Saturday, September 10, 2022

ధృష్టద్యుమ్యుడిని, ఉపపాండవులను, శిఖండిని, ద్రుపద పుత్రులను అర్థరాత్రి చంపిన అశ్వత్థామ, ప్రాణాలు విడిచిన దుర్యోధనుడు .... ఆస్వాదన-88 : వనం జ్వాలా నరసింహారావు

 ధృష్టద్యుమ్యుడిని, ఉపపాండవులను, శిఖండిని, ద్రుపద పుత్రులను

అర్థరాత్రి చంపిన అశ్వత్థామ, ప్రాణాలు విడిచిన దుర్యోధనుడు

ఆస్వాదన-88

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (11-09-2022)

దుర్యోధనుడు అశ్వత్థామకు సర్వసేనాధిపత్యాభిషేకం చేయించిన తరువాత అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మలు శత్రు సంహారోత్సాహంతో పాండవ శిబిరం వైపు వెళ్లారు. వారు వెళ్ళిన సమయంలో అక్కడ శిబిరంలో వున్న వారంతా విజయోత్సాహంతో పొంగిపోతూ కేరింతలు వేస్తుంటే, ఆ ముగ్గురు వీరులు వారి సమీపానికి వెళ్లడానికి భయపడ్డారు. వెంటనే ఆ ముగ్గురూ అక్కడి నుండి మరలిపోయి అడవిలో ప్రవేశించి, ఒక మడుగును చూశారు. అప్పటికే సూర్యాస్తమయం కావడంతో ఆ ముగ్గురు సంధ్యావందనాది కార్యక్రమాలను నిర్వర్తించారు. తరువాత ఒక మర్రిచెట్టు దగ్గర కూచున్నారు. రాత్రి కూడా అయి చీకటి పడింది. కాసేపటికి కృపాచార్యుడు, కృతవర్మ నిద్రపోయారు కాని అశ్వత్థామకు మాత్రం నిద్ర పట్టనందున మర్రిచెట్టును చూస్తూ కూచున్నాడు.

మర్రిచెట్టు మీద నిద్రుస్తున్న కాకుల కొరకు ఒక గుడ్లగూబ వచ్చి, కాకులన్నిటినీ చంపింది భయంకరంగా. గుడ్లగూబ కాకులను చంపిన విధానం చూడగానే,  అశ్వత్థామ తాను కూడా ఆ రీతిగా చేయడానికి మనస్సులో నిశ్చయించుకున్నాడు. గుడ్లగూబ తనకు కర్తవ్యాన్ని ఉపదేశించిందని భావించి, శత్రువులను నిద్రబోతున్నప్పుడు చంపాలని అనుకున్నాడు. దుర్యోధనుడు బతికి వుండగానే పాండవులను చంపాలనుకున్నాడు. ధర్మయుద్ధంలో ఆ మహావీరులను చంపడం కష్టమని, గుడ్లగూబ చేసినట్లే చేయాలని, శత్రువులను చంపేటప్పుడు అధర్మం అనకుండా దొరికిన ఉపాయాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. అది శాస్త్ర సమ్మతమేనని నమ్మాడు. వెంటనే తన మేనమామ కృపాచార్యుడిని, కృతవర్మను నిద్రలేపి మహాభారత యుద్ధంలో చోటుచేసుకున్న అధర్మాలను చెప్పి, తానూ అధర్మ మార్గంలో పోదల్చుకున్నానని, తన మనసులోని ఆలోచన తెలియచేశాడు.

తన తండ్రిని చంపిన దుర్మార్గుడు ధృష్టద్యుమ్నుడు మొదలైన శత్రువులను ఆ వేళ సంహరిస్తానని, దానికొక ఉపాయం ఆలోచించానని, శత్రువులు అజాగ్రత్తగా ఏమరుపాటుతో నిద్రపోతున్న సమయంలో వారిని చంపడం సరైనదని, ఇప్పుడే పోయి పరాకుగా వున్న వారిని  తాకుతానని, అనేకులను ఖండిస్తానని, చంపుతానని, పీనుగుల పెంట చేస్తానని అశ్వత్థామ ఆ ఇద్దరికీ చెప్పాడు. బాగా ఆలోచిస్తే అంతకంటే మంచి ఉపాయం కనిపించడం లేదని అన్నాడు. అయితే శత్రువులను చంపడం తమకు అంగీకారమైనప్పటికీ, ఆ పనిని తెల్లవారిన తరువాత చేద్దామని, అప్పుడు శత్రు సమూహాన్ని అనాయాసంగా గెల్వ వచ్చని వారన్నారు. ప్రస్తుతానికి నిద్రపొమ్మని సలహా ఇచ్చారు.

శత్రువుల మీద కసి ఎలా తీర్చుకోవాలా అన్న ఆలోచనలో వున్న తనకు నిద్ర రావడం లేదని అన్నాడు అశ్వత్థామ. అదే కాకుండా శ్రీకృష్ణుడి, అర్జునుడి రక్షణలో వున్న పాండవ సైన్యాన్ని, వీరులను పగటి వేళ చంపడం కష్టమని, ఎలాగైనా శత్రువుల విజృంభణ అణచడం మగతనమని, తాను రాత్రివేళ పూనుకుంటే శ్రమ లేకుండా గెలుస్తానని చెప్పాడు అశ్వత్థామ. నిద్రించిన వాడిని, నిరాయుధుడైన వాడిని వధించడం ధర్మం కాదన్నాడు కృపాచార్యుడు. దానికి జవాబుగా పాండవుల చేతిలో ద్రోణాచార్యుడి, భీష్ముడి, కర్ణుడి అధర్మ మరణం గురించి చెప్పాడు అశ్వత్థామ. దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టడం అధర్మం కాదా? అని ప్రశ్నించాడు. వేరే ఆలోచనలు మాని తనతో రమ్మని అశ్వత్థామ కృపాచార్య, కృతవర్మలకు చెప్పి వారితో కలిసి రథం ఎక్కాడు. ఆ ముగ్గురూ అలా కలిసి పాండవుల శిబిర ద్వారం దగ్గరికి వచ్చి, అశ్వత్థామ లోపలి పోవాలని ప్రయత్నం చేశాడు.

సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద భూతం అశ్వత్థామ ఎదురుగా భయంకరంగా నిలబడ్డది. ఆ భూతం శరీరం నుండి అనేకానేకమైన వస్తువులు వెలువడ్డాయి. అయినా ఏమాత్రం భయపడకుండా అశ్వత్థామ దానిమీద బాణాలు వేశాడు కాని, అది వాటన్నిటినీ మింగింది. అశ్వత్థామ ప్రయోగించిన శక్త్యాయుధాన్ని, ఆ తరువాత  విసిరిన ఖడ్గాన్ని, గదనూ కూడా అది ముక్కలు చేసింది. అశ్వత్థామ ఆయుధాలన్నీ వ్యర్తమైపోయాయి. అతడికి ఆకాశంలో అనేకమంది విష్ణువులు కనబడ్డారు. అప్పుడు అశ్వత్థామ హృదయంలో ఈశ్వరుడిని స్థాపించుకొని ఆత్మబలిదానం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. తన పూజతో పరమేశ్వరుడిని తృప్తి పరుస్తానని అనుకున్నాడు. అప్పుడు అశ్వత్థామ ఎదురుగా ప్రకాశవంతమైన ఒక బంగారు అరుగు కనబడింది. దానిమీద తీక్షణ జ్వాలలతో అగ్ని వెలిగింది. అప్పుడు లెక్కలేనంతమంది ప్రమథులు కనిపించారు. అశ్వత్థామ ఆ అగ్నిలో దూకడానికి సమీపించాడు.

అగ్నిలో ఉరికిన అశ్వత్థామకు శివుడు సాక్షాత్కరించాడు. అతడికి వరం ఇవ్వడానికి వచ్చానన్నాడు. శ్రీకృష్ణుడు తనను అచంచలమైన భక్తితో పూజిస్తాడని, తనకు కూడా ఆయనంటే ఇష్టమని, ఆయనకు గౌరవం కలిగిద్దామని భూతాకారం దాల్చి వచ్చానని, అశ్వత్థామను పాంచాలుర మీదకు దండెత్తకుండా అడ్డగించానని, అయితే పాంచాలురకు పోగాలం దాపురించిందని, ఆ వేళ చస్తారని, అశ్వత్థామ తన అనుగ్రహం పొందాడని అంటూ, ఒక గొప్ప ఖడ్గాన్ని అశ్వత్థామకు ఇచ్చాడు. అతడికి తెలియకుండా తేజోరూపంలో అతడి శరీరంలో ప్రవేశించాడు. అలా రుద్రుడు ఆవేశించిన అశ్వత్థామ సంతోషంగా రథం ఎక్కి పాండవుల శిబిరానికి నడుస్తుంటే అతడి వెంట కృపాచార్యుడు, కృతవర్మ నడిచారు.

ఆ ఇద్దరినీ బయట వాకిట్లోనే నిలిపి, మొదట ధృష్టద్యుమ్నుడు వున్న శిబిరానికి వెళ్లాడు. కాపలాదారులు అలసిపోయి ఒళ్లు తెలియని స్థితిలో నిద్రపోతున్నారు. నిద్రపోతున్న ధృష్టద్యుమ్నుడిని కాలితో తన్ని లేపాడు. తటాలున నిద్రలేచిన ధృష్టద్యుమ్నుడి తల పట్టుకుని వెనుకకు మెలిపెట్టి, నేలమీద పడే విధంగా లాగి, అతడి వక్షస్థలాన్ని తన మోకాలితో పొడిచి, పిడికిలితో బాధించాడు. ఒక్క చిటికెలో అతడిని స్పృహ తప్పేట్లు చేశాడు. అల్లెతాడును అతడి కంఠానికి బిగించి, ఉరితాడులాగా చేసి, పశువును చంపే విధంగా చంపబోతుంటే తనను శస్త్రంతో కొట్టి చంపమని (ఉత్తమ గతి కొరకు) కోరాడు ధృష్టద్యుమ్నుడు. తన తండ్రిని చంపిన రీతిలోనే అతడిని కూడా దుర్మార్గంగా చంపుతానని అంటూ చితక్కొట్టి చంపాడు. ఆ తరువాత బయటకు వచ్చి రథం ఎక్కాడు.

ఆ వేళే శిబిరం మొత్తం తుడిచి పెట్టాలని, ఆ ప్రయత్నంలో వెళ్తుంటే అడ్డుకున్న కొందరు రాజులను, వాళ్ల భట సమూహాన్ని చంపాడు. వెంటనే ద్రుపడి కొడుకు ఉత్తమౌజుడి గుడారంలో ప్రవేశించాడు. అతడిని కూడా ధృష్టద్యుమ్నుడి లాగానే చంపాడు. అది తెలిసి వచ్చిన అతడి తమ్ముడు యుధామన్యుడిని కూడా అలాగే చంపాడు. ఆ తరువాత అశ్వత్థామ విజృంభించి గుర్రాలను, ఏనుగులను, పాంచాల వీరుల సైన్యాన్ని సంహరించాడు. ఇదంతా తెలుసుకున్న శిఖండి, ఉప పాండవులు వ్యూహంగా ఏర్పడి అశ్వత్థామను తాకారు. శత్రుసేనల అస్త్రాలను తన అస్త్రాలతో ఖండించిన అశ్వత్థామ ప్రతివింధ్యుడిని చంపాడు. తరువాత భీముడి కొడుకు శ్రుతసోముడిని సంహరించాడు. నకులుడి పుత్రుడైన శతానీకుడు, సహదేవుడి కొడుకైన శ్రుతసేనుడు, అర్జునుడి కొడుకైన శ్రుతకీర్తి కూడా అశ్వత్థామ చేతిలో హతమయ్యారు. ఆ విధంగా ద్రౌపది కొడుకులు ఐదుగురు చావగా శిఖండి ఎదుర్కొన్నాడు. అతడిని కూడా చంపాడు అశ్వత్థామ.

అలా విజృంభించిన అశ్వత్థామకు పాండవులు, శ్రీకృష్ణుడు అక్కడ శిబిరంలో కనిపించలేదు. ఆ తరువాత ఎదురు తిరిగిన వారందరినీ చంపాడు. సింహనాదం చేశాడు. ఉత్సాహంతో అతిశయించాడు. పాండవ శిబిరంలోని వాళ్లను యావన్మందినీ చంపి, శాంతించి, అశ్వత్థామ ఆ శిబిరంలో నుండి వస్తుంటే తెల్లవారింది. అలా తన శపథం నెరవేర్చి కృపాచార్య, కృతవర్మల దగ్గరికి వచ్చాడు. కనిపించని శ్రీకృష్ణుడు, సాత్యకి, పాండవులు తప్ప అందరినీ చంపానని చెప్పాడు. వారిద్దరూ అశ్వత్థామను కౌగలించుకుని పొగిడారు.

ఆ ముగ్గురూ అక్కడినుండి బయల్దేరి వేగంగా దుర్యోధనుడి దగ్గరకు వెళ్లారు. ప్రాణం పోవడానికి సిద్ధపడి చేష్టలుడిగిన దుర్యోధనుడిని, మెల్లగా కళ్లు తెరవగా చూశారు. తమ చేతులను అతడి శరీరం మీద వుంచి, కౌగలించుకుంటూ తాము చేసిన పాంచాలుల సంహారాన్ని గురించి చెప్పారు. దుర్యోధనుడు ధర్మం తప్పకుండా యుద్ధం చేసి వీరస్వర్గం అలంకరించబోతున్నాడని అన్నారు. దొరికిన శత్రువులను చంపి ఆయన మనస్సుకు ఆనందం కలిగించే అదృష్టం తమకు దక్కిందని అన్నారు. అశ్వత్థామ తాను ధృష్టద్యుమ్నాది యోధులను ఎవరెవరిని, ఎలా చంపింది వివరించాడు. కర్ణుడు, శల్యుడు లాంటి గొప్ప పరాక్రమవంతులు తనకు కలిగించని ప్రీతిని అశ్వత్థామ కలిగించాడని పొగిడాడు దుర్యోధనుడు.

కృపాచార్యుడిని, కృతవర్మను, అశ్వత్థామను సుఖంగా వుండమని, మళ్లీ స్వర్గంలో కలుసుకుందామని, దుఃఖించ వద్దని అంటూ దుర్యోధనుడు ప్రాణాలు విడిచాడు. ముగ్గురూ రాజును కౌగలించుకొని అతడికి ప్రదక్షిణం చేసి, రథాలెక్కి వెళ్లిపోయారు.          

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, సౌప్తికపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment