యోగ-సాంఖ్యశాస్త్రాల స్వరూపాలను, వాటి అభేదాన్ని,
శరీర దోషాలను వివరించిన భీష్ముడు
ఆస్వాదన-114
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (03-04-2023)
యోగి అనేవాడు
ఎలాంటి ఆహారాలను వర్జించాలని, ఎలాంటి ఆహారాలు తింటే బలం
పుంజుకొంటాడని ధర్మరాజు భీష్ముడిని ప్రశ్నించాడు. నూనెగల చిక్కనైన ఆహార పదార్థాలను
వర్జించాలని, రసవత్తరాలు కాని పదార్థాలతో, నీటితో ఆకలి
తీర్చుకోవాలని, అవి కూడా పొట్ట నిండేరీతిలో ఎక్కువగా
తీసుకోకూడదని, అలా చేస్తే బలం పెంపొందుతుందని భీష్ముడు
సమాధానం ఇచ్చాడు. కామాన్ని, క్రోధాన్ని, నిద్రను,
ఆశను, భయాన్ని,
అభిరుచిని, అభిరుచిలేని తనాన్ని, శ్వాస గమనాన్ని జయించాలని, యోగధారణలో నిశ్చలత కలిగి, తనలో తనను చూసుకుంటూ, రమించే యోగి నిత్యసుఖానికి నెలవైన ధామం
చేరుకుంటాడని భీష్ముడు చెప్పాడు. యోగసిద్ధి పొందినవాడికి పుట్టుకతో సంయోగం, మరణంతో దీనత్వం లేవని, భోగం వల్ల సుఖించడం, భోగంలేకపోతే దుఃఖించడం
అనేవి అతడికి వుండవని కూడా అన్నాడు భీష్ముడు.
యోగశాస్త్రం
ఎలాంటిదో భీష్ముడి ద్వారా తెలుసుకున్న తనకు సాంఖ్యశాస్త్ర స్వరూపం ఎలాంటిదో కూడా
తెలుసుకోవాలని వున్నదని అన్నాడు ధర్మరాజు. కపిలుడు మొదలైన మహామునులు చెప్పిన
పద్ధతిలో ఆ విషయాలను క్లుప్తంగా చెప్తానని ఇలా అన్నాడు భీష్ముడు.
‘శ్రోత్రం, త్వక్కు,
చక్షువు, జిహ్వ,
ఘ్రాణం అనే ఐదు జ్ఞానేంద్రియాలు క్రమంగా శబ్దం,
స్పర్శం, రూపం,
రసం, గంధం అనే ఐదు విషయాలలోను, అగ్ని ఉదరంలోను, వాయువు ఆకాశంలోను, జలం అగ్నిలోను, భూమి జలంలోను, హస్తేంద్రియం ఇంద్రుడిలోను, పాద విక్షేపం (కాలు చాచడం) విష్ణువులోను, లోభం ధనంలోను, బుద్ధి తమోగుణంలోను, తమోగుణం రజోగుణంలోను, రజోగుణం సత్త్వగుణంలోను తగులుకొని వున్నాయి.
సత్త్వగుణం జీవాత్ముడితో సంబందమై వున్నది. త్వంపదార్థమైన జీవుడు నారాయణుడు, మహేశ్వరుడు అనబడే దేవుడిలో తగులుకొని
వున్నాడు. ఆ దేవుడు శ్రేష్టమైన మోక్షంలో సక్తుడై వున్నాడు. తత్పదార్థమైన మోక్షం
ఎందులోనూ తగులుకోకుండా స్వతంత్రమై వున్నది’.
‘సత్త్వం మొదలైన
మూడు గుణాల సామ్యావస్థ అయిన ప్రకృతి పదహారు వికారాలకు ఆలంబనమై వున్నది. ఆత్మకు ఆ
ప్రకృతే ఆశ్రయ స్థానం. ఆత్మ స్వచ్చమైన తేజోరూపం కలిగి వున్నది. అది ప్రకృతి,
వికృతిలలో ఏదీకాకుండా భాసిస్తూ వున్నది. ఆత్మకు రెండు రూపాలున్నాయి. ఒక్కటే అయిన
వాయువుకు చెందిన ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అని ఐదు విధాలుగా వున్నాయి. వాటిని పరిశీలిస్తే క్రమంగా
పవనగమనం నిరోధించబడుతుంది. ఈ నిరోధమనే సుకృతం జీవుడిలోని అంతరాత్మను
దర్శింపజేస్తుంది. వాయు చలనాన్ని అరికట్టడం ద్వారా మనస్సును నిరోధించవచ్చు. మనస్సు
నిశ్చలమైతే పరమాత్మ దర్శనం కలుగుతుంది’.
‘జీవుడు
సుఖదుఃఖాలు పొందడానికి పుణ్యకార్యాలు చేసి అమరత్వం పొందుతాడు. పుణ్యపాప మిశ్ర
కర్మల వల్ల, నడిమిరకపు పనులు చేసి మానవుడు జన్మిస్తాడు.
పాపం ఎక్కువైనప్పుడు పశువుగానో, పురుగుగానో ఉద్భవిస్తాడు. జీవుడు చేసే
కర్మలలో ఇన్ని తేడాలున్నాయి. బుద్ధిమంతుడు కర్మజాలంలో చిక్కుకోకుండా ముక్తి కోరి, అందుకై ప్రయత్నిస్తాడు. వేయిమందిలో ఏ ఒక్కడో తన
శరీర దోషాలను గ్రహించి, వాటిని త్యజించి, మోక్షం సాధిస్తాడు. అహంకారం కారణంగా చాలామంది
మోక్షప్రయత్నం చేయరు’.
