Saturday, February 12, 2022

భూగోళ వర్ణన-ధృతరాష్ట్రుడితో భారత వర్షం సంపదలకు ఆలవాలం అన్న సంజయుడు ..... ఆస్వాదన-59 : వనం జ్వాలా నరసింహారావు

 భూగోళ వర్ణన-ధృతరాష్ట్రుడితో భారత వర్షం సంపదలకు ఆలవాలం అన్న  సంజయుడు

ఆస్వాదన-59

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (13-02-2022)

పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రంలో కౌరవపాండవులు యుద్ధానికి సంసిద్ధమై వున్న సమయంలో సంజయుడితో కూడి వున్న ధృతరాష్ట్రుడి దగ్గరకు వేదవ్యాస మహర్షి వచ్చాడు. పోయేకాలం దగ్గరపడి రాజులకు యుద్ధం దాపురించిందని, దానికి ధృతరాష్ట్రుడు విచారించవద్దని, ఆ యుద్ధాన్ని ఆయన ప్రత్యక్షంగా చూడాలనుకుంటే దివ్యదృష్టిని ఇస్తానని అన్నాడు. జవాబుగా ధృతరాష్ట్రుడు, అన్నదమ్ముల మధ్య జరిగే ఘోర యుద్ధాన్ని తాను చూడలేనని, కేవలం వినగలనని, ఆ ఏర్పాటు చేస్తే చాలని కోరాడు. వేదవ్యాసుడు కరుణించి, యుద్ధ విషయాలను ధృతరాష్ట్రుడికి జరిగినవి జరిగినట్లుగా చెప్పడానికి సంజయుడిని నియోగించాడు. సంజయుడికి కొన్ని అతిలోక శక్తులు ప్రసాదించాడు. దాని ప్రకారం, సంజయుడు యుద్ధభూమిలో ఇష్టం వచ్చినట్లు నిర్భయంగా తిరగవచ్చు. అతడిని ఏ ఆయుధాలు తాకలేవు. అందరి మాటలు వినగలదు. మనసులను పసిగట్టగలడు.

(ఈ విధంగా మహాభారత యుద్ధ కాలంలోనే ఇప్పటి ఆధునిక యుగంలో లాగా యుద్ధ వార్తల సేకరణకు నాంది పలికినట్లు అర్థం చేసుకోవాలి. అప్పట్లో యుద్ధ వృత్తాంతాలను సేకరించినవాడు సంజయుడు).

వేదవ్యాసుడు అంతర్థానమై పోయిన తరువాత ధృతరాష్ట్రుడు సంజయుడిని, అతడికి ఋషివరేణ్యులతో వున్న గాఢమైన పరిచయం ఆధారంగా, జగత్తులోని విశేషాలన్నీ తెలిసిన వ్యక్తిగా, భూమి విషయాలన్నీ తేటతెల్లంగా వివరించి చెప్పమని అడిగాడు. (ఇలా ధృతరాష్ట్రుడు అడగడాన్ని, సంజయుడు వివరించి చెప్పడాన్ని విశ్లేషిస్తూ, డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు, సంస్కృత మహాభారత రచనా కాలం నాటి భూమిని గురించిన పరిజ్ఞానం మనకు తెలుస్తుందని, పంతొమ్మిదవ శతాబ్దినాటికిగాని మానవులకు భూ పరిజ్ఞానం లభించలేదని, సంస్కృత మహాభారత రచనా కాలం నాటికే భారతీయులకు భూ పరిజ్ఞానం వున్నదని, ఆనాడు ఇతర దేశీయులకు అంతటి పరిజ్ఞానం లేదని చెప్పవచ్చని రాశారు. యుద్ధం జరగబోయే నేపథ్యంలో భూగోళ వర్ణన ప్రస్తావన తేవడానికి కారణం మహాభారతాన్ని సమకాలేన విజ్ఞాన సర్వస్వంగా తీర్చిదిద్దాలనే రచయిత ఆకాంక్ష కావచ్చు).

ధృతరాష్ట్రుడు వేసిన ప్రశ్నకు జవాబుగా సంజయుడు భూగోళ విషయాలన్నీ వివరించాడు. ఈ భూమ్మీదనే చరాచరాలన్నీ పుట్టుతూ వుంటాయని, పెరుగుతూ వుంటాయని, నశిస్తూ వుంటాయని, ఈ భూమే అన్నిటికీ ఆధారమైన చోటని సంజయుడు చెప్పడం ప్రారంభించాడు. ఇంకా ఇలా చెప్పాడు.

ఆకాశానికి లక్షణం శబ్దం. వాయువుకు లక్షణాలు శబ్దం, తాకుడు. తేజానికి లక్షణాలు శబ్ద, స్పర్శ, రూపాలు. నీటికి లక్షణాలు శబ్ద, స్పర్శ, రూపాలే కాకుండా ద్రవత్వం కూడా. భూమికి శబ్ద, స్పర్శ, రూప రసాలతో పాటు వాసన కూడా వున్నది. అంటే పంచ భూతాల లక్షణాలు అన్నీ భూమికి వున్నాయి. అందువల్ల భూతాలలో పంచభూతాలు ఎన్నదగినవి. పంచ భూతాలలో భూమి ఎన్నదగినది, గొప్పది.

మేరు పర్వతానికి దక్షిణంగా ‘సుదర్శనం అనే పేరుకల, మిక్కిలి విస్తీర్ణం కల పెద్ద ప్రదేశం వున్నది. దాని పొడుగు రెండు వేల ఏబై వందల యోజనాలు. (యోజనం అంటే సుమారు ఎనిమిది మైళ్లు). అందులో ఒక జంబూ వృక్షం (నేరేడు చెట్టు) వున్నది. ఆ చెట్టు మీదినుండి పండ్లు పెద్ద చప్పుడు చేసుకుంటూ నేలమీద పడి విచ్చుకుంటాయి. ఆ పండ్ల రసం పెద్ద ఏరుగా తయారై ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి, పొంగి పొరలి, ఉత్తర కురుభూముల మీదుగా ప్రవహించి చివరకు సముద్రాన్ని చేరుకుంటుంది.

జంబూనది ప్రవహించే ఆ ప్రదేశాలు అన్నీ బంగారంగా మారిపోవడం వల్ల బంగారానికి ‘జాంబూనదము అన్న పేరొచ్చింది. ఆ నదీ జలం తాగినవారికి ముసలితనం రాదు. ఏరోగం రాదని, దాహం వుండదని అంటారు. ఆ నదికి పశ్చిమ దిక్కున నేరేడు చెట్ల గుంపు విస్తరించి వుంటుంది. ఆ చెట్టు పేరుమీద ఆ ప్రాంతానికి ‘జంబూద్వీపం’ అన్న పేరొచ్చింది. దానినే ‘సుదర్శన ద్వీపం అని కూడా అంటారు. ఆ ద్వీపానికి చుట్టూ ఉప్పునీటి సముద్రం వుంటుంది. ఆ ద్వీపంలోని దీవికి తూర్పు, పడమర దిక్కులలో పొడవుగా సముద్రం వ్యాపించి వుంటుంది. ఇరువైపులా హిమాలయ పర్వతాలు, హేమకూట పర్వతం, నిషధ పర్వతాలు వుంటాయి. అవి నల్లటి, తెల్లటి శిఖరాలతో విరాజిల్లుతూ వుంటాయి. ఆ మూడింటికి అటు-ఇటు వేల్పుకొండ సువర్ణమయమై వెలుగొందుతుంటుంది.

మేరుపర్వతం పునాది మిక్కిలి లోతైనది. బలమైనది. దాని లోతు పదహారు వేల యోజనాలు. మేరుపర్వతం పొడుగు ఎనభైనాలుగువేల యోజనాలు. భూమికి మధ్యనున్న మేరుపర్వతం మీద దేవతలు, దేవేంద్రుడు, బ్రహ్మదేవుడు మొదలైనవారు తిరుగుతుంటారు. ఆ కొండ పరిసరాలలో పార్వతీ పరమేశ్వరులు విహరిస్తూ వుంటారు. జంబూద్వీపం తొమ్మిది భాగాలుగా ఏర్పడింది.

ఉత్తర సముద్రానికి, శృంగవంతం పర్వతానికి మధ్యలోగల ప్రదేశాన్ని ఐరావత వర్షం అంటారు. శ్వేత పర్వతం, శృంగవంత పర్వతాల మధ్యలోగల ప్రదేశాన్ని హైరణ్మయ వర్షం అంటారు. నీల శైలానికి ఉత్తర దిక్కున, దక్షిణ దిక్కునగల ప్రదేశం రమణక వర్షం. మేరు పర్వతానికి తూర్పుదిక్కున ఉన్న ప్రదేశం భద్రాశ్వవర్షం. మేరుపర్వతానికి పడమర దిక్కున వున్న ప్రదేశాన్ని కేతుమాలా వర్షం అంటారు. హేమకూట పర్వతానికి ఉత్తర దిక్కునగల ప్రదేశం హరి వర్షం. హిమాలయ పర్వతానికి ఆవలిగట్టున వున్న ప్రదేశాన్ని కింపురుష వర్షం అని, ఇవతలి వైపున వున్న ప్రదేశాన్ని భారత వర్షం అని అంటారు.

భారత వర్షంలో ఉత్తర దిక్కున వున్న ప్రదేశాలలో ఉత్తరోత్తరంగా శక్తి, సామర్థ్యం, ఆరోగ్యం, ఆయువు, సౌఖ్యం, పుణ్యకార్య నిర్వహణలు ఎక్కువగా కనిపిస్తాయి. జంబూద్వీప విస్తీర్ణం ఎనభైవేల ఆరువందల యోజనాలు. దీనికి రెండింతలుగా లవణ, ఇక్షు, సుర, ఘృతదధి, క్షీర, శుద్ధజలమయమైన మహాసముద్రాల వైశాల్యాలున్నాయి. జంబూద్వీప వైశాల్యానికి ఒకదానికొకటి రెండింతలుగా పక్షద్వీప, శాల్మలద్వీప, క్రౌంచద్వీప, కుశద్వీప, శాకద్వీప, పుష్కరద్వీప వైశాల్యాలు వుంటాయి. ఈ ఆరు ద్వీపాలు జంబూద్వీపం కంటే అన్నిటిలోనూ పొగడబడుతూ అనేక పర్వతాలతో, నానానదులతో, బహుజనపదాలతో కూడి వరుసగా ఒకదానికంటే మరొకటి గుణవిశేషంలో అధికమై వుంటాయి. వీటన్నిటికి కర్తయై, భర్తయై, హర్తయై, క్షీరసాగారానికి ఉత్తరంలో కనకమయమైన ఎనిమిది చక్రాలతో, పెక్కు భూతాలతో కూడినది, మనోజవమైనది అయిన మహనీయ శకటం మీద నారాయణుడు వైకుంఠవాసుడై, శ్రీమహావిష్ణువు అన్న పేరుతో విహరిస్తాడు.

భారత వర్షం అన్న భూభాగం కోసమే కదా కౌరవులు, పాండవులు ఒకరితో ఒకరు పోరాడి వినాశనానికి పాల్పడ్డారని, ఇలాంటి లోభబుద్ధికలవారు ఎక్కడైనా వున్నారా అని ప్రశ్నించాడు సంజయుడిని ధృతరాష్ట్రుడు. జవాబుగా సంజయుడు, పూర్వకాలంలో కూడా భూరాజ్య సంపాదన కోసం భగీరథుడు, రఘువు, నహుషుడు, యయాతి మొదలైన మహారాజులు యుద్ధాలు చేసి గొప్ప యశస్సు, అభ్యుదయం సంపాదించారని చెప్పాడు. ఇంతమంది రాజులు, మహారాజులు పెక్కు యుద్ధాలు చేయడానికి ఆసక్తి కలిగించిన భారత వర్షం విస్తీర్ణం వివరించాడు సంజయుడు.

