Saturday, November 27, 2021

రాయబారిగా ద్రుపదుడి పురోహితుడు, శ్రీకృష్ణుడి సాయం కోరిన దుర్యోధనార్జునులు ...... ఆస్వాదన-48 : వనం జ్వాలా నరసింహారావు

 రాయబారిగా ద్రుపదుడి పురోహితుడు,

శ్రీకృష్ణుడి సాయం కోరిన దుర్యోధనార్జునులు

ఆస్వాదన-48

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (18-11-2021)

ఉత్తరాభిమన్యుల వివాహానంతరం, నాలుగు రోజులు గడిచిన తరువాత, ఉపప్లావ్యంలోనే వున్న పాండవులు ఒకనాడు, విరాటరాజు సభాభవనంలో విరాటుడు, ద్రుపదుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు మొదలైనవారు వున్న సందర్భంలో పాండవుల భావికార్యం ప్రస్తావన తెచ్చాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా తదపరి కార్యక్రమం గురించి చర్చ పెడతాడు శ్రీకృష్ణుడు. మాయాద్యూతం, పాండవుల రాజ్యాన్ని దుర్యోధనుడు అపహరించడం, పాండవుల అరణ్య-అజ్ఞాతవాసాలు, వారు ఎదుర్కొన్న ఆపదలు, పడ్డ కష్టాల గురించి మాట్లాడాడు కృష్ణుడు. పాండవులు ద్యూత నియమాన్ని శాంతంగా పాటించారని, తమ భుజబలాన్ని నిగ్రహించారని, ఇక తమ పరాక్రమాన్ని కౌరవులకు చూపాలనుకొంటున్నారని అన్నాడు. దుర్యోధనుడు కూడా మిత్ర బృందాన్ని సమకూర్చుకుంటున్నాడు కాబట్టి పాండవుల పక్షంలోని రాజసమూహం కూడా సమీకృతం కావాలని అంటూ కౌరవుల అభిప్రాయం తెలుసుకోవడానికి తగినవాడిని కౌరవ సభకు పంపాలని, దుర్యోధనుడు పాండవులకు రాజ్యభాగం ఇస్తే మంచిదేనని, ఇవ్వకపోతే ఏంచేయాల్నో ఆలోచించాలని అన్నాడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుడు చెప్పినదానికి సమ్మతించిన బలరాముడు, పాండవులు పంపిన మనిషి వినయంతోనే రాయబారపు కార్యం సాధించుకొని రావాలి అన్నాడు. కాకపోతే ఆయన మాటల్లో దుర్యోధనుడి పట్ల కొంత శిష్య వాత్సల్యం కనపర్చాడు. బలరాముడి వాదన సాత్యకికి పూర్తిగా నచ్చలేదు. ధర్మరాజును బలవంతంగా జూదం ఆడించారని అన్నాడు. తాను, భీమార్జునులు యుద్ధం చేస్తుంటే ఎదిరించడం ఎవరికీ సాధ్యం కాదని, అలాగే నకుల సహదేవులని, ఇతర పాండవ పక్ష రాజులని అంటూ, తన అభిప్రాయం ప్రకారం యుద్ధం చేయడమే కర్తవ్యం అని స్పష్టం చేశాడు. ఒకవేళ దూతనే పంపుతే, న్యాయం చొప్పున తగినట్లుగా, సగౌరవంగా దుర్యోధనుడు ఇస్తే తీసుకుందాం అని చెప్పాలన్నాడు.

బలరాముడి మాట సమ్మతం కాదని, సాత్యకి మాట సముచితంగా వున్నదని ద్రుపదుడు అన్నాడు. దుష్టస్వభావుడు, దుర్మార్గుడైన దుర్యోధనుడు ప్రీతిపూర్వక మాటలకు రాజ్యభాగం ఇవ్వడానికి ఇష్టపడడని, యుద్ధం వల్ల కాని అతడు సరిపడడని ద్రుపదు అన్నాడు. తన ప్రధాన పురోహితుడిని ధృతరాష్ట్రుడి దగ్గరికి పంపమని, అతడు రాజనీతిలో సమర్థుడని ద్రుపదుడు అనగా శ్రీకృష్ణుడితో సహా అంతా అంగీకరించారు.  

భారతంలో ద్రుపదుడి పాత్ర చాలా విలక్షణ మైనది. అతడికి‌ ముందు చూపుతో కూడిన రాజనీతిజ్ఞత వున్నదని విరాటరాజు కొలువులో చెప్పిన మాటలు రుజువు పరుస్తాయి. సాత్యకి లేచి యుద్దము అభిలషణీయము కాదు, కాని రాయబారమన్నది దయా ధర్మ బిక్షంగా ఉండకూడదని అన్నప్పుడు, ద్రుపదుడు ఈ విధంగా మాట్లాడుతాడు.

"సుయోధనుడు మంచి మాటలతో వినకపోతే యుద్ధమే శరణ్యం. ఆ పరిస్థితులలో దుర్యోధనుడి ఆశ్రయం లో వున్మ భీష్ముడు దుర్యోధనుడి పక్షమే. అశ్వత్థామకు సుయోధనుడికి మైత్రి మెండు. కాబట్టి అతడు కూడా వారి పక్షమే. పుత్రప్రేమకు లోనైన ద్రోణుడూ వారి పక్షమే. బందుత్వాన్ని విడచిపెట్టలేని కృపాచార్యుడూ వారి పక్షమే. ఇక ధృతరాష్ట్రుడు పుత్ర ప్రేమకు బందీ కాబట్టి రారాజుకి వ్యతిరేకంగా పాండవుల రాజ్యభాగాన్ని ఇప్పించలేడు. శకుని ఎలాగూ మేనల్లుడైన దుర్యోధనుడిని ప్రోత్సహిస్తాడు. కర్ణుడు యుద్ధోన్మాది. ఎప్పుడు యుద్ధం వస్తుందా, అర్జునుడిని ఎప్పుడు ఓడించాలా అని అర్రులు చాస్తున్నాడు. అందుకని అతడు దుర్యోధనుడిని యుద్ధానికే ప్రోత్సహిస్తాడు. రారాజు సోదరులూ ఎలాగూ అన్న ఆజ్ఞ మీరరు. ఈ నేపధ్యంలో దుర్యోధనుడు సంధికి అంగీకరించే అవకాశాలు మృగ్యం. అతడు ఈ పాటికే యుద్ధసన్నాహాలు మొదలు పెట్టే వుంటాడు. మనం కూడా సంధి ప్రయత్నాలు చేస్తూనే, మనకి హితులైన మిత్రరాజుల సహాయ సహకారాలకు ప్రయత్నించడం మంచిదని" నా అభిప్రాయం అని చెబుతాడు.

ఆ తరువాత శ్రీకృష్ణుడు ప్రయాణ సన్నద్ధుడై ద్వారకానగరానికి వెళ్లాడు. వివాహ మహోత్సవానికి వచ్చిన రాజులంతా యుద్ధ ప్రయత్నాలు చేసుకోవడానికి తమతమ నగరాలకు వెళ్లిపోయారు. పాండవులు కూడా యుద్ధ ప్రయత్నంలో నిమగ్నులయ్యారు. విరాటుడూ యుద్ధ సన్నద్ధుడయ్యాడు. ద్రుపదరాజు కూడా యుద్ధ సన్నద్ధుడయ్యాడు. దుర్యోధనుడు కూడా పాండవుల ప్రయత్నాలను తెలుసుకుని తాను కూడా యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయాడు. నలుదిక్కుల నుండి రాజాలు, వారి సమూహాలు ఉభయుల శిబిరాలకు లోకభీకరంగా రావడం మొదలైంది.

అనుకున్న ప్రకారం ద్రుపదుడు ధర్మరాజు ఆజ్ఞతీసుకుని తన పురోహితుడిని ధృతరాష్ట్రుడి దగ్గరికి పొమ్మన్నాడు. పురోహితుడు చేయాల్సిన కార్యాన్ని వివరించాడు ద్రుపదుడు. పాండవులకు భూభాగం ఇమ్మని అడగడానికి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లమని అంటూ, అక్కడి వారితో మాట్లాడి పాండవులకు బలం చేకూర్చడం ఆయన చేయాల్సిన పని అని చెప్పాడు. హస్తినాపురంలో వుండి, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైన వారిదగ్గరికి వెళ్లి, వారి మనోభిప్రాయాలు తెలుసుకుని ప్రవర్తించమన్నాడు. ఆయన మాట ప్రకారం సంతోషంగా పురోహితుడు రాయబారానికి వెళ్లాడు.

