Sunday, September 18, 2022

శిరోమణిని పాండవులకిచ్చిన అశ్వత్థామ, ఉత్తర గర్భాన్ని రక్షిస్తానన్న శ్రీకృష్ణుడు .... ఆస్వాదన-89 : వనం జ్వాలా నరసింహారావు

 శిరోమణిని పాండవులకిచ్చిన అశ్వత్థామ, ఉత్తర గర్భాన్ని రక్షిస్తానన్న శ్రీకృష్ణుడు

ఆస్వాదన-89

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (18-09-2022)

అర్థరాత్రి పాండవ శిబిరంలోకి కృపాచార్యుడు, కృతవర్మలతో కలిసి వచ్చి, అంతా ఒళ్లు మరిచి నిద్రపోతుంటే, ధృష్టద్యుమ్నుడిని వధించి, అతడి సోదరులను, కొడుకులను, పాంచాల వీరులను కూడా చంపి, చేది సైన్యాన్ని చంపి, ద్రౌపది కొడుకులను, శిఖండిని సహితం అశ్వత్థామ దారుణంగా చంపాడని ధర్మరాజు దగ్గరికి వచ్చి చెప్పాడు ధృష్టద్యుమ్నుడి రథసారథి. ఆ మాటలు విన్న ధర్మరాజు దుఃఖోద్రేకంతో మూర్ఛపోయాడు. ఆ సమయంలో ఆయన చుట్టూరా వున్న ఆయన సోదరులు, శ్రీకృష్ణ సాత్యకులు ధర్మరాజును అరచేతులతో పట్టుకున్నారు. కాసేపటికి మూర్ఛనుండి తేరుకున్న ధర్మరాజు తన కొడుకులను అశ్వత్థామ చంపడం పట్ల విలపించాడు.  

ఆ సమయంలో ద్రౌపది ద్రుపద విరాటులు చనిపోయిన మర్నాడు వారి భార్యలను ఓదార్చడానికని  సుభద్ర, ఉత్తర సమేతంగా విరాట నగరానికి వెళ్లి అక్కడే వున్నది. ద్రౌపదిని వెంటనే తోడ్కొని తెమ్మని నకులుడికి చెప్పాడు ధర్మరాజు. ఆ తరువాత తమ్ములు, కృష్ణ సాత్యకులు తోడూ రాగా ఏడ్చుకుంటూ తన శిబిరానికి పోయాడు. తన కుమారుల, మిత్రుల, ఇతరుల శవాలను చూసి మళ్లీ మూర్ఛిల్లాడు ధర్మరాజు. కొంతసేపటికి తెప్పరిల్లాడు. కృష్ణార్జునులు ఆయన్ను ఓదార్చారు. ఆ తరువాత అందరికీ దహన కార్యం చేసి ద్రౌపది కొరకు నిరీక్షిస్తూ కూచున్నాడు. నకులుడి వల్ల విషయం విన్న ద్రౌపది దుఃఖం ఆపుకోలేక అక్కడికి వచ్చి ధర్మరాజును చూసి ఏడుస్తూ నేలమీద పడిపోయింది. భీముడు ఆమెను లేవదీశాడు.

తన కుమారులు మంచి నిద్రలో వున్న సమయంలో పాపాత్ముడైన అశ్వత్థామ అధర్మ పద్ధతిలో కనికరం లేకుండా వారిని చంపాడని, అతడు చేసిన అధర్మ యుద్ధం తనను దహించి వేస్తున్నదని, ఆ నిర్దయుడిని ఎదిరించి పేరు లేకుండా చేయడం తప్ప తన దుఃఖం ఉపశమింప చేయడానికి మరో మార్గం లేదని ధర్మరాజుతో అన్నది ద్రౌపదీదేవి. వెంటనే భీముడిని నియోగించి ఆ విధంగా చేయకపోతే తాను ఆమరణ నిరాహార దీక్షతో తన శరీరం విడుస్తానని చెప్పింది. అశ్వత్థామ అడవుల పాలై వుంటాడని ధర్మరాజు సందేహం వెలిబుచ్చగా, ఆ దుష్టుడికి పుట్టుకతోనే వున్న ‘శిరోమణి ని తెచ్చి ఇస్తే చూసి తాను ప్రాణాలతో వుంటానని అన్నది ద్రౌపది. అలా అంటూనే భీముడి చేయి తాకి అశ్వత్థామను చంపి తన మనసులోని కోపాన్ని, శోకాన్ని మాన్చి తనను రక్షించమని కోరింది. అశ్వత్థామను ఎలాగైనా చంపమని ద్రౌపది అనగానే భీముడు తన రథాన్ని సిద్ధం చేయమని నకులుడికి చెప్పాడు.

