Monday, September 26, 2022

తిరుమల వెంకన్న దర్శనం ఓ మధురానుభూతి స్వీయ అనుభవాల నేపధ్యంలో అప్పుడు, ఇప్పుడు : వనం జ్వాలా నరసింహారావు

 తిరుమల వెంకన్న దర్శనం ఓ మధురానుభూతి

స్వీయ అనుభవాల నేపధ్యంలో అప్పుడు, ఇప్పుడు

వనం జ్వాలా నరసింహారావు

"వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి"… ఆ కలియుగ ప్రత్యక్ష దైవ దర్శనం ఒక్క క్షణ కాలంపాటు కలిగినా చాలని, వందల-వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి, లక్షలాది మంది భక్తులు, పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమల కొండకు నిత్యం వెళుతుంటారు. స్వామిని దర్శించుకున్న సామాన్యులు కాని, అసామాన్యులు కాని, గంటల తరబడి క్యూలో నిలుచున్న వారు కాని, సరాసరి వైకుంఠ ద్వారం గుండా లోనికి వెళ్లగలిగిన వారు కాని, ఒక్క టంటే ఒక్క దర్శనం చాలనుకునేవారు కాని, వీలై నన్ని దర్శనాలు కావాలనుకున్నవారు కాని, ఒక్క రూపాయి హుండీలో వేయలేని వారు కాని, కోట్లాది రూపాయలు సమర్పించుకోగలిగే వారు కాని, ఎవరైనా, కారణమేదైనా, ఎలా వెళ్లినా, వచ్చినా....తృప్తి తీరా, తనివితీరా దేవుడిని చూశామంటారే కాని, అసంతృప్తితో ఎవరూ వెనుదిరిగిపోరు. వెళ్తూ....వెళ్తూ, దర్శనంలో పడ్డ ఇబ్బందులేమన్నా వుంటే పూర్తిగా మరచి పోతూ, ఏ భక్తుడైనా, ఏం కోరినా-కోరకున్నా, తప్పకుండా కోరేది మాత్రం ఒకటుంటుంది.....అదే, "స్వామీ, పునర్దర్శన ప్రాప్తి కలిగించు" అని. అలా తన భక్తులను తన వద్దకు రప్పించుకుంటాడా కలియుగ దైవం!

సాధారణంగా ప్రతి సంవత్సరం మా వివాహ వార్షికోత్సవం అయిన ఏప్రియల్ 30 నాడు కాని, ఒకటి రెండు రోజులు అటు ఇటుగా కానీ తిరుమల పోయి స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా అవస్తున్నది. ఆగస్ట్ 2019 లో కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్న తరువాత , కరోనా నేపధ్యంలో, ఏప్రియల్ 27, 2022 వరకు వెళ్లిరావడం కుదరలేదు. సిఫార్సులు అవసరం రాకూడదనుకుని శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను వెళ్ళిన ఆరుగురం కుటుంబ సభ్యులం ఆనలైన్లో బుక్ చేసుకున్నాం. తెలిసిన వారి ద్వారా వసతి ఏర్పాటు చేసుకున్నాం. అయితే నావయసు, మా శ్రీమతి వయసు దృష్టిలో పెట్టుకుని కార్యనిర్వహణాధికారితో నాకున్న కొద్దిపాటి పరిచయంతో దర్శనానికి సహాయకుడిని ఏర్పాటు చేసుకోగాలిగాం. బ్రేక్ దర్శనంతో పాటు సుప్రభాత సేవ దర్శనం కూడా చేసుకున్నాం. క్యూలైన్లలో సహజమైన ఇబ్బందులు సరేసరి. గతంలో కూడా స్వామిదయవల్ల ఇబ్బందులు ఎదురైనా దర్శనం బాగానే జరిగేది.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కోవడానికి ఎప్పుడు వెళ్లాలనుకున్నా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా నెలసరి ఆదాయంలో ఒక శాతం పైకాన్ని తిరుమల దర్శనార్థం విడిగా తీసి పెట్తుంటాం. అలా కూడగట్టిన పైకంతో దైవ దర్శనం, తిరుమల వెళ్లడానికి ఖర్చులు, అక్కడ వుండడానికి అయ్యే ఖర్చు సమకూర్చుకుంటాం. ఇక తిరుగు ప్రయాణం కొరకు మాత్రం అవి ఉపయోగించం. ఖర్చు పెట్టగా మిగిలిన పైకం దేవుడి హుండీలో వేస్తాం.

నాకు ఊహ తెలియక ముందు, తెలిసీ-తెలియని రోజుల్లో, తెలిసినప్పటి నుంచీ గత ఏబై-అరవై ఏళ్లుగా తిరుమల వెళ్లి రావడంలో చాలా మార్పులు స్వయంగా చూస్తూ వస్తున్నాను. దర్శనానికి వచ్చిన వేలాది-లక్షలాది యాత్రీకులందరికీ, వారివారి స్థోమతకనుగుణంగా, వుండడానికి వసతితో పాటు, కావలసిన వారికి ఉచిత భోజన సౌకర్యం కూడా తిరుమలలో కలిగించిన విధంగా ప్రపంచంలో ఎక్కడా, అదీ అనునిత్యం కలిగిస్తున్న దాఖలాలు లేవనాలి. ఏమిటీ కొండ మహాత్మ్యం? ఏముందీ దైవంలో? ఎందుకిన్ని ఆర్జిత సేవలు? ఒక్కో సేవకున్న ప్రత్యేకత ఏమిటి?పొరపాటునన్నా, లేదా, ఏమరుపాటునన్నా ఏనాడైనా ఏదైనా సేవ ఆగిందా? ఏ సేవ, ఎప్పుడు, ఎంతసేపు జరపాలన్న విషయంలో ఏవన్నా నియమ నిబంధనలున్నాయా? గతంలోను, ఇప్పుడు సేవల వేళల్లో కాని, పట్టే సమయాల్లోకాని, మార్పులు చేర్పులు జరిగాయా? జరగడానికి శాస్త్రీయ కారణాలే మన్నా వున్నాయా? ఆర్జిత సేవలకు అనుమతిచ్చే భక్తుల సంఖ్యలో పెంచడం-తగ్గించడం జరిగిందా? ఇవన్నీ ఆసక్తికరమైన విషయాలు.

మార్పులకు కారణాలుండే వుండాలి. ఇవన్నీ భక్తులు తెలుసుకోవాలనుకున్నా, ఏ కొద్దిమందికో తప్ప అందరికీ వీలుండదేమో! ఒకప్పుడు ఎల్ 1. ఎల్ 2. ఎల్ 3, బ్రేక్ దర్శనాలు వుండేవి. వాటిని రద్దు చేసి వాటి స్థానంలో ఒకే ఒక బ్రేక్ దర్శనం పెట్టారు. కాకపోతే ముందుగా ప్రోటోకాల్ దర్శనాలు, తరువాత శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు, చివరగా వీఐపీ దర్శనాలు ఏర్పాటు చేశారు. తోపులాట అన్నిటికీ వున్నా కొద్దిగా తేడా వున్నది.

          ఇవన్నీ కాక శ్రీ వేంకటేశ్వరుడికి అను నిత్యం జరిపించే ఒక్కో సేవకు ఒక్కో ప్రాధాన్యం వుంది-విశేషముంది. ప్రతి సేవలో అనుసరించే ఒక్కో విధానానికి విశేష ప్రాముఖ్యత వుంది. ఉదాహరణకు "సన్నిధి గొల్ల" అని పిలువబడే ఒక యాదవ వ్యక్తి బంగారు వాకిళ్ల తాళాలు తీయడం. ప్రతి నిత్యం తొలి దర్శనం అతడికే కలుగుతుంది. సుప్రభాత సేవ సమయాన పొర్లు దండాలు మరో విశేషం. ప్రతి నిత్యం స్వామివారికి ఇలా అనేకం జరగడం ఆనవాయితీ.

