గ్రామ పునర్నిర్మాణం దిశగా....
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ (12-11-2017)
1,04,000 స్థానిక స్వపరిపాలనా ప్రజాప్రతినిధులతో,
16,000 మంది పంచాయతీరాజ్ సిబ్బందితో, 30,000 మంది సఫాయీ కర్మచారులతో, రూ. 12,000 కోట్ల భారీ
బడ్జెట్ కేటాయింపులున్న పంచాయతీరాజ్ వ్యవస్థ, ప్రజలకు అందిస్తున్న సేవలు ఏమిటని
ప్రశ్నించుకుంటే దొరికే జవాబు, అగమ్యగోచరంగా, అస్పష్టంగా, ఉహకందని రీతిలో
వుంటుంది. సమర్థవంతమైన గ్రామాభివృద్ధి దిశగా ఆచరణాత్మక, సామాజిక బాధ్యతే ధ్యేయంగా,
క్రియాత్మకమైన పంచాయతీరాజ్ చట్టం రూపొందించుకుని, స్థానిక స్వపరిపాలనను పటిష్టం
చేసుకోవలసిన అవసరం వందశాతం వుంది. ఇందుకోసం మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థలోనే సమూలమైన
మార్పులు తీసుకురావాల్సిన తరుణం ఆసన్నమైంది.
భారతదేశ తొలి పంచాయతీరాజ్-సహకార శాఖల
మంత్రి స్వర్గీయ ఎస్.కె. డే సేవలు, ఆయన నేతృత్వంలో
జరిగిన కమ్యూనిటీ డెవలప్ మెంట్ కార్యక్రమాలు స్వతంత్ర భారతావనిలో మరుపురాని మధుర
ఘట్టాలు. ప్రజాస్వామ్యం అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితమైంది
కాదనీ, దాని ఫలాలు గ్రామీణ స్థాయి ప్రజలకు చేరువ కావాల్సిన అవసరం ఎంతైనా వుందని
ఎస్.కె.డే ప్రగాఢంగా నమ్మాడు. ఆయన నమ్మిన సిద్ధాంతం, ఆయన ప్రగాఢ విశ్వాసం నాటి
భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ప్రభావితం చేసింది. విదేశాల్లో ఉద్యోగం
చేసుకుంటున్న ఆయన్ను స్వదేశానికి రప్పించాడు. ఫలితంగా నవభారత నిర్మాణంలో భాగంగా
గ్రామీణాభివృద్ధిశాఖ పగ్గాలు ఆయనకు అప్పగించడం జరిగింది. జవహార్ లాల్ నెహ్రూ మరణానంతరం
మంత్రి పదవికి డే రాజీనామా చేసి తన విశ్రాంత సమయాన్ని దేశంలో పంచాయతీ రాజ్ సంస్థల నిర్మాణానికి,
అభివృద్ధికి ఉపయోగించారు. తన అభీష్టానికి అనుగుణంగా, కమ్యూనిటీ డెవలప్ మెంట్ కార్యక్రమం
ద్వారా ప్రజలను ప్రభావితం చేయసాగారు.
ఎవరో, ఏదో ఉద్ధరిస్తారనే ఎదురుచూపులు చూడకుండా, ప్రజలు స్వయం ప్రతిపత్తితో సామాజికాభివృద్ధి
జరుపుకునేలా చర్యలు తీసుకోవడానికి ఇది మూలకారణం అయింది. కమ్యూనిటీ డెవలప్మెంట్ ను మూడంచెలుగా
చేపట్టాలన్నది డే రూపకల్పన చేసి ఆకారణలో పెట్టిన విధానం. స్థానిక ప్రాంతాల
అభివృద్ధి, సమన్వయ పరిపాలన, వ్యక్తిగతంగా-సామాజిక పరంగా ప్రతివారూ అభివృద్ధి
సాధించడం, ఆయన వ్యూహంలో ప్రధానాంగాలు.
ఆదిలో కమ్యూనిటీ డెవలప్మెంట్ గా రూపుదిద్దుకున్న
పంచాయతీరాజ్ వ్యవస్థ, కాలక్రమంలో రాజకీయాలకు నిలయమై, ముక్కలు-చెక్కలుగా విడిపోయింది.
కమ్యూనిటీ రేడియో సెట్ల ద్వారా, గ్రామ సర్పంచులు, ఒకానొక రోజుల్లో, వివిధ కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించే
పద్ధతికి చెల్లుచీటి పలకడం జరిగింది. గత కాలం నాటి క్రమశిక్షణతో కూడుకున్న పటిష్ఠ
పంచాయతీరాజ్-కమ్యూనిటీ డెవలప్మెంట్ వ్యవస్థను
తిరిగి పునరుద్దరించాలన్న ఆకాంక్ష, తపన ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, పంచాయతీరాజ్ వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించాలని,
ప్రక్షాళన చేయాలని పదే పదే వ్యక్తం చేయడం జరిగింది.
క్రియాశీలకంగా, నిర్విరామంగా పనిచేయగలిగిన
పంచాయతీ రాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయంప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు
స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన తరుణం ఆసన్నమైందని,
ముఖ్యమంత్రి అంటున్నారు. ఇందుకు పంచాయతీరాజ్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన
చేయాల్సిన అవసరం వుందనీ, దీనికి కార్యోన్ముఖులై రంగంలోకి దిగాలని సిఎం ప్రజలకు
పిలుపిచ్చారు. పారదర్శకత, బాధ్యతాయుత, నిబద్ధతలు
పొందుపరిచే విధంగా పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించి, స్థానిక స్వపరిపాలనా
ప్రతినిధులను, గ్రామస్థాయి అధికారులను గ్రామాభివృద్ధికి సిద్ధం చేయాలని ఆయన
అంటున్నారు. యావత్ పంచాయతీరాజ్ వ్యవస్థ జీర్ణావస్థలో, రోగ గ్రస్థమయినందున శస్త్ర
చికిత్స చేసే దీన్నిరక్షించాలి. ఎదో తూతూ మంత్రం లాగా కాకుండా విధానాల ఒరవడిలో
చట్టం వుండాలి.....అడ్హాక్ పద్ధతులకు స్వస్తి పలకాలి.
మారుమూల ప్రాంతంలో కానీ,
గ్రామీణస్థాయిలో కానీ అక్కడి ప్రజలకు కేంద్ర, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు
చేరువ చేయాలంటే, అందుబాటులోకి తేవాలంటే సర్పంచ్ లు ముఖ్య భూమిక వహించాల్సి
ఉంటుంది. కాలక్రమంలో స్థానిక స్వపరిపాలానా ప్రభుత్వం అసలు లేదమోనన్న పరిస్థితి తీసుకువచ్చే
విధంగా, ఆగమ్యగోచరంగా, మారి గ్రామపంచాయతీ సమావేశం జరపడం కానీ, గ్రామసభలు నిర్వహించడం
కానీ లేకుండా పోయింది. ఇవి రాజ్యాంగబద్ధంగా,
యధావిధిగా కొనసాగాల్సిన ఆవశ్యకత ఉన్నదనే సత్యాన్ని సర్పంచులు విస్మరించటం జరిగింది.
గ్రామీణస్థాయిలో లోకాల్ ఫండ్ ఆడిట్ లెక్కలు పరిశీలించటం, ఏయే పనులు ఎలా జరిగాయి,
ఎంత స్థాయిలో జరిగాయి, వాటికైన ఖర్చులు, జమ ఇత్యాది వివరాలు పరిశీలించటం అన్నది జరిగిన
పాపాన పోలేదు. గ్రామంలో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం చేరి గ్రామమంతా మురికివాడలుగా,
చెత్తకుప్పలుగా తయారవటం, వాటని పట్టించుకునే నాధుడు లేకపోవడం పరిపాటి అయ్యింది.
సర్పంచ్ లు స్థానిక పలుకుబడులకు, సొంత వ్యాపారాలకు, కాంట్రాక్టులకు, చిన్న చిన్న
వ్యాపారలావాదేవీలకు ఆసక్తి చూపటం జరుగుతోంది. డబ్బు సంపాదనకు, సొంత లాభాలకు,
వ్యాపారాలకు ఆకర్షణ పెరగటంతో వారిలో ప్రజాసేవ-గ్రామీణ సేవ పట్ల ఆసక్తి కరువై జరగాల్సిన
పనులకు సమయం కేటాయించే ధ్యాస పోయింది. సర్పంచులు పనితీరు బట్టి వారు అవలంబిస్తున్న
తీరును బట్టి వారికే పట్టనప్పుడు మాకెందుకనే చందాన ఎంపిటిసిలు, జడ్పీటీసీలు అదే
కోవలో సర్పంచులను ఆదర్శంగా తీసుకుని పనిచేయడం మానేశారు. గ్రామీణ పంచాయతీరాజ్
వ్యవస్థ దరిమిలా నిర్వీర్యమై పోయింది.
ఈ మధ్య కాలంలో ఒక అడుగు ముందుకు వేసి
సర్పంచులు తమ బాధ్యతలను ఆసాంతం ఎమ్యెల్యేలు చేపడతారంటూ తాము చేయాల్సిన పనులను వారిమీడకు
నెట్టి అక్కడ ముట్టచెప్తేకానీ పని జరగదనే స్థాయికి తీసుకురావటం జరిగింది. “మా
గ్రామానికి మీరేం చేసారంటూ” సర్పంచులు ఎమ్మెల్యేలను ప్రశ్నించే స్థాయికి పరిస్థితి
దిగజారిపోయింది. తెలంగాణకు హరితహారం కింద అమలు జరుగుతున్నా చెట్లు నాటే
కార్యక్రమాన్ని సర్పంచులు, గ్రామపంచాయతీలు పూర్తిగా విస్మరించి ఇది తమ పని కాదు అన్నట్లు పట్టించుకోకుండా వుండడం
అందరికీ తెలిసిన విషయమే. ప్రతి గ్రామంలో 40,000 ల మొక్కలను నాటాలన్న లక్ష్యాన్ని
కానీ, ఆయా గ్రామాల్లో కావాల్సినన్ని నర్సరీలు అందుబుటులోకి ఉన్నాయన్న విషయం కానీ,
అది సమగ్రంగా నిర్వర్తించాల్సి ఉందని కానీ
సర్పంచులకు అవగాహనే లేదు. గ్రామాల్లో కావాల్సినన్ని డంపింగ్ యార్డులు కానీ,
శ్మశానవాటికలుకానీ, పటిష్టమైన పారిశుద్ధ్య వ్యవస్థగానీ లేకుండా పోయింది. ఇంటి
పన్నులు గ్రామాల్లో చెల్లించడం పూర్తిగా ఆగిపోయింది. ఫలితంగా యావత్ పంచాయతీ వ్యవస్థ కుప్పకూలిన
రీతిలో ఉండటం వల్ల ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టే మూలాల నుంచి
ప్రక్షాళన చేపట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యగా భావించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్
సంస్థలకు జులై 31, 2018 కి ముందుగా,
సర్పంచుల పదవి కాలం పూర్తి అయ్యేలోపు ఎన్నికలు నిర్వహించాలని, దానికంటే ముందే, అదనంగా
4000
నుంచి
5000
వరకు పంచాయితీలను కొత్తగా ఏర్పాటు చేయాలని, తద్వారా
13,000 నుంచి 14,000 లకు వాటి
సంఖ్య పెంచాలని నిర్ణయించింది. తండాలను, కోయగూడాలను, చెంచుగూడాలను గ్రామపంచాయతీలు గా
మార్చాలని కూడా ప్రభుత్వం సంకల్పించింది. గ్రామపంచాయతీల పరిధిని బట్టి ఒక్కో
గ్రామానికి రూ.10 లక్షల నుంచి 25 లక్షల
వరకు నిధులు కేటాయించాలని నిర్ణయించింది. అదే విధంగా ఇతరత్ర మార్గాల ద్వారా స్వయంగా
నిధులు సమకూర్చుకునే విధంగా గ్రామపంచాయతీలను రూపొందించాలని సంకల్పించింది. ఏ ఆర్థిక కమిషన్ అయినా స్థానిక సంస్థల
అభ్యున్నతికి పెద్దపీట వేయడం ఖాయం కాబట్టి, వచ్చే కమిషన్ తగు విధంగా నిధులను
స్థానిక సంస్థలకు, పంచాయతీలకు తప్పక కేటాయిస్తుందనీ, సహృదయంతో స్పందిస్తుందనీ
ప్రభుత్వం భావిస్తున్నది.
దీనంతటికి కార్యరూపం కల్పించేందుకు
పంచాయతీరాజ్ చట్టాన్ని సమగ్రరూపంతో తీర్చిదిద్దాలని నిర్ణయించింది. చట్టం పరిధిలో
పనితీరు సరిగా లేని పక్షంలో సంబంధిత సర్పంచులను విధులనుంచి తప్పించే విధంగా
ప్రభుత్వానికి ఆస్కారం ఉండేలా చట్టం రూపొందనున్నది. తద్వారా క్రియాశీలకంగా
పనిచేయగలిగే పంచాయతీరాజ్ వ్యవస్థ రూపొందించి “సర్పంచ్ పనిచేయాలి లేదా వైదొలగాలి”
అన్న విధానం రాబోతున్నది. 2019 శాసనసభ ఎన్నికల నాటికి పంచాయతీరాజ్ వ్యవస్థలో
సమూలమైన మార్పులు తీసుకువచ్చి, పనిచేసే పంచాయతీ వ్యవస్థను రూపొందించి, మారుమూల
ప్రాంతాలలో మార్పు తీసుకురావాలని కృతనిశ్చయంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది రాష్ట్ర
ప్రభుత్వం. అలాగే ఎన్నికైన సర్పంచులకు, ఉప సర్పంచులకు, సమగ్ర శిక్షణా
కార్యక్రమాలను నిర్వహించి పదవీ బాధ్యతలు చేపట్టే లోపు వారిని గ్రామీణాభివృద్ధికి
సర్వ సన్నద్ధం చేయాలని సంకల్పించింది. బాధ్యతలు చేపట్టేలోపు లక్ష్యాలు వారి ముందుంచి
పటిష్ట పంచాయతీ వ్యవస్థకు పునరంకితం అయ్యే విధంగా వారిని తీర్చిదిద్దాలని
పూనుకుంది. పారదర్శకంగా ఉంటూ, ప్రజలతో స్నేహపూర్వకంగా మమేకమవుతూ, పటిష్టంగా
పనిచేసే వ్యవస్థకు, ప్రతిపనికీ పారదర్శకంగా వుండే పద్ధతికి పూనుకోవాలని,
తదనుగుణంగా తగు చట్టం తీసుకురావాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకుపోతోంది. గ్రామాల,
గ్రామీణ ప్రజల అవసరాలను వారి హక్కులుగా రూపొందించి, వాటికి సర్పంచులు బద్దులై విధులు
నిర్వర్తించేలా చట్టం తయారు చేసి, గ్రామాల పరిపూర్ణ అభివృద్ధికి ప్రభుత్వం కంకణం
కట్టుకోవడం హర్షణీయం. END
No comments:
Post a Comment