రామలక్ష్మణులను చూసి
భయపడిన సుగ్రీవుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి
రామాయణం... కిష్కింధాకాండ-6
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం
సంచిక (01-12-2019)
ఈ విధంగా ఆ
రాజకుమారులు, రాముడు, లక్ష్మణుడు ఋశ్యమూక పర్వతం దరిదాపుల్లో సంచరిస్తుండగా, ఆశ్చర్యకరంగా, మిక్కిలి అందంగా, దేవతల్లాగా వున్న
వారిని కొండమీద వున్న సుగ్రీవుడు చూసి భయంతో చేష్టలుడిగి, బాధపడసాగాడు.
సుగ్రీవుడితో పాటు ఇతర వానరులు కూడా చూశారు. రామలక్ష్మణులను చూసిన వానరులకు వీరిని
వాలి పంపగా తమను చంపడానికి వచ్చారని భావించారు. వెంటనే వారు దాక్కునే మతంగాశ్రమ
గుహ దగ్గరకు పోయారు. పంపానదికి ఉత్తరాన రామలక్ష్మణులు, దక్షిణాన
సుగ్రీవాదులు వున్నారు. మనోహరమైన ఆకారంకల రామలక్ష్మణులను విల్లు, బాణాలు, ఖడ్గం ధరించగా
చూసిన సుగ్రీవుడు సందేహించాడు. గుండెలు కొట్టుకున్నాయతడికి. ఇంకా ఎవరైనా
వస్తున్నారేమోనని నలుదిక్కులా చూశాడు. ఎటు పరుగెత్తాల్నా అని ఆలోచించసాగాడు.
నిప్పుతొక్కిన కోతిలాగా అయిపోయాడు. ఒకచోట నిల్వలేకపోయాడు. ఏ పాపం ఎరుగని
అన్నదమ్ములను చూసి తాన్నున్న స్థలాన్ని వదిలి భయపీడితుడు, శోకతప్తుడయ్యాడు.
ఈ పర్వతం మీదే వుంటే శాపభయం లేనందున వాళ్లిక్కడికి వస్తారేమోనని భయపడ్డాడు
సుగ్రీవుడు. ఇది విడిచి పోతే వాలి చంపుతాడేమోనని కూడా భయపడ్డాడు. తనతోటి వానరులను, మంత్రులను చూసి
ఇలా అన్నాడు.
"మంత్రులారా!
శుభకర రూపం కలవారిని చూశారుకదా?
వారెవరో,
ఏమో కాని నిజమైన మునుల్లాగా లేరు. వంచించడానికి నారచీరెలు
కట్టారు. ఎవరిని వంచించడానికి ఇక్కడికి వచ్చారో? నామీద వైరం సాధించడానికి వాలి ఇక్కడికి రాలేడు. కాబట్టి
ఎవరినో మనుష్యులను పిలుచుకుని వచ్చాడు. మునులని మనం దగ్గరకు పోతే, వెంటనే చంపుతారు.
ఇది వారి ఉపాయం. అలాకాకపోతే తపస్సు చేసుకునేవారికి ఆయుధాలెందుకు?"
సుగ్రీవుడు ఇలా
చెప్పగా వానరులు, మంత్రులు కూడా పెద్ద విల్లు-బాణాలు ధరించిన రామలక్ష్మణులను చూసి, గుండెలు అదరగా, ఒక కొండ మీదనుండి
మరొక కొండ మీదికి దూకుతూ, ఒకడు పోయిన దారిలో ఇంకొకడు పోకుండా ఒక్కొక్కరొక దారిలో పోసాగారు. అందరూ చివరకు
ఒక కొండ చాటున చేరి సుగ్రీవుడి దగ్గర నిలుచున్నారు.
సుగ్రీవుడి భయానికి కారణం అడిగిన హనుమంతుడు
ఆంజనేయుడు
సుగ్రీవుడి దగ్గరకు పోయి "వానర రాజా! ఎందుకు నీకు భయం వేస్తున్నది? వాలి భయంతో ఎందుకు
నువ్వీవిధంగా పరుగెత్తుతున్నావు?
ఈ పర్వతం ఋష్యమూకం కదా! ఇక్కడ వాలివల్ల భయం లేదుకదా? ఒకవేళ
భయపడడానికైనా వాలి ఇక్కడెక్కడా కనబడడం లేదే? కాబట్టి ఎందుకు తొట్రుపాటు పడుతున్నావు?క్రూరకర్మలు, పాపపు పనులు చెసే
వాలి నాకిక్కడ కనబడడం లేదు. నీ పిరికితనానికి కారణం ఏమిటి? నీ కోతి స్వభావం
సార్థకమైంది. నువ్వు గొప్ప మనస్సు లేనివాడివైనందున ముందు-వెనుకలు, సాధక-బాధకాలు
పూర్తిగా ఆలోచించడం లేదు. జ్ఞానం,
బుద్ధి,
ఇంగితం లేని రాజు ప్రజలను ఎలా రక్షించగలడు? సుగ్రీవా! మొదట
ఏది తోస్తుందో దాన్నే నమ్మి తటాలున ఏ పనీ చేయవద్దు. ఆ విషయంలో చక్కగా ఆలోచించు.
ఎదుటివారి ముఖనయన చేష్టల వల్ల నీ అభిప్రాయం సరైందో, కాదో నిర్ణయించుకో".
పనులన్నీ
చక్కదిద్దమని హితమైన మాటలు చెప్పిన తన హితుడైన ఆంజనేయుడితో సుగ్రీవుడు శుభకరమైన
మాటలతో ఇలా జావబిచ్చాడు. తన అభిప్రాయం
తాను చెప్తాననీ, ఆ తరువాత హనుమంతుడు పోయి చాకచక్యంగా కార్యం సరిదిద్దమనీ అంటాడు.
"హనుమంతా! నా
ఆలోచనా విధానం చెప్తా విను. కమలాల రేకుల్లాంటి కళ్లు కలవారిని, మోకాలిని అంటే
చేతులు కలవారిని, గొప్ప విల్లు-బాణాలు-కత్తులు కలవారిని, స్తోత్రం చేయడానికి యోగ్యమైన తేజస్సు కలవారిని, దేవకుమారులతో
సమానంగా వున్నవారిని చూస్తే భయం కలగదా? వారు శత్రువులని ఎందుకు భయపడాలి, వారికి నాకు
విరోధం వుందా, లేదు కదా, ఏదో వాళ్ల పనిమీద వాళ్లు వచ్చారేమో, అని అనుకోకూడదా? అంటావేమో?
వీళ్లు ఋషులా? రాచవీరులా?
అయితే నారచీరెలు ఎందుకు కట్టుకోవాలి? ఋశీశ్వరులే అయితే
విల్లు-బాణాలు ఎందుకు? నేనా వాళ్లను ఎరుగను. వారి సహాయం అడగలేదు. కాబట్టి నా పక్షాన రాలేదు. కాబట్టి
దీంట్లో ఏదో వంచన వున్నదని అనుమానించాను. ఏ వంచన అంటావా? వాలి ఇక్కడికి
రాకూడదు. నేనా దీన్ని విడిచి పోను. కాబట్టి ఇక్కడికి రాగలిగి, నన్ను చంపగల
వారెవరినో ఇక్కడికి వాలి పంపాడని నిశ్చయించాను. కాబట్టి భయపడ్డాను”.
“రాజులకు
స్నేహితులు ఎందరో వుంటారు. కాబట్టి రాజులను నమ్మకూడదు. వంచనతో రహస్యంగా తమ
శత్రువులను చంపడానికి ఎవరినో పంపుతారు. వచ్చినవారు అవకాశం దొరికినప్పుడు తమ గుట్టు
బయటపడకుండా శత్రువులను చంపుతారు. ఇది రాజ ధర్మం. వాలి అంటే సామాన్యుడు కాదు.
ఉపాయాలన్నీ తెలిసినవాడు. అపాయం లేని నడవడి కలవాడు. దూరాలోచన కలవాడు. రాజులందరూ తమ
శత్రువులను ఉపాయంతోనే కదా చంపుతారు? అలాగే వాలి కూడా చేస్తుండవచ్చు. అయినప్పటికీ ఇది ఇలాగే అని
నేను చెప్పలేను. నా జాగ్రత్తలో నేను వుండడం మంచిదని ఇక్కడికి వచ్చాను. నా ఆలోచన
సరైందా? కాదా? అని తెలుసుకోవాలి. దానికొరకు ఎవరో ఒక సామాన్యుడిని వారిదగ్గరకు పంపాలి. అధముడు
పోతే పని పాడవుతుంది. కాబట్టి నువ్వే సామాన్య మనిషి వేషంలో వాళ్ల దగ్గరికి పోయి
విషయం తెలుసుకో".
రామలక్ష్మణుల దగ్గరికి హనుమంతుడిని పంపిన సుగ్రీవుడు
"ఆంజనేయా!నువ్వు
పో. మాటలవల్ల, ఆకారాల వల్ల, పలురకాలైన ముఖకవళికల వల్ల,
వాళ్ల మనస్సు నిజంగా ఎలాంటిదో కనుక్కో, వారి మనస్సు
శుద్ధమైందా? వంచనతో కూడిందా? ఇది వున్నది వున్నట్లుగా తెలుసుకో. ఆంజనేయా! నువ్వు ముందుగా చేయాల్సిన పని
చెప్తా విను. నీ మాటల నేర్పుతో,
నీ భావం వాళ్లకు సులభంగా అర్థమయ్యేట్లుగా, వాళ్లు నిన్ను
నమ్మేట్లు ముచ్చట్లాడు. ఇలా నీమీద ముందుగా నమ్మకం పుట్టించుకుని ఆ తరువాత నామీద
వాళ్లకు సదభిప్రాయం కలిగేట్లు చేయి. ఇలా చనువు కుదిరిన తరువాత వాళ్లు కత్తులు, బాణాలు, విల్లు ధరించి
అడవుల్లో తిరగడానికి కారణం ఏంటో కనుక్కో. వాళ్లు నిర్మలమైన మనస్సు కలవారనీ, వంచన గుణం
లేనివారనీ నీకు నమ్మకం కుదిరితే,
వాళ్లు మాట్లాడే విధానం గమనించు. వారి మాటల్లో నిజమెంతో, మోసమెంతో
తెలుసుకో".
అని సుగ్రీవుడు
చెప్పగా అలాగే చేస్తానని మహాత్ముదైన హనుమంతుడు రామలక్ష్మణులున్న ప్రదేశానికి ఎలా
పోవాలా అని ఆలోచన చేశాడు. తన స్వరూపంతోనే పోవాలా, పోయినట్లయితే, సుగ్రీవుడి దగ్గరనుండి వచ్చాడని అనుమానించి, వాళ్లు వంచకులే
అయితే తనను వదిలరని భావించాడు. పోయిన పని వృధా అవుతుందనుకుంటాడు. సామాన్యులైన అడవి
మనుష్యుల వేషంతో పోతే, వీడెవడో పామరుడని మనసు విప్పి మాట్లాడరేమో? ఎలా పోవాలా అని ఆలోచన చేశాడు.