          మా ఇంట్లో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం, నా ఉపనయనానికి వెళ్లినప్పుడు, చాలా అట్టహాసంగా సుమారు పాతిక మందికి పైగా (సుమారు 62 సంవత్సరాల క్రితం 1960 లో) ఒక జట్టుగా కలిసి వెళ్లాం. ఎద్దుల బండ్లలో సమీపంలోని రైల్వే స్టేషన్ కు చేరుకుని, అక్కడ నుంచి పాసింజర్ రైల్లో విజయవాడ వెళ్లాం మొదట. అందరం విజయవాడ చేరుకుని, అక్కడ ఒక సత్రంలో బస చేశాం. ఆ మర్నాడు సాయంత్రం తిరుమలకు ప్రయాణం కట్టాం. ఇప్పటి లాగా హోటెల్ భోజనం కాదు. వంట చేసుకుని తిన్నాం. మినరల్ వాటర్ బాటిల్స్ వుండేవి కాదు. ఏ నీరు లభ్యమవుతే అదే తాగే వాళ్లం. బయల్దేరిన మూడో రోజు ఉదయం తిరుపతి రైల్వే స్టేషన్‌లో దిగాం. ఒక పూట తిరుపతి సత్రంలో బస చేసి, వంటా-వార్పూ కానిచ్చి, స్థానికంగా వున్న దేవాలయాలను దర్శించుకుని, మర్నాడు తిరుమలకు బస్సులో ప్రయాణమయ్యాం. ఆ రోజుల్లో తిరుమల-తిరుపతి దేవస్థానం వారే బస్సులు నడిపేవారు. రూపాయో-రెండో టికెట్ ధర వుండేది. తిరుమల వెళ్లడానికి-రావడానికి ఒకే ఘాట్ రోడ్డుండేది.

బస్సు మొత్తం ప్రయాణం  పూర్తయ్యేంతవరకు, గోవింద నామ స్మరణతో మారు మోగేది. అప్పట్లో సెక్యూరిటీ చెకింగులు అసలే లేవు. తిరుమలలో ఇప్పటి లాగా టిటిడి వారి వసతి గృహాలు ఎక్కువగా వుండేవి కావు. ఎన్నో ప్రయివేట్ సత్రాలుండేవి. వాటిలో "పెండ్యాల వారి సత్రం" చాలా పేరున్న సత్రం. తిరుమల చేరుకోగానే, అక్కడే బస చేశాం. వంటా-వార్పూ అన్నీ అక్కడే. అక్కడే నా ఉపనయనం జరిగింది. దాదాపు మూడు రోజులు అక్కడే వున్నాం. దర్శనానికి ఎన్ని సార్లు వీలుంటే అన్ని సార్లు, ఏ దర్శనం కావాలనుకుంటే ఆ దర్శనానికి, ఎవరి సహకారం లేకుండానే వెళ్లొచ్చాం. ఏ నియమ నిబంధనలుండేవి కావు. నాకు గుర్తున్నంతవరకు ప్రధాన ద్వారం గుండా సరాసరి వెళ్లొచ్చాం. కాకపోతే, శ్రీవారి దర్శనానికి ముందు వరాహ స్వామి దర్శనం చేసుకున్నాం. పక్కనే వున్న స్వామిపుష్కరణి-కోనేరులో  స్నానం చేసే వాళ్లం. అప్పట్లో అందులో నీరు శుభ్రంగా-కొబ్బరి నీళ్లలా వుండేది. తిరుమల సమీపంలోని పాప నాశనానికి తప్పనిసరిగా వెళ్లే ఆచారం వుండేది అప్పట్లో. అక్కడ నిరంతరం ధారగా నీరు పడుతుండేది.

కళ్యాణోత్సవం చేయించాం. గుళ్లో తిరగని ప్రదేశం లేదు. ఏ రకమైన కట్టుబాట్లు లేవు. ఇక లడ్డులకు కొదవే లేదు. కళ్యాణోత్సవం చేయించిన వారు బస చేసే చోటికి, ఆలయ నిర్వాహకులు, ఒక పెద్ద గంప నిండా పులిహోర, దద్ధోజనం, పొంగలి, పెద్ద లడ్డులు, వడలు, చిన్న లడ్డులు వచ్చేవి. మా హయాంలో కూడా ఒక సారి కళ్యాణం చేయించినప్పుడు మా వసతి గృహానికి అలానే వచ్చినట్లు గుర్తు. కళ్యాణం చేయించినవారికి ప్రత్యేక దర్శనం వుండేది.

          తిరుగు ప్రయాణంలో ఇప్పటిలాగే అప్పుడూ, అలి మేలు మంగాపురం పోయాం. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అంతకంటే ముందు అక్కడి కోనేట్లో స్నానం చేశాం. స్థానికంగా వున్న గోవింద రాజ స్వామి దర్శనం కూడా చేసుకున్నాం. తిరుపతి నుంచి ఒక పూట శ్రీ కాళహస్తి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నాం. ఆ మర్నాడు విజయవాడకు బయల్దేరాం. ఆ రోజుల్లో ఒక పద్దతి ప్రకారం దైవ దర్శనం చేసుకునే ఆచారం వుండేది. వరాహ స్వామి దర్శనం, వేంకటేశ్వర స్వామి దర్శనం, అలి మేల్ మంగ దర్శనం, గోవింద రాజ స్వామి దర్శనం, శ్రీ కాళహస్తి దర్శనం తిరుగు ప్రయాణంలో విజయవాడలో ఆగి కనకదుర్గ దర్శనం చేసుకునే వాళ్లం. సుమారు వారం-పది రోజుల యాత్ర అలా సాగేది అప్పట్లో. ఇక ఇప్పుడు విమానంలో తిరుమల పోయి దొరికిన దర్శనం చేసుకుని, 24 గంటల్లో తిరిగి వస్తున్నారు.  

ప్రత్యేక ప్రవేశ దర్శనం రు. 25 లతో ప్రారంభమైనట్లు జ్ఞాపకం. క్రమేపీ సిఫార్సు ఉత్తరాల సాంప్రదాయం మొదలైంది. ఆర్జిత సేవలకు కోటా మొదలైంది. అయినప్పటికీ మొదట్లో అంతగా ఇబ్బంది కలగలేదనాలి. ఎలాగో ఆలాగ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉత్తరాలు దొరికేవి స్వామివారి దయవల్ల. అప్పట్లో సర్వ సాధారణంగా చేసుకునే మంచి దర్శనం అర్చనానంతర దర్శనం. ఎప్పుడైతే కళ్యాణం చేయించిన వారికి మామూలు దర్శనాలు మొదలయ్యాయో చాలా మంది అవి చేయించడం మానుకున్నారు. తరువాతి కాలంలో అర్చనానంతర దర్శనాలు రద్దయ్యాయి. ఒకప్పుడు రు. 25 వుండే బ్రేక్ దర్శనం అంచలంచలుగా పెరిగి ఇప్పుడు రు. 500 కు చేరుకుంది.

ఎన్నాళ్ల బట్టో మాకు స్వామివారికి అభిషేకం చేయించాలన్న కోరిక వుండేది. ఆ కోరికా తీరింది అర్చన, సుప్రభాతం, అభిషేకం, కళ్యాణం లాంటివి చేయించిన మాకు "వస్త్రం" సేవ చేయించాలనే కోరిక కలిగింది. ఐ. వి. సుబ్బారావు గారి ద్వారా, రమణాచారిగారి ద్వారా   మూడు పర్యాయాలు వారి సిఫార్సుతో రు. 50, 000 టికెట్ కొని ఆ ముచ్చటా తీర్చుకున్నాం. మా కుమారుడు ఆదిత్య కృష్ణ రాయ్ దంపతులు కూడా రెండు సార్లు ఆ భాగ్యానికి నోచుకున్నారు. సుప్రభాత దర్శనాలు కూడా చేసుకున్నాం చాలా సార్లు.

ఒక సారి మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డితో, ఒక సారి ప్రస్తుత సీఎం కేసీఆర్ తో బ్రహ్మాండమైన దర్శనాలు కలిగాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని బంగారు ఆభరణాలు సమర్పించిన సమయంలో స్వామివారిని సమీపం నుండి తనివితీరా దర్శనం చేసుకున్న వారిలో నేను కూడా వుండడం అరుదైన, అపురూపమైన అనుభవం. తొలుత రంగనాయక మండపంలో వుంచిన ఆభరణాలను కళ్లకద్దుకోవడం, ఆ తరువాత ముఖ్యమంత్రి వెంట దర్శనం చేసుకోవడం జరిగింది. పేరుపేరునా తన వెంట వచ్చిన ప్రతివారినీ తన సమీపంలోకి పిలుస్తూ, అందరికీ తనివితీరా దర్శనం చేయించారు సీఎం. హారతీ, తీర్థం అందరికీ లభించింది.

అంతకుముందు సరిగ్గా 26 సంవత్సరాల క్రితం అదే ఫిబ్రవరి నెలలో, దాదాపు ఇవే రోజుల్లో, అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి దగ్గర పీఆర్వోగా పనిచేస్తున్నప్పుడు కూడా నాకిలాంటి దర్శనమే లభించింది. అప్పట్లో అమల్లో వున్న నిబంధనల ప్రకారం, సీఎం వెంట వున్న వారందరినీ ముఖద్వారం నుంచే లోనికి అనుమతించినట్లు జ్ఞాపకం.

సీఎం కేసీఆర్ ఆభరణాలు స్వామివారికి సమర్పించిన తరువాత ఎస్వీబీసీ ఛానల్ తో మాట్లాడుతూ తన స్వానుభవం ఒకటి వివరించారు. కొన్నేళ్ల క్రితం తిరుమలకు వచ్చి కూడా, దర్శనం చేసుకోకుండా తిరిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, స్వామి అనుజ్ఞ లేనిదే దర్శనం జరగదని, "దర్శనం స్వామి ఇస్తేనే దొరికేది" అనీ, అందుకే ఆభరణాలు ఇవ్వడానికి ఇంత కాలం పట్టిందనీ, అన్నారు. ఇది నూటికి నూరు పాళ్లు వాస్తవం. 

కాలం మారింది. ఏబై-అరవై ఏళ్ల క్రితం పరిస్థితులు ఇప్పుడు లేవు. సరాసరి దైవ దర్శనానికి పోయేందుకు ఇప్పుడు వీలు లేదు. ఇప్పటి నియమనిబంధనలు పాటించక తప్పదు. భక్తులను ఇలా నియంత్రిస్తేనే అందరికీ దర్శనం దొరికే అవకాశం వుంటుంది. ఒకనాడు విఐపి లకు వున్న ప్రాముఖ్యత ఇప్పుడు లేదే! గతంలో లాగా వీఐపీలకు హారతి ఇచ్చే ఆచారం ఆగిందే! ఆ రోజుల్లో లాగా అన్నీ-అందరికీ ఇప్పుడు జరగడం లేదే! కాకపొతే ఇంకా, ఇంకా వసతులు శాస్తీయంగా పెరగాల్సిన అవసరం వున్నది.

అందుకే బహుశా, రాబోయే రోజుల్లో ఏం జరగ బోతోందో ఎవరూ ఊహించలేరేమో.

Sunday, September 25, 2022

‘ధృతరాష్ట్ర కౌగిలి’ నుండి భీముడిని కాపాడిన శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్ర-గాంధారి విలాపం .... ఆస్వాదన-90 : వనం జ్వాలా నరసింహారావు

ధృతరాష్ట్ర కౌగిలి నుండి భీముడిని కాపాడిన శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్ర-గాంధారి విలాపం

 ఆస్వాదన-90

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (25-09-2022)

తన నూరుగురు సంతానం ఒక్కరూ కూడా మిగలకుండా పాండవుల చేతిలో చనిపోవడంతో ధృతరాష్ట్రుడికి అమితమైన దుఃఖంకలిగింది. మనసంతా కకావికలైపోయింది. హృదయం శూన్యమై పోయింది. మాటా, పలుకూ లేకుండా పోయిన ధృతరాష్ట్రుడిని పామరుడిలాగా దుఃఖించ వద్దని, ఆయన బాధకు అంతం లేదని, శోకించడం తగని పనని, తాను చెప్పేది వినమని సంజయుడు అన్నాడు. యుద్ధంలో చనిపోయిన వారందరికీ దహన సంస్కారం చేయాలని, సన్నిహిత బంధువర్గానికి తిలోదక ప్రదానం చేయాలని, కాబట్టి యుద్ధభూమికి బయల్దేరమని సంజయుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చి ఎన్నో విధాలుగా యుద్ధం నాశకరమని చెప్పినా తాను వినలేదని, భీష్మద్రోణాది పెద్దలు చెప్పిన హితోక్తులు కూడా తాను విన్నవాడిని కాదని, రాజ్యభాగం ఇవ్వక పోయానని, తన వల్లనే అంతా చనిపోయారని, పాండవులను సంపదకు దూరం చేశానని, ఇక తాను బతకడం సమంజసం కాదని సంజయుడితో చెప్పుకుని విలపించాడు ధృతరాష్ట్రుడు. తప్పంతా దుర్యోధనుడిదే అని సంజయుడు ఓదార్చాడు.

అక్కడే వున్న విదురుడు కూడా ధృతరాష్ట్రుడికి దుఃఖోపశమనం చేశాడు. ధృతరాష్ట్రుడి కొడుకులు ఉత్సాహంగా ఒక ఆటలాగా యుద్ధం చేసి స్వర్గానికి అతిథులుగా వెళ్లారని, ఇంద్రుడి సత్కారాలు పొందుతున్నారని, యుద్ధంలో వెన్ను చూపకుండా పోరాడి మరణించే యోధులకు కలిగే పుణ్యగతులు అన్నిటికన్నా ఎక్కువని విదురుడు అన్నాడు. కాబట్టి ధృతరాష్ట్రుడు ఆయన కొడుకుల విషయంలో చింతించాల్సిన అవసరం లేదన్నాడు. విదురుడి మాటలు వినడం వల్ల తన బాధ తగ్గిందన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ తరువాత తన దుఃఖోపశమనంలో భాగంగా ధృతరాష్ట్రుడు విడురుడిని రెండు-మూడు సందేహాలను అడిగి నివృత్తి చేయమన్నాడు. సంయోగ-వియోగాల వలన పుట్టే మానసిక భావాల చేత ఆక్రమించబడకుండా ప్రాజ్ఞులు ఎలా వుంటారని, సంసారంలో ఎక్కడెక్కడ దుఃఖం పరివ్యాప్తమయిందో దాన్ని దాటడం ఎందుకు కష్టమని, అలాంటివే మరికొన్ని ప్రశ్నలు అడిగాడు. విదురుడు వాటన్నిటికీ సరైన సమాధానం చెప్పాడు. సంసార గహనం గురించీ చెప్పాడు.

ఇవన్నీ చెప్పిన సంజయుడు కుమారులకు, దాయాదులకు ఉత్తర క్రియలు జరిపించమని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వేదవ్యాస మహర్షి వచ్చాడు. ఆయన కూడా ధృతరాష్ట్రుడికి దుఃఖోపశమనం చేశాడు. పుత్రుల మరణం వల్ల కలిగిన దుఃఖ సముద్రాన్ని దాటి శాంతిని పొందమన్నాడు. ప్రాణులు అన్నీ అశాశ్వతాలే అని అన్నాడు. ధృతరాష్ట్రుడికి తెలియకుండా కౌరవ పాండవులకు వైరం కలిగిందా అని ప్రశ్నించి, దీనంతటికీ మూలకారణం ఆయన కొడుకు దుర్యోధనుడే అన్నాడు. దేవతల సమక్షంలో భూదేవితో శ్రీమహా విష్ణువు అన్న మాటలను, తాను విన్న మాటలను వివరంగా  చెప్పాడు వ్యాసుడు ఈ సందర్భంగా. ధృతరాష్ట్రుడు అనే రాజుకు పుట్టే నూరుగురు కుమారులలో దుర్యోధనుడు భూభారాన్ని సంపూర్ణంగా పోగొట్టుతాడని, కురుక్షేత్రంలో జరిగే మహా యుద్ధంలో సకల రాజలోకం ఘోరంగా చనిపోతుందని, సోదరులతో సహా దుర్యోధనుడు చనిపోతాడని నారాయణుడు భూదేవిని ఓదార్చిన సంగతి వ్యాసుడు చెప్పాడు. అంతా అలాగే జరిగిందన్నాడు.  

