స్వర్గం మీద కాని, అయోధ్య మీద
కాని మనసు పోని రాముడు
శ్రీమదాంధ్ర వాల్మీకి
రామాయణం... కిష్కింధాకాండ-5
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం
సంచిక (24-11-2019)
లక్ష్మణుడితో తన
సంభాషణ కొనసాగిస్తూ శ్రీరాముడు ఇలా అంటాడు.
"నానా రకాల రంగులు
కల పూలు, అంతటా రాలి మనోహరంగా,
బంగారపు ఎరుపు, తెలుపు కలిగి, పరచిన పరుపులాగా ప్రకాశిస్తున్నాయి లక్ష్మణా చూశావా? లక్ష్మణా! ఈ వసంత సమయంలో చెట్ల సమూహాలలో ఎంత విస్తారంగా పూలున్నాయో చూశావా? అన్నా! ఏ పక్క చూసినా పూలు, కొమ్మల కొనల్లో బసకలిగి
వున్నాయి. ఈ వృక్షాలు ఒకదానిలాగా మరొకటి పూయాలని, పోటీపడి,
చక్కగా పూచి, తుమ్మెదల ఝంకారాల నెపంతో
ఒకదానిని ఇంకొకటి అదే తక్కువ పూచిందని, తాను ఎక్కువగా పూసానని
పరిహాసం ఆడింది. ఈ నీటికోడి తన భార్యతో నీళ్లలో మునిగి స్నానం చేసి నాకు మదన తాపం
కలిగేట్లు రతికేళిలో నిమగ్నమైంది. గంగానదికి, ఈ పంపానది అందం
లభించినందువల్లే కదా,
మనోహర గుణాలతో లోకంలో ప్రసిద్ధికెక్కింది. నా భార్యను నేను
కళ్లారా చూస్తూ నిండుమనస్సుతో వుండగలిగితే, నాకు స్వర్గం మీద కాని, అయోధ్య మీద కాని మనసుపోదు. స్వర్గం, వైకుంఠం మాట అలా
వుండనియ్యి...సీతను చూస్తూ,
మిసమిస మెరిసే ఈ పచ్చిక బయళ్లలో మనం వుండగలిగితే, పొద్దుపోవడానికి కూడా మిగతా విషయాల జోలికి ఎందుకు పోతాను? మనం ముగ్గురం తప్ప వేరే ఆలోచనే రాదు”.
"తమ్ముడా, లక్ష్మణా! చిగుళ్లతో,
మొగ్గలతో, పూలతో, అందమైన ఆకులతో కాంతివంతంగా ప్రకాశిస్తూ, ఈ చెట్లున్న అడవుల
కాంతితో నాకు పిచ్చెక్కుతున్నది. చక్రవాకాలు, బెగ్గురులు, నీటికోళ్లు,
క్రౌంచాలు, కూసే పక్షులు, అనేక రకాల జింకలు,
పందులు, మితిమీరి వున్నాయి. ఈ
పంపానదిని చూశావా?
యువతీరత్నం, చంద్రముఖి, కమలలోచన అయిన సీతాదేవిని, సంతోషంతో కూడిన పక్షి
సమూహాలు నాకు స్మృతికి తెచ్చి మితిమీరిన కామాన్ని నాకు కలిగిస్తున్నాయి. ఆడ
జింకలతో కలిసి చరియల్లో తిరిగే మగ జింకలను చూడు. ఆడ జింక కళ్లలాంటి కళ్లుకల సీతను
విడిచి వున్న నన్ను చూడు. అవెంత సంతోషంగా వున్నాయో, నేనెలా ఏడుస్తున్నానో చూడు. మదించిన పక్షి గుంపులు పర్వతాలలోని బయళ్లలో కామంతో
సంతోషంగా తిరుగుతుంటే ఇక్కడ నేను తత్తరపాటుగా వుండడాన్ని ఏమని చెప్పాలి? సీతాదేవితో కూడి ఈ మనోహరమైన వనంలో కామం చక్కబడే విధంగా ఇతర విచారం లేకుండా
తిరిగినప్పుడు కదా నా మన్స్సు చక్కబడుతుంది. పావన పంపానదీ జలాలను, పిల్ల గాలులను,
నేను పావని అయిన సీతాదేవితో కలిసి సేవిస్తేనే కదా నా దేహంలో
ప్రాణాలు నిలుస్తాయి. అలా కాకపోతే నాకు క్షేమం కలదా? కమలాలతో,
కలువలతో, పరిమళాలు కలదిగా చేయబడ్ద
పంపా సమీపంలోని అడవుల గాలిని అలసట మాని సేవించగలవారే ఎంతో ధన్యులు”.
"ఆ కమలాక్షి, ఆ సుందరి,
నిండు చంద్రుడిని పోలిన మోము కలది, వియోగం కలిగినందున,
ఏ విధంగా ధైర్యంతో ప్రాణాలు నిలుపుకోగలదు? దానికొరకై నేను దుఃఖిస్తాను. వియోగం ఎలాగైనా సహించవచ్చు. అవమానం ఎలా సహించాలి? ఏం అవమానం వచ్చిందంటావా? సీతాదేవి తండ్రి జనక రాజు
పాపరహితుడు. యదార్థం చెప్పుతాడు. గొప్ప పూజ్యమైన మనసున్నవాడు. ధర్మం అంటే ఆసక్తికల
ఆచారం కలవాడు. ఇలాంటివాడు,
నేను మళ్లీ తిరిగి అయోధ్యకు పోయిన తరువాత, ’అల్లుడా,
నా కూతురు క్షేమంగా వుందా?’ అని కుశల ప్రశ్న వేస్తే, నేనేమని జవాబివ్వాలి? ’నీ కూతురును ఎవడో ఎత్తుకుని పోయాడు’ అని చెప్పాల్నా? ఇంతకంటే అవమానమైన మాట ఇంకోటి లేదుకదా? నన్ను కడుపార కన్న తండ్రే
నా మీద ప్రేమ వదిలి,
’రామా! నువ్వు అడవుల పాలై పో’ అని చెప్పగా, సీతాదేవి భర్త వెంట భార్య అనే న్యాయాన్ని అనుసరించి నా వెంట వచ్చింది.
దానివెంట నేను పోలేదు కదా?
నేనేమి మగడిని? ఏమి కృతజ్ఞుడిని? ఎక్కడ,
ఏ గతి పట్టిందో?”
"లక్ష్మణా!
రాజునన్న పేరే కాని నాకు రాజ్యం లేదు. నా లాగా సంతోషహీనులై ఏడ్చేవారు ఎందరుంటారు? నవ్వుకుంటో,
ఏడ్చుకుంటో ఏదో తిని కొంపలో పడి వుందామంటే, దరిద్రుల్లో శ్రేష్టుడనైతిని. ఇలాంటి నావెంట తన పుట్టింటికీ, బంధువుల ఇంటికీ కాకుండా, నాతో పాటు అడవులకు నన్ను
వదలకుండా వచ్చిన ఆడపడుచును వదిలిన నేను దేన్ని చూసి ప్రాణాలు నిలుపుకోవాలి? లక్ష్మణా! సీతాదేవి ఘుమ-ఘుమ కమ్మటి వాసనలు వెదజల్లే అద్దంలాంటి ముఖాన్ని
చూడగలనా?
చెవులకింపుగా సమానమైన చిరునవ్వుతో కూడిన హాస్యపు మాటలను
నేను వినగలనా?
తనకు మనసులో బాధ వున్నప్పటికీ, ఏమీ లేనిదానిలాగా నా మదన తాపం చల్లారేట్లు పలుకగా జీవించగలనా? మెల్లటి నడకగల సీతాదేవిని కూడి సంతోషంగా హృదయంతో జీవించగలనా? తమ్ముడా! నేనేం చేయాలిరా ఇప్పుడు? అయోధ్యకు పోగానే
కల్లాకపటం తెలియని మృధుస్వభావి మా తల్లి కౌసల్య ఎదురుగా వచ్చి, కుమారా! నా కోడలేదిరా?
అని అడిగితే ఏమని జవాబు చెప్పాలి? లక్ష్మణా! నువ్వు అయోధ్యకు వెళ్లిపో. నాగతి ఏమిటంటావా? సీతను విడిచి నేను బతకలేను. ఒక్క బాధే అయితే ఎలాగైనా సహించవచ్చు. సీత నా
సుఖానికి కారణమైంది. తన సుఖం లెక్కపెట్టకుండా నా సుఖం కొరకు నావెంట నన్ను నమ్మి
అడవులకు వచ్చింది. అలాంటి దాన్ని విడిచి నేనెలా బతుకుతాను? సీతాపతి,
సీతా భర్త, సీతా ప్రియుడు, సీతా మనోహరుడు,
సీతా ప్రాణేశుడు అని ఎవరైనా అంటే, వాళ్ల ముఖం నేనెలా
చూస్తాను?
మొండి బతుకు బతికి అయోధ్యకు వచ్చాననుకో....మామగారికి ఏమని
చెప్పాలి?
కన్న తల్లికి ఏమని చెప్పాలి? వాళ్లు వద్దని వారించినా మగవాడిలాగా సీతను తీసుకుపోయానే? ఇప్పుడు వాళ్లేమంటారు?
కామానికి ఏడ్వాలా? నా అనాథ తత్వానికి
ఏడ్వాలా?
అవమానానికి ఏడ్వాలా? దేనికని ఏడ్వాలి? కాబట్టి ఇన్ని దుఃఖాలతో ఈ శరీరం నిలవదు. నువ్వు అయోధ్యకు పోయి భరతుడి దగ్గర
చేరు. ఆయన కైక కొడుకైనా నువ్వంటే ప్రేమకలవాడు. నిన్ను అలక్ష్యం చేయడు.
వెళ్లు".
ఇలా
రామచంద్రమూర్తి,
ఎంతో సమర్థుడైనప్పటికీ, బేలవలె ఏడుస్తూ వుండడం
చూసిన లక్ష్మణుడు సమాయనుకూలమైన నీతితో కూడిన హితబోధ చేసి సంతాపాన్ని ఉపశమింప
చేద్దామని ఇలా అన్నాడు.
"అన్నా!
ధైర్యం తెచ్చుకో. నీలాంటి ధీరుడు ఆపద్దశలో ఇలా దుఃఖించవచ్చునా? ఏడ్వ వచ్చునా?
అన్నా, నా మనవి దయచేసి ఆలకించు.
ఈ లోకంలో తనకు ఇష్టమైన వారు వదిలిపోతే తీవ్ర దుఃఖం కలుగుతుంది. ఇది లోక ధర్మమని నీ
మనసుకు తెచ్చుకో. తెచ్చుకుని ఏం చేయాలంటావా? ఎవ్వరిమీదా, ఏ బంధువుల మీదా స్నేహభావం వుంచుకోవద్దు. అన్ని దుఃఖాలకు స్నేహభావమే కారణం.
నీళ్లలో నానిన వత్తి కూడా చమురుతో స్నేహభావం వల్ల మండుతున్నది కదా? నీళ్లలో నానితే మండదు కాని చమురుతో నానితే మండుతుంది. వత్తిని కాల్చేది
స్నేహమే కదా?
అందుకే స్నేహం వదులుకో. అటైన సీత పోయిన పోనీలే అని
వూరుకుందామా అని అంటావేమో?
సీతను పోగొట్టుకుని వూరికే వుండమని నేననడంలేదు. ముందు మనం
సీత ఎక్కడున్నదా అనే విషయం తెలుసుకోవాలి. దానికై మనం కృషి చేయాలి. ఆమె వునికి స్థానం
మనకు తెలిస్తే,
మనం చంపుతామని భయపడి, ఆమెను అపహరించినవాడు
తనంతట తానే సీతను తెచ్చి నీకు సమర్పిస్తాడు. అలాకాకపోతే, వారెవరైనా సరే,
జానకితో పాతాళలోకంలో దూరినా, ఇంద్రుడి తల్లి కడుపులో దాగినా వాడిని చీల్చి చెండాడుతాను. నువ్వు
శ్రమించాల్సిన అవసరం లేదు. సీతాపహరణం వల్ల నాకు దుఃఖం లేదా? అవమానం నాకు లేదా?
నువ్వు సీతకొరకు మాత్రమే దుఃఖిస్తున్నావు. నేను మీ
ఇరువురికొరకు దుఃఖిస్తున్నాను. బహిరంగంగా ఏడ్వడం లేదు. కార్యసాధన ఉపాయం
ఆలోచిద్దాం”.
"భార్య కొరకు, ఎంతో బుద్ధికలవాడివై కూడా, బుద్ధిమంతుల్లో
శ్రేష్టుడవై కూడా,
ఆలోచన లేనివాడిలాగా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడ్వ వద్దు. ఏడుస్తూ వూరికే కూర్చుంటే ఏ పనీ జరగదు. నీకు ఏడుపు ప్రధానమా? సీతను మళ్లీ పొందడం ప్రధానమా? రెండోది ప్రధానమైతే
దానికై కృషి చేయి. ఆ కృషికి కావాల్సింది ధైర్యం. కాబట్టి ధీరుడివికా. ఏవిధంగానైనా
సీతను సాధిద్దాం. ప్రయత్నం చేయకపోతే చెడిన పని ఎలా బాగవుతుంది? అన్నా! నువ్వు ఉత్సాహం వదలడం మంచిదికాదు. ఉత్సాహంకంటే బలం లేదు. ఉత్సాహమే
శక్తి. ఉత్సాహవంతులకు సాధించనిది లేదు. ఉత్సాహంతో పనిచేసేవారికి కార్యాలు విఘ్నం
కలగించలేవు. రామచంద్రా! నీకు ఉత్సాహం కలిగిందా....సీతను తప్పక
తేగలవు....చూడగలవు. శోకాన్ని తగ్గించుకో.
కామవృత్తు వదులుకో. నువ్వు కోవిదుడివి. మహాత్ముడివి. సుకృతాత్ముడివి. రామచంద్రా!
ఇలాంటి నిన్ను నువ్వే తెలుసుకోలేకపోతే నేనేమని చెప్పాలి?". అని ఇలా లక్ష్మణుడు చెప్పగా ఆయన చెప్పిన మాటలు సత్యమని భావించిన రాముడు దుఃఖాన్ని
విడిచి ధైర్యం వహించాడు. ఆ తరువాత శీఘ్రంగా సెలయేళ్లు, అడవులు,
గుహలు, చూసుకుంటూ నిర్భయంగా
నడుస్తూ,
తమ్ముడు ధర్మ వాక్యాలు చెప్తుంటే వినుకుంటూ ముందుకు
సాగిపోయారు.
No comments:
Post a Comment