిస్తాన్ యుద్ధంలో, ఇందిర నేతృత్వంలోని భారతదేశం అఖండ విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఉపఖండంలో తిరుగులేని శక్తిగా భారత దేశానికి పేరు తెచ్చింది. ఇందిరా గాంధీని ద్వేషించే అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ తన సంపూర్ణ మద్దతును పాకిస్తాన్ కు ఇచ్చిన నేపధ్యంలో, యుద్ధానంతరం ఆయనకొక ఘాటైన ఉత్తరం రాసిందామె. లక్షలాది మంది తూర్పు పాకిస్తాన్ శరణార్థులు సరిహద్దులు దాటి భారత దేశానికి వచ్చి పడుతుంటే, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమకుందని, ఆ కర్తవ్య నిర్వహణలో యుద్ధం చేయాల్సి వస్తే, తాను చేసిన తప్పేమిటో స్పష్టం చేయాలని నిక్సన్ ను ప్రశ్నించింది. ఆ తర్వాత కొద్ది నెలలకు జరిగిన రాష్ట్ర శాసన సభల ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఆమె ప్రభ వెలగ సాగింది. ఆమె ఆరోహణ పర్వం కొనసాగుతుండగానే, అవరోహణ పర్వం కూడా మొదలైంది. కరవు-కాటకాలు, ద్రవ్యోల్బణం, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల లాంటి ఇబ్బందులను మాత్రమే కాకుండా, అవినీతి ఆరోపణలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులొచ్చాయి. నైతిక విలువలకు కట్టుబడడం లేదని ఆ గర్భ శత్రువులు ఆమెను విమర్శించ సాగారు. ఇంతకాలం ఆమెకు మద్దతు పలుకుతున్న కొందరు స్వపక్షీయులు కూడా వారితో గొంతు కలిపారు. గోరు చుట్టుపై రోకటి పోటులా, అలహాబాద్ హైకోర్టు, ఇందిరా గాంధీపై వేసిన ఎన్నికల పిటీషన్ లో ఆమెకు వ్యతిరేకంగా, లోక్ సభకు ఆమె ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించింది. ఆమె పై కోర్టుకు అపీల్ చేసుకునే వీలున్నప్పటికీ, తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండు చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బంధించి, అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అంతర్గత బధ్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది. స్వతంత్ర భారత దేశంలో చీకటి రోజులకు తెరలేపింది ఇందిరా గాంధీ.


ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, పౌరుల ప్రాధమిక హక్కులు హరించిందని, పత్రికా స్వాతంత్ర్యం కాల రాసిందని దేశ విదేశాల ప్రముఖుల విమర్శలను లెక్క చేయని ఇందిర రాజ్యాంగాన్ని తిరగ రాసింది. తనకు వ్యతిరేకంగా వచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పునుంచి ఊరట పొందింది. ప్రజాస్వామ్యం అనే లైసెన్సు కింద ఎవరేం చేసినా చెల్లుతుందనుకుంటే పొరపాటని చెప్పింది. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నిటి కంటే, భారత దేశంలోనే ప్రజాస్వామ్యం ఎక్కువ పాళ్లు అని స్పష్టం చేసింది. విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది. దేశ సమైక్యతకు-సమగ్రతకు ముప్పు వాటిల్లిందని, రోగికి చేదు మందిచ్చి బ్రతికించిన విధంగానే, అత్యవసర పరిస్థితి విధింపు తాత్కాలికమే అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఆర్థిక, రాజకీయ సుస్థిరత కొరకు, జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేసింది. విదేశీ బూచిని చూపించడం పదే పదే చేయసాగింది. మీడియాపై మరిన్ని ఆంక్షలు విధించింది. అత్యసర పరిస్థితికి అనుగుణంగా, అరెస్టు చేసిన రాజకీయ ఖైదీలను విచారణ లేకుండా జైళ్లలో నిర్బంధించడానికి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో ఇందిరకు మరింత బలం చేకూరింది. మరిన్ని రాజ్యాంగ సవరణల ద్వారా, అవధులు లేని అధికారాలను ఇందిరా గాంధీ తన సొంతం చేసుకుంది.