ఆ తరువాత భీముడు నకులుడిని సారథిగా చేసుకొని తన ఆయుధాలు తీసుకొని రథం ఎక్కి, అశ్వత్థామ వెళ్ళిన మార్గంలో పోయాడు. కురుక్షేత్రంలో తిరుగుతున్న జనుల సమాచారం ఆధారంగా అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మలు వెళ్ళిన వ్యాసాశ్రమానికి బయల్దేరాడు. ఒక్క భీముడే అశ్వత్థామను ఎదుర్కోవడానికి పోవడం క్షేమం కాదని యుద్ధానికి అంతా కలిసి వెళ్ళడం మచిదని ధర్మారాజుకు చెప్పాడు శ్రీకృష్ణుడు. మరో విషయం ఈ సందర్భంగా ప్రస్తావించాడు కృష్ణుడు ధర్మరాజుతో. ‘బ్రహ్మశిరస్సు లేదా ‘బ్రహ్మశిరోనామకాస్త్రం అనే పేరుకల దివ్యాస్త్రాన్ని ద్రోణాచార్యుడు అశ్వత్థామకు, అర్జునుడికి ఇచ్చాడని, ఆ అస్త్రాన్ని మనుష్యుల మీద ప్రయోగించితే కీడు కలుగుతుందని, ఎన్ని ఆపదలు వచ్చినా అలా చేయవద్దని, అశ్వత్థామకు ప్రత్యేకంగా ద్రోణుడు చెప్పాడని అన్నాడు కృష్ణుడు. తన దగ్గరున్న ‘బ్రహ్మశిరోనామకాస్త్రం సహాయంతో అశ్వత్థామ భీముడిని బాధించే అవకాశం ఉన్నదన్నాడు ధర్మరాజుతో.

అలా చెప్పిన కృష్ణుడు సాత్యకిని, సహదేవుడిని శిబిరంలోనే వుండమని చెప్పి, ధర్మరాజు, అర్జున సమేతంగా అశ్వత్థామ మీదికి యుద్ధానికి బయల్దేరారు. రథానికి సారథ్యం కృష్ణుడు చేశాడు. వేగంగా రథాన్ని పరుగెత్తించడం వల్ల మధ్యలో భీముడి రథాన్ని కలుపుకొన్నారు. అయినా వారికంటే ముందుగా పోయిన భీముడు గంగానది ఒడ్డున శరీరం నిండా బూడిద పూసుకొని తపస్సు చేస్తున్న అశ్వత్థామను చూశాడు. ‘నీచ బ్రాహ్మణుడా! అని సంభోదిస్తూ, గత రాత్రి ఆయన చేసిన అధర్మపు పనిని పేర్కొంటూ, యుద్ధానికి రమ్మని సవాలు విసిరాడు భీముడు. అప్పుడు భీముడిని, వారి వెనుకే వస్తున్న అర్జునుడిని, ధర్మరాజును చూసి బాధపడే మనస్సుతో అశ్వత్థామ ‘బ్రహ్మశిరోనామకాస్త్రం తలచుకుంటూ ఒక రెల్లు గడ్డిపోచ పట్టుకొని దానిమీదకు ఆ అస్త్రాన్ని ఆవాహనం చేసి, ‘పాండవ నిర్మూలనం అవుతుంది కాక!’ అని ప్రయోగించాడు.

అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్రం నుండి పుట్టిన భయంకరమైన అగ్నిజ్వాలలు అన్నివైపులా విజృంభిస్తూ లోకాన్ని బూడిద చేయడాన్ని కృష్ణుడు గమనించాడు. ఆ అస్త్రాన్ని తిప్పికొట్టడానికి ఆర్జునుడిని కూడా ‘బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించి, దాన్ని నిరోధించి పాండవులను కాపాడుకొమ్మని సూచించాడు. వెంటనే అర్జునుడు ‘బ్రహ్మశిరోనామకాస్త్రం సంధించాడు. సంధించి మొదలు అశ్వత్థామకు హాని కలగకుండా వుండాలని ప్రార్థించి, తనకూ, సోదరులకూ శుభం కలగాలని అస్త్రదేవతకు నమస్కారం చేసి అన్నాడు. అది అశ్వత్థామ అస్త్రాన్ని తిప్పికొట్టడానికి ప్రయత్నించగా రెండు అస్త్రాల విజృంభణ వల్ల ప్రళయం చోటుచేసుకున్నది. అప్పుడు వ్యాసుడు, నారదుడు అక్కడికి వచ్చి అశ్వత్థామను, అర్జునుడిని శాంతింప చేయడానికి వారి మధ్య నిలిచారు. అస్త్రాలను ఉపసంహరించమని అన్నారు. తాను వారి కోరిక మేరకు అస్త్రాన్ని ఉపసంహరిస్తానని కాని దుర్మార్గుడైన అశ్వత్థామ అలా చేయకుండా తమను దహించి వేస్తాడని అన్నాడు అర్జునుడు. దానికి పరిష్కారం కనుక్కొమ్మన్నాడు.

అర్జునుడు తాను అన్న మాట ప్రకారం ఆ మహాస్త్రాన్ని అనాయాసంగా ఉపసంహరించాడు. అయితే ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించి తిరిగి మరల్చడానికి ఒక్క అర్జునుడికి తప్ప ఇతరులకు సాధ్యం కాదు. ఆ పని దేవతలు సైతం చేయలేరు. ‘బ్రహ్మశిరోనామకాస్త్రం స్మరించి ప్రయోగించిన తరువాత వారించడానికి శక్యం కాదు. ఒకవేళ వారిస్తే వారించిన వారికే శిరశ్చేదం చేస్తుంది. అశ్వత్థామ వారించడానికి ప్రయత్నం చేసి విఫలుడై వ్యాసుడితో అదెలాగైనా పాండవులను దహించి తీరుతుందని అన్నాడు. వ్యాసుడు అప్పుడు రాజీ మార్గాన్ని సూచించాడు అశ్వత్థామకు. అర్జునుడు అతడికి హాని తలపెట్టడని, అర్జునుడిని వధించడం అతడి శక్యం కాదని, ఆయన అస్త్రం కూడా అర్జునుడు వారించగలడని, ఏవిధంగానైనా అస్త్రాన్ని ఉపసంహరించాలని, అశ్వత్థామ తన శిరోమణిని అర్జునుడికి ఇవ్వమని, అలా చేస్తే పాండవులు అశ్వత్థామ ప్రాణాలు తీసినంతగా సంతోషిస్తారని వ్యాసుడు సలహా ఇచ్చాడు.

వ్యాసుడు సలహాకు స్పందించిన అశ్వత్థామ తన అస్త్రం పాండవేయుల గర్భాలకు హాని కలిగించి తృప్తి పడి ఉపశమిస్తుంది గాక! అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామతో పాండురాజు మనుషులందరినీ అతడు వధించాడని, పాపం కట్టుకున్నాడని, ఇప్పుడు మనుమల గర్భాలను చంపాలని అనుకుంటున్నాడని, అందులో ఒక్కదాన్నైనా ఆయన బారిన పడకుండా తొలగించాలని అన్నాడు. తాను ఒకడిని పాండవ వంశం నిలబెట్టేందుకు రక్షిస్తానని స్పష్టం చేశాడు. శ్రీకృష్ణుడు చెప్తున్నది ఉత్తర గర్భం గురించని, దాన్ని కూడా తాను తప్పకుండా నాశనం చేస్తానని అన్నాడు అశ్వత్థామ. అది నెరవేరదని అభిమన్యుడి కుమారుడికి తాను దీర్ఘాయువు ఇస్తానని అన్నాడు శ్రీకృష్ణుడు.

వ్యాస, శ్రీకృష్ణుల మాటలు లక్ష్యపెట్టక అశ్వత్థామ పాండవుల సంతానం తాలూకు గర్భాలన్నింటి మీద అస్త్రం విడిచి పెట్టడం చూశాడు శ్రీకృష్ణుడు. అప్పుడు కోపంతో అశ్వత్థామను ఉద్దేశించి శ్రీకృష్ణుడు, ఉత్తరకు పుట్టబోయే బాలుడు పాండవ వంశోద్ధారకుడు అవుతాడని, పిల్లలను చంపిన అశ్వత్థామ ఆహారం లేకుండా, నిస్సహాయుడుగా, కంపుకొట్టే రక్తంతో, శరీరం కాలిపోతుంటే మూడు వేల సంవత్సరాలు తిరుగుతాడని అన్నాడు. తన చేత రక్షించబడ్డ ఆ కుమారుడు కృపాచార్యుడి దగ్గర ధనుర్వేదం నేర్చుకొని అన్ని శస్త్రాస్త్రాలు పొంది అనేక వేల సంవత్సరాలు భూమిని పాలిస్తాడని చెప్పాడు. అతడికి జనమేజయ మహారాజు పుట్టి అశ్వత్థామ చూస్తుండగానే గొప్పగా వెలుగొందుతాడని తన తపస్సత్యాల మహిమ చూడమని అన్నాడు కృష్ణుడు. అప్పుడు వ్యాసుడు అశ్వత్థామను, తన మాటలు పాటించ కుండా పాపకృత్యం చేశాడని, అందుకే కృష్ణుడు చెప్పినట్లే కమ్మని అన్నాడు.

వ్యాసుడు మనుష్యులలోనే వుండిపొమ్మని ప్రతిశాపం ఇచ్చిన అశ్వత్థామ తన శిరోమణిని పాండవులకు ఇచ్చి తపోవనానికి వెళ్లాడు. పాండవులు, కృష్ణుడు వ్యాసుడికి నమస్కరించి సెలవు పుచ్చుకొని ద్రౌపది దగ్గరకు వచ్చారు. భీముడు శిరోమణిని ద్రౌపదికి ఇచ్చాడు. దుఃఖం మానమని చెప్పాడు. గురుపుత్రుడయినందున అశ్వత్థామ ప్రాణం తీయడానికి పూనుకోకుందా అర్జునుడు అవమానించి వదిలి పెట్టాడని, శిరోమణి పోగొట్టుకోవడం వల్ల అశ్వత్థామ కీర్తిశరీరం పతనం అయిందని అన్నాడు. శిరోమణిని ధరించడానికి ధర్మారాజే అర్హుడని దానిని ఆయనకిచ్చింది ద్రౌపది. ధర్మరాజు దాన్ని తన శిరస్సు మీద ధరించాడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, సౌప్తికపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment