అశోక్ నగర్ పర్చా కిషన్ రావు గారింట్లో
జ్ఞాపకాల
అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-13
వనం జ్వాలా నరసింహారావు
మా పెద్ద అమ్మాయి బుంటి-ప్రేమ మాలిని, మా ఆవిడ
చిన్నన్నయ్య డాక్టర్ మనోహర్ రావు వరంగల్ మెడికల్ కాలేజీలో మెడికోగా వున్నప్పుడు,
వరంగల్ లో పుట్టింది. మా రెండో కూతురు కిన్నెర భద్రాచలం ఆసుపత్రిలో మా ఆవిడ
పెద్దన్నయ్య డాక్టర్ రంగారావు మెడికల్ ఆఫీసర్ గా వున్నప్పుడు అక్కడ పుట్టింది. ఇలా
వాళ్లిద్దరూ మా ఆవిడ పుట్టింటికి సంబంధించిన వారి పర్యవేక్షణలో, పుట్టింటి వారి
(ఆసుపత్రి, తదితర) ఖర్చుతో పుట్టారు. మూడో కాన్పు పుట్టింటి వారి ఖర్చుతో కాకూడదని మా
నాన్న, అమ్మ చెప్పడం వల్ల మూడో డెలివరీ ఖమ్మంలో అత్తింటి వారి పర్యవేక్షణలో జరగాలని
నిర్ణయించాం. హైదరాబాద్ లో వుంటున్న మా ఆవిడ డెలివరీకి రెండు నెలల ముందు ఖమ్మం
వెళ్లింది. వెళ్లి (అత్తగారి ఇంట్లో) మా ఇంట్లోనే మా అమ్మ దగ్గర వుంది. ఆలనా-పాలనా
అంతా మా అమ్మే. డిసెంబర్ 24 మధ్యాహ్నం సమయంలో కొత్తగా పెట్టిన డాక్టర్ దంపతులు
ఆంధ్రజ్యోతి-వైవీ రామారావు ఆసుపత్రిలో మా ఆవిడను అడ్మిట్ చేయడం, ఆ సాయింత్రమే నార్మల్ డెలివరీ
అయ్యి ఆదిత్య పుట్టడం జరిగింది. మా ఇంటికి అతి సమీపంలోనే వున్న ఆసుపత్రి అది.
ఆదిత్య పుట్టిన వార్తను మా నాన్న గారు ఇంట్లోనే వున్న అందరికీ తెలియ చేశాడు.
యధావిధిగా గతంలో మా ఇద్దరు
అమ్మాయిలకు చేసినట్లుగానే 21 వ రోజు బారసాల, నామకరణం తదిర
కార్యక్రమాలు జరిపించారు మా అమ్మానాన్నలు. అబ్బాయి పేరు ఆదిత్య కృష్ణ రాయ్ అని
పెట్టాం. బారసాల తరువాత నేను మామూలుగా ఉద్యోగంలో చేరడానికి హైదరాబాద్, మా ఆవిడ తల్లిగారి వూరు
వల్లభికి పోవడం జరిగింది. అక్కడే మూడో నెల వచ్చిందాకా వున్నది. మధ్యమధ్యన నేను
ఖమ్మం, వల్లభి వెళ్లి వస్తుండేవాడిని. అలా ఒక పర్యాయం వచ్చినప్పుడు బాణాపురం గ్రామ
సర్పంచ్ గండ్లూరి కిషన్ రావును వనం నర్సింగరావుతో వెళ్లి కలియడం, ఆ రాత్రే ఆయన సెకండ్ షో
సినిమా నుండి స్నేహితులతో ఇంటికి వస్తుండగా దారుణంగా హత్యకు (నాకు గుర్తున్నంత
వరకు ఫిబ్రవరి 7, 1976) గురికావడం జరిగింది. ఖమ్మం సమితి గ్రామాల్లో కాంగ్రెస్-కమ్యూనిస్ట్
గొడవల్లో భాగంగా జరుగుతున్న హత్యల పరంపరలో ఆయనది కూడా ఒకటి. మూడో నెల
ప్రవేశించడంతో ఆ ఆవిడ ముగ్గురు పిల్లలతో సహా హైదరాబాద్ చేరుకుంది. ఎప్పటిలాగే
సంసారం సాగింది.
ఇంతలో మా తోడల్లుడి తండ్రి జూపూడి
నరసింహారావు గారు, నేను ఖమ్మలో ఉన్నప్పుడే ఒకరోజున నన్ను పిలిచి వారి ఇల్లు ఖాళీ
చేయమని చెప్పాడు. మరో ఇల్లు వెతుక్కుంటూ వుంటే, అశోక్ నగర్ హనుమాన్
దేవాలయం దగ్గరలో వున్న పర్చా కిషన్ రావు గారి ఇంట్లో ఒక పోర్షన్ (మూడు చిన్న
గదులు) దొరకడం, అందులో చేరడం చకచకా జరిగిపోయింది. మా ఇంటి పక్కనే, మా కాంపౌండు గోడకు
ఆనుకునే స్వర్గీయ సి నారాయణ రెడ్డిగారు వుండేవారు. వారి నలుగురు ఆడపిల్లలు, గంగ, యమున, సరస్వతి, కృష్ణలు మా ఇంటికి రావడం
మా పిల్లలతో సరదాగా గడపడం నాకింకా గుర్తు.
ఆ రోజుల్లో మమ్మల్ని బాగా
ఇబ్బందికి గురిచేసిన అంశం మా ఆబ్బాయి ఆదిత్యకు వచ్చిన “స్కిన్ ఎగ్జిమా” సమస్య.
వాడి వళ్ళంతా చాలా చీకాకు కలిగించే విధంగా ఆ సమస్య వుండేది. మా ఆవిడ అన్న గారు
(చిన్న పిల్లల) డాక్టర్ మనోహర్ రావు ఆ రోజుల్లో మా కుటుంబానికి చాలా అండగా
వుండేవాడు. నేనేమో ఉదయం ఆరున్నరకే బీహెచ్ఇఎల్ స్కూల్ ఉద్యోగానికి పోవాల్సి
వచ్చేది. మళ్లీ సాయంత్రం ఏడున్నర దాకా రావడం కుదరక పోయేది. ఆదిత్యను చర్మ వైద్య
నిపుణుల దగ్గరకు తీసుకుపోవడానికి మనోహర్ రావు చాల సహాయపడేవాడు. ఏ మందు ఎలా వాడినా
సమస్య తీరకపోయేది. ఎవరికి చూపించినా పెద్దయితేనే కాని (మూడు-నాలుగేళ్లు వయసు)
తగ్గదని చెప్పేవారు. అలోపతి కాకుండా హోమియో వైద్యం కూడా చేయించాం. అయినా ఫలితం
లేదు. ఎవరింటికీ పండుగలకు కాని, ఫంక్షన్లకు కాని వాడిని తీసుకు పోయేవాళ్లం కాదు.
చివరకు వాడికి మూడేళ్లు వచ్చిన తరువాత, హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో
చేర్పించిన తరువాత గాని అది తగ్గలేదు.
మేం పర్చా కిషన్ రావు
గారింట్లో వున్నప్పుడే అనుకోకుండా డైనింగ్ టేబుల్ కొనుక్కోవడం జరిగింది. అదే మా
డబ్బుతో కొన్న మా మొట్టమొదటి, చివరి టేబుల్. అది, దాంతో పాటు కొన్న కుర్చీలు మా
ఇంట్లో దాదాపు ఇరవై సంవత్సరాలు మాకు సర్వీసు చేసింది. రోజ్వుడ్ కలర్ టేబుల్ అది.
చాలా ముచ్చటగా వుండేది.
ఇంతకూ ఆ టేబుల్ కొనడం, కొనగలగడం వెనక ఒక కథ
వుంది. నేను ఖమ్మంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు నా జీతానికి అదనంగా ఆదాయం వుంటే
బాగుంటుందని అనిపించి మా ఆవిడ పేరుమీద జీవిత భీమా కంపెనీ ఏజంటుగా నమోదు చేయించాం.
మొదటి సంవత్సరమే మా తోడల్లుడు జూపూడి ప్రసాద్ పేరుమీద లక్ష రూపాయలకు ఇన్సూరెన్స్
చేయిస్తే భారీగా ఏజంట్ కమీషన్ లభించింది. అలా నేను ఖమ్మంలో ఉద్యోగం చేసినన్ని
రోజులు, హైదరాబాద్ వచ్చిన తరువాత కూడా కొన్నాళ్లు ఇన్సూరెన్స్ ఏజన్సీ వుండేది మా
ఆవిడకు. ఏజంట్ కమీషన్ గా మొదటి సంవత్సరం భీమా చేసిన వ్యక్తి కట్టే ప్రీమియంలో 25%, రెండు, మూడు సంవత్సరాలలో 15%, ఆ
ఆతరువాత తగ్గుకుంటూ పోతుంది. పాలసీ లైవ్ లో వున్నంతకాలం కమీషన్ వస్తూనే వుంటుంది.
మేము ఏజన్సీ వదిలిన తరువాత కూడా అలా కట్టిన వారి నుండి కొంత కమీషన్ లభించేది.
అనుకోకుండా 1976 జూన్-జులై నెలల్లో రు. 600
కమీషన్ చెక్ వచ్చింది. అది నా చేతికి వచ్చిన సమయంలో మా ఆవిడ మేనమామ, ఎస్బీఐ సీనియర్ అధికారి
భండారు రామచంద్ర రావు గారు మాదగ్గరే వున్నారు. ఆయన దాన్ని వెంటనే తీసుకుని చెక్
కలెక్షన్ కు పోకుండానే తన అకౌంట్లో వేసుకుని, పైకం ఇచ్చాడు. దానివల్ల
ఆయనకుఇబ్బంది అయింది కూడా. ఆ డబ్బుతో ఒక డైనింగ్ టేబుల్, మూడు కుర్చీలు కొన్నాం.
నాలుగో కుర్చీకి డబ్బులు చాల లేదు. అప్పట్లో అదే పరిస్థితి మా అందరిదీ కూడా.
నాలుగో కుర్చీ (బహుశా అప్పట్లో ఇరవై రూపాయలు అనుకుంటా!) తరువాత కొన్నాం. టీబీ
ఆసుపత్రిలో పనిచేసిన చంద్రయ్యకు 1995 లో ఆ డైనింగ్ టేబుల్ సెట్ ఇచ్చాం.
No comments:
Post a Comment