అన్ని రకాల ఆంక్షలు విధిస్తూనే, వ్యూహాత్మకంగా, ప్రతిపక్షాల సమావేశాలకు అనుమతులు ఇవ్వ సాగింది. ఆమె ప్రతిపాదించిన అసాధారణ రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోదం లభించింది. జనాభా పెరుగుదలను అరికట్టేందుకు, బలవంతపు కుటుంబ నియంత్రణ విధానాలను అమల్లోకి తెచ్చింది. ఐదేళ్ల లోక్ సభ పదవీకాలం పొడిగించి, ఆరేళ్లు చేసిన తర్వాత, మరో ఏడాది పొడిగించబోతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే, హఠాత్తుగా, జనవరి 1977 లో ఎన్నికల నిర్ణయం ప్రకటించింది ఇందిరా గాంధీ. ప్రజలపై-ప్రజా శక్తిపై తనకు అపారమైన విశ్వాసం వుందని, మార్చ్ నెలలో ప్రజల నిర్ణయం కొరకు ఎన్నికలు జరుగుతాయని అన్నది. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. భారత దేశం బలీయమైన శక్తిగా ఎదగడానికి బలమైన కేంద్ర ప్రభుత్వం, సుస్థిరమైన కేంద్ర ప్రభుత్వం అవసరమని స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ కాలం నుండి ప్రోత్సహిస్తూ వస్తున్న చిన్న కొడుకు సంజయ్ గాంధీని రాజ్యాంగేతర శక్తిగా ఎదగడానికి తోడ్పడింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయనను ప్రవేశ పెట్టింది. వారసత్వానికి బాటలు వేసింది.

ప్రతి పక్షాలన్నీ ఏకమయ్యాయి. ఆమె అనుంగు సహచరుడు జగ్జీవన్ రాం కూడా బాంబు పేల్చాడు. ప్రతి పక్షాల సరసన చేరాడు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ లోని యంగ్ టర్క్స్ కూడా వారితో జత కట్టారు. నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పాలని, మకుటంలేని మహారాణిని ఓడించాలని జనతా పార్టీ ఎన్నికల్లో పిలుపిచ్చింది. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా, జనతా పార్టీ ఓటర్ల ముందుకు పోయింది. మార్చ్ 20, 1977 న జరిగిన లోక సభ ఎన్నికలలో ఇందిరా గాంధీని ఆమె నియోజక వర్గంలోను, ఆమె సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని స్వతంత్రం వచ్చిన ముప్పై సంవత్సరాలకే అధికారంలోకి తెచ్చారు ఓటర్లు. కలగాపులగం లాంటి కాంగ్రేసేతర పార్టీల కలయికతో ఏర్పడిన జనతా ప్రభుత్వానికి, ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో ఉప ప్రధాన మంత్రిగా చేసి, ఆ తర్వాత రెండేళ్లు ఆమెచే జైల్లో నిర్బంధించబడిన మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా సారధ్యం వహించారు. ప్రజల తీర్పును శిరసా వహిస్తానని, ప్రజల సేవలోనే గడుపుతానని అంటూ పదవికి రాజీనామా చేసింది ఇందిరా గాంధీ. ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నాలు తిరిగి ప్రారంభించింది. తన పార్టీలో తనకు వ్యతిరేకంగా వున్న వారితో బంధాలు తెంచుకుని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన వారిలో సగం మందికి పైగా తన వెంట వుంచుకుని, మరో మారు కాంగ్రెస్ పార్టీని చీల్చింది. కాంగ్రెస్ (ఐ) ని స్థాపించింది. అదే అసలు సిసలైన భారత జాతీయ కాంగ్రెస్ గా ప్రకటించింది. ప్రజలు ఆమె పక్షమే వున్నారనడానికి, దేశ రాజకీయాల్లో ఒకటి వెంట మరొక టి చోటు చేసుకున్న సంఘటనలే నిదర్శనం.


          జులై 1979 లో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. దానికి కారణ భూతుడైన చరణ్ సింగ్ కు మద్దతు పలికి, ఆయన ప్రధాన మంత్రి కావడానికి తోడ్పడింది ఇందిరా గాంధీ వ్యూహాత్మకంగా. తనపై మొరార్జీ ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలను ఉపసంహరించుకోవడానికి నిరాకరించిన చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని విశ్వాస తీర్మానంలో ఓటమి పాలు చేసింది. జనవరి 1980 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ () మూడింట రెండు వంతుల మెజారిటీతో అఖండ విజయం సాధించి, ఇందిరా గాంధీ మరో మారు ప్రధాన మంత్రి అయింది. అలా, భారత దేశానికి కావాల్సింది నియంతృత్వం సమపాళ్లలో కల్సిన ప్రజాస్వామ్యం అన్న సంకేతాన్ని కూడా ఓటర్లు బహిర్గతం చేశారని అనాలి.

No comments:

Post a Comment