Sunday, December 8, 2019

రామకార్యం...రమ్య దర్శనమ్ : మరుమాముల వెంకటరమణ శర్మ


యుద్ధకాండ మందర మకరందం
అనువక్త-వాచవి, వనం జ్వాలా నరసింహారావు
రామకార్యం...రమ్య దర్శనమ్
మరుమాముల వెంకటరమణ శర్మ
మఱల నిదేల రామాయణంబన్నచో నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళల
దినుచున్న యన్నమే తినుచున్నదిన్నాళ్లు తనరుచి బ్రదుకులు తనవిగాన
చేసిన సంసారమే సేయుచున్నది తనదైన యనుభూతి తనదిగాన
తలచిన రామునే తలచెద నేనును నా భక్తి రచనలు నావిగాన.

కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్ష అవతారికలో చెప్పిన మాటలివి..  సాక్షాత్తు ధర్మస్వరూపుడైన రాముడి చరిత్రను ఎంతమందైనా ఎన్నిసార్లయినా రాయవచ్చు. రాసిన ప్రతిసారీ ఒక నూతన అనుభూతి కలుగుతుంది. తలిస్తే రాముణ్ణే తలచాలని విశ్వనాథ వారన్నారు. విశ్వేతిహాస చరిత్రలో రామాయణానికి ఉన్న శాశ్వతత్వం మరే ఇతిహాసానికి లేదు. భారతీయ వాఙ్మయంలో 24  వేల పద్యాలతో మహర్షి వాల్మీకికి మినహా మరెవరికీ అనితరసాధ్యమైన అత్యద్భుతమైన మహత్తరమైన పరమేతిహాసమిది. రామో విగ్రహవాన్ ధర్మ: అన్నాడు వాల్మీకి. అత్యంత అనాచారమై.. తండ్రీ కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, రాజు-ప్రజలు, దేవాసుర వ్యక్తిత్వాలు.. పెచ్చరిల్లిపోతున్న నేటిసమాజానికి తప్పనిసరిగా అవసరమమైన అతి ముఖ్యమైన ధర్మనిర్మాణ ఖని. వ్యక్తిత్వ నిర్మాణం లేక సమాజంలో విలువలు కునారిల్లిపోతున్న నేటికాలంలో విశృంఖలత్వం విస్తరిల్లి పరిష్కారానికి ఆక్రోశిస్తున్న ఈ తరుణంలో సమాజానికి అత్యంత అవసరమైనది.. అనుసరణీయమైనది.. శ్రీమద్రామాయణం తప్ప మరొకటి లేదు. మన చరిత్ర, సంస్కృతి, మన నడత, నడవడిక, నమ్మకం, ఆచారాలన్నింటికీ ఆధారభూతమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆదర్శ జీవనానికి ప్రమాణమైనది. ఇంతటి మహేతిహాసాన్ని యథావాల్మీకంగా, పూర్వోత్తర కాండలతో తెనిగించిన మహాకవి కీర్తిశేషులు వావిలికొలను సుబ్బారావు (వాసుదాస స్వామి). ఈయన రచించిన ఆంధ్రవాల్మీకి రామాయణ మందారాలు తెలుగునేల నాలుగు చెరగులా ప్రాచుర్యాన్ని పొందాయి. కుండలినీ విద్యాస్వరూపులైన సీతారాముల స్వస్వరూపాన్ని.. తాత్వికతను తేటతేట తెలుగులో ఆంధ్రీకరించిన మహానుభావుడు వాసుదాసస్వామి. తెలుగు పాఠకుల హృదయ సీమల్లో తన రామాయణంతో చిరస్థానం సంపాదించుకొన్న వారు శ్రీ వాసుదేవస్వామి. ’మందర‘ మకరందాలను, రమారామ పారమ్య పీయూషాలను నాలుగు చెరగులా పంచినవారు. వాల్మీకి సంస్కృత రామాయణాన్ని అందరికంటే మొట్ట మొదలు ఆంధ్రీకరించి, పదే-పదే రామాయణ పఠన పాఠన శ్రవణాదుల పట్ల ఆంధ్రులకు అత్యుత్సాహాన్ని కలిగించి, "రామ భక్తి సామ్రాజ్యం" అంటే, ఆంధ్ర దేశమే సుమా, అనిపించిన నిరుపమ రామ భక్తులు వాసుదాస స్వామివారు.


ఇప్పుడీ మందర మకరందాలను మరోసారి పాఠకులకు అందిస్తున్నారు వనం జ్వాలా నరసింహరావుగారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారి ప్రధాన ప్రజా సంబంధాల  అధికారిగా తీరికలేని విధుల్లో నిమగ్నమై కూడా.. ధార్మిక చింతనతో తన సహజ సిద్ధమైన రచనా ప్రవృత్తిని విడిచిపెట్టలేదు. నరసింహరావుగారు ఇతరత్రా అనేక రచనలు చేసినప్పటికీ.. ఆయనలోని అచంచలమైన శ్రీరామచంద్రుని అచంచలమైన భక్తి ప్రపత్తులు.. తెలుగువారికి మరొక్కసారి తనదైన అనుభూతి తనది గాన అన్నట్టుగా రామాయణాన్ని అందించారు. సుందర సరళమైన తెలుగులో.. చిన్న పిల్లలకు సైతం అర్థమయ్యే పరిభాషలో అందించిన అద్భుతమైన రచన రామాయణం. శ్రీ వాసుదాస స్వామి వారి మందర మకరంద మైన రామాయణాన్ని అనువక్తగా వచనంలోకి అనుసృజన చేయడం అద్భుతం. చదివింది గణితం, సైన్స్, లైబ్రరీ సైన్సు అయినా.. తెలుగు భాషపై, పదాలపై, పదబంధాలపైన వనంవారికి ఉన్న పట్టు ఈ రామాయణ అనుసృజనలో ప్రతిఫలిస్తుంది. ఈ తరానికి వనంవారు మరోసారి.. సరికొత్త అనుభూతితో సీతారాముల తత్వాన్ని అందించారు. వారి రామాయణాన్ని తెలుగునాట విశిష్టమైన ఆధ్యాత్మిక పత్రిక దర్శనమ్ లో ప్రచురించే అవకాశం  లభించటం మా సుకృతం. ప్రస్తుత యుద్ధకాండతో ఆరు కాండలు పూర్తయినాయి. ఈ ఆరు కాండలను విశిష్ట ప్రచురణలుగా సభక్తికంగా పాఠకలోకానికి అందించే అపురూప భాగ్యాన్ని కలిగించిన నా మార్గదర్శి, శ్రేయోభిలాషి, హితవరి శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారికి నమస్సులు. రామాయణ రచనతో వనం వారు మరుజన్మ లేని మోక్షాన్ని సాధించారు. దాన్ని లోకానికి అందించే భాగ్యాన్ని సొంతం చేసుకున్న దర్శనమ్ పత్రిక పరివారం పునీతమయింది. ఈ పుస్తక ప్రచురణలో ప్రత్యక్షంగా,పరోక్షంగా సహకరించిన ప్రతిఒక్కరికీ మనఃపూర్వక నమస్సులు.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.. సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే.
మరుమాముల వెంకటరమణ శర్మ
సంపాదకులు, దర్శనమ్

No comments:

Post a Comment