Saturday, February 5, 2022

భీష్ముడు దుర్యోధనుడికి చెప్పిన అంబోపాఖ్యానం ..... ఆస్వాదన-58 : వనం జ్వాలా నరసింహారావు

భీష్ముడు దుర్యోధనుడికి చెప్పిన అంబోపాఖ్యానం

 ఆస్వాదన-58

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (06-02-2022)

పాండవ పక్షంలో వున్న శిఖండిని చంపలేనని భీష్ముడు తనకు చెప్పగానే దానికి కారణం ఏమిటని కుతూహలంగా ఆయన్ను ప్రశ్నించాడు దుర్యోధనుడు. ఆ పూర్వాపరాలన్నీ వివరంగా చెప్పాడు భీష్ముడు.

భీష్ముడి తండ్రి శంతను మహారాజు దాశరాజు కూతురు సత్యవతిని వివాహం చేసుకుని చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులను కన్నాడు. వారు పెద్దవారు కాకముందే ఆయన చనిపోయాడు. భీష్ముడు సత్యవతీ-శంతనుల పెద్ద కుమారుడైన చిత్రాంగదుడిని రాజ్యాభిషిక్తుడిని చేశాడు. రాజైన కొద్ది కాలానికే చిత్రాంగదుడిని ఒక గంధర్వుడు యుద్ధంలో సంహరించాడు. తదనంతరం, భీష్ముడు విచిత్రవీర్యుడిని కౌరవ రాజ్యానికి అభిషిక్తుడిని చేశాడు. అతడికి వివాహం చేయాలని భావించాడు భీష్ముడు.

కాశీరాజు తన ముగ్గురు కూతుళ్లకు స్వయంవరం చాటించడం విన్న భీష్ముడు అక్కడికి వెళ్లి, స్వయంవరంలో అలంకరించబడి వున్న అంబ, అంబిక, అంబాలిక అనే ఆ ముగ్గురు కన్యలను తన రథంమీద ఎక్కించుకుని, తన తమ్ముడికి వారిని వివాహం చేయడానికి తీసుకుపోతున్నానని ప్రకటించాడు. తనను ఎదుర్కున్న రాజులందరినీ పరాజితులను చేశాడు. సాల్వపతి సాళ్వుడు మాత్రం భీష్ముడిని వెంబడించాడు కాని యుద్ధంలో ఓడిపోయి తన పట్టణానికి వెళ్లిపోయాడు. ఆ ముగ్గురు కన్యలతో హస్తినాపురం చేరుకున్న భీష్ముడు వారిని తన తల్లి సత్యవతికి అప్పగించాడు. ఆ ముగ్గురిని విచిత్రవీర్యుడికిచ్చి వివాహం జరిపించాలని యత్నిస్తుండగా, వారిలో అంబ, తాను సాల్వపతి సాళ్వుడిని ప్రేమించానని, అతడి దగ్గరికి తనను సాదరంగా పంపమని వేడుకున్నది భీష్ముడిని. ఆమె కోరినట్లే భీష్ముడు అంబను సాళ్వుడి దగ్గరికి పంపాడు. అంబిక, అంబాలికలను విచిత్రవీర్యుడికి ఇచ్చి వివాహం జరిపించాడు.

తన దగ్గరికి వచ్చిన అంబను సాళ్వుడు తిరస్కరించాడు. ఆమె భీష్ముడి వల్ల అపహరించబడిన కులటవన్నాడు. ఆమెను పత్నిగా స్వీకరించడం న్యాయం కాదని, ఆమెకు కన్యాత్వం పోయిందని, ఆమెను భార్యగా వరించడం తగదని, ఇక తన దగ్గర నిలవ వద్దని సాళ్వుడు చెప్పడంతో అంబ అక్కడి నుండి వెళ్లిపోయింది. తన బతుకు చట్టు బండలైందని, ఇక అప్పుడు భీష్ముడి దగ్గరికి వెళ్లినా ప్రయోజనం లేదని, అతడిని సాధించి తీరాలని నిర్ణయించుకుని తపస్సు చేయడానికి నిశ్చయించుకున్నది.

మునీశ్వరులు తపస్సు చేసుకునే ఒక పావన ప్రదేశానికి వెళ్లి, వారితో తనకు తపస్సు చేయాలని వుందని చెప్పింది. ఆమె ఆ విధంగా చెప్పుతున్న సమయంలో ఆ మునుల ఆశ్రమానికి హోత్రవాహనుడనే రాజర్షి వచ్చాడు. అంబ వృత్తాంతం విన్న ఆ రాజర్షి, ఆమె తనకు వరుసకు దౌహిత్రి అవుతుందని చెప్పి, ఆమెను పరశురాముడిని దర్శించమని సలహా ఇచ్చాడు. అలా ఆయన సలహా ఇస్తున్న సమయంలోనే యాధృచ్చికంగా పరశురాముడి శిష్యుడైన అకృతవ్రణుడు అనే ముని అక్కడికి వచ్చాడు. హోత్రవాహనుడిని చూడడానికి శిష్యులతో కూడి పరశురాముడు మర్నాడు అక్కడికి వస్తున్నట్లు చెప్పాడు అకృతవ్రణుడు. ఆయన చెప్పినట్లే మర్నాడు పరశురాముడు అక్కడికి వచ్చాడు.

హోత్రవాహనుడు పరశురాముడికి అంబను తన మనుమరాలిగా పరిచయం చేశాడు. ఆమె కథ వినమన్నాడు. అంబ ఆ మహానుభావుడికి తన సంగతంతా విపులంగా చెప్పింది. తన అవమానం బాపి తనను కాపాడమని పలికింది. సాళ్వుడిని శిక్షించాలా? లేక భీష్ముడిని దండించాలా? అని ప్రశ్నించాడు పరశురాముడు. తనను ఎత్తుకుపోయిన భీష్ముడి మీద చాలా కోపంగా వున్నదని, అతడిని చంపడానికి తపస్సు చేద్దామనుకున్నానని అన్నది అంబ. తాను చెప్పినట్లు భీష్ముడు చేస్తాడని, చేయకపోతే అతడిని తన బాణాలతో చంపుతానని, ఆమె తపస్సు చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు పరశురాముడు.

అంబను వెంటబెట్టుకుని పరశురాముడు కురుక్షేత్రానికి వచ్చాడు. ఆయన రాకను తెలుసుకున్న భీష్ముడు ఆయన దర్శనార్థం వెళ్లాడు. అంబను చూపించి ఆమెను కూడా విచిత్రవీర్యుడికిచ్చి వివాహం జరిపించమన్నాడు. అంబ కోరినట్లే ఆమెను సాళ్వుడి దగ్గరికి పంపిన తరువాత ఇప్పుడు విచిత్రవీర్యుడితో వివాహం జరిపించడం కుదరదన్నాడు భీష్ముడు. తన మాట వినకపోతే భీష్ముడిని, ఆయన స్నేహితులను, చుట్టాలను చంపుతానని హెచ్చరించాడు పరశురాముడు. భీష్ముడు ఎంత వేడుకున్నా తగ్గలేదు. యుద్ధానికి సిద్ధమై సేనావ్యూహాలు పన్నాడు. శీఘ్రమే యుద్ధానికి రమ్మన్నాడు భీష్ముడిని. యుద్ధానికి తాను ఒక్కడినే వస్తానని చెప్పి భీష్ముడు తల్లి సత్యవతి ఆశీర్వాదం తీసుకున్నాడు. యుద్ధానికి పోతున్న భీష్ముడిని అతడి అసలు తల్లి గంగాదేవి స్త్రీరూపంలో వచ్చి యుద్ధ కారణం తెలుసుకుని, పరశురాముడి దగ్గరికి వెళ్లి శాంతించమని చెప్పినా ఆయన ఒప్పుకోలేదు.

పరశురాముడికి, భీష్ముడికి యుద్ధం ప్రారంభం అయింది. పరశురాముడు భీష్ముడి మీద శరవర్షం కురిపించాడు. వాటన్నిటినీ అణచి వేశాడు భీష్ముడు. ఒక దశలో పరశురాముడు మూర్ఛపోయి మళ్లీ తేరుకున్నాడు. భీష్ముడు మారుతాస్త్రం ప్రయోగిస్తే పరశురాముడు గుహ్యకాస్త్రంతో దానిని నివారించాడు. పరశురాముడు ప్రయోగించిన దివ్యాస్త్రాలను భీష్ముడు వారించాడు. ఇలా గురుశిష్యులిద్దరూ ఇరవైరెండు రోజులు యుద్ధం చేశారు. మర్నాడు మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆనాడు పరశురాముడు వేసిన శక్త్యాయుధాన్ని భీష్ముడు నరికేశాడు. కాసేపటికి భీష్ముడు దీప్తి వికాసం కలిగిన అస్త్రాలను ప్రయోగించి పరశురాముడిని మూర్ఛపోయేట్లు చేశాడు.

మూర్ఛనుండి తేరుకున్న పరశురాముడు భీష్ముడిని స్మృతి తప్పి నేలకు వాలేటట్లు చేసి, ఆతడి రథసారథిని చంపాడు. భీష్ముడు మూర్ఛలో మునిగి వున్న సమయంలో గంగాదేవి, ఎనిమిదిమంది మునులు (వసువులు) అతడిని కాపాడారు. మళ్లీ యుద్ధం మొదలైంది. నాటి యుద్ధం ముగిసిన తరువాత, ఆ రాత్రి, భీష్ముడిని అంతకు ముందు కాపాడిన ఎనిమిదిమంది మునులు వచ్చి ఆయనకు మోహనాస్త్రం ప్రసాదించి వెళ్లిపోయారు. ఆ బాణం పరశురాముడిని జయించగలదని వారు చెప్పారు.

మర్నాడు మళ్లీ యుద్ధం మొదలైంది. ఆనాటి యుద్ధంలో పరశురాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా, భీష్ముడు కూడా అదేపని చేశాడు. ఆ రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదాని నొకటి ఎదుర్కొని సకల జీవులకు సంక్షోభం కలిగించాయి. అదే సమయమని భావించిన భీష్ముడు మోహనాస్త్రాన్ని ఆవాహనం చేశాడు. అప్పుడు చేతనాచేతాలు ఆక్రందించాయి. ‘మోహనాస్త్రాన్ని ప్రయోగించవద్దు అని అంటూ నారద మహర్షి అక్కడికి వచ్చాడు. అదే సమయంలో తనకు మోహనాస్త్రం ఇచ్చిన ఎనిమిదిమంది మునులు కూడా అక్కడికి వచ్చి నారద మహర్షి పలుకులు వినమన్నారు. భీష్ముడు సమ్మోహనాస్త్రం విడవడం మానుకున్నాడు. పరశురాముడు అపజయం పొందినట్లు భావించాడు. ఆయన పితరులు వచ్చి పరశురాముడిని యుద్ధం విరమించమన్నారు. భీష్ముడిని యుద్దంలో జయించడం కష్టమని అన్నారు. చివరకు గంగాదేవి జోక్యం వల్ల ఇద్దరూ యుద్ధం చాలించారు.

ఎనిమిదిమంది వసువుల సూచన ప్రకారం భీష్ముడు పరశురాముడి దగ్గరికి పోయి ఆ మహానుభావుడికి నమస్కారం చేశాడు. ఇరువురూ కౌగలించుకున్నారు. అ ఆతరువాత అంబను చూసి, తనను భీష్ముడు జయించాడని, తానింతకన్నా ఎక్కువ ఏమీచేయలేనని చెప్పాడు. తాను తపస్సు చేసి తపోబలంతో భీష్ముడిని సాధిస్తానని అంటూ అంబ వెళ్లిపోయింది.

అంబ యమునా నదీతీరానికి వెళ్లి అక్కడ ఘోరమైన తపస్సు చేసింది. అక్కడినుండి వేరే ప్రదేశాలకు కూడా వెళ్లి తపస్సు చేసింది. అలా తీవ్రమైన తపోవృత్తిలో మత్స్యదేశ నివాసిగా వున్న సమయంలో, ఒకరోజు తన వ్రత ఫలంలో అర్ధభాగమైన అంబ అనే పేరుతో నదిగా మారి, మత్స్యధరణీ మండలంలో ప్రవహించింది. మిగిలిన సగభాగం తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి శంకరుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకొమ్మన్నాడు. భీష్ముడిని తాను చంపేట్లు వరం అనుగ్రహించమని వేడుకున్నది. ‘అట్లే అగుగాక’ అన్నాడు శివుడు. అదెలా సాధ్యమని ప్రశ్నించింది అంబ.

అంబ శరీరం విడిచిన తరువాత ద్రుపదుడికి మొదలు కూతురుగా జన్మించి, తరువాత కుమారుడివి అవుతావని, శిఖండి అనే పేరుతో పరాక్రమశాలివి అవుతావని, యుద్ధంలో భీష్ముడిని సంహరిస్తావని, తన మాట వ్యర్థం కాదని అన్నాడు శివుడు. ఆరోజునే చితిలో దూకి అంబ చనిపోయింది. అదే తరుణంలో భీష్ముడి మీద కోపం వున్న ద్రుపదుడు సంతానం కొరకు శివుడి గురించి తపస్సు చేశాడు. భీష్ముడిని చంపగల కుమారుడిని అనుగ్రహించమని ప్రత్యక్షమైన శివుడిని వేడుకున్నాడు.

ద్రుపదుడి ప్రార్థనకు స్పందించిన ఈశ్వరుడు ఆయన కోరిన వరం ఇచ్చాడు. మొదట కూతురుగా జన్మించి, ఆ తరువాత కొడుకుగా మారి, భీష్ముడిని యుద్ధ భూమిలో చంపగలిగిన చక్కటి సంతానం ఆయనకు కలుగుతుందని చెప్పాడు శివుడు. ఆ తరువాత ద్రుపదుడి భార్య కోకిలాదేవి గర్భం ధరించి, కుమార్తెను కన్నది. కాని, తమకు కొడుకు పుట్టాడని లోకులందరికి చెప్పారు. ఆ బిడ్డకు శిఖండి అని పేరుపెట్టి మగ పిల్లవాడిలాగా పెంచారు. మగబిడ్డకు చేయించాల్సిన సంస్కారాలన్నీ చేయించారు. అక్షరాభ్యాసం చేయించి ద్రోణాచార్యుడి దగ్గర శస్త్రాస్త్ర విద్యలు నేర్పించారు. ఉపాయంగా శిఖండికి వివాహం కూడా చేశారు. కోడలిని ఇంటికి తెచ్చుకున్నారు. కోడలికి అసలు విషయం తెలవడం, అది ఆమె తండ్రిదాకా పోవడం, ఆయన ద్రుపదుడి మీదికి యుద్ధానికి రావడం జరిగింది.

ఈ విషయం విని భయపడ్డ శిఖండి అరణ్యానికి పోయాడు. అరణ్యంలో స్థూలకర్ణుడనే ఒక యక్షుడున్న ప్రదేశంలో ప్రాణం తీసుకునే ప్రయత్నంలో వుండగా, దానికి కారణం ఏమిటని యక్షుడు అడిగాడు. తనకు మగతనం కావాలన్నాడు. తన మగతనం ఇస్తానన్నాడు యక్షుడు. అయితే పదిరోజుల తరువాత మళ్లీ వెనక్కు ఇవ్వాలన్న నిబంధన పెట్టాడు. అలాగే ఇద్దరూ వారి-వారి స్వరూపాలను మార్చుకున్నారు. ద్రుపదుడు తన వియ్యంకుడిని రప్పించి శిఖండి పురుషత్వాన్ని స్పష్ట పరిచాడు.

ఇదిలా వుండగా స్థూలకర్ణుడి భవన సమీపానికి కుబేరుడు వచ్చి విషయం తెలుసుకుంటాడు. స్థూలకర్ణుడిని అలాగే వనితగా ఉండుగాక అని పలికాడు. అతడిమీద కరుణ చూపమని మిగతా యక్షులు కోరగా, శిఖండి బతికున్నంతవరకు పడతిగా వుంది తరువాత నిజస్వరూపం తెచ్చుకుంటాడు అని చెప్పాడు కుబేరుడు. శిఖండి నియమం ప్రకారం స్థూలకర్ణుడి దగ్గరికి అతడి మగతనం తిరిగి ఇవ్వడానికి పదిరోజుల తరువాత వచ్చాడు. వచ్చినవాడిని అలాగే ఇంటికి పొమ్మని, ఇది అతడికి దైవం అనుగ్రహించిన రూపమని, జరిగిన విషయం చెప్పాడు. శిఖండి తన తండ్రి దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్పాడు. ద్రుపదుడు శిఖండిని ద్రోణాచార్యులకు అసాధారణ శిష్యుడిని చేశాడు.

ఈ విషయాన్ని ఆసాంతం చెప్పిన భీష్ముడు, దుర్యోధనుడితో, తాను ఆడువారిని, మొదలు ఆడువారిగా ఉన్నవారిని, ఆడువారి పేర్లు పెట్టుకున్నవారిని, ఆడువారిలాంటి ఆకారం కలవారిని చంపనని నియమం పెట్టుకున్నానని, శిఖండి మొదలు ఆడుదిగా వుండి తరువాత పురుషుడైనాడు కాబట్టి, అతడు యుద్ధంలో ఎదురైతే బాణప్రయోగం చేయనని చెప్పాడు. ఇది తన నిశ్చయం అన్నాడు. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

1 comment:

  1. జ్వాలా గారూ, చిత్రాంగదుణ్ణి సంహరించిన గంధర్వుడి పేరు కూడా చిత్రాంగదుడే నండీ.

    ReplyDelete