హనుమంతుడిని ప్రశంసిస్తూ లక్ష్మణుడికి చెప్పిన
రాముడు
శ్రీమదాంధ్ర వాల్మీకి
రామాయణం... కిష్కింధాకాండ-8
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం
సంచిక (15-12-2019)
శ్రీరాముడు
హనుమంతుడిని ప్రశంసిస్తూ లక్ష్మణుడితో ఇలా అంటాడు. “లక్ష్మణా! ఇతడిని సామాన్యుడిగా
భావించవద్దు. గొప్ప మనసున్న సుగ్రీవుడికి ప్రీతిపాత్రుడైన మంత్రి. ఇతడి మీద ఎంతో
నమ్మకముంటేనే కదా, మనదగ్గరికి ఇలాంటి పనిమీద
పంపాడు? మనం ఏ సుగ్రీవుడిని చూడాలని పోతున్నామో, అతడి మంత్రే ఈ రూపంలో మనదగ్గరికి వచ్చాడు. అంటే,
సుగ్రీవుడితో ఏ పనైతే అవుతుందని అనుకుంటున్నామో, అది
ఇతడిద్వారానే జరుగుతుంది. ఆయన్ను మనం ఎలా నమ్మవచ్చో ఇతడిని కూడా అలాగే నమ్మవచ్చు.
ఆయనకూ, ఇతడికీ భేదం లేదు”.
(హనుమంతుడు
ఆచార్యపదవికి తగినవాడని శ్రీరామచంద్రమూర్తి ఆయన యోగ్యతను గురించి చెప్పాడు.
ఆచార్యుడు వేదం తెల్సినవాడిగానూ,
విష్ణుభక్తుడుగానూ, మాత్సర్యం లేనివాడుగానూ, విష్ణుమంత్రం తెలిసినవాడుగానూ, ఆ మంత్రం మీద
భక్తికలవాడుగానూ, మంత్రార్థం ఇతరులకు చెప్పగలిగినవాడుగానూ, బాహ్యాభ్యంతరాలలో నిర్మలమైనవాడుగానూ,
గురుభక్తికలవాడుగానూ, పురాణాల జ్ఞానంకలవాడుగానూ వుండాలి.
ఇలాంటివాడినే ఆచార్యడు అంటారు. ఈ గుణాలు హనుమంతుడిలో వున్నాయని శ్రీరాముడు
చెప్తున్నాడు లక్ష్మణుడితో).
“లక్ష్మణా!
యితడు అడిగిన ప్రశ్నలకు నువ్వు జవాబు ఇవ్వు. యితడు మాటల పొందిక శాస్త్రసరణి
తెలిసినవాడు. ఆయన యోగ్యతకు తగ్గట్లు మనం మాట్లాడకపోతే మనం మూఢులమని ఆతడు
భావిస్తాడు. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు స్నేహం కలవడానికి, వింటానికి ప్రియంగా వుండాలి. ఏ విషయం ఎలా
చెప్పాలో అలాగే చెప్పు. ఎందుకింత హెచ్చరికగా చెప్తున్నానంటావా? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం
చక్కగా వల్లించి ధృఢంగా మనస్సులో నిలిపినవాడే ఇతడిలాగా మాట్లాడగలడు. అలా అని
ఇతడిని చాంధసుడు అని భావించవద్దు. శిక్షావ్యాకరణాలు చక్కగా పఠించినవాడు.
వ్యాకరణాన్ని ఎన్నోమార్లు వల్లించి కంఠస్థం చేశాడో కాని,
నేనెంత పరీక్షించి చూసినా, ఇతడి మాటల్లో వ్యాకరణ విరుద్ధమైన
ప్రయోగం ఒక్కటైనా కనబడలేదు. అంతేకాదు....మాట్లాడే తీరు చూస్తే, శిక్షను కూడా పఠించినవాడుగా వున్నాడు. ఎంతసేపు మాట్లాడినా, కళ్లల్లోకానీ, ముఖంలో కానీ,
నొసటకానీ, కనుబొమలలోకానీ ఒక్క దోషమైనా కనిపించలేదు”.
“ఇతడి
మాటల్లో గొతుకులు లేవు. వ్యర్థపదాలు లేవు. ఈ అర్థమా? ఆ అర్థమా? ఇది ఈ పదమా? ఆ పదమా? అన్న సందేహం రాదు. గబగబా పరుగెత్తడం లేదు. మెల్లగా నీళ్లు నమలుకుంటూ
మాట్లాడిందీ లేదు. తొస్సులు లేవు. ఉరం, కంఠ౦ నుండి మాట
వచ్చింది కాని, బిగ్గరగా అరిచింది లేదు. వినవచ్చీ, వినపడకుండా గొణగడం, పెదవులతో మాట్లాడడం లేదు.
ప్రతిపదం వ్యాకరణ శుద్ధక్రమాన్ని అనుసరించి వుంది. శుభంగా,
మనోహరంగా వుంది. ఉదాత్తానుదాత్త స్వరితాలతో కూడిన ఇతడి చిత్రమైన మాటలు, ఇతడిమీద కోపంతో కత్తిపైకెత్తిన వాడినికూడా సంతోషపెట్తుంది. ఇక అనుకూలమైన
వారి వేరే విషయం చెప్పాలా? రాజైనవాడు ఇలాంటి దూతను సంపాదించకపోతే
ప్రారంభించిన పని ఎలా పూర్తవుతుంది? అతడు కార్యసాధకుడన్న
కీర్తిని ఎలా సంపాదించగలడు? ఇలాంటి గుణసమూహాలు కల దూత ఏ
రాజుదగ్గర వుంటాడో, అతడి పనులన్నీ దూతవల్లే సఫలం అవుతాయి”.
(దీనర్థం:
తాను సుగ్రీవుడితో స్నేహం చేస్తే తన పని హనుమంతుడి వల్లే సఫలం అవుతుందని
రామచంద్రమూర్తి నిశ్చయించుకున్నాడు. వాక్యజ్ఞుడు లక్ష్మణుడు, వాక్యజ్ఞుడు హనుమంతుడు అని
శ్రీరామచంద్రమూర్తి చెప్పడం అంటే, ఈ గుణాలన్నీ లక్ష్మణుడిలో, హనుమంతుడిలో-ఇద్దరిలో- కలవనీ, ఇద్దరూ సమానులే అనీ
భావం).
శ్రీరామచంద్రమూర్తి
ఈ విధంగా చెప్పడంతో, వాక్యజ్ఞుడైన లక్ష్మణుడు
వాక్యజ్ఞుడైన హనుమంతుడితో ఇలా అన్నాడు. “అయ్యా! పండితుడా! సుగ్రీవుడి గురించి, అతడి ప్రభావం గురించీ, అతడి గొప్ప గుణాలను గురించీ, మేం ఇదివరకే విన్నాం. కాబట్టే ఆయన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం.
నువ్వు చెప్పిన సుగ్రీవుడి పనిని మేం సంతోషంతో నువ్వు చెప్పినట్లే చేయగలం”.
ఇలా లక్ష్మణుడు చెప్పగానే హనుమంతుడు సుగ్రీవుడి
జయం కోరుతూ రామసుగ్రీవులకు స్నేహం కుదర్చాలని అనుకున్నాడు.
No comments:
Post a Comment