Sunday, September 25, 2022

‘ధృతరాష్ట్ర కౌగిలి’ నుండి భీముడిని కాపాడిన శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్ర-గాంధారి విలాపం .... ఆస్వాదన-90 : వనం జ్వాలా నరసింహారావు

ధృతరాష్ట్ర కౌగిలి నుండి భీముడిని కాపాడిన శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్ర-గాంధారి విలాపం

 ఆస్వాదన-90

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (25-09-2022)

తన నూరుగురు సంతానం ఒక్కరూ కూడా మిగలకుండా పాండవుల చేతిలో చనిపోవడంతో ధృతరాష్ట్రుడికి అమితమైన దుఃఖంకలిగింది. మనసంతా కకావికలైపోయింది. హృదయం శూన్యమై పోయింది. మాటా, పలుకూ లేకుండా పోయిన ధృతరాష్ట్రుడిని పామరుడిలాగా దుఃఖించ వద్దని, ఆయన బాధకు అంతం లేదని, శోకించడం తగని పనని, తాను చెప్పేది వినమని సంజయుడు అన్నాడు. యుద్ధంలో చనిపోయిన వారందరికీ దహన సంస్కారం చేయాలని, సన్నిహిత బంధువర్గానికి తిలోదక ప్రదానం చేయాలని, కాబట్టి యుద్ధభూమికి బయల్దేరమని సంజయుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చి ఎన్నో విధాలుగా యుద్ధం నాశకరమని చెప్పినా తాను వినలేదని, భీష్మద్రోణాది పెద్దలు చెప్పిన హితోక్తులు కూడా తాను విన్నవాడిని కాదని, రాజ్యభాగం ఇవ్వక పోయానని, తన వల్లనే అంతా చనిపోయారని, పాండవులను సంపదకు దూరం చేశానని, ఇక తాను బతకడం సమంజసం కాదని సంజయుడితో చెప్పుకుని విలపించాడు ధృతరాష్ట్రుడు. తప్పంతా దుర్యోధనుడిదే అని సంజయుడు ఓదార్చాడు.

అక్కడే వున్న విదురుడు కూడా ధృతరాష్ట్రుడికి దుఃఖోపశమనం చేశాడు. ధృతరాష్ట్రుడి కొడుకులు ఉత్సాహంగా ఒక ఆటలాగా యుద్ధం చేసి స్వర్గానికి అతిథులుగా వెళ్లారని, ఇంద్రుడి సత్కారాలు పొందుతున్నారని, యుద్ధంలో వెన్ను చూపకుండా పోరాడి మరణించే యోధులకు కలిగే పుణ్యగతులు అన్నిటికన్నా ఎక్కువని విదురుడు అన్నాడు. కాబట్టి ధృతరాష్ట్రుడు ఆయన కొడుకుల విషయంలో చింతించాల్సిన అవసరం లేదన్నాడు. విదురుడి మాటలు వినడం వల్ల తన బాధ తగ్గిందన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ తరువాత తన దుఃఖోపశమనంలో భాగంగా ధృతరాష్ట్రుడు విడురుడిని రెండు-మూడు సందేహాలను అడిగి నివృత్తి చేయమన్నాడు. సంయోగ-వియోగాల వలన పుట్టే మానసిక భావాల చేత ఆక్రమించబడకుండా ప్రాజ్ఞులు ఎలా వుంటారని, సంసారంలో ఎక్కడెక్కడ దుఃఖం పరివ్యాప్తమయిందో దాన్ని దాటడం ఎందుకు కష్టమని, అలాంటివే మరికొన్ని ప్రశ్నలు అడిగాడు. విదురుడు వాటన్నిటికీ సరైన సమాధానం చెప్పాడు. సంసార గహనం గురించీ చెప్పాడు.

ఇవన్నీ చెప్పిన సంజయుడు కుమారులకు, దాయాదులకు ఉత్తర క్రియలు జరిపించమని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వేదవ్యాస మహర్షి వచ్చాడు. ఆయన కూడా ధృతరాష్ట్రుడికి దుఃఖోపశమనం చేశాడు. పుత్రుల మరణం వల్ల కలిగిన దుఃఖ సముద్రాన్ని దాటి శాంతిని పొందమన్నాడు. ప్రాణులు అన్నీ అశాశ్వతాలే అని అన్నాడు. ధృతరాష్ట్రుడికి తెలియకుండా కౌరవ పాండవులకు వైరం కలిగిందా అని ప్రశ్నించి, దీనంతటికీ మూలకారణం ఆయన కొడుకు దుర్యోధనుడే అన్నాడు. దేవతల సమక్షంలో భూదేవితో శ్రీమహా విష్ణువు అన్న మాటలను, తాను విన్న మాటలను వివరంగా  చెప్పాడు వ్యాసుడు ఈ సందర్భంగా. ధృతరాష్ట్రుడు అనే రాజుకు పుట్టే నూరుగురు కుమారులలో దుర్యోధనుడు భూభారాన్ని సంపూర్ణంగా పోగొట్టుతాడని, కురుక్షేత్రంలో జరిగే మహా యుద్ధంలో సకల రాజలోకం ఘోరంగా చనిపోతుందని, సోదరులతో సహా దుర్యోధనుడు చనిపోతాడని నారాయణుడు భూదేవిని ఓదార్చిన సంగతి వ్యాసుడు చెప్పాడు. అంతా అలాగే జరిగిందన్నాడు.  