మలయం, శుక్తిమంతం, వింధ్యం, పారియాత్రం, మహేంద్రం, ఋక్షవంతం, సహ్యం అనే ఏడు గొప్ప పర్వతాలు భారత వర్షంలో కుల పర్వతాలుగా వున్నాయి. ఈ పర్వత పంక్తులలో ఎన్నో రకాలైన మణులు సంపాదించవచ్చు. ఇక గనుల్లో దొరికే లోహాల గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఉప పర్వతాలు అనేకం వున్నాయి. వాటిలో ఇనుము, వెండి, రాగి, తగరం, బంగారం కుప్పపోసిన సంపదలాగా లభ్యమవుతాయి. అలాగే, కొండల వల్ల అమితమైన ధనాన్ని ఆర్జించవచ్చు. నేర్పు, పట్టుదల, న్యాయం అనే గుణాలను ఒకదానితో ఒకటి సంఘటించుకోగలిగితే చాలు.

గంగ, తుంగభద్ర, వేత్రవతి, కృష్ణవేణి, పెన్న, యమున, తమస, శిరావతి, కావేరి, గోదావరి, నర్మద, బాహుద, సరయువు, శతద్రువు, వితస్త, విపాశ, తామ్రపర్ణి మొదలైన మహానదులు ఈ పర్వతాల నుండి పుట్తున్నాయి. వీటివల్ల అనేక రకాల ధనాలు, ధాన్యాలు, సంపదలు లభిస్తాయి. నదులే కాకుండా ఎన్నో అడవులున్నాయి. ఆ అడవుల నుండి ధనార్జన చేసే ఉపాయాలు ఎన్నో వున్నాయి.

పాంచాల, బర్బర, వత్స, మత్స్య, మగధ, మళయాళ, కళింగ, కుకురు, కొంకణ, టెంకణ, త్రిగర్త, సాముద్ర, సాళ్వ, శూరసేన, సుదేష్ణ, సుహ్మ, కురు, కరూశ, కాశ, కోసల, యవన, యుగంధర, ఆంధ్ర, సింధు, చేది, చోళ, పుళింద, పుండ్ర, పాండ్య, అభీర, సౌవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, విదేహ, విదర్భ, ద్రవిళ, దశార్ణ, కర్ణాట, గౌళ, అంగ, వంగ, వరాట, లాట, బాహ్లిక, బహుదాన, కిరాత, కేకయ, ఆశ్మంత, కాశ్మీర, గాంధార, కాంభోజ, కేరళ, మాళవ, నేపాళ, ఘూర్జర, కుంతల, అవంతి, కామరూపం మొదలైన భారత వర్షంలోని జనపదాలు అనేక రకాల సంపదలకు ఆలవాలాలు.

రాజుకు భూమి కామధేనువై వర్తిల్లుతుంది. శక్తి, సామర్థ్యాలున్న రాజులు, ఉపాయంకల రాజులు, తమకు ఎంతో విశాలమైన రాజ్యం ఉన్నప్పటికీ, తృప్తి చెందక, తండ్రి-కొడుకు, అన్న-తమ్ముడు అనే విచక్షణ లేకుండా యుద్ధం చేసి భూమిని బలవంతంగా లాక్కుంటారని చెప్పాడు సంజయుడు. పూర్వకాలం నుండి రాజులు భూమికోసం పోరాడుతూనే వున్నారని, కౌరవపాండవులు కూడా భూమికోసం పోరాడడం వెనుకటి పరిపాటిమాత్రమే కాని కొత్త తప్పేమీ కాదని అన్నాడు. దైవం ఎవరిని అనుకూలిస్తే వారికి విజయం చేకూరుతుందని, ఏం జరగనున్నదో అని ధృతరాష్ట్రుడు దుఃఖించాల్సిన పని లేదని చెప్పాడు.      

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

 

 

              

No comments:

Post a Comment