Sunday, November 19, 2017

సీత-రాములిరువురూ సేవ్యులే అనుకున్న హనుమంతుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

సీత-రాములిరువురూ సేవ్యులే అనుకున్న హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (20-11-2017)
సకల గుణాభిరాముడైన శ్రీరాముడిని, గుణాలతో ప్రసిధ్ధికెక్కిన సీతను పొగిడి, చింతా మనస్కుడై, కన్నీళ్లు కార్చాడు ఆంజనేయుడు. ఉత్తమురాలైన సీతకు ఎటువంటి కష్ఠమొచ్చిందని తల్చుకుంటూ మరీ-మరీ ఏడుస్తాడు. ఏడుస్తూ అనుకుంటాడు:"ఈమె మహాపతివ్రత. ఈమెకిట్టి ఆపద రాకూడదు. సీత ప్రకృతికతీత. అందరిలాగా కర్మానుభవానికై పుట్టిందికాదు. అట్టి ఈమెకే దిగులు సంప్రాప్తిస్తే కాలాన్ని అతిక్రమించే వారెవరైనా వున్టారా? అదెవ్వరికీ సాధ్యం కాదు" (సర్వం కాలాధీనమనుకొని, అదే నీతిని మనస్సులో వుంచుకొని, దుఃఖ-సంతోషాల పాలుపడ కూడదు. సీతకే ఇన్ని కష్టాలొచ్చాయే, మనమెంతనుకుని, మనస్సు పరితాప పడ్డా, బుధ్ధిని వ్యాకుల పడనీయ కూడదు)

"రామచంద్రమూర్తి నిశ్చయం, లక్ష్మణుడి అభిప్రాయం ఎరిగిందికనుకనే, వర్షాకాలపు మురుగునీరు ఎంతకలిసినా మలినపడని గంగవలె, గుండెనిబ్బరంతో వుంది సీత. లేకపోతే, ఎప్పుడో గుండె పగిలి చచ్చిపోయేది. రామచంద్రమూర్తికి కాటుకకన్నుల సీత, పతివ్రత సీతకు రాముడు, వయస్సులో, స్వభావంలో, సాముద్రిక లక్షణాలలో, సద్వంశంలో పుట్టడంలో, ఒకరికొకరు సరిగ్గా సరిపోయారు" అని కూడా అనుకుంటాడు.

(వివాహకాలంలో శ్రీరాముడికి పన్నెండేళ్లు, సీతకు ఆరేళ్లు. అంటే రాముడి వయస్సులో సగం. శాస్త్రప్రకారం తగినవయస్సే. ఇప్పుడు శ్రీరామచంద్రుడి వయస్సు ముప్ఫైతొమ్మిది సంవత్సరాలు, సీతకు ముప్ఫైరెండు. వధువుకు ఎనిమిదేళ్ళు వుంటే, వరుడికి పదహారేళ్ళు వుండాలని విష్ణు స్మృతి. సీత-రాముడు వయస్సులో ఎలా ఈడూ-జోడో, శీలంలోనూ అంతే. సాముద్రికం ప్రకారం, సార్వభౌమత్వ చిహ్నాలు రాముడికున్నాయి. అట్టి వాని భార్యకల దానికే చిహ్నాలుండాలో అవన్నీ సీతకున్నాయి. సూర్యవంశంలో ప్రసిధ్ధికెక్కిన వాడి కొడుకు రాముడైతే, చంద్రవంశంలో జగత్ప్రసిధ్ధికన్న జనకుడి కూతురు జనని-జానకి. "స్మరణ మాత్ర సంతుష్టాయ" అంటే స్మరించినంత మాత్రాన సంతోషించే వాడు రాముడు. "ప్రణతి ప్రసన్న జానకి" అంటే ఒక్క నమస్కారంతో సంతోషించేది సీత. ఇట్టి అపురూప దాంపత్యం లోకంలో ఎక్కడైనా వుందానని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. భక్తులకు సీత-రాములిరువురూ సేవ్యులే. జగన్మాత "శ్రీదేవి", జగన్నాయకుడు "విష్ణువు". ఒకరున్న చోటే రెండో వారుంటారు. వీరిరువురి తోనే ప్రపంచమంతా వ్యాపించి వుంది. ఈశత్వం ఇద్దరిలో సమానమే. సర్వదా ఏకశేషులే! ఒకేమాటలో ఇరువురినీ తెలిపేదే ఏకశేషం. ఇలా "సర్వకారణత్వం, సర్వవ్యాపకత్వం, సర్వనియన్తృత్వం" లక్ష్మీనారాయణుల్లో, సీతారాముల్లో వుంది. ఇరువురిలో, "ఉపాయత్వం, ఉపేయత్వం" వున్నాయి. అందుకే సీతారాములిరువురూ సమానంగా సేవించాల్సిన వారేనని గ్రహించాడు హనుమంతుడు.)

బంగరుబొమ్మలా, ముల్లోకాలకు దేవతైన లక్ష్మీదేవిలా వున్న సీతాదేవిని చూసి, రాముడిని మనస్సులో తలచుకుంటూ అనుకుంటాడు హనుమంతుడు:" రామచంద్రమూర్తి చేసే కార్యాలన్నింటికీ ఈమేమూలకారణం కదా! రావణసమానుడైన కబంధుడి చేతులు నరికింది ఈమెకోసమేకదా! విరాధుడు చచ్చిపోయింది ఈమెకొరకేకదా! పధ్నాలుగువేల రాక్షసులను వధించింది ఈమెకొరకేకదా! ఖరుడు, త్రిశరుడు, దూషణుడు, రాముడి చేతిలో చచ్చింది ఈమె కారణాన్నేకదా! ఈమెకోసమేకదా దుర్లభమైన వానర రాజ్యసంపద నిమిషంలో సుగ్రీవుడికి లభించింది. ఈమెకోసమేకదా తాను సముద్రాన్ని దాటింది. అట్టి ఈమెకొరకై రామచంద్రమూర్తి ముల్లోకాలను దహించివేసినా దోషంలేదు"   (రామచంద్రమూర్తి చేసే కార్యాలన్నింటికీ మూలకారణం సీతాదేవే! చేసేది రాముడు...చేయించేది సీత. నిగ్రహానుగ్రహాల రెండింటిలోనూ ఇదే నియమం)

"సీతాదేవి లేకుండా ముల్లోకాలతో కూడిన ప్రభుత్వం దక్కితే మేలా, అవిలేకుండా సీత లభించడం మేలా" అని ఆలోచించిన హనుమంతుడికి, సీతను దక్కించుకోవడానికి ముల్లోకాలను భస్మం చేసినా దోషంలేదనిపిస్తుంది. ఎందుకంటే "సీతకళలలో ఒక్కటైనా ఈమూడులోకాలకు సరిపోవు. ఇలాంటిదొక్కటున్నా కోటానుకోట్ల ముల్లోకాలు లభిస్తాయి. ఆమే లేకుంటే ముల్లోకాలు కూడా దక్కవు" అనుకుంటాడు. (భగవంతుడు అనేకకోటి బ్రహ్మాండ నాయకుడు కాగా అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు నాయకి లక్ష్మీదేవి. ఈ అనంత కోటి బ్రహ్మాండాలు ఆమె మూలాన్నే నామరూపాలై, స్థితిగలవై వున్నాయి. అట్టి ఈమెకు ముల్లోకాలు ఒక లెక్కకాదు. అయితే లక్ష్మీదేవి, సీతాదేవి భగవంతుడి సహధర్మచారిణిగా, భగవత్ సంకల్పానుసారంగా, తదాజ్ఞావశవర్తియై, ఆయనకు పరతంత్రంగా వుంటుందని భావన.)

"ధర్మాత్ముడు, మహితాత్ముడు, మహాత్ముడు, మిధిలానాధుడు, జనకుడి కూతురు సీత ఈమె. పరమపతివ్రతైన సీతే ఈమె. సందేహంలేదు. ఇట్టిలక్షణాలు ఆమెలో తప్ప మరొకరిలో వుండవు. అందమైన పొలాన్ని దున్నతున్న నాగటికొనకుతగిలి, భూమినుండి లక్ష్మీదేవిలా పుట్టిన సీత, ఆ భూమినే లోకానికంతా భూమిగా చేసింది. సత్యమైన శీలాన్ని, సత్యమే శీలంగా, కలిగిన జనకుడికి ముద్దుల కూతురై, లోకానికంతా "జనకుడు"అనే పేరుతెచ్చింది తన జనకుడికి. పరాజయమంటే ఏమిటో తెలియని దశరధుడి కోడలయింది. ఆత్మజ్ఞాని, కృతజ్ఞుడు, శరణాగతవత్సలుడైన శ్రీరాముడి ముద్దులరాణయింది. భర్తమీదున్న భక్తితో, కష్టపడ్తానన్న విచారమేలేక, భర్తతో అడవికెళ్లి, ఆకులలాలు తింటూ, ఇంట్లోవున్న తృప్తిని పొందుతూ, చివరకు రాక్షస స్త్రీల మధ్యలో పడిపోయింది. భక్తిపూర్వకంగా మనస్సంతా, భర్తమీదుంచింది కాబట్టి, ఆమెకు అడవిలో కష్టాలు, కష్టాల్లా కనిపించలేదు. రాతిని తొక్కినా, కంపను తొక్కినా, మనస్సు దానిపైనంటేనే కదా కష్టమనిపించేది."


    దేహం, ఆత్మ తారతమ్యాన్ని గ్రహించిన వారిని సుఖదుఃఖాలు కదిలించలేవు. దేహమే ఆత్మ అనే భ్రాంతివల్లనే బాధ కలుగుతుంటుంది. మనస్సునుండి శరీరాన్ని వేరుచేసి భావించగల ధీమంతులకు బాధ, హాయి అనే అనుభవాలుండవు. ఈ సత్యం ఇక్కడ స్ఫురిస్తున్నది)

         "సీతాదేవి సౌందర్యంచేతనే ఆదరించతగింది. కష్టాలేంటో ఎరుగకుండానే సుఖాలను అనుభవించతగింది. ఉత్తమస్త్రీ అయినందున, పరిమితచిరునవ్వుతో మాట్లాడే స్వభావం కలది. బంగరువన్నె దేహపు చాయ, పూర్ణచంద్రుడిలాంటి ముఖం కల్గి, రావణుడు పెట్టే బాధలకు గురౌతున్నది. దాహంతో వున్నవాడు చలువపందిరి దగ్గరకు పోయినట్లు, ఇటువంటిదాన్ని శ్రీరాముడు చూడాలనుకోవడంలో ఆశ్చర్యమేముంది? చూడతలచుకోకపోతే, తప్పు ఆయనదికాని ఈమెది కానేకాదు. దుఃఖమెవరికి? రాజ్యసింహాసనం పోతే, తిరిగి సంపాదించుకుని, సంతోషించే విధంగానే, ముల్లోకాలకు, జీవకోటులకు, పూజ్యురాలైన సీతను శ్రీరామచంద్రమూర్తి మళ్లీ పొందుతాడు.... సంతోషిస్తాడు".

         (పెదవులు కదిలించకుండా కళ్లతో నవ్వినా, కొద్దిగా పళ్లు కనిపిస్తూ పెదవులు తెరిచినా "హసిత" మంటారు. ఇవి ఉత్తమస్త్రీ లక్షణాలు. మధురంగా గొంతువినపడేటట్లు నవ్వితే దాన్ని "విహసిత" మంటారు. వళ్ళంతా కదిలేట్లు నవ్వితే "ఉద్దసిత" మని, "అపహసిత" మని అంటారు. ఇవిమధ్యమ స్త్రీ లక్షణాలు. కళ్లల్లో నీళ్లు కారేటట్లు నవ్వినా "అపహసిత" మనే అంటారు. వళ్ళంతా పూర్తిగా కదిలేటట్లు నవ్వితే "అతిహసిత" మంటారు. పకపకా-వికవికా నవ్వులు దీంట్లో భాగమే. ఇది అధమస్త్రీ లక్షణం. సీతాదేవిని అందుకనే కొంచెం చిరునవ్వుతో మాట్లాడేదన్నాడు హనుమంతుడు. అలాగే దాహంతో వున్నవాడు, చలువపందిరి, రాజయం, భ్రష్టరాజు, అనే ఉపమానాలు శ్రీరాముడిని గురించే. సీతను పొందాలంటే కష్టపడి, ఆమెవున్నచోటుకే వచ్చి, ఆమెను స్వీకరించాలని సూచిస్తున్నాయి ఈ వుపమానాలు. ఆవిషయంలో సీతాదేవి చేయాల్సిన ప్రయత్నమేమీలేదు)

దప్పికయినప్పుడు చలువపందిరి దగ్గరకొస్తే, అక్కడ నీళ్లులేకపోతే, ఎట్లావుంటుందో,  ఆపరితాపమేంటో తెలిసిన సీత, శ్రీరాముడు తనకోసమొస్తే, తాను చనిపోతే, ఆయనెంత సంతాపపడ్తాడో, అన్న భావానతోనే వుంటుంది. ఆయనకట్టి సంతాపం కలిగించడం ఇష్టం లేక, బంధువులందరినీ విడిచినప్పటికీ, ఇష్టసుఖాలు కోల్పోయినప్పటికీ, ఎన్ని కష్టాలు కల్గినప్పటికీ, సర్వకాల, సర్వావస్థలందు మనస్సు భర్తపైనే నిల్పి, పోతున్న ప్రాణాలను పోనియ్యకుండా బిగపట్టివుంచింది. ఆమె చేయకలిగింది ఇంతకంటే ఏముంటుందనుకుంటాడు హనుమంతుడు.

No comments:

Post a Comment