భీష్ముడు ఇలా చెప్పడంతో
ధర్మరాజుకు మరో సందేహం కలిగింది. శరీరంలోని దోషాలు ఏవని, వాటిని తెలియపర్చమని
పితామహుడిని అడిగాడు. కామం, క్రోధం, భయం, నిద్ర, నిశ్న్వాసం (నిట్టూర్పు) అనేవి దేహగతమైన దోషాలని, ఆ ఐదు దోషాలను తొలగించుకునే విధానం
వివరిస్తానని అన్నాడు భీష్ముడు. కోపానికి ఓర్పు, కామానికి సంకల్పించకుండా వుండడం,
భయానికి ఏమరుపాటు లేకుండడం, నిద్రకు సత్త్వగుణాన్ని సేవించడం, శ్వాసకు అల్పాహార స్వీకరణ శత్రువులన్నాడు.
సాంఖ్య విధానాన్ని ఓడగా గ్రహించిన ఆర్యుడు సంసారమనే సముద్రాన్ని దాటుతాడని, అలా
దాటిన పుణ్యాత్ముడిని సూర్యుడు మోసికొనిపోతాడని, నారాయణుడు ఆ పుణ్యాత్ముడిని చివరకు పరమాత్మతో చేరుస్తాడని, ఆ పరతత్త్వంతో కలిసి అతడు తన్మయుడై
అమృతత్వదశను పొంది శాశ్వతస్థితి కలవాడవుతాడని భీష్ముడు చెప్పాడు.
అలా అమృత స్వరూపుడైన
మహాత్ముడు తన పూర్వ స్థితిని తలుస్తాడా?
లేదా? అని ప్రశ్నించాడు ధర్మరాజు. జవాబుగా భీష్ముడు
ఇలా చెప్పాడు.
‘శ్రోత్రం, త్వక్కు మొదలైన ఇంద్రియాలు పురుషుడిని
తెలియజాలవు. అవి మనస్సులో వుంటాయి. పురుషుడు మనస్సుతో వున్న సంబంధం వల్ల
ఇంద్రియాలను తెలుసుకుంటాడు. పురుషుడు ముక్తి పొందినా, పొందక పోయినా, ఇంద్రియాలను తెలుసుకోవడం సమానమే. ఆత్మజ్ఞాన సంపన్నుడై, అమృత
స్వరూపుడైన పురుషుడు ఇంద్రియాలను తెలుసుకున్నా,
లేకపోయినా జరిగేదేమీలేదు. దానివల్ల అతడికి కలిగే బాధలు ఏమీలేవు. ముక్తిపొందిన
పురుషుడు ఇంద్రియాలను వర్జించినప్పుడు అవి జడంగా పడి వుంటాయి. లేదా విచ్చిన్నమై
పోతాయి. ఇంద్రియాలు ఈ స్థితిని పొందడం అనేది ఈశ్వరుడి విధానం కావచ్చు. అది ముక్తి
పొందిన ఆత్మకు కూడా అన్వయిస్తుంది. ఒకవేళ పురుషుడు ఇంద్రియాలతో కూడి
పరమజ్ఞానమగ్నుడైతే అతడు వాటి సూక్ష్మమైన పోకడలను చూస్తూ వుంటాడు. చూసినప్పటికీ, వాటివల్ల కలిగే వికారాలకు లోనుకాడు’
‘జీవుడు పృథివి,
అప్పు, తేజస్సు,
వాయువు, ఆకాశం అనే ఐదు భూతాలను, సత్త్వం,
రజస్సు, తమస్సు అనే మూడు గుణాలను, బుద్ధిని,
మనస్సును అణచుకొన్నవాడై నారాయణుడి సన్నిధి చేరుకుంటాడు. ఆ పరమాత్ముడి కృపా ప్రభావం
వల్ల మహితమైన పరమపదం పొందుతాడు. అందువల్ల ఆ స్థితిలో అతడికి పుణ్యం, పాపం అనేవి లేవు. పరమాత్ముడైన నారాయణుడిని
పొందిన జీవుడికి పునర్జన్మ లేదు. శ్రేష్టమైన పునరావృత్తిలేని ఆ దశనే మోక్షమని
అంటారు. మోక్షావస్థకంటే ఎక్కువ దశ మరేదేలేదు. గురూపదేశాన్ని అనుసరించి ఎవడు
పరతత్త్వనిరూపణ పద్ధతిని నియమంతో పాటిస్తాడో, అలాంటి పురుషుడికి త్వరలో ప్రశాంతి
కలుగుతుంది. జీవుడు బ్రహ్మత్వం పొందడానికి సాంఖ్య పద్ధతికి ధీటురాగల మంచి ఉపాయాలు
వేరే ఎక్కడా లేవు. సాంఖ్యం శరీరంలేని
పరమేశ్వరుడికి శరీరమై వున్నది’.
ఇలా చెప్పిన
భీష్ముడు, సాంఖ్యమని, యోగమని పేరులో భేదమే కాని నిజంగా
పరిశీలించి చూస్తే సాంఖ్యంలో యోగం,
యోగంలో సాంఖ్యం కనిపిస్తూనే వుంటాయని,
అందువల్ల తత్త్వజ్ఞులు సాంఖ్యయోగాలను రెంటినీ ఒక్కటిగానే భావిస్తారని అని అంటూ, ఆ పద్ధతిని ధర్మరాజు తన చిత్తంలో అభ్యసించమని
సలహా ఇచ్చాడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, శాంతిపర్వం, పంచమాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment