Sunday, February 6, 2022

మేనకను మోహించిన విశ్వామిత్రుడు ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-94 : వనం జ్వాలా నరసింహారావు

 మేనకను మోహించిన విశ్వామిత్రుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-94

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (07-02-2022)

         "వెయ్యేళ్లు విశ్వామిత్రుడిలా ఘోరమైన తపస్సు చేయడంతో, బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి మునీశ్వరుడిని చూసేందుకొచ్చి, అతడు చేసిన తపస్సు వలన-తప ఫలంగా ఆయన ఋషి అయినాడని చెప్పి అంతర్థానమయ్యాడు. ఆ మాటలకు తృప్తి చెందని విశ్వామిత్రుడు, అంతకంటే ఘోరమైన-కఠోరమైన తపస్సు చేయసాగాడు. అలా చేస్తున్న సమయంలో, సమీపంలోని తీర్థంలో స్నానమాడేందుకు, అతి మనోహరమైన సౌందర్యంతో-మన్మథుడి ఆయుధమేమోనని అనుకుండే విధంగా కనిపిస్తున్న ఒక అప్సరస, విశ్వామిత్రుడిని మోసగించే ఉద్దేశంతో వచ్చింది. కమలాల లాంటి కళ్లతో, పూవువలె మనోహరమైన మెచ్చుకోవాల్సిన శరీరంతో, రతిక్రీడలో ఆసక్తితో, మేఘాలలాంటి నల్లటి కురులతో, మొగ్గలలాంటి దంతాలతో, చంద్రుడిలాంటి ముఖంతో అందంగా వున్న ఆ అప్సరస, మేఘాల మధ్య మెరుపుతీగలాగా నీళ్లల్లో స్నానం చేస్తుంటే విశ్వామిత్రుడు చూశాడు. చూసి, కామ బాణ పీడితుడై, మనస్సు కలవరపడగా, తామరాకుమీద పడిన నీళ్లు చలించినట్లు మనస్సు చలించడంతో, ఆ అందగత్తెను సమీపించాడు. ’అప్సరసకు శోభనమగు కాక’ అని అంటూ, ఆమెను చూసినప్పటినుండి మన్మథుడు దయ లేకుండా బాణాలతో తనను తూట్లుపడేటట్లు పొడుస్తున్నాడని, ఆ వేదనను సహించలేనని, మనసార ఆమె అక్కడే వుండి ప్రేమాతిశయంతో తనను పాలించమని కోరతాడు. ఆమెకు నమ్మిన బంటులాగా ప్రవర్తిస్తానని, తన మాట నమ్మమని, మోసం చేయనని విశ్వామిత్రుడు అప్సరసను ప్రార్థించాడు".

         "విశ్వామిత్రుడి అభ్యర్థనను సరేనని అంగీకరించిన అప్సరస, ఋషీశ్వరుడి ఆశ్రమంలో వుండిపోయింది. వారిద్దరూ భార్యా-భర్తలలాగా పది సంవత్సరాలు గడిపారు. అప్పటికి, విశ్వామిత్రుడి మదన తాపం తగ్గి, తను చేసిన పనిగురించి ఆలోచించసాగాడు. ఎట్లైనా బ్రాహ్మణ్యం సంపాదించాలని ఆశతో వైరాగ్యం పూనిన విశ్వామిత్రుడెక్కడ-వ్యాకులపడక జితేంద్రియుడై మహా తపస్సు చేయడమేంటి-ఇప్పుడీ బోగందిలా తోడుగా వుండడమేంటి? బ్రాహ్మణులు వింటే ఫక్కున నవ్వరా అని ఆలోచించాడు. చపల మనస్సుతో మన్మథుడి బారిన పడితినేనని, పది సంవత్సరాలు వృధాచేసానేనని బాధపడ్డాడు. సుఖాలు వదిలిన రాజని, విరాగి అని, బ్రాహ్మణ్యం కొరకు అడవుల్లో ఏళ్లతరబడి తపస్సు చేస్తున్నాడని తనను గురించి అనుకునే వారందరూ ఇప్పుడు, బోగందానికి వశపడ్డాడనీ-వీడికి బుద్ది లేదని అనుకుంటారని విచారపడ సాగాడు. ఈ జంజాటానికి కారణం, తన తపస్సు నాశనం చేసేందుకు ఇది దేవతలు పన్నిన పన్నాగంగా అర్థంచేసుకుంటాడు. దేవతలవల్ల మోసపోయాను కదా అని ఆలోచిస్తున్న విశ్వామిత్రుడిని చూసి భయపడింది అప్సరస మేనక. తను శపిస్తాడేమోనని భయపడుతున్న దేవకన్య మేనకతో, ఆమె తప్పులేదని, దోషం ఆమెదికాదని, బుద్ధిలేనివాడినైన తాను కామానికి దాసుడనై ఆమె సాంగత్యంతో చెడిపోయానని అంటాడు. ఆమెను దూషించి ప్రయోజనం లేదని చెప్పి ఇక వెళ్లమంటాడు. అమెను పంపి కామాన్ని జయించేందుకు విశ్వామిత్రుడు హిమవత్పర్వతం దగ్గరున్న కౌశికీ తీరంలో కఠినమైన తపస్సుచేసేందుకై పోయాడు".

మహర్షి ఐన విశ్వామిత్రుడు

"అక్కడ ఉత్తరానున్న మంచు కొండమీద వెయ్యి సంవత్సరాలు నిశ్చలుడై-నిర్విఘ్నంగా తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. ఆయన తపస్సుకు లోకాలన్నీ కలవరపడుతున్నాయని, సజ్జన శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు మహర్షి కావడానికి సరిపడేంత తపస్సు చేశాడని, ఆ మాటతడికి చెప్పి ఆయన్ను సమాధానపర్చాలని దేవతలందరు బ్రహ్మను కోరారు. బ్రహ్మదేవుడు వారు చెప్పినట్లే విశ్వామిత్రుడి దగ్గర కొచ్చి, ఆయన మహర్షి అయ్యాడని అంటాడు. ఆయన మాటలకు విశ్వామిత్రుడు పొంగిపోలేదు. తను జితేంద్రియుడనయ్యానా అని బ్రహ్మను ప్రశ్నించాడు. ఆయనింకా జితేంద్రియుడు కాలేదని, దానికొరకు ఇంకా ప్రయత్నంచేయాలని, ఆయన మనస్సు వికారం పొందేందుకు అవకాశమున్నప్పటికీ అలా కానీయకుండా చేయగలిగినప్పుడే జితేంద్రియుడవుతాడని జవాబిచ్చాడు బ్రహ్మ. అల్ప కారణంతో కొడుకులను శపించినవాడు జితేంద్రియుడెలా అవుతాడనంటూ బ్రహ్మ వెళ్లిపోయాడు. విశ్వామిత్రుడు తిరిగి కామాన్ని జయించడంకొరకు, రెండు చేతులు పైకెత్తి, గాలినే ఆహారంగా తీసుకుంటూ, నిరాహారంగా కదలక-మెదలక ఆశ్చర్యకరమైన తపస్సు చేశాడు. మండుటెండల్లో పంచాగ్నుల మధ్య, జోరుగా వానలు కురుస్తున్నప్పుడు ఆరుబయట, మంచులాంటి శీతాకాలంలో చల్లటి నీళ్లల్లో నిలిచి రాత్ర్రింబగళ్లు తపస్సు చేశాడు. విశ్వామిత్రుడిలా ఘోర తపస్సు చేస్తుంటే, ఆ వేడికి ప్రపంచమంతా తల్లడిల్లింది. దేవతలు-ఇంద్రుడు ఆయన తపస్సు భంగం చేయడానికి ఈ సారి రంభను ఉపయోగించుకోవాలనుకుంటారు".

 

No comments:

Post a Comment