మొదటి పర్యాయం
గాంధీనగర్-బాకారం ఇంట్లో అద్దెకు
జ్ఞాపకాల
అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-15
వనం జ్వాలా నరసింహారావు
పర్చా కిషన్ రావు
గారింట్లో కూడా ఏడాదికి మించి వుండలేదు. అదేంటో గాని మేం ఎంత మంచిగా వున్నప్పటికీ
మేం అద్దెకుంటున్న ఇంటి సొంతదారులు మమ్మల్ని ఏడాదికాగానే ఖాళీ చేయమని అనేవారు.
దాదాపు చాలా ఇళ్లల్లో అలానే జరిగింది,
ఒకటి-రెండు చోట్ల తప్ప. మమ్మల్ని హటాత్తుగా ఖాళీ చేయమన్న పర్చా కిషన్ రావు గారిమీద
ఒకింత కోపం వచ్చినప్పటికీ, ఆయన ఇల్లు ఆయన ఇష్టం అనుకుని
ఇల్లు వెతుక్కునే ప్రయత్నం చేశాం. ఎంత వెతికినా అశోక్ నగర్,
చిక్కడ్పల్లి ఏరియాలలో అద్దెకు ఇల్లు దొరకలేదు. ఇంకా అప్పటికి ఫ్లాట్స్ కల్చర్
రాలేదు. ఇళ్ళ కొరతకూడా వుండేది. మొత్తం మీద వెతకగా, వెతకగా
న్యూ బాకారంలో (గాంధీనగర్ అని కూడా అనేవారు) రెండు చిన్న గదులు దొరికాయి. అద్దె
అరవై రూపాయలు. వెనక వైపు నుండి ఇంటి సందులో పోతే పక్క ద్వారం గుండా లోపలికి పోయే
ఇల్లది. మేం తీసుకున్న ఇంటి పక్కనే మా ఆవిడ కజిన్ అయితరాజు జగన్మోహన్ రావు కుటుంబం
అద్దెకుండేది. మాకు వాళ్ళు చాల తోడుగా వుండేవారు.
మా ఆవిడ చిన్ననాటి స్నేహితురాలు కేసరి (అనుకుంటా) మేం అద్దెకున్న ఇంటికి సమీపంలోనే
వుండేది. ఒకనాడు అనుకోకుండా కలవడం, మా ఆవిడ, కేసరి చిన్ననాటి
కబుర్లు తిరగేసుకోవడం, రోజూ కలసి కబుర్లు చెప్పుకోవడం
జరగసాగింది. అలాగే నేను పనిచేస్తున్న బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లోనే
పనిచేస్తున్న రాజేశ్వరి నారాయణన్ కూడా ఆ దగ్గరలోనే వుండేది. నేను అక్కడి నుండి
రోజూ అశోక్ నగర్ మీదుగా, హిమాయత్ నగర్ వరకు నడుచుకుంటూ
(సుమారు పాతిక నిమిషాలు) పోయి స్కూల్ కు పోవడానికి అక్కడ బస్సెక్కే వాడిని. అది
కూడా ఉదయం ఆరున్నరకే. మధ్యలో బీహెచ్ఇఎల్ కర్మాగారంలో పనిచేస్తున్న నరసింహారెడ్డి
(కమ్మర్షియల్ సీనియర్ ఇంజినీర్) కలిసేవాడు. మా స్కూల్ లైబ్రరీ పేపర్లను నేను
ఇంట్లో వేయించుకుని రోజూ తీసుకెళ్లేవాడిని. బస్సులో అంతా చదివేవారు. దిగేటప్పుడు
అవి తీసుకునేవాడిని.
బాకారంలో వుంటున్నప్పుడు మరిచిపోలేని ఒకటి-రెండు సంఘటనలు ఇప్పటికీ ఇంకా
గుర్తున్నాయి. అందులో ఒకటి ప్రతిరోజూ ఉదయమే పాలు పోసేవాడి ధాష్టీకం. అప్పట్లో
ఇప్పటిలాగా ఎప్పుడు పడితే అప్పుడు పాలు దొరక్క పోయేవి. పాలు కొనాలంటే ఒకటి-రెండే
మార్గాలు. ఇంటి ముందర కొచ్చి మన కళ్ళ ముందు బర్రె పాలు పితికి పోయడం, లేదా, వాడి ఇంట్లో పితికి తెచ్చి మనకు మన ఇంట్లో పోయడం. ఇది ప్రయివేట్
వ్యవహారం. సర్కారు వారు పాల సీసాలు అమ్మేవారు. నాకు గుర్తున్నంతవరకు సీసా ఖరీదు
పావలా (రూపాయిలో నాలుగో వంతు). నెలకు సీసాకు ఇంత అని మనకు ఎన్ని సీసాలు కావాల్నో
అన్నింటికి ముందస్తుగానే డబ్బులు కట్టించుకుని కార్డు ఇచ్చేవారు. అప్పట్లో మా జీతం
నెలకు సుమారు రు. 300. ముందస్తుగా కట్టలేక ఏరోజుకారోజు క్యూలో నిలబడి డబ్బులు
పెట్టి కొనుక్కునే వాళ్ళం. దురదృష్టం ఏమిటో గాని క్యూలో నిలబడ్డ మా వంతు
వచ్చేసరికి సీసాలు అయిపోయాయని అనేవారు. ఇంట్లో పిల్లలు ముగ్గురూ అప్పటికి పాలు
తాగే వయసు వాళ్లే. ఇలా కాదనుకుని ఒకడిని ప్రతిరోజూ పాలుపోయడానికి కుదిరించుకున్నాం.
అలా
కుదిరించు కోవడానికి కారణం, డబ్బులు ఇవ్వడానికి ఒక నెల ఆలశ్యం అయినా
పాలవాడు సర్దుకు పోతాడని. కాని మేం అనుకున్నట్లు జరగలేదు. పాలవాడు ఒక నెల డబ్బులు
ఇవ్వక పోయేసరికి ఇవ్వమని డిమాండ్ చేయకుండా, పాలల్లో నీళ్లు
కలిపి పోయడం మొదలు పెట్టాడు. కోప్పడితే, వెంటనే పాత బాకీ
కట్టమన్నాడు. కట్టడానికి డబ్బుల్లేక, వాడు ఎలా పోస్తే అలాగే
పోయమన్నాం గత్యంతరం లేక. పాలవాడు మమ్మల్ని బెదిరించిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ
సంఘటన ఒక జ్ఞాపకం.
మరో
మరవలేని సంఘటన మా అబ్బాయి ఆదిత్యను ఆసుపత్రిలో చేర్పించడం. వాడికప్పుడు బహుశా రెండేళ్ళు
ఇంకా నిండలేదనుకుంటా. హటాత్తుగా వాడికి విరోచనాలు విపరీతంగా కావడం మొదలయ్యాయి.
వెంటనే మా ఆవిడ అన్నయ్య డాక్టర్ మనోహర్ రావును సంప్రదించాం. ఆయన ఇచ్చిన మందులకు
వెంటనే నయం కాలేదు. ఆయన సలహామీద నారాయణగూడాలో వున్న స్నేహితుడు డాక్టర్ చారి
ఆసుపత్రిలో చేర్పించాం. ఒక రాత్రి వుంచినా ఫలితం లేకపోయింది. విరోచనాలు ఆగలేదు.
మర్నాడు మనోహర్ సలహా మీద నిలోఫర్ ఆసుపత్రికి మార్పించాం. అక్కడ మనోహర్ స్నేహితుడు
డాక్టర్ సురేష్ పనిచేస్తున్నాడు. తక్షణమే చికిత్స మొదలెట్టారు. ఎంతకూ మందులకు
తగ్గకపోతే సెలైన్ ఎక్కించడానికి ప్రయత్నం చేస్తే నరం దొరకలేదు. అప్పటికే
డీహైడ్రేషన్ మొదలైంది. వెంటనే కాలు కింద చిన్నగా కోసి, నరం బయటకు తీసి సెలైన్ ఎక్కించారు. మొత్తం మీద ఒకటి-రెండు
రోజుల్లో తగ్గిపోయింది.
అప్పట్లో
చికిత్స చేయించడానికి మా దగ్గర కావాల్సినంత డబ్బు కూడా లేదు. మనోహర్ రావు, భండారు రామచంద్ర రావు, ఆయన సతీమణి విమల, భండారు శ్రీనివాసరావు, ఆయన సతీమణి నిర్మల, తదితరులు చాలా సహాయం చేసారు. చాలా సార్లు ఆసుపత్రికి వచ్చారు. ధైర్యం
చెప్పారు.
బాకారంలో
ఉన్నప్పుడే ఇందిరాగాంధీ విధించిన 1975 నాటి ఎమర్జెన్సీ ఎత్తివేయడం, 1977 లో పార్లమెంటుకు ఎన్నికలు జరగడం,
ఇందిరాగాంధీ ఓడిపోవడం, ఆమె ఓటమిని తెల్లవారు ఝాముదాకా చెప్పకపోవడం, దరిమిలా జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడం,
మొరార్జీ దేశాయ్ ప్రధాని కావడం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. మొరార్జీ
ప్రధానిగా ఉన్నప్పుడే ఇందిరాగాంధీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని మరోమారు చీల్చి, ఇందిరా కాంగ్రెస్ (భారత జాతీయ కాంగ్రెస్-ఐ) స్థాపించడం, తనదే అసలు సిసలైన కాంగ్రెస్ అని ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్-ఐ
పార్టీకి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా డాక్టర్ మర్రి
చెన్నారెడ్డి సారధ్యంలో శాసనసభ ఎన్నికలు జరగడం, ఆయన గెలవడం, 1978 లో రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం జరిగింది. భండారు పర్వతాలరావు సీఎం
పీఆర్వో అయ్యారు.
మేము, మా ఆవిడ కజిన్
అయితరాజు జగన్మోహన్ రావు కలసి చిక్కడపల్లిలో మా మామయ్య ఇంటి ఎదురుగా రాములమ్మ
ఇంట్లో పై పోర్షన్ అద్దెకు తీసుకున్నాం. అలా మరో అద్దె ఇంటికి మారాం. చిక్కడపల్లిలో
ఆ ఇల్లు వెంకటేశ్వర స్వామి గుడికి అతి సమీపంలో వుంది.
బాకారంలో
వుండగా సురభి స్కూల్లో చదువుకున్న మా బుంటి, కిన్నెర
దరిమిలా హిమాయత్ నగర్లోని సెయింట్ యాంథనీ స్కూలుకు మారారు ప్రాధమిక
విద్యకోసం.
No comments:
Post a Comment