రామలక్ష్మణులకు శివుడి వింటిని చూపించిన జనకుడు
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-97
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (28-02-2022)
జనకుడి మాటలను
విన్న విశ్వామిత్రుడు ధనుస్సును చూపమని కోరాడు. దీర్ఘమైన-భయంకరమైన దేహాలున్న
ఐదువేలమంది బలశాలులు,
జనకుడి ఆదేశం ప్రకారం, అందరూ కలిసి ఇనుప
పెట్టెతో సహా దాంట్లో వున్న పెద్దవింటిని తెచ్చారు వారున్న చోటికి. దివ్య
ధనుస్సును తెచ్చామని వారు మహారాజుకు చెప్పగానే, తన ఆసనం పైనుంచి లేచి, ముకుళిత హస్తాలతో రామలక్ష్మణులను-విశ్వామిత్రుడిని చూసి, "మునీశ్వరా,
ఇది జనకరాజులందరు పూజించే విల్లు. ఎంతటి మహాబలులని పేరున్న
వారెవరూ విల్లెక్కుపెట్టలేక, గర్వమణిగి అవమానపడి
మరలిపోయారు. మానవులైన రాజుల సంగతటుంచి, దేవతలు-రాక్షసులు-యక్షులు-కిన్నరులు
కూడా విల్లెక్కపెట్టలేకపోయారు. నీకిష్టమైతే-చూపదల్చుకుంటే, రామలక్ష్మణులకు చూపించవచ్చు" అని జనకుడంటాడు. విశ్వామిత్రుడప్పుడు
మహదానందంతో,
రామచంద్రమూర్తిని చూసి, "నాయనా,
రామచంద్రా, ఈ ధనుస్సును చూడు"
అని చెప్పాడు. విశ్వామిత్రుడి ఆదేశం ప్రకారం శ్రీరాముడు, ధనుస్సుండే పెట్టె దగ్గరికిపోయి, దాని మూత తెరిచి, తాను వింటిని చూసానని-తాకానని చెప్పి, ఆయన ఆజ్ఞాపిస్తే బయటకు
తీస్తానని అంటాడు. వింటిని బయటకు తీసి ఎక్కుపెడతానని కూడా అంటాడు. అలానే చేయమని
జనకుడు, విశ్వామిత్రుడు చెప్పారు రాముడితో.
హరుడి విల్లు విరిచిన శ్రీరాముడు
మాత్రం లక్ష్యంచేయకుండా, అవలీలగా వింటిని అరచేత్తో పట్టుకొని, బయటకు తీసి, రాజులందరు చూస్తుండగా అల్లెతాటిని బిగువుగా లాగుతుంటేనే, విల్లు ఫెల్లుమని రెండుగా విరిగిపోయింది. (వింటి అల్లెతాడు ఒక కొన గట్టిగా
కట్టబడి,
రెండో కొనకు అవసరమొచ్చినపుడు మాత్రమే తగిలించే విధంగా తయారై
వుంటుంది. విల్లెక్కు పెట్టేటప్పుడు, ఋజువుగా కట్టెలాగా
వుంటుంది. విల్లెక్కుపెట్టాలనుకునేవాడు కొంచెం పైగా దండాన్ని పట్టుకొని, పైకెత్తి,
అల్లెతాటిని ఈడ్చి, తనపిడికిలి కిందుండే
కోపుకు తగిలిస్తాడు. ఇలా ఈడ్చి తగిలించడంలో, మితం కంటే ఎక్కువగా
లాగితే దనుర్ధండం విరుగుతుంది. శ్రీరాముడదే చేశాడు. ఇది విలుకాడి బలాతిశయం
తెలియచేస్తుంది). విరిగిన వింటి చప్పుడు పిడుగుపడినప్పుడు కలిగే ధ్వనిలా, కొండలు పగిలిపోతున్నట్లుగా, భయంకరమైన ధ్వనితో భూమి
వణికింది. రామలక్ష్మణులు,
విశ్వామిత్రుడు, జనక మహారాజు తప్ప మిగిలిన
వారందరూ,
మనస్సు భ్రమించి స్మృతితప్పి నేలపై పడిపోయారు.
కొంచెంసేపైంతర్వాత అక్కడున్నవారందరికి స్మృతి వచ్చింది. జనకుడు
విశ్వామిత్రుడితో"నేనెందుకు ఇలాంటి ప్రతిజ్ఞ చేసాను? విల్లు ఎక్కుపెట్టగలిగే వారెవరైనా వున్నారా?నామాట దక్కేదెలా?
సీతకు వరుడు దొరుకుతాడా? మానవుల్లో-దేవతల్లో
అలాంటివాడు కనిపించడంలేదే?
అని భయపడ్డాను. రామచంద్రమూర్తి అన్నివిధాలుగా నన్ను
మెప్పించాడని,ఇతడు ఈ వింటిని ఎక్కుపెట్టగలడో-లేదోనని భయపడ్డాను. సీతనిస్తే బాగుంటుందని
అనుకుంటుండగానే ఆయన విల్లు విరిచాడు.ఆయన అల్లుడయ్యే అదృష్టం నాకుందో-లేదో
అనుకున్నాను.మునీంద్రా,
రామచంద్రమూర్తి భుజబలం చూసాను. కళ్లారా చూసాను.
రామచంద్రమూర్తి వింటిని విరిచాడు. ఇది వాస్తవానికి మిక్కిలి అసాధ్యమైన
పని-ఆశ్చర్యకరమైన పని. మా సీత రామచంద్రమూర్తిని మగడిగా గ్రహించడమంటే అది నా
అదృష్టం. నేను ధన్యుడనయ్యాను" అంటాడు. తన ముద్దుల కూతురు సీత దశరథ కుమారుడు
శ్రీరామచంద్రుడిని భర్తగా పొందడంవల్ల తమ జనక కులానికి కీర్తి
సంపాదించిపెట్టినట్లైందని కూడా అంటాడు జనకుడు విశ్వామిత్రుడితో.
దశరథుడి దగ్గరకు దూతలను పంపిన జనకుడు
"నా కూతురు వీర్యశుల్క అనేపేరుతో నేను చేసిన ప్రతిజ్ఞ ఫలించింది. నేనన్న మాట ప్రకారం, నా ప్రాణంకంటే ప్రియమైన భూపుత్రి సీతను గొప్ప గుణాలున్న శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేస్తాను" అని జనకుడు సీతను రాముడికి ధారాదత్తం చేసే ప్రయత్నం చేశాడుకాని, రాముడందుకు అంగీకరించలేదు. తనను విశ్వామిత్రుడు చెప్పిన పని చేయాల్సిందిగా తన తండ్రి ఆజ్ఞాపించాడని, ఆయన వింటిని చూడమంటే చూసానని, ఎక్కుపెట్టమంటే పెట్టానని, అది నిస్సారమైంది కనుక ఫెల్లున విరిగిపోయిందని అంటూ, వివాహమాడడానికి తనకు తండ్రి ఆజ్ఞలేదని జనకుడికి చెప్పాడు. ఆ కార్యం చేయడానికి తన తండ్రి స్వతంత్రుడు గాని తాను కానని, ఆయన మెచ్చి ఎవరిని చేసుకోమంటే ఆమెనే వివాహమాడుతానని, జనకుడి కోరికను నిరాకరించాడు. రామచంద్రమూర్తి ధర్మం చెప్పాడని విశ్వామిత్రుడంటూ దశరథుడుని పిలిపించమని చెప్పాడు. తన మంత్రులిప్పుడే అయోధ్యకు పోతారని అంటాడు జనకుడు. "దశరథ మహారాజా, నీ కుమారులు విశ్వామిత్ర మహాముని రక్షణలో, ఆయన వెంట మా నగరానికొచ్చారు. ఇక్కడ సభ వారందరూ చూస్తుండగా, రామచంద్రమూర్తి, అవలీలగా శివుడి ధనుస్సు విరచడంవల్ల వీర్యశుల్కైన నా కూతురు సీతను నీ కుమారుడు రామచంద్రమూర్తికిచ్చి వివాహం చేయదల్చాను. ఈ వార్త మీకు చెప్పి, మిమ్మల్ని ఇక్కడకు తీసుకొని రమ్మని జనక రాజు మమ్ము పంపాడు. మీరిక్కడకు రావాలని మా మహారాజు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాడు" అని నేను పంపిన వారు దశరథుడితో చెప్తారని అంటాడు జనకుడు. విశ్వామిత్రుడు అలానే చేయమని చెప్పగా, దశరథుడికి శుభలేఖ రాసిచ్చి దూతలను ఆయన దగ్గరకు పంపాడు జనకుడు.
No comments:
Post a Comment