Saturday, February 26, 2022

అర్జున విషాద యోగం – శ్రీకృష్ణుడి విశ్వరూప ప్రదర్శన, అర్జునుడికి తత్త్వజ్ఞానోపదేశం ..... ఆస్వాదన-61 : వనం జ్వాలా నరసింహారావు

 అర్జున విషాద యోగం –

శ్రీకృష్ణుడి విశ్వరూప ప్రదర్శన, అర్జునుడికి తత్త్వజ్ఞానోపదేశం

ఆస్వాదన-61

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (27-02-202)

ధర్మరాజు భీష్మ, ద్రోణ, కృపాచార్యుల దగ్గరికి పోయి వారి అనుమతి, ఆశీర్వాదం తీసుకుని మరలి వస్తున్న సమయంలోనే, తానున్నంతవరకు యుద్ధానికి రాకుండా భీష్ముడు నిషేధించిన కర్ణుడు, కురుపాండవ సేనల విన్యాసాలను చూడాలన్న వేడుకతో యుద్ధరంగానికి వచ్చాడు. కర్ణుడిని చూసిన శ్రీకృష్ణుడు అతడి దగ్గరికి వెళ్లి మర్యాదగా పలకరించాడు. భీష్ముడిమీద కోపంతో కర్ణుడు యుద్ధంలో పాల్గొనడం లేదని తెలిసిందని, కాబట్టి భీష్ముడు మరణించే వరకు సరదాగా అతడు పాండవ పక్షంలో చేరి యుద్ధం చేయగూడదా? అని, అలా చేసి భీష్ముడి మీద పగతీర్చుకోవచ్చుకదా? అని సరదాగా మాట్లాడాడు. ఇది ఒక విధంగా శ్రీకృష్ణుడి రాజనీతి చతురతకు చక్కటి ఉదాహరణ. కార్యసాధనకు సామ, దాన, భేద, దండోపాయాలు అవసరమని అంటారు. జవాబుగా కర్ణుడు తాను రారాజైన దుర్యోధనుడికి ఏనాడో తన ప్రాణం సమర్పించానని, వేరే పక్షంలో చేరే ప్రసక్తే లేదని, అలా చేయడం న్యాయం కాదని స్పష్టం చేశాడు. కర్ణుడి స్వామిభక్తికి ఇది చక్కటి ఉదాహరణ. శ్రీకృష్ణుడు వెనక్కు వచ్చాడు.

ధర్మరాజు మళ్లీ కవచం ధరించి యుద్ధానికి సన్నద్ధుడయ్యే ముందు ఒక పిలుపిచ్చాడు కౌరవ పక్షంలో వున్నవారికి. అటు నుండి ఎవరైనా వచ్చి పాండవ పక్షంలో చేరితే వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తానని అనగానే ధృతరాష్ట్రుడి కొడుకు యుయుత్సుడు వచ్చి చేరాడు. కౌరవపాండవ సేనలు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం చేరి యుద్ధానికి సంసిద్ధులై వున్నారు. కౌరవ సేనాపతైన భీష్ముడు సింహనాదం చేసి శంఖం వూదాడు. మిగిలిన రాజులు కూడా అలా చేయగానే ఆకాశం యుద్ధవాద్యాల ధ్వనితో నిండిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, ధర్మరాజు అనంతవిజయాన్ని పూరించారు. భీమ, నకుల సహదేవ, ద్రుపద, విరాట, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, శిఖండి మొదలైనవారు తమ శంఖాలను పూరించారు.

సరిగ్గా ఆ సమయంలో, యుద్ధం ఇక ఆరంభించాల్సి వుండగా, అర్జునుడు గాండీవాన్ని ధరించి, అల్లెతాటిని మోగించి, బాణాలు చేత్తో తీసుకుని, శ్రీకృష్ణుడితో, తానిప్పుడు ఎవరితో యుద్ధం చేయాలో నిర్ణయించుకోవాలని, కాబట్టి రథాన్ని యుద్ధం మధ్యలోకి తీసుకుపొమ్మని అన్నాడు. అర్జునుడు కోరినట్లే రథాన్ని రెండు సేనల మధ్య నిలిపాడు శ్రీకృష్ణుడు. బంధు మిత్రులను చూసిన అర్జునుడు దుఃఖానికి లోనయ్యాడు. తన గాండీవం జారిపోతున్నదని,  ఈ క్రౌర్యానికి తాను ఒడిగట్టలేనని, ఇంతమంది చచ్చిపోయాక కలిగే సౌఖ్యాలు ఏపాటివని శ్రీకృష్ణుడితో అన్నాడు. ఇంకా ఇలా అన్నాడు.

ఉ:       తాతల మామలన్ సుతుల దండ్రుల దమ్ముల నన్నలన్ గురు

వ్రాతము శిష్టకోటి సఖివర్గము దుచ్ఛజనానురూప దు

ర్నీతి వధించి యేబడయు నెత్తుటదోగిన రాజ్యభోగముల్

ప్రీతియొనర్చునే యశము పెల్లొడగూర్చునే పెంపొనర్చునే?

         (తాతలను, మామలను, కొడుకులను, తండ్రులను, సహోదరులను, గురువులను, స్నేహితులను, స్వార్ధ బుద్ధితో సంహరించి పొందే రాజ్యసుఖాలు రక్తంతో తడిసినట్టివి. అవేం సంతోషం కలిగిస్తాయి? ఎలాంటి కీర్తిని తెచ్చిపెట్ట గలవు? ఏ అభ్యున్నతిని చేకూర్చగలవు?). యుద్ధమార్గం తాను అంగీకరించ లేనన్నాడు అర్జునుడు. ఇంతటి పాపం చేయడానికి పూనుకోవడమా? రాజ్యం మీద ఆశతో బంధువులను చంపుకోవడమా? అని అర్జునుడు పలుకుతూ రథం మీద తన చేతిని ఆసరాగా చేసుకుని కూలబడి కూచున్నాడు. (దీన్నే అర్జున విషాదయోగం అని అంటారు. దీని పర్యవసానమే భగవద్గీత ఉపదేశం). అప్పుడు ఆర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేయడం ఆరంభించాడు.

         అర్జునుడికి ఇలాంటి ఆడంగితనం కూడదని, మనస్సులోని తక్కువ భావాన్ని విడిచిపెట్టి గొప్పవాడివి కమ్మని, యుద్ధానికి లెమ్మని హెచ్చరించాడు. అర్జునుడు అలాగే విషాద తన్మయత్వంతో రథం మీద కూలబడి కూచుని శ్రీకృష్ణుడికి జవాబిచ్చాడు. తాను భీష్మ, ద్రోణులలాంటి బంధుమిత్రులను చంపడం పరాక్రమం కాదని, కాబట్టి యుద్ధం చెయ్యలేనని అన్నాడు. తాను ధర్మం తెలియని మూఢుడినని, తనకు జ్ఞానోపదేశం చేసి కర్తవ్యం తెలియచేయాలని అర్జునుడు శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. ఏ మాత్రం దుఃఖించదగని వారికోసం అర్జునుడు దుఃఖిస్తున్నాడని, వున్నవారికి, విధివశం వల్ల తప్పనిసరిగా చనిపోయినవారికి దుఃఖించాల్సిన అవసరం లేదని, మనసు ఉజ్వలమైన వివేకంతో కూడినదైతే దుఃఖాలన్నీ నశిస్తాయని శ్రీకృష్ణుడు అన్నాడు.

         శ్రీకృష్ణుడు అర్జునుడికి తత్త్వజ్ఞానోపదేశం చేశాడు. చేస్తూ ఇలా అన్నాడు. ‘మానవదేహం బాల్యం, యౌవనం, వార్థక్యం అనే అవస్థలు పొందినట్లుగా, చినిగిపోయిన పాతబట్టలు విడిచి కొత్త బట్టలు ధరించినట్లు, ఆత్మ ఒక దేహాన్ని విడిచి మరొక దేహాన్ని పొందుతుంది. ఆత్మ దేహాంతరగమనం వల్ల నశించదు. నశిమ్చేది శరీరం మాత్రమే. ఆత్మకు పుట్టుక, చావు అనేవి లేవు. ఆయుధాలు శరీరానికే తప్ప ఆత్మకు హానిచేయలేవు. ఆత్మ (పురుషుడు) బాధించేవాడు కాదు; బాధను పొందేవాడూ కాదు. ఆత్మకు అభావం లేదు. ఆత్మ శాశ్వతం. శరీరం నశించేది. దానికి అస్తిత్వం లేదు. ఈ కారణం వల్ల ఎవరూ శోకించాల్సిన అవసరం లేదు. చావుపుట్టుకలు సహజ పరిణామం అని సరిపెట్టుకోవాలి. ఆత్ముడు నశిస్తాడు అని అనేవాడు, ఆత్ముడు నశింపచేస్తాడు అని అనేవాడు, ఇద్దరూ అవివేకులే! ఆత్మ నశించదు. ఎవరినీ నాశనం చేయదు. పురుషుడు, ఆత్మ అంటే నేనే! వేరొకడు కాదు. పురుషోత్తమత్త్వం అభివ్యక్తం కావడానికి ఆత్మత్వస్ఫూర్తి వుంటుంది. అదే సర్వక్రియలకూ పూనుకుంటుంది’.

         ఇలా ఎన్నో విధాలుగా శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆత్మకు బాధింపబడడం లేదని, బాధించడమూ లేదని వివరించాడు. అర్జునుడి అహంకార, మమకారాలను తొలగించాడు. అర్జునుడు యుద్ధానికి చేయాల్సిన స్వకర్మావలంబనం వదలరాదని తెలియచేసే మాటలను చెప్పాడు. క్షత్రియులకు ముఖ్య కర్తవ్యం యుద్ధమని, దానివల్ల స్వర్గం లభిస్తుందని, లేచి యుద్ధం చెయ్యమని బోధించాడు. ఇంక ఇలా అంటాడు:

         కం:      ఫలముల యెడ బ్రహ్మార్పణ, కలన పరుండగుచుఁ గార్య కర్మము నడపన్‌

వలయుం దత్త్వ జ్ఞానము, దల కొనినం గర్మ శమము దానై కలుగున్‌        

         (ఫలితాల పట్ల మమకారం విడిచి కర్తవ్యాలను నిర్వహించాలి. ఫలితాలు, జయాపజయాలు భగవదర్పితం చేయాలి. తత్త్వజ్ఞానం లభిస్తే ఇక కర్మ నాశనం తానంతట అదే కలుగుతుంది. ఈ పద్యాన్ని, సందర్భాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు ఇలా రాశారు: ‘ఈ పద్యం తిక్కన రాసిన భగవద్గీతకు కేంద్ర గరిమనాభి. ఇది భగవద్గీతాసారసంగ్రహం అనదగిన పద్యం’.)

         శ్రీకృష్ణుడు అనేకరకాల చెప్పి, అనేక మార్గాలను వివరించి, అర్జునుడు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి, అతడి అనుమానాలన్నిటినీ పోగొట్టాడు. ఇవన్నీ విన్న అర్జునుడు లేచి, నిలుచుని, శ్రీకృష్ణుడితో, ఆయన అందించిన సందేశం, చేసిన ఉపదేశం మిక్కిలి రహస్యమైనదని, తనమీద ఎంతో దయ వున్నది కాబట్టే ఇలాంటి ఆత్మజ్ఞానం తనకు కలిగించాడని, ఆయన చెప్పిన ఆధ్యాత్మికతత్త్వం వినడం వల్ల తన భ్రమ తొలగిందని, యోగీశ్వరులు చూడడానికి తహతహలాడే ఆయన రూపం తనకు దర్శింపచేయమని ప్రార్థించాడు. వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్యదృష్టి ప్రసాదించి తన విశ్వరూపాన్ని ప్రదర్శించగా, అర్జునుడు దానిని సందర్శించాడు. ఆ విశ్వరూపం వర్ణనాతీతం. సర్వ ప్రపంచంతో కూడిన, సమస్త సృష్టికి మూలకారణమైన, భూమ్యాకాశ దిక్కులన్నీ కలిగిన, దేదీప్యమానంగా వెలుగొందిన, ఆ విశ్వరూపాన్ని కాంచిన అర్జునుడు శ్రీకృష్ణుడిని పరిపరివిధాల స్తుతించాడు. తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, అసలాయన ఎవరో చెప్పమని వేడుకున్నాడు.

         జవాబుగా, తాను లోకాలన్నిటినీ నాశనం చేసే యముడిని సుమా! అన్నాడు శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర సంగ్రామ రంగంలో జనసందోహాన్ని సంహరించడానికి ఉద్యుక్తుడనయ్యానని, అర్జునుడు తాను చంపుతున్నట్లు భ్రమలో పడనక్కర లేదని, భీష్మద్రోణులంతా అవశ్యం చావాల్సినవారేనని, తాను చంపే వీరందరినీ అర్జునుడే చంపినట్లుగా భావించి విజయం కైకొని రాజ్యం ఏలుకొమ్మని అన్నాడు. అర్జునుడు నిమిత్తమాత్రుడే అని, లేచి యుద్ధం చెయ్యమని ఆదేశించాడు. ఆ ఆమాటలు విన్న అర్జునుడు వణకుతూ చేతులు జోడించి శ్రీకృష్ణుడికి నమస్కారం చేశాడు. తాను ఎక్కువసేపు ఆయన విశ్వరూపం చూడలేనని, శాంత స్వరూపం ధరించమని వేడుకున్నాడు. సామాన్యులు దర్శించలేని తన విశ్వరూపాన్ని అర్జునుడికి మాత్రమే చూపానని అంటూ వెనుకటి ఆకారాన్ని ధరించాడు శ్రీకృష్ణుడు.

         అర్జునుడికి రహస్యమైన జ్ఞానాన్ని అందించానని, అతడా సందేశాన్ని అవగాహన చేసుకుని, తనకు నచ్చిన రీతిలో ప్రవర్తించమని చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. ఇప్పుడు చెప్పినదానికంటే గొప్ప రహస్యం చెప్తానని అంటూ, ధర్మాలు ఎన్నో వున్నప్పటికీ, వాటికి ఎన్నో ప్రత్యామ్నాయాలు వున్నప్పటికీ, వాటన్నిటి కంటే రక్షించేవాడు తానే అని నమ్మి తన శరణు పొందమని, అలా చేస్తే పాపాలన్నీ పోగొట్టి సంతోషం చేకూరుస్తానని చెప్పాడు. శ్రీకృష్ణుడి మీద తనకు పరిపూర్ణ భక్తి విశ్వాసం కలిగాయని, అన్ని అనుమానాలు తొలగిపోయాయని, ఆయన విశ్వరూప సందర్శనం వల్ల తన జ్ఞానం ద్రుఢ౦గా పాదుకున్నదని, ఇక ఆయన చెప్పినట్లుగా నడచుకుంటానని అన్నాడు అర్జునుడు.

ఇలా అంటూ అర్జునుడు శ్రీకృష్ణుడికి భక్తితో సాష్టాంగనమస్కారం చేసి, గాండీవం ధరించి నిలిచాడు. భీష్ముడి మొదటి రోజు యుద్ధం ప్రారంభం అయింది.     

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

              

          

    

    

No comments:

Post a Comment