నారాయణుడు అలా చెప్పిన తరువాత ‘కలిఅంశతో దుర్యోధనుడు పుట్టాడని, అందువల్ల అతడు ఇతరుల గొప్పతనాన్ని సహించడని, ఎంత బలవంతుడో అంత కోపిష్టి అని, ఎవరైనా పెద్దలు నీతి చెప్తే వినడని కూడా చెప్పాడు వ్యాసుడు. దుశ్శాసన, శకుని, కర్ణులు ఆ రాజుకు సన్నిహితులైనప్పుడు అంతా నశించకుండా ఎలా వుంటారని ప్రశ్నించాడు. ఇదంతా చెప్పి, పాండవుల వల్ల ఏ కీడూ జరగలేదని, దుర్యోధనాదులే భూమండలాన్నంతా మింగేశారని, ఇలా జరుగుతుందని తనకు తెలిసే ధర్మరాజును సంధికి ప్రోత్సహించానని అన్నాడు. అతడు సంధి కొరకు ఎంత ప్రయత్నించినా అది జరగలేదని, విధిని తప్పించడానికి ఎవరికీ సాధ్యం కాదని అన్నాడు. ఆయన మీద గౌరవం వున్న ధర్మరాజును ఆదరించమని ధృతరాష్ట్రుడికి చెప్పాడు వ్యాసుడు. ఆయన మాటలు విన్న తన మనస్సు ప్రశాంతమైనదని, ఆయన చెప్పినట్లే బాధ పడడం మానేసి బాంధవ్యాన్ని పెంచుకుంటానని అన్నాడు ధృతరాష్ట్రుడు వ్యాసుడితో. ఆ తరువాత వ్యాసుడు అంతర్థానం అయ్యాడు. యుద్ధరంగానికి ప్రయాణానికి సిద్ధం చేయమని సంజయుడికి చెప్పాడు ధృతరాష్ట్రుడు. గాంధారిని, కుంతిని, మిగతా కౌరవ స్త్రీలను పిలుచుకొని రమ్మని విదురుడికి చెప్పాడు.

క్రమంగా గాంధారి, కుంతీదేవి, కురువంశంలోని పెద్ద ఆడవారు, ఇతర కౌరవ కాంతలు, పరిచర్యలు చేసే స్త్రీలు, ఇతర స్త్రీలు, మృతవీరుల భార్యలు దుఃఖిస్తూ యుద్ధభూమికి తరలిపోవడానికి అక్కడికి చేరుకున్నారు. అలా వస్తుంటే కురుకుమారుల ఇళ్లలో ఆర్తనాదాలు పుట్టాయి. ఏడ్పులు, రోదనాలతో కురు స్త్రీలంతా వచ్చి ధృతరాష్ట్రుడి సమీపంలో నిలిచారు. విదురుడికి నోట మాట రావడం లేదు. నెమ్మదిగా వారందరికీ ఓదార్పు మాటలు చెప్తూ, వారివారికి తగిన వాహనాల మీద కూచోబెట్టాడు. ధృతరాష్ట్రుడు కూడా రథం ఎక్కి బయల్దేరాడు. అతడి వెనుకనే విదురుడు గాంధారి, కుంతి మొదలైన వారిని తీసుకుని సంజయుడితో కలిసి బయల్దేరాడు. ఒక కోసెడు దూరం పోయిన తరువాత అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కలిశారు. దుర్యోధనుడు మహా యుద్ధం చేసి వీరస్వర్గం అలంకరించిన సంగతి ధృతరాష్ట్రుడికి చెప్పారు వారు ముగ్గురు. ఆ తరువాత అతి దీనంగా విలపిస్తున్న గాంధారిని ఓదార్చాడు కృపాచార్యుడు. భీముడు అధర్మ పద్ధతిలో దుర్యోధనుడిని అతి క్రూరంగా చంపాడని ఆమెతో అన్నాడు.