నారాయణుడు అలా చెప్పిన తరువాత ‘కలిఅంశతో దుర్యోధనుడు పుట్టాడని, అందువల్ల అతడు ఇతరుల గొప్పతనాన్ని సహించడని, ఎంత బలవంతుడో అంత కోపిష్టి అని, ఎవరైనా పెద్దలు నీతి చెప్తే వినడని కూడా చెప్పాడు వ్యాసుడు. దుశ్శాసన, శకుని, కర్ణులు ఆ రాజుకు సన్నిహితులైనప్పుడు అంతా నశించకుండా ఎలా వుంటారని ప్రశ్నించాడు. ఇదంతా చెప్పి, పాండవుల వల్ల ఏ కీడూ జరగలేదని, దుర్యోధనాదులే భూమండలాన్నంతా మింగేశారని, ఇలా జరుగుతుందని తనకు తెలిసే ధర్మరాజును సంధికి ప్రోత్సహించానని అన్నాడు. అతడు సంధి కొరకు ఎంత ప్రయత్నించినా అది జరగలేదని, విధిని తప్పించడానికి ఎవరికీ సాధ్యం కాదని అన్నాడు. ఆయన మీద గౌరవం వున్న ధర్మరాజును ఆదరించమని ధృతరాష్ట్రుడికి చెప్పాడు వ్యాసుడు. ఆయన మాటలు విన్న తన మనస్సు ప్రశాంతమైనదని, ఆయన చెప్పినట్లే బాధ పడడం మానేసి బాంధవ్యాన్ని పెంచుకుంటానని అన్నాడు ధృతరాష్ట్రుడు వ్యాసుడితో. ఆ తరువాత వ్యాసుడు అంతర్థానం అయ్యాడు. యుద్ధరంగానికి ప్రయాణానికి సిద్ధం చేయమని సంజయుడికి చెప్పాడు ధృతరాష్ట్రుడు. గాంధారిని, కుంతిని, మిగతా కౌరవ స్త్రీలను పిలుచుకొని రమ్మని విదురుడికి చెప్పాడు.

క్రమంగా గాంధారి, కుంతీదేవి, కురువంశంలోని పెద్ద ఆడవారు, ఇతర కౌరవ కాంతలు, పరిచర్యలు చేసే స్త్రీలు, ఇతర స్త్రీలు, మృతవీరుల భార్యలు దుఃఖిస్తూ యుద్ధభూమికి తరలిపోవడానికి అక్కడికి చేరుకున్నారు. అలా వస్తుంటే కురుకుమారుల ఇళ్లలో ఆర్తనాదాలు పుట్టాయి. ఏడ్పులు, రోదనాలతో కురు స్త్రీలంతా వచ్చి ధృతరాష్ట్రుడి సమీపంలో నిలిచారు. విదురుడికి నోట మాట రావడం లేదు. నెమ్మదిగా వారందరికీ ఓదార్పు మాటలు చెప్తూ, వారివారికి తగిన వాహనాల మీద కూచోబెట్టాడు. ధృతరాష్ట్రుడు కూడా రథం ఎక్కి బయల్దేరాడు. అతడి వెనుకనే విదురుడు గాంధారి, కుంతి మొదలైన వారిని తీసుకుని సంజయుడితో కలిసి బయల్దేరాడు. ఒక కోసెడు దూరం పోయిన తరువాత అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కలిశారు. దుర్యోధనుడు మహా యుద్ధం చేసి వీరస్వర్గం అలంకరించిన సంగతి ధృతరాష్ట్రుడికి చెప్పారు వారు ముగ్గురు. ఆ తరువాత అతి దీనంగా విలపిస్తున్న గాంధారిని ఓదార్చాడు కృపాచార్యుడు. భీముడు అధర్మ పద్ధతిలో దుర్యోధనుడిని అతి క్రూరంగా చంపాడని ఆమెతో అన్నాడు.

అర్థరాత్రి తాము పాండవులను తప్ప మిగతావారిని ఎలా సంహరించారో గాంధారికి, ధృతరాష్ట్రుడికి చెప్పారు అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మలు. పాండవులు పగతో తమను వెంటాడుతున్నారని, వాళ్ల బారినుండి బయట పడక తప్పదని, కాబట్టి పోవడానికి తమకు అనుమతి ఇవ్వమని చెప్పి వారిద్దరికీ ప్రదక్షిణ నమస్కారం చేసి బయల్దేరి వారు ముగ్గురు గంగానదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుని తమతమ మార్గాలలో వెళ్లిపోయారు. కృపాచార్యుడు హస్తినకు వచ్చాడు. కృతవర్మ ద్వారకకు చేరుకున్నాడు. అశ్వత్థామ వ్యాసమహర్షి ఆశ్రమానికి చేరుకొని వెంటనే తపస్సు ప్రారంభించాడు. అక్కడికే పాండవులు రావడం, అతడితో యుద్ధం చేయడం, శిరోమణిని తీసుకుపోవడం జరిగింది.

ఇదిలా వుండగా, ధృతరాష్ట్రుడు యుద్ధభూమికి వస్తున్నాడని తెలిసి ధర్మారాజాదులు కూడా బయల్దేరారు అక్కడికి. తాను యుద్ధభూమి వైపుగా పోతున్నానని శ్రీకృష్ణుడికి ధర్మరాజు తెలియచేయగానే, సాత్యకి, భీమార్జున నకులసహదేవులు ఆయనకు ఇరువైపులా బయల్దేరారు. ద్రౌపది, ఆమె వెనుక మత్స్యపాంచాల దేశాల స్త్రీలు కూడా ధర్మరాజును అనుసరించారు. ధర్మరాజు యుద్ధభూమికి చేరుకునే సమయానికల్లా ధృతరాష్ట్రుడు కూడా అక్కడికి వచ్చాడు. కౌరవ పక్షంలోని కొంతమంది స్త్రీలు ఎంతమందో చావడానికి కారణమని ధర్మరాజును దూషించారు. ధర్మరాజు చిన్నగా ధృతరాష్ట్రుడి దగ్గరకు చేరుకొని ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. ధృతరాష్ట్రుడు నెమ్మదిగా ధర్మరాజును కౌగలించుకున్నాడు. కౌగలించుకుని ఓదార్పు మాటలతో సాంత్వనం కలిగించాడు.

ఆ తరువాత భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ధృతరాష్ట్ర మహారాజును సమీపించారు. వారు వచ్చారని పక్కవారు చెప్తున్నప్పుడు భీముడి పేరు చెప్పగానే కోపాగ్ని అతడిని దహించి వేయడం శ్రీకృష్ణుడు గమనించాడు. వెంటనే భీముడిని రాజు సమీపానికి పోకుండా ఆపాడు. అతడికి బదులుగా రహస్యంగా ఇనుముతో తయారు చేయించి అక్కడకు తెచ్చిన భీముడి విగ్రహాన్ని రాజు ముందరికి జరిపాడు శ్రీకృష్ణుడు. ఆ విగ్రహమే భీమసేనుడు అనుకుని ధృతరాష్ట్రుడు దాన్ని రెండు చేతుల మధ్యా అదుముకొని అతి క్రూరంగా భయంకరమైన వేగంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా విరిచి పారేశాడు. ధృతరాష్ట్రుడి కౌగిలిలో విగ్రహం ముక్కలై పోయింది. ధృతరాష్ట్రుడి రొమ్ము చిట్లిపోయింది. (అందుకే ‘ధృతరాష్ట్రుడి కౌగిలి’ అన్న మాట లోకంలో ప్రసిద్ధికెక్కింది). ఏదో జరిగినట్లు ఏడుస్తున్న రాజును చూసి శ్రీకృష్ణుడు, భీముడు ఆయన చేతిలో చావలేదని, ఆయన విరిచింది విగ్రహాన్నని, ఆయనకు అంత కోపం వున్నదని తెలుసుకొని తానే విగ్రహాన్ని పెట్టానని అన్నాడు. సృష్టికర్త లీలలు గ్రహించలేక ధృతరాష్ట్రుడు అపహాస్యం పాలయ్యాడని, పెద్ద పాపం చేశాడని అన్నాడు కృష్ణుడు. గతం గుర్తు చేస్తూ ఆయన చేసిన తప్పులను మరోమారు ఎత్తి చూపాడు.

ఇక మున్ముందు తన కొడుకు చనిపోయారన్న బాధను వదిలేస్తానని తన తమ్ముడి కుమారులే తనకు సంతోషం కలిగించగలిగే వారుగా నడుచుకుంటానని ధృతరాష్ట్రుడు కృష్ణుడికి చెప్పాడు. ఆ తరువాత భీమార్జున నకుల సహదేవులను కౌగలించుకొని అందరికీ దీవెనలు ఇచ్చాడు ధృతరాష్ట్రుడు. యుయుత్సుడిని కూడా కౌగలించుకొని దీవించాడు. ఆ తరువాత కుంతీ కుమారులు గాంధారికి నమస్కరించారు. వారిని ఆశీర్వదించడానికి ఇష్టపడని గాంధారి శాపం ఇవ్వడానికి ధర్మరాజు వైపుకు తిరిగింది. తక్షణమే వ్యాసుడు అక్కడ ప్రత్యక్షమై శపించవద్దని, శాంతించమని గాంధారికి చెప్పాడు.

దుర్యోధనుడు యుద్ధభూమికి వెళ్లే ముందర తల్లి దీవెన కోసం, విజయం సిద్ధించేట్లు చేయమని ఆశీర్వచనం కోసం వచ్చినప్పుడు గాంధారి, ‘ధర్మం ఎక్కడ వుంటే జయం అక్కడే అని అన్నదని, ఆ విధంగానే ధర్మదీక్షతో పోరాడి పాండవులు గెలిచారని, వారి పట్ల అసూయ వద్దని, ఇప్పటికైనా మాతృ ధర్మాన్ని అవలంభించి పాండవుల మీద వున్న కోపాన్ని పోగొట్టుకొమ్మని వ్యాసుడు అన్నాడు. తనకు వారిమీద కోపం లేదని, దుఃఖం అధికం కావడం వల్లే కోపం వచ్చిందని గాంధారి అన్నది. భీముడు గదా యుద్ధంలో దుర్యోధనుడిని అధర్మంగా చంపాడని కోపంగా వున్నదని అన్నది. అప్పుడు భీముడు భయంతో వణకి పోతూ, తాను ప్రాణభీతితో అలా చేశానని, క్షమించమని అన్నాడు గాంధారితో. అలా అంటూనే, ద్రౌపదికి సభలో జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించాడు. అది న్యాయమేనా అని ప్రశ్నించాడు. అది జరిగినప్పుడు దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టుతానని నిండు సభలో ప్రతిజ్ఞ చేశానని, అది నెరవేర్చుకున్నానని చెప్పాడు. అదే విధంగా దుశ్శాసనుడిని చంపిన తరువాత తన ప్రతిజ్ఞ తీర్చుకోవడానికి అతడి రక్తాన్ని పెదవికి మాత్రమే చేర్చానని తాగలేదని స్పష్టం చేశాడు.

కనీసం తన కొడుకుల్లో ఒక్కడినైనా చంపకుండా వుండాల్సిందని గాంధారి అంటూ ధర్మరాజు కొరకు చూసింది. అతడు భయ పడుతూ ఆమె దగ్గరికి వచ్చి ఆమె కొడుకులను చంపించిన పాపాత్ముడు తనే అనీ, తనను శాపంతో చంపమని అన్నాడు. గాంధారి ఒక నిట్టూర్పు విడిచి, తన కళ్లకు కట్టుకున్న గుడ్డ అంచు సందులో నుండి ధర్మరాజును ఒక చూపు చూసింది. వెంటనే అతడి వేళ్లు ఎర్రబడ్డాయి. అది చూసి భీమార్జున నకుల సహదేవులు పక్కకు తప్పుకున్నారు. ఆ సమయంలో గాంధారి కోపాన్ని వదిలిపెట్టి పాండవుల పట్ల మాతృభావాన్ని పొంది, కుంతిని దర్శించుకొమ్మని చెప్పింది. పాండవుల మనస్సు కుదుటపడ్డది. అంతా కలిసి కుంతి దగ్గరికి వెళ్లారు.

కుంతీదేవి తన కొడుకులను చూసి వారు పడ్డ కష్టాలను తలచుకొని, అభిమన్యాదుల మరణం గుర్తు తెచ్చుకొని, మహా దుఃఖంలో మునిగిపోయింది. ఆమె బాధ చూసి పాండవులు కూడా చలించి పోయారు. అంతా ఆమె పాదాలమీద పడి నమస్కరించారు. అంతా కుమిలి కుమిలి ఏడ్చారు. వారి శరీరాలను నిమిరింది కుంతి. ఇంతకాలానికి వచ్చారా? అన్నది. ద్రౌపది కూడా కుంతిని సమీపించి పెద్దగా ఏడ్చింది. గాంధారి కాళ్లకు కూడా నమస్కరించింది ద్రౌపది. తమ విషయంలో విధి క్రూరంగా వ్యవహరించిందని గాంధారి ద్రౌపదితో అన్నది. ఇలా అవుతుందని తెలిసే తాను ప్రయత్నించి కూడా తన కుమారుల దుర్మార్గాన్ని ఆపలేకపోయానని, అందుకే ఈ సంక్షోభం అని అన్నది గాంధారి.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, స్త్రీపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

Sunday, September 18, 2022

జాతినిర్మాణంలో తెలంగాణ ఉజ్వల పాత్రను నిర్వహించాలి:ముఖ్యమంత్రి కేసీఆర్

జాతినిర్మాణంలో తెలంగాణ ఉజ్వల పాత్రను నిర్వహించాలి, ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం (17-09-2022) సందర్భంగా

యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా, ప్రతి హృదయంలో భారతీయతా భావన ఉప్పొంగేలా 15 రోజులపాటు అద్భుతంగా జరుపుకున్నాం. దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలనూ నిర్వహించుకుంటున్నాం.

స్వతంత్రం రాకముందు భారతదేశ స్వరూపం భిన్నంగా ఉండేది. కొంతభాగం బ్రిటిష్ వారు నేరుగా పరిపాలించే బ్రిటిష్ ఇండియాగా ఉంటే.. మిగతా భాగం సంస్థానాధీశుల పాలనలో ఉండేది. కొన్ని ప్రాంతాలు ఫ్రెంచ్, పోర్చుగీస్ వారి వలస పాలనలో ఉండేవి. ప్రపంచంలో ఏ దేశమైనా పరిణామ క్రమంలో సమగ్ర స్వరూపాన్ని సంతరించుకుంది. మన భారతదేశం కూడా అంతే.

తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన మహోజ్వల సందర్భం మనందరికీ సువిదితమే. నాడు అవలంబించిన అనేక వ్యూహాలు, జరిపిన పోరాటాలు, నెరపిన త్యాగాలలో నాటి తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములే. ఆనాటి ఉజ్వల ఉద్యమ సందర్భం తెలంగాణ కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిపోయింది.

ఆనాటి అద్భుత ఘట్టాలు జాతి జనుల జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి. తెలంగాణ సమాజాన్ని నిరంతరం ఉద్విగ్నపరుస్తూనే ఉంటాయి. యావత్ సమాజం పోరాడిన సందర్భంలో ఆ సన్నివేశానికి కొందరు నాయకత్వం వహించడం ప్రపంచ పోరాటాలన్నింటిలో కనిపించేదే. తెలంగాణలో సైతం ఆనాడు ఎందరో యుద్ధం చేశారు. ఇంకొందరు ఆ యుద్ధానికి నాయకత్వం వహించారు. మరికొందరు సాంఘిక, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించారు. నేటి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి వీరయోధులందరినీ  పేరు పేరునా తలుచుకోవడం మన కర్తవ్యం 

ఆదిలాబాద్ అడవుల్లో తుడుం మోత మోగించి, అడవిబిడ్డలను ఒక్కటి చేసి, జల్ జంగల్ జమీన్ కోసం సింహగర్జన చేసిన ఆదివాసి యోధుడు కొమరం భీమ్ సాహసాన్ని సగర్వంగా తలుచుకుందాం. భూస్వాముల ఆగడాలకు బలయి పోయిన దొడ్డి కొమురయ్య అమరత్వాన్ని వినమ్రంగా గుర్తు చేసుకుందాం. తన సొంత భూమి వందల ఎకరాలను  పేద ప్రజలకు పంచిన త్యాగశీలి, రైతాంగ పోరాటానికి తిరుగులేని నాయకత్వాన్ని అందించిన వీరాగ్రేసరుడు, మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నెహ్రూ కన్నా అత్యధిక మెజారిటీని సాధించిన మహా నాయకుడు రావి నారాయణరెడ్డికి ఘనమైన నివాళులర్పిద్దాం. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో రాజకీయాల్లో అడుగిడి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ను స్థాపించి, పివి నరసింహారావు వంటి  ఎంతోమంది నాయకులను తీర్చిదిద్దిన స్వామి రామానంద తీర్థను స్మరించుకుందాం.  తెలంగాణ పల్లెల్లో గ్రంథాలయ స్థాపనను యజ్ఞంలా నిర్వహిస్తూ, కఠోరమైన జైలు శిక్షలకు వెరవకుండా  మొక్కవోని ధైర్యంతో పోరాడిన సర్దార్ జమలాపురం కేశరావు, వట్టికోట ఆళ్వార్ స్వామిల కృషిని కొనియాడుదాం.

భూపోరాటాలకు గొప్ప ప్రేరణనిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిని ఆవాహన చేసుకుందాం. ఐలమ్మ  పోరాటానికి  దన్నుగా నిలిచి, ఉద్యమాన్ని మలుపు తిప్పిన వ్యూహకర్త, వందలాది ఎకరాల తన సొంత భూమిని పేదలకు పంచిన మానవతావాది, మచ్చలేని మహానాయకుడు భీంరెడ్డి నర్సింహారెడ్డిని సవినయంగా స్మరించుకుందాం. జనగామసింహంగా పేరు గాంచిన   నల్లా నర్సింహులునూజీవితాంతం పీడిత ప్రజల గొంతుకగా నిలిచి, గీత కార్మికుల అభ్యున్నతికోసం జీవితాన్ని అంకితం చేసిన  బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ నూ, ప్రజా పోరాటానికి సేనానిగా నిలిచిన వీర యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి ఆరుట్ల కమలాదేవిల  త్యాగాలను సదా స్మరించుకుందాం.

పోరాటంలో పాలుపంచుకోవడమే కాకుండా ఆ పోరాట చరిత్రను గొప్పగా రికార్డు చేసిన దేవులపల్లి వేంకటేశ్వర రావుతో పాటు అట్టడుగు వర్గాల మేలు కోరిన ఉద్యమకారుడిగా, పార్లమెంటేరియన్ గా, శాసనసభ్యుడిగా ఎనలేని సేవలు అందించిన బద్దం ఎల్లారెడ్డి చైతన్యాన్ని పుణికిపుచ్చుకుందాం. నిర్బంధాలకు  ఎదురొడ్డి నిలిచిన అక్షర చైతన్య మూర్తులు సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్, బండియాదగిరి, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతుల  రచనల్లోని ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని నిరంతరం నిలబెట్టుకుందాం. ఇంకా ఎందరో మహానుభావులు, తెలంగాణ సమాజంలో అద్భుతమైన రాజకీయ, సామాజిక చైతన్యాన్ని రగిలించారు తమ త్యాగాలతో చరిత్రను వెలిగించారు.  వారందరి ఉజ్వల స్మృతికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

ఆసేతు హిమాచలం అన్ని వర్గాల ప్రజల్లో దేశం పట్ల విశ్వాసాన్ని నెలకొల్పడానికి నాటి భారత పాలకులు చేసిన కీలకమైన కృషి వల్ల నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది. మహాత్మాగాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు భూమికగా, జవహర్ లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం, సర్దార్ వల్లభభాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం, మతాలకు అతీతంగా దేశభక్తి భావనను పాదుకొల్పిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి నేతలు చేసిన అవిరళ కృషి వల్ల ఒక్కొక్క చిక్కు ముడి వీడిపోయింది. భారతదేశం ఏకీకృతమైంది.

భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుండి 1956 వరకు సొంత రాష్ట్రంగా వెలుగొందింది. శ్రీబూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రం కొనసాగింది. మిగులు నిధులతో కూడిన నాటి హైదరాబాద్ రాష్ట్రం ఆనాడే  అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని, అడుగులు వేయటం ప్రారంభించింది. 1956లో దేశంలో జరిగిన రాష్ట్రాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ-ఆంధ్రలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుండి తెలంగాణ ప్రజలలో తాము మోసపోయినామనీ, తాము దోపిడీకి గురువుతున్నామనే ఆందోళన గూడు కట్టుకుంది.  ఇరుప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదు. సఖ్యత ఏర్పడలేదు. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్దకాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడింది. సమస్యను పరిష్కరించాల్సిన ఆనాటి కేంద్రప్రభుత్వం అందుకు భిన్నంగా సాచివేత ధోరణిని అవలంభించింది. తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షను పట్టించుకోకుండా గాలికొదిలేసింది. తెలంగాణ ప్రజలు భయపడినట్లుగానే సమైక్య రాష్ట్రంలో అన్నిరంగాల్లో దారుణమైన వివక్ష అమలైంది. ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చింది. 

2001లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నేనే స్వయంగా సారథ్యం వహించి, ఉద్యమశంఖం పూరించాను. తెలంగాణ ప్రజలందరినీ ఒక్కటిచేసి, పధ్నాలుగేళ్లు అవిశ్రాంత పోరాటాన్ని నడిపించాను. లక్ష్య సాధన కోసం మరణం అంచులదాకా వెళ్లేందుకు సిద్ధపడ్డాను. తెలంగాణ ఉద్యమం అంతకంతకూ తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం దిగివచ్చింది. ప్రజా ఉద్యమం ఆశించిన గమ్యాన్ని ముద్దాడింది. 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది.

తెలంగాణ ఏవిధంగానైతే ఉండాలని ప్రజలు స్వప్నించారో, సంభావించారో.. అదేవిధంగా నేడు తెలంగాణ అన్నిరంగాల్లోనూ అగ్రగామి రాష్ట్రంగా పురోగమిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిననాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ పురోగమించి.. దేశానికే దారిచూపే టార్చ్ బేరర్ గా నిలిచింది. విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, ప్రజా సంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాలలో అనతికాలంలోనే అద్భుతాలను ఆవిష్కరించి దేశానికే దిశానిర్దేశనం చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అవలంబించిన ప్రగతిశీల, పారదర్శక విధానాల వల్ల రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగింది.

         ఎనిమిదేళ్లలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతగానో మారిపోయింది. పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో శాంతికి నెలవుగా తెలంగాణ అలరారుతున్నది. సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్రం ప్రగతిబాటలో పయనిస్తున్నది. ఈ తరుణంలో మతతత్వ శక్తులు బయలుదేరి తమ  వికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఏ దేశమైనా, ఏ సమాజమైనా తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ, వాటిలోని మంచి చెడులను అర్ధం చేసుకుంటూ అప్రమత్తంగా ముందడుగు వేయాలి.

ఏ కొంచెం ఆదమరిచినా ఎంతటి బాధాకరమైన, దౌర్భాగ్యమైన పరిస్థితులు సంభవిస్తాయో తెలుసుకోవడానికి మన తెలంగాణే మనకు ఉదాహరణ. ఒకనాడు జరిగిన ఏమరుపాటు వల్ల తెలంగాణ 58 సంవత్సరాలు శాపగ్రస్త జీవితం అనుభవించింది. తాను కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది. ఎంతోమంది జైలుపాలు కావలసి వచ్చింది, ఎన్నోజీవితాలు ఆహుతై పోవాల్సి వచ్చింది. ఆ  చరిత్రంతా నేను వేరే చెప్పనక్కరలేదు. అది మనందరి ప్రత్యక్ష అనుభవం. సమీప చరిత్రలోనే జరిగిన తెలంగాణ ఉద్యమంలో మనమందరం ప్రత్యక్ష భాగస్వాములమే.

హక్కుల కోసం, అస్తిత్వం కోసం తెలంగాణ సమాజం అనుభవించిన ఘర్షణను తలచుకుంటే నేటికీ నా కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. అటువంటి కష్టం, అటువంటి వేదన పొరపాటున కూడా మళ్లీ రాకూడదు. అందుకు నిశిత పరిశీలన, నిరంతర చైతన్యం కావాలి.

దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయి. తమ సంకుచిత ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్లకంపలు నాటుతున్నాయి. విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయి. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ  సమర్థనీయం కాదు. మతం చిచ్చు ఈ విధంగానే  విజృంభిస్తే అది  దేశం యొక్క, రాష్ట్రం యొక్క జీవికనే కబళిస్తుంది. మానవ సంబంధాలనే మంట గలుపుతుంది. జాతి జీవనాడిని కలుషితం చేస్తుంది.

జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు   పాల్పడుతున్నాయి. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధంలేని ఈ అవకాశవాదులు,   ఆషాడ భూతులు చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు  ప్రయత్నం చేస్తున్నాయి.

         అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే  తెలంగాణ సమాజం తన బుద్ధి కుశలతను ప్రదర్శించి స్వరాష్ట్రాన్ని సాధించుకుంది. అదే క్రియాశీలతను, బుద్ధి కుశలతను మరోమారు చూపించాలి. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట, భ్రష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలి. ఈ విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం కల్లోలంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని మరోమారు హెచ్చరిస్తున్నాను.

మీ అందరి అండదండలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తిగా, అనునిత్యం తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా, ఈ నేల పై నెలకొన్న శాంతి, సౌభ్రాతృత్వాలను గుండెల నిండా శ్వాసించే వ్యక్తిగా.. ప్రతీ క్షణం ప్రజాశ్రేయస్సు కోసమే పరితపించే వ్యక్తిగా, అన్నింటికి మించి మీ బిడ్డగా ఈ విషయం  మీకు చెప్పడం నా కర్తవ్యం. నా గురుతర బాధ్యత.

         మీ అందరికీ వినమ్రంగా చేతులు మోడ్చి నమస్కరిస్తూ నేను కోరుకునేది ఒక్కటే. ఎన్నటికీ ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప, అశాంతి, అలజడులతో అట్టుడికి పోవద్దు. తిరిగి తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దు. తెలంగాణ ఈనాడు ఎంత వేగంగా పురోగమిస్తున్నదో, అంతేవేగంతో రాబోయే రోజుల్లోనూ అప్రతిహతంగా అభివృద్ధి పథంలో దూసుకు పోవాలి. జాతినిర్మాణంలో ఉజ్వల పాత్రను నిర్వహించాలి. భారత జాతి జాగృతి కోసం, అభ్యున్నతి కోసం మనవంతు దోహదం చేద్దామని అందరినీ కోరుకుంటూ మరోమారు యావత్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

శిరోమణిని పాండవులకిచ్చిన అశ్వత్థామ, ఉత్తర గర్భాన్ని రక్షిస్తానన్న శ్రీకృష్ణుడు .... ఆస్వాదన-89 : వనం జ్వాలా నరసింహారావు

 శిరోమణిని పాండవులకిచ్చిన అశ్వత్థామ, ఉత్తర గర్భాన్ని రక్షిస్తానన్న శ్రీకృష్ణుడు

ఆస్వాదన-89

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (18-09-2022)

అర్థరాత్రి పాండవ శిబిరంలోకి కృపాచార్యుడు, కృతవర్మలతో కలిసి వచ్చి, అంతా ఒళ్లు మరిచి నిద్రపోతుంటే, ధృష్టద్యుమ్నుడిని వధించి, అతడి సోదరులను, కొడుకులను, పాంచాల వీరులను కూడా చంపి, చేది సైన్యాన్ని చంపి, ద్రౌపది కొడుకులను, శిఖండిని సహితం అశ్వత్థామ దారుణంగా చంపాడని ధర్మరాజు దగ్గరికి వచ్చి చెప్పాడు ధృష్టద్యుమ్నుడి రథసారథి. ఆ మాటలు విన్న ధర్మరాజు దుఃఖోద్రేకంతో మూర్ఛపోయాడు. ఆ సమయంలో ఆయన చుట్టూరా వున్న ఆయన సోదరులు, శ్రీకృష్ణ సాత్యకులు ధర్మరాజును అరచేతులతో పట్టుకున్నారు. కాసేపటికి మూర్ఛనుండి తేరుకున్న ధర్మరాజు తన కొడుకులను అశ్వత్థామ చంపడం పట్ల విలపించాడు.  

ఆ సమయంలో ద్రౌపది ద్రుపద విరాటులు చనిపోయిన మర్నాడు వారి భార్యలను ఓదార్చడానికని  సుభద్ర, ఉత్తర సమేతంగా విరాట నగరానికి వెళ్లి అక్కడే వున్నది. ద్రౌపదిని వెంటనే తోడ్కొని తెమ్మని నకులుడికి చెప్పాడు ధర్మరాజు. ఆ తరువాత తమ్ములు, కృష్ణ సాత్యకులు తోడూ రాగా ఏడ్చుకుంటూ తన శిబిరానికి పోయాడు. తన కుమారుల, మిత్రుల, ఇతరుల శవాలను చూసి మళ్లీ మూర్ఛిల్లాడు ధర్మరాజు. కొంతసేపటికి తెప్పరిల్లాడు. కృష్ణార్జునులు ఆయన్ను ఓదార్చారు. ఆ తరువాత అందరికీ దహన కార్యం చేసి ద్రౌపది కొరకు నిరీక్షిస్తూ కూచున్నాడు. నకులుడి వల్ల విషయం విన్న ద్రౌపది దుఃఖం ఆపుకోలేక అక్కడికి వచ్చి ధర్మరాజును చూసి ఏడుస్తూ నేలమీద పడిపోయింది. భీముడు ఆమెను లేవదీశాడు.

తన కుమారులు మంచి నిద్రలో వున్న సమయంలో పాపాత్ముడైన అశ్వత్థామ అధర్మ పద్ధతిలో కనికరం లేకుండా వారిని చంపాడని, అతడు చేసిన అధర్మ యుద్ధం తనను దహించి వేస్తున్నదని, ఆ నిర్దయుడిని ఎదిరించి పేరు లేకుండా చేయడం తప్ప తన దుఃఖం ఉపశమింప చేయడానికి మరో మార్గం లేదని ధర్మరాజుతో అన్నది ద్రౌపదీదేవి. వెంటనే భీముడిని నియోగించి ఆ విధంగా చేయకపోతే తాను ఆమరణ నిరాహార దీక్షతో తన శరీరం విడుస్తానని చెప్పింది. అశ్వత్థామ అడవుల పాలై వుంటాడని ధర్మరాజు సందేహం వెలిబుచ్చగా, ఆ దుష్టుడికి పుట్టుకతోనే వున్న ‘శిరోమణి ని తెచ్చి ఇస్తే చూసి తాను ప్రాణాలతో వుంటానని అన్నది ద్రౌపది. అలా అంటూనే భీముడి చేయి తాకి అశ్వత్థామను చంపి తన మనసులోని కోపాన్ని, శోకాన్ని మాన్చి తనను రక్షించమని కోరింది. అశ్వత్థామను ఎలాగైనా చంపమని ద్రౌపది అనగానే భీముడు తన రథాన్ని సిద్ధం చేయమని నకులుడికి చెప్పాడు.

ఆ తరువాత భీముడు నకులుడిని సారథిగా చేసుకొని తన ఆయుధాలు తీసుకొని రథం ఎక్కి, అశ్వత్థామ వెళ్ళిన మార్గంలో పోయాడు. కురుక్షేత్రంలో తిరుగుతున్న జనుల సమాచారం ఆధారంగా అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మలు వెళ్ళిన వ్యాసాశ్రమానికి బయల్దేరాడు. ఒక్క భీముడే అశ్వత్థామను ఎదుర్కోవడానికి పోవడం క్షేమం కాదని యుద్ధానికి అంతా కలిసి వెళ్ళడం మచిదని ధర్మారాజుకు చెప్పాడు శ్రీకృష్ణుడు. మరో విషయం ఈ సందర్భంగా ప్రస్తావించాడు కృష్ణుడు ధర్మరాజుతో. ‘బ్రహ్మశిరస్సు లేదా ‘బ్రహ్మశిరోనామకాస్త్రం అనే పేరుకల దివ్యాస్త్రాన్ని ద్రోణాచార్యుడు అశ్వత్థామకు, అర్జునుడికి ఇచ్చాడని, ఆ అస్త్రాన్ని మనుష్యుల మీద ప్రయోగించితే కీడు కలుగుతుందని, ఎన్ని ఆపదలు వచ్చినా అలా చేయవద్దని, అశ్వత్థామకు ప్రత్యేకంగా ద్రోణుడు చెప్పాడని అన్నాడు కృష్ణుడు. తన దగ్గరున్న ‘బ్రహ్మశిరోనామకాస్త్రం సహాయంతో అశ్వత్థామ భీముడిని బాధించే అవకాశం ఉన్నదన్నాడు ధర్మరాజుతో.

