Monday, September 5, 2022

అశ్వత్థామను సర్వసైన్యాధ్యక్షుడిగా అభిషేకించిన దుర్యోధనుడు ..... ఆస్వాదన-87 : వనం జ్వాలా నరసింహారావు

అశ్వత్థామను సర్వసైన్యాధ్యక్షుడిగా అభిషేకించిన దుర్యోధనుడు

 ఆస్వాదన-87

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (04-09-2022)

భీమసేనుడితో జరిగిన గదా యుద్ధంలో తొడలు విరిగి నేలమీద పడిన దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని ఆక్షేపించి, ఆయన్ను మోసగాడని, పాపాత్ముడని నిందించాడు. ఆయన చేసిన సైగ ఆధారంగా, గదా యుద్ధ ధర్మాన్ని తప్పి, పాపాత్ముడైన భీముడు తనను తొడమీద కొట్టాడు కాని, న్యాయమైన పోరాటంలో పాండవులందరినీ మట్టి కరిపించకుండా వుండేవాడినా? అని ప్రశ్నించాడు. భీష్ముడిని పడగొట్టడానికి శిఖండిని వాడుకున్నాడని, ద్రోణాచార్యుడి చావుకోరకు ధర్మరాజుతో అబద్ధం ఆడించాడని, రథం భూమిలో కూరుకు పోయినప్పుడు కర్ణుడిని చంపించాడని ఆక్షేపించాడు. భూరిశ్రవుడిని, సైంధవుడిని మరెంతమందినో న్యాయం తప్పని యుద్ధంలో ఓడించడం సాధ్యమయ్యే పనేనా అని నిలదీశాడు. వాటన్నిటికీ జవాబుగా, దుర్యోధనుడు ఆదినుండి చేసిన మోసపు పనులను వరుసబెట్టి పేర్కొన్నాడు శ్రీకృష్ణుడు. కాగా, తాను చేసిన పనులన్నీ న్యాయ బద్ధమైనవే అని స్పష్టం చేశాడు. వ్యర్థ వాదాలు మానుకొమ్మని దుర్యోధనుడికి హితవు పలికాడు.

తాను వేదాలన్నీ చదివానని, యజ్ఞాలు విధిప్రకారం చేశానని, సంపదకు ఆలవాలమైన నడవడితో బతికానని, రాజులెందరో సేవించగా చూశానని, దురహంకార గర్వంతో వున్న రాజులను యుద్ధంలో జయించానని, చివరకు స్నేహితులతోను, బంధువులతోను కలిసి స్వర్గానికి వెళ్తున్నానని, శ్రీకృష్ణుడి దృష్టిలో తాను ఎలాంటి వాడినైనా కావచ్చునని, ఏదేమైనా శ్రీకృష్ణుడి పక్షం వారంతా పశ్చాత్తాప దుఃఖంతో వుంటారు గాక! అని అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు దుర్యోధనుడి మీద పూలవాన కురిసింది. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, దుర్యోధనాదులను చంపిన తీరు ఆసాంతం మననం చేసుకున్న పాండవులు సిగ్గుతో తలవంచుకుని చిన్నబోగా, శ్రీకృష్ణుడు సంతోష సమయంలో దుఃఖం ఎందుకని వారించాడు. ఆ తరువాత కుంతీ కుమారులు కౌరవుల గుడారాలకు వెళ్లగా, సాత్యకి వారిని అనుసరించాడు. ధృష్టద్యుమ్నుడు మొదలైన వారంతా వారి విడిదులకు పోయారు.

పాండవులు కౌరవుల గుడారాలకు వెళ్లి రథం దిగే సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని చూసి, గాండీవాన్ని, ధనుస్సును, అమ్ముల పొదుల జంటను ఆవల పెట్టి తక్షణమే రథం దిగమన్నాడు. తాను తరువాత దిగుతానని, అది క్షేమకరం అని అన్నాడు. అర్జునుడు, కృష్ణుడు దిగగానే ఆ రథం కాలిపోయింది. వాస్తవానికి ఆ రథం ఏనాడో ద్రోణుడి, కర్ణుడి బాణాగ్నులకు మండిపోయిందని, అది పూర్తిగా కాలిపోకుండా తానేఇన్ని రోజులు దాన్ని రక్షించానని, యుద్ధం ముగిసింది కాబట్టి దాన్ని కాల్చడానికి వదిలిపెట్టానని శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జునుడికి.

శ్రీకృష్ణుడు ఆ తరువాత చాలాసేపు పాండవులతో తీయటి మాటలు చెప్పి ఆనందించాడు. సైనిక శిబిరం పాడైంది కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి వేరే మరేదైనా నిర్మలమైన ప్రదేశానికి పోదామన్నాడు. అంతా కలిసి ఓఘవతి అనే పేరున్న పుణ్య నదీతీరానికి చేరారు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూస్తూ, ఆయన్ను హస్తినాపురానికి పొమ్మన్నాడు. దుర్యోధనుడిని యుద్ధరంగంలో అర్జునుడి సైగతో భీముడు అధర్మంగా పడగొట్టాడని గాంధారి వింటే తమను శపిస్తుందని భయపడ్డ ధర్మరాజు ఆమెను శాంతింప చేయడానికి శ్రీకృష్ణుడిని ఆమె దగ్గరికి పొమ్మని కోరాడు. ధర్మరాజు కోరినట్లే శ్రీకృష్ణుడు ధృతరాష్ట్ర మందిరానికి వెళ్లి, ఆయనకు, గాంధారికి, అక్కడే వున్న వ్యాస మహర్షికి నమస్కారం చేసి కూచున్నాడు. వారిద్దరినీ ఓదార్చాడు. గతించిన సంగతులను, మాయా జూదాన్ని, నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానాన్ని, విరాటరాజు కొలువులో పాండవులు పడ్డ బాధలను, తన రాయబారం విఫలం కావడాన్ని జ్ఞప్తికి తెచ్చి, విధి నిర్ణయాన్ని మానవులు ఆపగలరా? అని అన్నాడు. పాండవుల మీద కోపం లేకుండా వుండమని, వారి మేలు కోరమని చెప్పాడు.

దుర్యోధనుడికి కీడు కలుగుతుందని గాంధారి చెప్పిందని, ఆ మాట సిద్ధించిందని, పాండవులు ఏ తప్పూ చేయలేదని ఆమెకు కూడా తెలుసని, వారిమీద కోపం తెచ్చుకోవద్దని వేడుకున్నాడు. అంతా శ్రీకృష్ణుడు చెప్పిన విధంగానే జరిగిందని, ఆయన మాటల వల్ల తన దుఃఖం తొలగిందని అనగానే శ్రీకృష్ణుడు నానారకాల ఉపశమన వాక్యాలతో గాంధారిని ఓదార్చాడు. అలా చెప్పిన శ్రీకృష్ణుడికి అశ్వత్థామ సమరోత్సాహం కన్నులకు మనఃఫలకం మీద గోచరించింది. వెంటనే లేచి ధృతరాష్ట్ర, గాంధారిలకు నమస్కారం చేసి, అక్కడి నుండి వెళ్లిపోయాడు. అక్కడి నుండి శ్రీకృష్ణుడు పాండవులున్న ఓఘవతీ నదీ తీరానికి వెళ్లి హస్తినాపురంలో జరిగిన సంగతులు చెప్పాడు.

ఇదిలా వుండగా, పాండవులు ద్వైపాయన మడుగు దగ్గరికి రావడం, భీమ దుర్యోధన గదా యుద్ధం జరగడం, దుర్యోధనుడు తొడలు విరిగి నేలకూలడం, భీముడు దుర్యోధనుడి తల తన్నడం మొదలైనవన్నీ దూరం నుండి చూస్తున్న సంజయుడు పాండవులు వెళ్ళగానే దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. తన దురవస్థ గురించి సంజయుడికి చెప్పి బాధపడ్డాడు దుర్యోధనుడు. భీముడు అధర్మంగా చేసిన గదాయుద్ధం గురించి, తన తలను తన్నడం గురించి అందరికీ చెప్పమన్నాడు. పాపాత్ములైన పాండవులు యుద్ధ ధర్మాన్ని అతిక్రమించి విజయం పొందిన పద్ధతిని అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మలకు తన మాటలుగా స్పష్టంగా తెలియచేయమన్నాడు. ఆ సమయంలో అక్కడకు దగ్గరగా వుండే జనపదాలలోని కొందరు అటు దిక్కుగా వచ్చి దుర్యోధనుడి మాటలు విని, సమీపంలోనే వున్న అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మలకు ఆవిషయం తెలియచేశారు. వారంతా అక్కడికి వచ్చారు. దుర్యోధనుడి చుట్టూ కూర్చున్నారు.

విధి మోసంగా తాకి, మహోన్నతంగా గద్దెను అలంకరించాల్సిన దుర్యోధనుడిని భూమ్మీద పడేట్లుగా చేసిందని, ఆయన భుజబలం ఏమైందని, ఆయన వెంట వుండే వీరులెవరూ లేకుండా పోయారని బాధపడ్డాడు అశ్వత్థామ. ధర్మబద్ధంగా శత్రువులు యుద్ధం చేయలేక తనను ఆ విధంగా బాధించగా తాను పుణ్యగతిని పొందడం అదృష్టం అన్నాడు దుర్యోధనుడు. తాను చనిపోకుండా వారి ముగ్గురినీ చూడగలగడం కూడా తన అదృష్టమేనని చెప్పాడు. అక్కడే వున్న సంజయుడు పాండవులు వచ్చినప్పటినుండి గదాయుద్ధం తరువాత వెళ్లిపోవడం వరకు జరిగిన విషయాన్ని వారికి తెలియచేశాడు.

సంజయుడి మాటలు విన్న అశ్వత్థామకు విపరీతమైన కోపం వచ్చింది. పాండవులు దుర్మార్గంగా తన తండ్రిని చంపినప్పుడు కూడా తన మనసు ఇంత కలత చెందలేదని, తాను తక్షణమే పాండవులలో ఒక్కరు కూడా మిగలకుండా అందరినీ తన బాణాగ్నితో పూర్తిగా దహించివేస్తానని, అందరినీ ఇప్పుడే హతమారుస్తానని తీక్షణమైన మాటలతో అన్నాడు అశ్వత్థామ. తాను ఆ విధంగా చేయడానికి తనను ఆజ్ఞాపించమని రాజును కోరాడు. దుర్యోధనుడు సంతోషించి, కృపాచార్యుడితో ఇక చెంబు నిండా నీరు తెప్పించి, సమీపంలోని మునికుమారులను ప్రార్థించి ఒక కలశాన్ని తెప్పించాడు. వెంటనే అశ్వత్థామను కౌరవ సర్వ సేనానాయకుడిగా అభిషేకించమని కృపాచార్యుడిని కోరాడు. దుర్యోధనుడి ఆజ్ఞానుసారం కృపాచార్యుడు అశ్వత్థామను కౌరవ సేనకు సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించాడు. అశ్వత్థామ రాజును గౌరవంగా కౌగలించుకున్నాడు. 

ఆ తరువాత అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మలు పాండవ శిబిరం వైపు వెళ్లారు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శల్యపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

                       

No comments:

Post a Comment