అర్థరాత్రి తాము పాండవులను తప్ప మిగతావారిని ఎలా సంహరించారో గాంధారికి, ధృతరాష్ట్రుడికి చెప్పారు అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మలు. పాండవులు పగతో తమను వెంటాడుతున్నారని, వాళ్ల బారినుండి బయట పడక తప్పదని, కాబట్టి పోవడానికి తమకు అనుమతి ఇవ్వమని చెప్పి వారిద్దరికీ ప్రదక్షిణ నమస్కారం చేసి బయల్దేరి వారు ముగ్గురు గంగానదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుని తమతమ మార్గాలలో వెళ్లిపోయారు. కృపాచార్యుడు హస్తినకు వచ్చాడు. కృతవర్మ ద్వారకకు చేరుకున్నాడు. అశ్వత్థామ వ్యాసమహర్షి ఆశ్రమానికి చేరుకొని వెంటనే తపస్సు ప్రారంభించాడు. అక్కడికే పాండవులు రావడం, అతడితో యుద్ధం చేయడం, శిరోమణిని తీసుకుపోవడం జరిగింది.

ఇదిలా వుండగా, ధృతరాష్ట్రుడు యుద్ధభూమికి వస్తున్నాడని తెలిసి ధర్మారాజాదులు కూడా బయల్దేరారు అక్కడికి. తాను యుద్ధభూమి వైపుగా పోతున్నానని శ్రీకృష్ణుడికి ధర్మరాజు తెలియచేయగానే, సాత్యకి, భీమార్జున నకులసహదేవులు ఆయనకు ఇరువైపులా బయల్దేరారు. ద్రౌపది, ఆమె వెనుక మత్స్యపాంచాల దేశాల స్త్రీలు కూడా ధర్మరాజును అనుసరించారు. ధర్మరాజు యుద్ధభూమికి చేరుకునే సమయానికల్లా ధృతరాష్ట్రుడు కూడా అక్కడికి వచ్చాడు. కౌరవ పక్షంలోని కొంతమంది స్త్రీలు ఎంతమందో చావడానికి కారణమని ధర్మరాజును దూషించారు. ధర్మరాజు చిన్నగా ధృతరాష్ట్రుడి దగ్గరకు చేరుకొని ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. ధృతరాష్ట్రుడు నెమ్మదిగా ధర్మరాజును కౌగలించుకున్నాడు. కౌగలించుకుని ఓదార్పు మాటలతో సాంత్వనం కలిగించాడు.

ఆ తరువాత భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ధృతరాష్ట్ర మహారాజును సమీపించారు. వారు వచ్చారని పక్కవారు చెప్తున్నప్పుడు భీముడి పేరు చెప్పగానే కోపాగ్ని అతడిని దహించి వేయడం శ్రీకృష్ణుడు గమనించాడు. వెంటనే భీముడిని రాజు సమీపానికి పోకుండా ఆపాడు. అతడికి బదులుగా రహస్యంగా ఇనుముతో తయారు చేయించి అక్కడకు తెచ్చిన భీముడి విగ్రహాన్ని రాజు ముందరికి జరిపాడు శ్రీకృష్ణుడు. ఆ విగ్రహమే భీమసేనుడు అనుకుని ధృతరాష్ట్రుడు దాన్ని రెండు చేతుల మధ్యా అదుముకొని అతి క్రూరంగా భయంకరమైన వేగంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా విరిచి పారేశాడు. ధృతరాష్ట్రుడి కౌగిలిలో విగ్రహం ముక్కలై పోయింది. ధృతరాష్ట్రుడి రొమ్ము చిట్లిపోయింది. (అందుకే ‘ధృతరాష్ట్రుడి కౌగిలి’ అన్న మాట లోకంలో ప్రసిద్ధికెక్కింది). ఏదో జరిగినట్లు ఏడుస్తున్న రాజును చూసి శ్రీకృష్ణుడు, భీముడు ఆయన చేతిలో చావలేదని, ఆయన విరిచింది విగ్రహాన్నని, ఆయనకు అంత కోపం వున్నదని తెలుసుకొని తానే విగ్రహాన్ని పెట్టానని అన్నాడు. సృష్టికర్త లీలలు గ్రహించలేక ధృతరాష్ట్రుడు అపహాస్యం పాలయ్యాడని, పెద్ద పాపం చేశాడని అన్నాడు కృష్ణుడు. గతం గుర్తు చేస్తూ ఆయన చేసిన తప్పులను మరోమారు ఎత్తి చూపాడు.

ఇక మున్ముందు తన కొడుకు చనిపోయారన్న బాధను వదిలేస్తానని తన తమ్ముడి కుమారులే తనకు సంతోషం కలిగించగలిగే వారుగా నడుచుకుంటానని ధృతరాష్ట్రుడు కృష్ణుడికి చెప్పాడు. ఆ తరువాత భీమార్జున నకుల సహదేవులను కౌగలించుకొని అందరికీ దీవెనలు ఇచ్చాడు ధృతరాష్ట్రుడు. యుయుత్సుడిని కూడా కౌగలించుకొని దీవించాడు. ఆ తరువాత కుంతీ కుమారులు గాంధారికి నమస్కరించారు. వారిని ఆశీర్వదించడానికి ఇష్టపడని గాంధారి శాపం ఇవ్వడానికి ధర్మరాజు వైపుకు తిరిగింది. తక్షణమే వ్యాసుడు అక్కడ ప్రత్యక్షమై శపించవద్దని, శాంతించమని గాంధారికి చెప్పాడు.

దుర్యోధనుడు యుద్ధభూమికి వెళ్లే ముందర తల్లి దీవెన కోసం, విజయం సిద్ధించేట్లు చేయమని ఆశీర్వచనం కోసం వచ్చినప్పుడు గాంధారి, ‘ధర్మం ఎక్కడ వుంటే జయం అక్కడే అని అన్నదని, ఆ విధంగానే ధర్మదీక్షతో పోరాడి పాండవులు గెలిచారని, వారి పట్ల అసూయ వద్దని, ఇప్పటికైనా మాతృ ధర్మాన్ని అవలంభించి పాండవుల మీద వున్న కోపాన్ని పోగొట్టుకొమ్మని వ్యాసుడు అన్నాడు. తనకు వారిమీద కోపం లేదని, దుఃఖం అధికం కావడం వల్లే కోపం వచ్చిందని గాంధారి అన్నది. భీముడు గదా యుద్ధంలో దుర్యోధనుడిని అధర్మంగా చంపాడని కోపంగా వున్నదని అన్నది. అప్పుడు భీముడు భయంతో వణకి పోతూ, తాను ప్రాణభీతితో అలా చేశానని, క్షమించమని అన్నాడు గాంధారితో. అలా అంటూనే, ద్రౌపదికి సభలో జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించాడు. అది న్యాయమేనా అని ప్రశ్నించాడు. అది జరిగినప్పుడు దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టుతానని నిండు సభలో ప్రతిజ్ఞ చేశానని, అది నెరవేర్చుకున్నానని చెప్పాడు. అదే విధంగా దుశ్శాసనుడిని చంపిన తరువాత తన ప్రతిజ్ఞ తీర్చుకోవడానికి అతడి రక్తాన్ని పెదవికి మాత్రమే చేర్చానని తాగలేదని స్పష్టం చేశాడు.

కనీసం తన కొడుకుల్లో ఒక్కడినైనా చంపకుండా వుండాల్సిందని గాంధారి అంటూ ధర్మరాజు కొరకు చూసింది. అతడు భయ పడుతూ ఆమె దగ్గరికి వచ్చి ఆమె కొడుకులను చంపించిన పాపాత్ముడు తనే అనీ, తనను శాపంతో చంపమని అన్నాడు. గాంధారి ఒక నిట్టూర్పు విడిచి, తన కళ్లకు కట్టుకున్న గుడ్డ అంచు సందులో నుండి ధర్మరాజును ఒక చూపు చూసింది. వెంటనే అతడి వేళ్లు ఎర్రబడ్డాయి. అది చూసి భీమార్జున నకుల సహదేవులు పక్కకు తప్పుకున్నారు. ఆ సమయంలో గాంధారి కోపాన్ని వదిలిపెట్టి పాండవుల పట్ల మాతృభావాన్ని పొంది, కుంతిని దర్శించుకొమ్మని చెప్పింది. పాండవుల మనస్సు కుదుటపడ్డది. అంతా కలిసి కుంతి దగ్గరికి వెళ్లారు.

కుంతీదేవి తన కొడుకులను చూసి వారు పడ్డ కష్టాలను తలచుకొని, అభిమన్యాదుల మరణం గుర్తు తెచ్చుకొని, మహా దుఃఖంలో మునిగిపోయింది. ఆమె బాధ చూసి పాండవులు కూడా చలించి పోయారు. అంతా ఆమె పాదాలమీద పడి నమస్కరించారు. అంతా కుమిలి కుమిలి ఏడ్చారు. వారి శరీరాలను నిమిరింది కుంతి. ఇంతకాలానికి వచ్చారా? అన్నది. ద్రౌపది కూడా కుంతిని సమీపించి పెద్దగా ఏడ్చింది. గాంధారి కాళ్లకు కూడా నమస్కరించింది ద్రౌపది. తమ విషయంలో విధి క్రూరంగా వ్యవహరించిందని గాంధారి ద్రౌపదితో అన్నది. ఇలా అవుతుందని తెలిసే తాను ప్రయత్నించి కూడా తన కుమారుల దుర్మార్గాన్ని ఆపలేకపోయానని, అందుకే ఈ సంక్షోభం అని అన్నది గాంధారి.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, స్త్రీపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

1 comment:

  1. Wonderful.

    Been reading this since long! I really like the way you have simplified it without missing the important sequence and elements.

    Thank you so much!

    ReplyDelete