అలా చెప్పిన కృష్ణుడు సాత్యకిని, సహదేవుడిని శిబిరంలోనే వుండమని చెప్పి, ధర్మరాజు, అర్జున సమేతంగా అశ్వత్థామ మీదికి యుద్ధానికి బయల్దేరారు. రథానికి సారథ్యం కృష్ణుడు చేశాడు. వేగంగా రథాన్ని పరుగెత్తించడం వల్ల మధ్యలో భీముడి రథాన్ని కలుపుకొన్నారు. అయినా వారికంటే ముందుగా పోయిన భీముడు గంగానది ఒడ్డున శరీరం నిండా బూడిద పూసుకొని తపస్సు చేస్తున్న అశ్వత్థామను చూశాడు. ‘నీచ బ్రాహ్మణుడా! అని సంభోదిస్తూ, గత రాత్రి ఆయన చేసిన అధర్మపు పనిని పేర్కొంటూ, యుద్ధానికి రమ్మని సవాలు విసిరాడు భీముడు. అప్పుడు భీముడిని, వారి వెనుకే వస్తున్న అర్జునుడిని, ధర్మరాజును చూసి బాధపడే మనస్సుతో అశ్వత్థామ ‘బ్రహ్మశిరోనామకాస్త్రం తలచుకుంటూ ఒక రెల్లు గడ్డిపోచ పట్టుకొని దానిమీదకు ఆ అస్త్రాన్ని ఆవాహనం చేసి, ‘పాండవ నిర్మూలనం అవుతుంది కాక!’ అని ప్రయోగించాడు.

అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్రం నుండి పుట్టిన భయంకరమైన అగ్నిజ్వాలలు అన్నివైపులా విజృంభిస్తూ లోకాన్ని బూడిద చేయడాన్ని కృష్ణుడు గమనించాడు. ఆ అస్త్రాన్ని తిప్పికొట్టడానికి ఆర్జునుడిని కూడా ‘బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించి, దాన్ని నిరోధించి పాండవులను కాపాడుకొమ్మని సూచించాడు. వెంటనే అర్జునుడు ‘బ్రహ్మశిరోనామకాస్త్రం సంధించాడు. సంధించి మొదలు అశ్వత్థామకు హాని కలగకుండా వుండాలని ప్రార్థించి, తనకూ, సోదరులకూ శుభం కలగాలని అస్త్రదేవతకు నమస్కారం చేసి అన్నాడు. అది అశ్వత్థామ అస్త్రాన్ని తిప్పికొట్టడానికి ప్రయత్నించగా రెండు అస్త్రాల విజృంభణ వల్ల ప్రళయం చోటుచేసుకున్నది. అప్పుడు వ్యాసుడు, నారదుడు అక్కడికి వచ్చి అశ్వత్థామను, అర్జునుడిని శాంతింప చేయడానికి వారి మధ్య నిలిచారు. అస్త్రాలను ఉపసంహరించమని అన్నారు. తాను వారి కోరిక మేరకు అస్త్రాన్ని ఉపసంహరిస్తానని కాని దుర్మార్గుడైన అశ్వత్థామ అలా చేయకుండా తమను దహించి వేస్తాడని అన్నాడు అర్జునుడు. దానికి పరిష్కారం కనుక్కొమ్మన్నాడు.

అర్జునుడు తాను అన్న మాట ప్రకారం ఆ మహాస్త్రాన్ని అనాయాసంగా ఉపసంహరించాడు. అయితే ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించి తిరిగి మరల్చడానికి ఒక్క అర్జునుడికి తప్ప ఇతరులకు సాధ్యం కాదు. ఆ పని దేవతలు సైతం చేయలేరు. ‘బ్రహ్మశిరోనామకాస్త్రం స్మరించి ప్రయోగించిన తరువాత వారించడానికి శక్యం కాదు. ఒకవేళ వారిస్తే వారించిన వారికే శిరశ్చేదం చేస్తుంది. అశ్వత్థామ వారించడానికి ప్రయత్నం చేసి విఫలుడై వ్యాసుడితో అదెలాగైనా పాండవులను దహించి తీరుతుందని అన్నాడు. వ్యాసుడు అప్పుడు రాజీ మార్గాన్ని సూచించాడు అశ్వత్థామకు. అర్జునుడు అతడికి హాని తలపెట్టడని, అర్జునుడిని వధించడం అతడి శక్యం కాదని, ఆయన అస్త్రం కూడా అర్జునుడు వారించగలడని, ఏవిధంగానైనా అస్త్రాన్ని ఉపసంహరించాలని, అశ్వత్థామ తన శిరోమణిని అర్జునుడికి ఇవ్వమని, అలా చేస్తే పాండవులు అశ్వత్థామ ప్రాణాలు తీసినంతగా సంతోషిస్తారని వ్యాసుడు సలహా ఇచ్చాడు.

వ్యాసుడు సలహాకు స్పందించిన అశ్వత్థామ తన అస్త్రం పాండవేయుల గర్భాలకు హాని కలిగించి తృప్తి పడి ఉపశమిస్తుంది గాక! అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామతో పాండురాజు మనుషులందరినీ అతడు వధించాడని, పాపం కట్టుకున్నాడని, ఇప్పుడు మనుమల గర్భాలను చంపాలని అనుకుంటున్నాడని, అందులో ఒక్కదాన్నైనా ఆయన బారిన పడకుండా తొలగించాలని అన్నాడు. తాను ఒకడిని పాండవ వంశం నిలబెట్టేందుకు రక్షిస్తానని స్పష్టం చేశాడు. శ్రీకృష్ణుడు చెప్తున్నది ఉత్తర గర్భం గురించని, దాన్ని కూడా తాను తప్పకుండా నాశనం చేస్తానని అన్నాడు అశ్వత్థామ. అది నెరవేరదని అభిమన్యుడి కుమారుడికి తాను దీర్ఘాయువు ఇస్తానని అన్నాడు శ్రీకృష్ణుడు.

వ్యాస, శ్రీకృష్ణుల మాటలు లక్ష్యపెట్టక అశ్వత్థామ పాండవుల సంతానం తాలూకు గర్భాలన్నింటి మీద అస్త్రం విడిచి పెట్టడం చూశాడు శ్రీకృష్ణుడు. అప్పుడు కోపంతో అశ్వత్థామను ఉద్దేశించి శ్రీకృష్ణుడు, ఉత్తరకు పుట్టబోయే బాలుడు పాండవ వంశోద్ధారకుడు అవుతాడని, పిల్లలను చంపిన అశ్వత్థామ ఆహారం లేకుండా, నిస్సహాయుడుగా, కంపుకొట్టే రక్తంతో, శరీరం కాలిపోతుంటే మూడు వేల సంవత్సరాలు తిరుగుతాడని అన్నాడు. తన చేత రక్షించబడ్డ ఆ కుమారుడు కృపాచార్యుడి దగ్గర ధనుర్వేదం నేర్చుకొని అన్ని శస్త్రాస్త్రాలు పొంది అనేక వేల సంవత్సరాలు భూమిని పాలిస్తాడని చెప్పాడు. అతడికి జనమేజయ మహారాజు పుట్టి అశ్వత్థామ చూస్తుండగానే గొప్పగా వెలుగొందుతాడని తన తపస్సత్యాల మహిమ చూడమని అన్నాడు కృష్ణుడు. అప్పుడు వ్యాసుడు అశ్వత్థామను, తన మాటలు పాటించ కుండా పాపకృత్యం చేశాడని, అందుకే కృష్ణుడు చెప్పినట్లే కమ్మని అన్నాడు.

వ్యాసుడు మనుష్యులలోనే వుండిపొమ్మని ప్రతిశాపం ఇచ్చిన అశ్వత్థామ తన శిరోమణిని పాండవులకు ఇచ్చి తపోవనానికి వెళ్లాడు. పాండవులు, కృష్ణుడు వ్యాసుడికి నమస్కరించి సెలవు పుచ్చుకొని ద్రౌపది దగ్గరకు వచ్చారు. భీముడు శిరోమణిని ద్రౌపదికి ఇచ్చాడు. దుఃఖం మానమని చెప్పాడు. గురుపుత్రుడయినందున అశ్వత్థామ ప్రాణం తీయడానికి పూనుకోకుందా అర్జునుడు అవమానించి వదిలి పెట్టాడని, శిరోమణి పోగొట్టుకోవడం వల్ల అశ్వత్థామ కీర్తిశరీరం పతనం అయిందని అన్నాడు. శిరోమణిని ధరించడానికి ధర్మారాజే అర్హుడని దానిని ఆయనకిచ్చింది ద్రౌపది. ధర్మరాజు దాన్ని తన శిరస్సు మీద ధరించాడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, సౌప్తికపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)