ఇదిలా వుండగా దుర్యోధనుడు అందరి రాజులను సహాయం అడిగినట్లే, స్వయంగా తానే శ్రీకృష్ణుడి వద్దకు పోవాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్లే ద్వారకకు వెళ్లాడు. యాధృచ్చికంగా అదే రోజున అర్జునుడు కూడా శ్రీకృష్ణుడిని చూడడానికి, సహాయం కోరడానికి వచ్చాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు నిద్రపోతుంటే, దుర్యోధనుడు ముందుగా వెళ్లి, తలాపి దిక్కున వున్న ఉన్నతాసనం మీద కూచున్నాడు. తరువాత వచ్చిన అర్జునుడు మెల్లగా వచ్చి కాళ్ల దిగ్గర వినయంగా నిలబడ్డాడు. కృష్ణుడు మేల్కొని ముందుగా ఆర్జునుడిని చూసి, తరువాత దుర్యోధనుడిని చూసి ఇద్దరినీ ఆదరించి ప్రీతిగా మాట్లాడాడు. వారిద్దరూ వచ్చిన పని తెలియచేయమని అడిగాడు. జవాబుగా దుర్యోధనుడు, అర్జునుడి పక్షాన కూడా మాట్లాడుతున్నవాడిలాగా, యుద్ధం చేసే తలంపుతో శ్రీకృష్ణుడి తోడ్పాటును కోరి వచ్చామని అన్నాడు. పాండవులకూ, కౌరవులకూ కృష్ణుడు దగ్గరి చుట్టమని కూడా అన్నాడు.

అయితే ముందుగా వచ్చింది మాత్రం తానన్నాడు దుర్యోధనుడు. లోకంలో వున్న న్యాయం ప్రకారం తనకు సహాయం చేయాలని అన్నాడు. జవాబుగా శ్రీకృష్ణుడు, ముందుగా దుర్యోధనుడు వచ్చినప్పటికీ, తాను ముందుగా అర్జునుడిని చూశానని, కాబట్టి ఇద్దరికీ సమానంగా, సగౌరవంగా సహాయం చేయడం మంచిదని అన్నాడు. తన దగ్గర పదివేల మంది యుద్ధం చేసే వీరులు, నారాయణ నామధేయులైన గోపాలురు వున్నారని, ఆయుధాల జోలికి పోకుండా, యుద్ధం చేయకుండా వుండే తానున్నానని, ఈ రెంటిలో ఒకటి కోరుకొమ్మని, మొదలు చిన్నవాడైన అర్జునుడికి అవకాశం ఇస్తున్నానని చెప్పాడు. అర్జునుడు వెంటనే శ్రీకృష్ణుడికి కోరుకున్నాడు.

అర్జునుడు అలా కోరుకున్నందుకు సంతోషించిన దుర్యోధనుడు ఆ గోపకులను తన పక్షాన వేసుకుని అక్కడి నుండి సహాయానికి బలరాముడి దగ్గరికి పోయాడు. జయాపజయాలు ఎవరివైనా తాను తటస్థంగా వుంటానని, ఎవరికీ సహాయం చెయ్యనని చెప్పాడు బలరాముడు. దుర్యోధనుడు దానికి వినయపూర్వకంగా అంగీకరించాడు.

తనను ఎందుకు కోరుకున్నావని శ్రీకృష్ణుడు అడిగాడు ఆర్జునుడిని. తాను యుద్ధానికి తోడ్పాటు కోరనని, ప్రతిపక్షంలో ఆయన వుంటే ఆయన్ను గెలవడం ఆశక్యమని, అందువల్ల విజయానికి ప్రధాన కారణమైన ఆయన్ను కోరుకున్నానని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అసమానమైన యుద్ధకేళిలో తాను అర్జునుడికి సారథ్యం వహిస్తానని చెప్పాడు.   

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment