ఇందిరా గాంధి శతజయంతి సందర్భంగా
రాజకీయ ఘనాపాఠి
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (19-11-2017)
ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో అమృత్‌సర్ లోని గోల్డెన్
టెంపుల్-హర్మందిర్ సాహిబ్ పై జరిగిన సైనిక దాడికి నిరసనగా, అంగరక్షకులు
సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ లు జరిపిన కాల్పుల్లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా
గాంధి హత్యకు గురై, మరణించడానికి క్రితం రోజు జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ,
దేశ సేవలో తన ప్రాణాలు
పోయినా బాధ పడనని, చనిపోతే తన రక్తంలోని ప్రతి
నెత్తురు బొట్టు జాతికి బలం చే కూరుస్తుందని యాదృచ్చికంగా అన్నదో,
లేదా, ఆమెలోని ఏదైనా అంతర్నిహిత శక్తి
అలా అనిపించిందో భగవంతుడికే తెలియాలి. ఇందిరా
గాంధి మరణించి ఏళ్లు గడుస్తున్నా జాతీయ-అంతర్జాతీయ
రంగాలలో ఆమె మిగిల్చిన గుర్తులు అజరామరంగా అశేష ప్రజానీకం గుండెల్లో
గూడుకట్టుకున్నాయి. కోట్లాది ప్రజలు అమెనెంతగా
అభిమానించేవారో, అంత మోతాదులోనే, ఆమెలోని
మంచి చెడులను నిశితంగా విమర్శించేవారు
ఇప్పటికీ చాలామంది వున్నారు. ఆమె దో అరుదైన వ్యక్తిత్వం.
జనవరి 1966-మార్చ్ 1977
మధ్య మొదటి పర్యాయం, జనవరి 1980-అక్టోబర్
1984 మధ్య రెండో పర్యాయం, సుమారు
పదహారేళ్ల పాటు భారత ప్రధాన మంత్రిగా వున్న ఇందిరా గాంధీ, తనదంటూ
ప్రత్యేకంగా సంతరించుకున్న దృఢమైన ఆత్మ స్థయిర్యం, నిరంకుశ
ధోరణి, రాజీ పడని మనస్తత్వం కలబోసిన అరుదైన వ్యక్తిత్వంతో,
అను నిత్యం సంక్లిష్టమైన పరిస్థితుల్లో వున్న దేశానికి,
అత్యంత సమర్థవంతమైన పరిపాలనను అందించి చరిత్రలో స్థిరమైన స్థానాన్ని
సంపాదించుకోగలిగింది. లాంఛనంగా రాజకీయాల్లోకి
ప్రవేశించిందనడానికి సంకేతంగా, 1955 లో
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా, 1959 లో
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఇందిరా గాంధీ ఎన్నికైంది.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, తనకు
ఆరంభంలో మద్దతు పలికి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో తనకు
వ్యతిరేకంగా పావులు కదుపుతున్న "సిండికేట్" నాయకత్వాన్ని ధిక్కరించి,
పార్టీని చీల్చి, భారత
జాతీయ కాంగ్రెస్ అంటే తానే అన్న చందాన, మొత్తం
పార్టీ యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. ఎమర్జెన్సీ అనంతరం ఓడిన అప్పటి
కాంగ్రెస్ పార్టీని, అచిర కాలంలోనే గద్దెనెక్కించడానికి,
మరో మారు చీల్చి, ఇందిరా
కాంగ్రెస్ గా నామకరణం చేసి, రెండేళ్లకే
మళ్ళీ అధికారంలోకి వచ్చి, పాలనా
పగ్గాలను-పార్టీ పగ్గాలను తన చేతుల్లో వుంచుకుంది. తనకు ఎదురు లేకుండా,
ఎదిరించిన వారికి పుట్ట గతులు లేకుండా, ఏకచ్ఛత్రాధిపత్యంగా,
మకుటంలేని మహారాణిగా దేశాన్ని ఏలింది. నియంతృత్వ ప్రజాస్వామ్యమంటే
ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది.
రాజకీయాలకు నిలయమైన కుటుంబంలో జన్మించి, రాజకీయాల్లో
మునిగితేలుతుండే వాతావరణంలో పెరిగి, దేశంలో
అత్యున్నత పదవికి ఎదిగిన జవహర్లాల్ అడుగుజాడల్లో బహుముఖ రంగాల్లో తీర్చి దిద్దబడి,
అవకాశం వచ్చిన వెంటనే అదే అత్యున్నత పదవిని పొంది,
తండ్రికంటే మిన్నగా ఆ పదవికి వన్నె తెచ్చి, అధికారంలో
వున్నా-లేకపోయినా అత్యంత బలీయమైన శక్తిగా గుర్తింపు పొంది,
వైరి వర్గాలను నామరూపాలు లేకుండా చేయగలిగే స్థాయికెదిగి,
తనకు తానే సాటి అనిపించుకున్న ఇందిరా గాంధీతో పోల్చతగ్గవారు "న
భూతో న భవిష్యతు" అనడం అతిశయోక్తి కాదే మో!
తండ్రి చాటు బిడ్డగా వుంటూ, తండ్రికి
అనధికారిక ఆంతరంగికురాలిగా ఎదుగుతూ, తండ్రి
తర్వాత కూతురుగా వారసత్వ అధికారాన్ని వంశపారంపర్యంగా-తరతరాలుగా,
తమ కుటుంబీకులకే దక్కే విధంగా వ్యూహం పన్నిన ఇందిరా గాంధీ,
నవ భారత వర్తమాన చరిత్రలో-ఆ
మాటకొస్తే ప్రపంచ చరిత్రలోనే, వేరెవరూ
సాధించలేని దాన్ని అవలీలగా సాధించగలిగిన వ్యక్తిగా చిర స్థాయిగా మిగిలిపోతుంది.
విధి వక్రీకరించి, తాను
అనుకున్న సంజయ్ గాంధీని ప్రధాన మంత్రిగా తేలేకపోయిన ఇందిర, తన
తదనంతరం రాజీవ్ గాంధీ ప్రధాని కావడానికి రంగం సిద్ధం చేసింది.
భవిష్యత్‌లో ఆ పరంపర కొనసాగడానికి చేయాల్సిన దంతా చేసింది.
ఆమె అనుకున్నట్లే నెహ్రూ-గాంధీ వారసత్వ పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే
వుంది.
ఇందిర ప్రియదర్శిని తల్లితండ్రులుకు ఏకైక సంతానం. నెహ్రూ-గాంధీ
కుటుంబ వారసత్వ ఆద్యుడైన తాత మోతీలాల్, స్వాతంత్రోద్యమంలో
మహాత్మా గాంధీ సరసన పోరాడిన సమర యోధుడు. ఆమె బాల్యమంతా ఒంటరితనంతోనే గడపాల్సి
వచ్చింది. అలహాబాద్ లోని ఆమె కుటుంబం వుంటుండే ఇల్లు స్వాతంత్ర్య సంగ్రామానికి
ప్రధాన కార్యాలయంగా వుండేది. తాత, తండ్రి
తరచుగా జైలుకెళ్ళి వస్తుండడం ఇందిరా గాంధీకి గుర్తున్న విషయాల్లో ముఖ్యమైంది.
చిన్న పిల్లల ఆట వస్తువులు కాని, ఆటలు కాని
ఆమెకు తెలియవు. ఆడిన ఆటల్లా, ఒక
నాయకురాలిగా, మూడేళ్ల వయసులోనే ఒక బల్లపైకెక్కి, ఇంట్లో
పనిచేసే వారందరికీ రాజకీయ ఉపన్యాసాలివ్వడం-తనను తానే జోన్ ఆఫ్ ఆర్క్ లాగా
ఊహించుకోవడం. పెద్ద వారెవరూ అందుబాటులో
లేనందున, యువరాణిలా ఎదుగుతున్న ఇందిరలో ఒకరకమైన అహంభావం పెరిగినట్లు ఆమే ఒక
సందర్భంలో చెప్పింది. ఇంటిమీద పోలీసు దాడులు జరగడం, సాధారణ
జీవనం కొరవడడం, ఇంట్లో వారిని అరెస్టు చేసి జైలుకు పట్టుకెళ్లడం లాంటివి నిత్యం
ఆమెకు అనుభవంలోకి వచ్చేవి.
అణుయుగంలో, అంతరిక్ష
యుగంలో భారతదేశాన్ని అడుగు పెట్టించిన ఘనత ఇందిరా గాంధీదే. సోవియట్ వ్యోమ నౌకలో
భారతీయులను పంపడానికి చొరవ తీసుకుంది ఆమే. ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్
ను ఘోరంగా ఓడించి, దానిలో అంతర్భాగంగా వున్న
ప్రాంతాన్ని విడిపోయేందుకు దోహదపడి, బంగ్లాదేశ్
ఆవిర్భావానికి కారకురాలై, ప్రపంచంలో
భారతదేశాన్ని ఒక బలీయమైన శక్తిగా రూపుదిద్దిన ఘనత కూడా ఇందిరా గాంధీదే. భారత దేశం
అంతర్జాతీయ రంగంలో ఎవరి పక్షం వహించదని, తమ
విదేశాంగ విధానం "భారత అనుకూల విధానం" అనీ ఎలుగెత్తి చాటి చెపుతూ,
అలీన విధానాన్ని పాటించే దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి
తీసుకెళ్ళింది ఇందిరా గాంధీ. సోవియట్ యూనియన్ తో మైత్రి చేసినప్పటికీ,
అమెరికా వ్యతిరేకిగా ముద్ర పడకుండా జాగ్రత్త పడింది. అవసరమైనప్పుడు,
తప్పదనుకున్నప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఎదురు తిరిగి తన సత్తా
ఏమిటో నిరూపించింది.
ఆమెలో పార్టీ పరంగా నియంతృత్వ పోకడలు విపరీతంగా కనిపించేవి. పాలనా
పరంగా కూడా ప్రజాస్వామ్య పద్ధతుల కంటే నియంతృత్వ, నిరంకుశత్వ పోకడలే ఎక్కువగా కనిపించేవి.
రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బలమైన కేంద్రం దిశగా ఆమె విధానాలు
రూపుదిద్దుకోసాగాయి. తన పార్టీకి చెందిన ముఖ్యమంత్రులను ఇష్టమొచ్చిన రీతిలో
మార్చడం, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురి చేయడం,
అధికారాలను కేంద్రీకరించడం ఆనవాయితీగా మారిపోయింది. కమ్యూనిస్టు
వ్యతిరేకతతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఇందిర, కాంగ్రెస్
లోని సిండికేట్ పై విజయం సాధించడానికి వామ పక్షాలను కలుపుకుంది.
"కమ్యూనిజం" కంటే "కమ్యూనలిజం" వల్లే ప్రమాదం ఎక్కువ అంటూ
అలనాటి జనసంఘ్ లాంటి పార్టీలను ఎదగకుండా చేసింది. ఎప్పుడైతే,
ఎమర్జెన్సీ విధింపుకు వ్యతిరేకంగా కాంగ్రేసేతర పార్టీలన్నీ ఏకమయ్యాయో,
వారూ-వీరూ అనే తేడా లేకుండా, తన
విధానాలను వ్యతిరేకించిన అందరినీ జైళ్లకు పంపడానికి వెనుకాడలేదు. ఇరవై సూత్రాల
ఆర్థిక ప్రణాళికైనా, గరీబీ హటావో పథకమైనా,
బాంకుల జాతీయ కరణైనా, గ్రామీణ
బాంకుల స్థాపనైనా, రాజ్యాంగ సవరణలైనా,
సవరణలలో భాగంగా అవతారికలో "సామ్యవాదం, లౌకిక
వాదం" అన్న పదాలను చేర్చడమైనా, రాజ్యాంగంలోని
ఆదేశిక సూత్రాలు ప్రాధమిక హక్కులకంటే ముఖ్యమైనవని చెప్పడమైనా,
మరేదైనా, ఏమి చెప్పినా-చేసినా,
ఇందిరా గాంధీ మనసులో మాట ఒకటే. భారత దేశానికి నాయకత్వం వహించగలిగేది
తానే అని-తాను దానికోసమే జన్మించానని ఆమె నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆమె అనుకున్న
కార్యం సాధించడానికి దేనికైనా వెనుకాడక పోయేది. ఆ నమ్మకమే ఆమె గెలుపుకు
సోపానాలయ్యాయి-ఓటమికి కారణాలయ్యాయి. ఓడినా గెలిచి అధికారంలోకి రాగలిగిన ఏకైక
వ్యక్తిగా, ప్రపంచ చరిత్రలో పేరు తెచ్చుకుంది.
ఇందిరా గాంధీలో సహనం, అసహనం
సమపాళ్లలో వుండేవని ఆమెను గురించిన కథనాల్లో పలువురు పేర్కొన్నారు. ఎప్పుడు
దూకుడుగా వ్యవహరించే దో, ఎప్పుడు
నిశ్శబ్దంగా పనులు చక్కబెట్టే దో, ఎందుకు
ఒంటరిగా వుండదలుచుకునేదో, ఎప్పుడు-ఎందుకు
ఏ పని చేసే దో కనుక్కోవడం అంత తేలిక కాదని మీడియాలో కథనాలొచ్చేవి. ఒకరిని
చేరదీయడంలోను, ఇంకొకరిని పక్కన పెట్టడంలోను, ఆమెకు
ఆమే సాటి. అమెరికా అధ్యక్షుడుగా పనిచేసిన రిచర్డ్ నిక్సన్ ఆ దేశ ప్రయివేట్
పౌరుడిగా, 1967
లో భారత దేశానికి వచ్చినప్పుడు ప్రధాని ఇందిరను కలిసిన సమయంలో,
ఇరవై నిమిషాలు గడిచిన తర్వాత, ఇంకెంత
సేపు ఆ సమావేశం కొనసాగుతుందని, నిక్సన్
వెంట వచ్చిన విదేశాంగ ప్రతినిధిని హిందీలో అసహనంగా ప్రశ్నించిందట ఆమె. ప్రశ్న
హిందీలో వేసినా, దాని గూడార్థాన్ని గ్రహించిన నిక్సన్ సంభాషణను త్వరగా ముగించి
వెళ్ళాడని అనధికార వార్తగా పత్రికలు ప్రచురించాయి అప్పట్లో. అందులోని నిజానిజాలు
ఎంతవరకో గాని, ఆమెలోని అసహనం పాలు ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువై,
ఇంటర్వ్యూలలో ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడమో,
నిశ్శబ్దం పాటించడమో, అదో రకంగా
నవ్వు ముఖం పెట్టడమో, ఎదురు ప్రశ్నలు వేయడమో చేసేదని
విశ్లేషకులు అంటుండేవారు.
జవహర్లాల్ ను కలవడానికొచ్చిన దేశ-విదేశీయ ప్రముఖులు,
రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు,
పాత్రికేయులు, విద్యావేత్తలు,
సామాజిక శాస్త్రజ్ఞులు, ఆయన
పక్షాన ఆతిథ్య బాధ్యతలు బిడియంగా చేపట్టిన ఇందిరను, తండ్రి చాటు బిడ్డగా నెహ్రూ
కూతురుగానే చూసేవారు. ఆమె మటుకు రాజకీయ పాత్ర పోషించకుండా వుండలేని పరిస్థితికి
చేరుకుంది. జవహర్లాల్ వెంట దేశ-విదేశాల్లో కలిసి తిరగడంతో, లక్షలాది
మంది భారతీయులకు, చాలా మంది విదేశ ప్రముఖులకు,
ఇందిరా గాంధీ సుపరిచితురాలైంది. 1955 లో కాంగ్రెస్ పార్టీ
వర్కింగ్ కమిటీకి ఎన్నుకోవడంతో, జాతీయ
స్థాయిలో స్వతంత్రంగా గుర్తింపు లభించినట్లయింది. నాలుగేళ్ల అనంతరం,
నాలుగు పదుల వయస్సులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా
ఎన్నికైన ఇందిర, ఏడాది కాలంలో తన రాజకీయ సమర్థతను, కాఠిన్యాన్ని
ప్రదర్శించిందనాలి. ప్రపంచ చరిత్రలోనే ప్రప్రధమంగా బాలట్ ద్వారా అధికారంలోకి
వచ్చిన కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేయించడంలో కీలక పాత్ర పోషించింది. ఆ
తర్వాత జరిగిన ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయం సాధించి పెట్టింది.
తండ్రి చెంత తానుండాల్సిన అవసరం దృష్ట్యా, తన
ఆలోచనా సరళికి తగ్గ రీతిలో పార్టీని నడిపించే స్థాయికి తానింకా ఎదగలేదని భావించిన
దృష్ట్యా, ఇందిరా గాంధీ మరో సారి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి
సుముఖత చూపలేదు. తండ్రి మరణానంతరం, లాల్
బహదూర్ మంత్రివర్గంలో సమాచార-ప్రసార శాఖను చేపట్టింది. శాస్త్రి హఠాన్మరణం దరిమిలా,
కాంగ్రెస్ అధిష్టానం ఇష్టం వున్నా లేకపోయినా, ఇందిరను
ప్రధాన మంత్రిని చేశారు. ఇక అక్కడి నుంచి ఇందిర అధ్యాయం మొదలైంది.
ఇందిర దేశానికి ఏం చేసిందో-ఏం చేయలేదో అనే విషయం విశ్లేషకులకు
వదిలేయవచ్చేమోకాని, తెలంగాణకు సంబంధించినంతవరకు మాత్రం అన్యాయమే చేసిందనాలి.
స్వర్గీయ డాక్టర్ మర్రిచెన్నారెడ్డి నాయకత్వంలో 1969 నాటి తెలంగాణ ప్రత్యెక
రాష్ట్ర సాధన ఉద్యమం దరిమిలా ప్రజాభిప్రాయానికి తల వంచి తెలంగాణ ఏర్పాటుచేయాల్సిన
నాటి ప్రధాని ఇందిరాగాంధి నిరంకుశ ధోరణితో వ్యవహరించి అలా కాకుండా చేయడాన్ని
తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఇక ఆతర్వాత జరిగిన చరిత్ర తెలిసిందే!
No comments:
Post a Comment