ఆధ్వర్యం మనదే...అధ్యక్షత
మనదే
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక
(22-11-2017)
తెలంగాణలో జరిగే
ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరగడానికి ఇంకా మూడు
వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచీ, విదేశాలనుంచీ, మన రాష్ట్రం నుంచీ, పొరుగు తెలుగు రాష్ట్రం నుంచీ, వేలాదిమంది
సాహిత్యాభిమానులు రానున్నారీ మహాసభలకు. యావత్ భారతదేశానికే గుండెకాయ లాంటి
చారిత్రాత్మక హైదరాబాద్-భాగ్యనగరం ఈ సభలకు వేదిక కాబోతున్నది. తోరణాలతో, స్వాగత ద్వారాలతో పండుగ వాతావరణం చూడబోతున్నాం. రాష్ట్రప్రభుత్వ పరంగా
సంపూర్ణ సహకారం ఉన్నందున అన్ని సంబంధిత శాఖల సమన్వయంతో పనులన్నీ ఏ లోటు లేకుండా
చురుగ్గా జరుగుతున్నాయి. ఇదొక మర్చిపోలేని మధురానుభూతిగా వుండబోతున్నది. తెలుగు
మహాసభల ముద్ర హైదరాబాద్ మీద బలంగా పడుతుందనడంలో అతిశయోక్తి లేదేమో! “భాగ్యనగరం
భాసిల్లుతున్నది” అన్న అనుభూతి మిగులుతుంది.
అంగరంగ వైభోగంగా, నభూతో-నభవిష్యత్ అనే రీతిలో, రాష్ట్ర
ప్రభుత్వ సాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలో జరగనున్న సభల పూర్వరంగంలో బహువిధ సమీక్షా
సమావేశాలు, సన్నాహక సమావేశాలు నిరంతరం జరుగుతున్నాయి. సాహిత్యాభిలాషైన రాష్ట్ర
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
స్వయంగా కొన్ని సన్నాహక సమావేశాలను నిర్వహించడం ఒక ప్రత్యేకత అనాలి. దాదాపు
రోజువారీగా, సీఎం, మహాసభల ఏర్పాట్లను సమీక్షించడం అంటే,
ప్రతి అంశాన్ని ఆయన కూలంకషంగా స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లుగా భావించాలి. ఎక్కడా
ఏ తప్పు జరక్కుండా, ఎవరూ నిర్వాహకులను వేలెత్తి చూపకుండా, సమావేశాలకు హాజరైన వారందరూ ఎల్లకాలం గుర్తుంచుకుండేలా సభలు
జరగబోతున్నాయనడానికి ఇవన్నీ తార్కాణం. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సన్నాహక
సమావేశాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న సమావేశం, నవంబర్ 20 న ప్రగతిభవన్ లో,
తెలంగాణాలో తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసి-ఔపోసన పట్టిన ఉద్దండులైన అరవై మందికి
పైగా ప్రముఖులతో జరిపిన సమావేశం అనాలి. రాష్ట్రం నలుమూలల నుంచి, తమదైన శైలిలో, ఒక్కో
సాహిత్య ప్రక్రియలో నిష్ణాతులైన పలువురు, ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో సీఎం
చెప్పిన విషయాలు అక్షరలక్షలు.
ఈ మహాసభలు జరపడానికి
ప్రేరణ...సమైక్య రాష్ట్రంలో మన భాషను-యాసనూ వెక్కిరించి, హేళన చేసి, వెకిలిగా
విమర్శించి, మన ప్రతిభా పాటవాలను వెలుగులోకి రాకుండా చేసిన
నేపధ్యమే! ఇప్పుడు మన రాష్ట్రం మనకొచ్చింది. ఈ రాష్ట్రంలో జరిగే అనేక కార్యక్రమాల
ప్రాతిపదికగా “స్వాభిమాన నిర్మాణం” జరుగుతున్న క్రమం ఇది. సాహిత్య సేవ ఏళ్ల
తరబడిగా, తెలంగాణా ఎంత గొప్పగా చేస్తున్నదో ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఇది. ఈ
రాష్ట్రంలో అనాదిగా, అద్భుతమైన సాహిత్యాన్ని వెలువరించే
గొప్పవాళ్లున్నారని తెలియచేయబోతున్నాం. ఈ సభలు అచ్చంగా,
తెలంగాణా తెలుగులో వెల్లివిరిసిన సాహితీ సంపదను ప్రపంచానికి వివరించడానికి జరుగుతున్నాయనేది
అందరికీ అర్థం కాబోతున్నది. భాష సుసంపన్నంగా పరిణామం చెందుతున్న క్రమంలో, సామాజిక పరిణామానికి అనుగుణంగా సాహిత్య పరిణామం చెందుతున్న క్రమంలో, జరుగనున్న ఈ సమావేశాలు, అన్ని రకాల సాహిత్యాన్ని పరిపుష్టంగా
విశదీకరించడానికి ఒక వేదిక కానుంది.
బమ్మెర పోతన, పాల్కురికి సోమనాదుడి నుండి, నేటి వరకు, పద్య-గద్య కావ్యాల, స్వేచ్చా వచన రచనల విశిష్టత చర్చకు రానున్నది. పండితులు, అవధానులు చేసిన సుసంపన్నమైన సాహితీ ప్రక్రియలు చర్చకు వస్తాయి. ఆధునిక
యుగంలో జరిగిన గేయకవితా ప్రక్రియల మీద, జనం వేనోళ్ల పాడిన
పాటల మీద, సినీ గేయాల మీద, అనేకానేక
సాహితీ ప్రక్రియల ఆధారంగా వెలువడిన గ్రంథాల మీద చర్చ జరుగుతుంది. తెలంగాణ వాళ్లు
తెలుగు మహాసభలు చాలా ఘనంగా జరిపారన్న పేరు వచ్చి తీరుతుంది. సాహితీ పరంగా తెలంగాణ
తెలుగువారి ఐక్యత ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇదొక మహత్తర అవకాశం. అనేకమంది
తెలంగాణ పండితుల, కవుల, రచయితల,
పాత్రికేయుల, వైతాళికుల అముద్రిత గ్రంథాలను ముద్రించి,
విస్మరించిన తెలంగాణ సాహిత్యాన్ని వెలికితీయడానికి మహాసభలు దోహదపడతాయి. కేవలం
మహాసభలతోనే ఈ ప్రక్రియ ఆగకుండా ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ కూడా అయితే మంచిది.
ప్రపంచ తెలుగు
మహాసభల పూర్వరంగంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకున్న అత్యంత
ముఖ్యమైన నిర్ణయం, ప్రాధమిక తరగతి నుండి ఇంటర్మీడియేట్ (12 వ తరగతి) వరకు తెలుగు
భాష అధ్యయనం విధిగా వుండాలని చేయడం. ఉర్దూ మాధ్యమం వున్న పాఠశాలల్లో కూడా ఇంటర్
వరకూ తెలుగు నేర్చుకోవడం తప్పనిసరి. తెలంగాణ వారికి తెలుగు సరీగ్గా రాదని హేళనకు
గురిచేసిన వాళ్లకు ధీటైన సమాధానంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. మన తెలుగు
సంవత్సరాల పేర్లు, పండుగల
పేర్లు, మాసాల పేర్లు మర్చిపోయిన నేపధ్యంలో, నమస్కారం మన సంస్కారం అని మర్చిపోయిన నేపధ్యంలో, తెలుగు మహాసభల పుణ్యమా
అని తీసుకున్న ఈ నిర్ణయం, భవిష్యత్ లో ఎంతో మేలు చేస్తుంది. పెద్ద బాలశిక్ష లాంటి
పాతకాలపు పుస్తకాలకు దీటుగా అలాంటి విద్యనందించే పుస్తకాలు ఎలా వుంటే బాగుంటుందో
తెలుగు మహాసభల్లో చర్చకు రావాలి. విలువల గురించి తెలుగులో విద్యాభోధన చేసే
పద్ధతులను కూడా మహాసభలు చర్చించాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర విభజన తర్వాత, ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించే బాధ్యతను నెత్తిన వేసుకుంది
మొదలు తెలంగాణానే. భాషకు ఎవరూ యజమాని లేరు... నేర్చుకున్నవారే భాషాధిపతులు.
తెలంగాణ తరువాత తెలుగు మాట్లాడే మరో రాష్ట్రం అంధ్రప్రదేశ్. అక్కడినుండి కూడా
అనేకమంది వస్తారు. ఆ ప్రాంతం నుండి కూడా ఎందరో ప్రసిద్ధ కవులు, రచయితలూ వున్నారు. గుర్రం జాషువా, జంధ్యాల పాపయ్య శాస్త్రి లాంటి వారి రచనల మీద కూడా చర్చ జరగవచ్చు. అలా
కాకుండా, తమని పిలిచి అవమానించారన్న అపవాదు రాకూడదు. కాకపొతే
వాళ్ళను కూర్చోబెట్టి మన ప్రతిభ ఏంటో చెప్పాలి. సభల నిర్వహణలో ఆంధ్రావారిపట్ల సహనం
కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎవరెన్ని చెప్పినా, ఎవరేం మాట్లాడినా, తెలంగాణాతో పాటు ఆంధ్రావాళ్ళూ మాట్లాడేది తెలుగే! అందుకే సభల నిర్వహణలో
ఒకవైపు మన సంస్కారం కోల్పోకుండా, మరో వైపు వాళ్లకు ఏ విధమైన
నిర్వహణా బాధ్యతలు, ఆధిక్యత అప్పచెప్పకుండా వుండే రీతిలో వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణా మహాసభల
“ఆధ్వర్యం, ఆధ్యక్షత” మనదే అన్న రీతిలో నిర్వహణ వుండాలి.
వందకు వంద శాతం తెలంగాణా ప్రాశస్త్యం మాత్రమే చాటాలి. ప్రతిభాపాటవాలు మనవే అని
నిరూపించాలి. ఒకవైపు మన ప్రతిభను చాటుకుంటూనే, మరోవైపు, సంకుచిత్వం లేకుండా, సుహృద్భావం-సౌజన్యంతో
వ్యవహరించి, మరెక్కడా జరగని కృషి తెలుగు నుడికారంలో
తెలంగాణాలో జరిగిందని తెలియచేయాలి. పొరుగు రాష్ట్రం వారిని గౌరవించడంలో మాత్రం
లోపం జరుగరాదు. అలాగే వారిపట్ల మన ఔన్నత్యం మర్యాదగా తెలియచేయాలి.
ఇదిలా వుండగా,
తెలుగు సాహితీరంగాన్ని ప్రభావితం చేసిన వాటిలో, అంతో-ఇంతో పాత్ర పోషిస్తున్న
సినిమారంగాన్ని గురించిన వివరమైన చర్చ కూడా మహాసభల సందర్భంగా జరగడం మంచిది. ఈ రంగం
కొంచెం వివాదాస్పదమైనది అయినప్పటికీ, ప్రతిభావంతమైనదనేది నిర్వివాదాంశం. ఒకనాటి సినీరంగ కేంద్రం అయిన చెన్నైలో
(నాటి మద్రాస్) అవకాశాలు బాగా లభించిన ఆంధ్రా ప్రాంతం వారు రాణించారు. అప్పట్లో
తెలంగాణ వాళ్లకు ఎక్కువగా అవకాశాలు రాలేదు-రానివ్వలేదు. దరిమిలా హైదరాబాద్ కు
పరిశ్రమ తరలివచ్చింది. అక్కడక్కడ తప్ప, తెలుగు సినీరంగమంతా
ఆంధ్రావాళ్ళ ఆదిక్యతలోనే ఉందనాలి. ఇప్పుడిప్పుడే తెలంగాణ వాళ్లు కొంచెం
పేరుతెచ్చుకుంటున్నారు. స్టూడియోల సంఖ్య, వసతుల మోతాదు
పెరగడంతో, భారతదేశంలొ అత్యధికంగా సినిమాలు తీసే రాష్ట్రం
తెలంగాణ అయింది. దీనికి కారణం స్టూడియోలున్న హైదరాబాద్ నగర వాతావరణం, దేశంలోని
వివిధ నగరాలకు దాని సామీప్యం. అనేక కారణాల వల్ల హైదరాబాద్ నుండి సినీ పరిశ్రమను
తరలించే ప్రయత్నం జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం కనుక పూర్తి స్థాయిలో సహకారం
అందిస్తే భారతదేశానికి హైదరాబాద్ “సినీ హబ్” అవుతుంది. ఈ నేపధ్యంలో, తెలుగు సినీరంగానికి సంబంధించిన అంశాలు తెలుగు మహాసభల్లో చోటు
చేసుకోవాలి. ఒక “సినీ నైట్” కాని, సినీ సంగీత విభావరి కాని
ఏర్పాటు చేస్తే మంచిది. ఈ కార్యక్రమంలో ఎవర్నీ కించపరిచే విధంగా కాకుండా ఆ రంగం
ప్రాముఖ్యతే ప్రధాన అంశంగా నిర్వహణ జరగాలి.
సాహితీపరమైన, సంగీతపరమైన కార్యక్రమాల సమన్వయంతో;
అద్భుతమైన కళా ప్రదర్శనలతో; జనరంజకంగా వుండే సినీ గీతాల ఆలాపనలతో; తెలంగాణ చేసిన సాహితీ సృజన బయటి ప్రపంచానికి చాటి చెప్పే ప్రక్రియలతో;
తెలుగుతోపాటు సంస్కృత పండితుల రచనలపై చర్చలతో.....ఇదొక భాషా-సాంస్కృతిక-సాహిత్యాల
కలయికగా, కుటుంబాలకు కుటుంబాలే తరలివచ్చి ఈ పండుగలో పాల్గొనే విధంగా, ప్రపంచ
తెలంగాణ తెలుగు మహాసభలు జరుగనున్నాయి.
No comments:
Post a Comment