జాగృత తెలంగాణలో జాతీయ చైతన్యం
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతిదినపత్రిక
(13-09-2022)
రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి తెలంగాణ
సమాజ పరిణామక్రమం ఈ సెప్టెంబర్ 17న 75వ సంవత్సరంలోకి ప్రవేశించనున్నది. ఈ
నేపథ్యంలో సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటిస్తూ, 16,
17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ
రాష్ట్ర వ్యాప్తంగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను,
సంవత్సరం తరువాత 2023 సెప్టెంబర్ 16, 17,
18 తేదీల్లో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం
నిర్ణయించింది. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు మందుముల నరసింగరావు జ్ఞాపకాల
సంపుటి ‘ఏభై సంవత్సరాల హైదరాబాద్’లోని ఆసక్తికరమైన విషయాలను గుర్తుచేసుకోవల్సిన
అవసరమున్నది.
ప్రథమ ప్రపంచ సంగ్రామం దరిమిలా నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్
ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ రాష్ట్ర పాలనలో బ్రిటీష్ ప్రభుత్వ జోక్యం మొదలైంది.
సమాంతరంగా ఆర్య సమాజం,
బ్రహ్మ సమాజం, థియోసాఫికల్ సొసైటీ, మౌల్వీ మహమ్మద్ ముర్తజా స్థాపించిన ‘హైదరాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్’,
వామన నాయక్ అధ్యక్షతన ఉన్న ‘హైదరాబాద్ యంగ్మెన్స్ అసోసియేషన్’,
వివేకవర్ధని హైస్కూల్, శ్రీకృష్ణదేవరాయల ఆంధ్ర
భాషా నిలయం, ఆంధ్ర సంవర్ధనీ గ్రంధాలయం, తెలంగాణ ప్రాంతంలో చైతన్యం కలిగించాయనాలి.
భారత జాతీయ కాంగ్రెస్ జిల్లా కార్యాలయం హైదరాబాద్‌లో
ఆరంభమయింది. దానికి వామన నాయక్, అంతు రామచందర్ రావు అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. మహాత్మాగాంధీ హైదరాబాద్ పర్యటన దరిమిలా
1921లో ‘ఖాదీ కేంద్రం, ‘ఆంధ్ర జనసంఘం’ స్థాపన జరగడంతో
హైదరాబాద్ సంస్థానంలో రాజకీయ ఉద్యమాలపై ప్రభుత్వ దమనకాండ, పౌర
హక్కులకు భంగం, పటిష్ఠంగా అమలు కావడం, పొరుగు
రాష్ట్ర పత్రికలను ప్రభుత్వం నిషేధించడం జరిగింది.
యూరప్ దేశాలలో ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్ తిరిగొచ్చిన
అతివాద భావాలు గల సమాజ వాదులు కొందరు నెలకొల్పిన ‘అంజుమన్ తరఖ్కీ’ అనే సంస్థలో
అలీయావర్ జంగ్,
బాఖర్ అలీ మీర్జా, పద్మజా నాయుడు, ఫజ్లుర్ రహమాన్, లతీఫ్ సయ్యద్, బూర్గుల రామకృష్ణ రావు, శ్రీ కిషన్, మీర్ అక్బర్ అలీ ఖాన్, మందుముల నరసింగరావు లాంటి
ప్రముఖులు సభ్యులయ్యారు. స్వామీ రామానంద తీర్థ మోమినాబాద్‌లో నెలకొల్పిన పాఠశాల,
స్వాతంత్ర్య సమరయోధులను తీర్చిదిద్దే కేంద్రంగా, పోరాట కార్యకలాపాల వేదికగా తయారైంది. మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం
దరిమిలా హైదరాబాద్‌లో పద్మజా నాయుడు అధ్యక్షతన ‘స్వదేశీ లీగ్’ స్థాపన జరిగింది.
వరుస ఆంధ్ర మహాసభల నేపథ్యంలో పౌరుల స్వాతంత్ర్యంపై ఆంక్షలు మరింత ఎక్కువయ్యాయి.
యువకుల్లో పెల్లుబుకిన అసంతృప్తి ముల్కీ ఉద్యమానికి దారి తీసింది. ఆంధ్ర మహాసభలు
రాజకీయ చైతన్యానికి బలమైన పునాదులు వేశాయి.
జూలై 1938లో ఏర్పాటైన ‘హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్’కు
స్వామీ రామానంద తీర్థ సారథ్యంలో ఒక కమిటీ ఏర్పాటవడంతో స్వామీజీ రాజకీయ రంగ ప్రవేశం
చేసి, తన కార్యకలాపాల వేదికను హైదరాబాద్‌కు మార్చారు. ప్రభుత్వంతో మంచిగా
వుంటూనే ఉద్యమాన్ని నడిపించాలన్న భావనతో, హైదరాబాద్ స్టేట్
కాంగ్రెస్‌కు జాతీయ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు లేవని బూర్గుల ప్రకటించినప్పటికీ,
దాన్ని ప్రభుత్వం నిషేధించింది.
రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశకు చేరుకునే సమయానికి స్టేట్
కాంగ్రెస్‌పైన నిషేధాజ్ఞలున్నా, ఉద్యమ ప్రభావాన్ని తగ్గించలేకపోయింది
ప్రభుత్వం. ప్రజలలో అలజడి తీవ్రమై, బాధ్యతాయుత ప్రభుత్వం
కొరకు ఒత్తిడి పెరిగింది. కమ్యూనిస్ట్ యోధుడు రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన హుజూర్‌నగర్‌లో
జరిగిన ఎనిమిదవ ఆంధ్ర మహాసభలో జాతీయవాదులు, కమ్యూనిస్టులు
అని రెండు గ్రూపులయ్యాయి. దేశవ్యాప్తంగా సాగుతున్న ‘క్విట్ ఇండియా’ ఉద్యమం
హైదరాబాద్ ప్రభుత్వంలో పరివర్తన తేలేదు. అదే సమయంలో అక్బర్ హైదరీ ప్రధానిగా పదవీ
విరమణ చేయడంతో ఆయన స్థానంలో చత్తారి నవాబు నియమితులయ్యారు.
ఆంధ్ర మహాసభ స్టేట్ కాంగ్రెస్‌లో విలీనం కావడం, కమ్యూనిస్ట్
ఉద్యమం తీవ్రతరం కావడం, ప్రజలలో అభిమానం పెరగడం, పెద్ద సంఖ్యలో ప్రజలు ఎర్ర జెండాలు పట్టుకుని తిరగడంతో పార్టీని
నిషేధించింది ప్రభుత్వం. చత్తారి నవాబు రాజీనామాతో తాత్కాలిక ప్రధానిగా అఖీల్ జంగ్
నియామకం జరిగింది. స్టేట్ కాంగ్రెస్‌పై నిషేధాన్ని ఎత్తివేశారు. సంస్థ
అధ్యక్షుడుగా రామానంద తీర్థ ఎన్నికయ్యారు. ప్రధానిగా నియమితుడైన సర్ మీర్జా
ఇస్మాయిల్ కేవలం పది నెలలు మాత్రమే పదవిలో వున్నారు. ఇంతలో ఖాసిం రజ్వీ ఇత్తె
హాదుల్ పార్టీ నాయకుడుగా, శాసనసభలో ఆ పార్టీ లీడర్‌గా
ఎన్నికయ్యారు. పింగిళి వెంకట రామారెడ్డి, అబ్దుల్ రహీంలు
మిర్జా ఇస్మాయిల్ మంత్రి మండలిలో చేరి, లాయఖ్ అలీ మంత్రి
మండలిలో కూడా కొనసాగి, హైదరాబాద్ రాజ్యాధికారం పతనం ఐన
తర్వాత పదవులను వదిలారు.
బ్రిటీష్ ప్రధాని అట్లీ సూచన ప్రకారం వైస్రాయ్ లార్డ్ మౌంట్
బేటన్ జూన్ 2,
1947న భారతదేశాన్ని విభజించైనా అధికారం అప్పచెప్పడం జరుగుతుందని
ఇండియన్ రేడియో ద్వారా ప్రకటించడం, నెహ్రూ దానికి అంగీకారం
తెలపడంతో, నిజాం నవాబు హైదరాబాద్ రాష్ట్రం ఇండియా, పాకిస్థాన్‌లలో దేనిలోనూ చేరదని, స్వతంత్ర రాజ్యంగా
వుంటుందని, జూన్ 11న ఒక ఫర్మానా ద్వారా తెలియచేశాడు. దానిని
ఖండిస్తూ, స్టేట్ కాంగ్రెస్ నాయకులు, ఆగస్ట్
7న జాతీయ జండా ఎగురవేసి, నిజాం స్వాతంత్ర్యాన్ని
తిరస్కరించారు. ఆగస్ట్ 15, 1947న దేశానికి స్వతంత్రం ఇచ్చి
బ్రిటీష్వారు వెళ్లిపోయిన తర్వాత, నిజాం స్వతంత్ర రాజుగా
ఆగస్ట్ 27న ప్రకటించుకున్నారు. రజాకార్ల దౌర్జన్యం ఉధృత రూపం దాల్చింది.
జూన్ 1948లో మౌంట్ బేటన్ స్థానంలో రాజగోపాలాచారి గవర్నర్
జనరల్ అయ్యారు. నిజాం తన కేసును ఐక్యరాజ్య సమితి దృష్టికి కూడా తీసుకెళ్లాడు.
పరిస్థితులు చేజారిపోతుండడంతో, పోలీసు చర్య ఆరంభమై, సెప్టెంబర్
13, 1948న హైదరాబాద్ రాష్ట్రంలోకి ప్రవేశించిన భారత
సైన్యాలకు నిజాం నుంచి నామమాత్రపు ప్రతిఘటన ఎదురైంది. సెప్టెంబర్ 17న మేజర్ జనరల్
జేఎన్ చౌదరీ నాయకత్వంలోని సేనలు హైదరాబాద్‌కు చేరుకోగానే, నిజాం
లొంగిపోయి శరణు కోరాడు. ఖాసిం రజ్వీ, లాయక్ అలీలను
నిర్బంధంలోకి తీసుకున్నారు. చౌదరీ మిలిటరీ గవర్నర్‌గా, సెప్టెంబర్
18, 1948న ప్రభుత్వం ఏర్పడింది.
రెండేళ్ల తర్వాత వెల్లోడి ముఖ్యమంత్రిగా సివిల్ పాలన
మొదలైంది. 1952లో ఎన్నికల అనంతరం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. బూర్గుల
రామకృష్ణారావు ముఖ్య మంత్రిగా 1956 అక్టోబర్ వరకు కొనసాగారు. భాషా ప్రయుక్త
రాష్ట్రాల ఏర్పాటు క్రమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు, వారు
కోరుకున్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాలేదు. హైదరాబాద్ రాష్ట్రం కూడా మూడు
ముక్కలైంది. కొన్ని ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రలకు పోగా
1956 నవంబరు 1న, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగుభాష మాట్లాడే
తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రాంతాన్ని కలిపి
విశాలమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
నాటినుండి ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు జరగడం చివరకు
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు కావడం, 14
సంవత్సరాల శాంతియుత ఉద్యమం తర్వాత జూన్ 2, 2014లో తెలంగాణ
రాష్ట్రం ఏర్పాటు కావడం, తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ
బాధ్యతలు చేపట్టి గత ఎనిమిది సంవత్సరాలుగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు
చేయడం జరుగుతున్న చరిత్ర.
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనా లేక విలీనమా అని వాదనలు
చేస్తున్న వారెవరూ ఆ రోజుకున్న ప్రాధాన్యతను, దాని నేపథ్యాన్ని
ప్రస్తావించడం లేదు. నిజాం పాలన నుండి వేరు చేసి, రాచరిక
వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలో వచ్చి, స్వతంత్ర భారతావనిలో
యావద్భారత ప్రజల ఆనందోత్సాహాల మధ్య, హైదరాబాద్ రాజసంస్థానం
సెప్టెంబర్ 17, 1948న భారతదేశంలో విలీనమయింది. జాతీయ
సమైక్యతలో అంతర్భాగం అయింది. బహుశా ఈ నేపథ్యంలోనే ‘తెలంగాణ జాతీయ సమైక్యతా
వజ్రోత్సవాల’ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల
చంద్రశేఖర్ రావు నిర్ణయించి వుంటారు.
(స్వర్గీయ మందుముల నరసింగరావు ‘ఏబై సంవత్సరాల
హైదరాబాద్’ పుస్తకం ఆధారంగా)
(సెప్టెంబర్ 16, 17,
18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వారోత్సవాలు)
No comments:
Post a Comment