Saturday, April 22, 2023

అభివృద్ధీ ..... నీ పయనం ఎటు? : వనం జ్వాలా నరసింహారావు

 అభివృద్ధీ ..... నీ పయనం ఎటు?

వనం జ్వాలా నరసింహారావు

సాక్షిదినపత్రిక (23-04-2023)

ఏడు సంవత్సరాల క్రితం 87 ఏళ్ల వయసులో మరణించిన భవిష్యత్తు వాది ఆల్విన్ టాఫ్లర్ ‘ఫ్యూచర్ షాక్’ అనే పుస్తకాన్ని 1970లో రాశాడు. వేగవంతమైన మార్పు ప్రజలను పిచ్చిగా మార్చే ప్రపంచాన్ని ఊహించిన టాఫ్లర్ ఆలోచన ప్రతివారి నాడిని తాకింది. సామాజిక, సాంకేతిక మార్పుల వేగాన్ని తట్టుకోలేని సగటు వ్యక్తి అనుభవించే శారీరక, మానసిక, సామాజిక క్షోభకు ఈ పుస్తకం అద్దం పడుతుంది. టాఫ్లర్ మరో పుస్తకం, ‘ది థర్డ్ వేవ్ సొసైటీ' మార్పులను ప్రభావితం చేయడానికి, భవిష్యత్తులో నూతన సమాజాన్ని రూపొందించడానికి, జ్ఞానం-సాంకేతికత పాత్రను స్పష్టంగా తెలియచేస్తుంది. ఈ నేపధ్యంలో స్వానుభవాలు.               

ఇటీవల మా గ్రామానికి సమీపంలో వున్న మా శ్రీమతి పుట్టిల్లు గ్రామం వల్లభిలో జరిగిన వేణుగోపాలస్వామి దేవాలయం పునర్నిర్మాణం సందర్భంగా నిర్వహించిన శాంతి కళ్యాణానికి వెళ్లడం జరిగింది. అర్చకస్వామి వాసు కల్యాణం వేదోక్త మంత్రాలతో జరిపిస్తూ, ముహూర్త సమయంలో శిరస్సు మీద ‘జీలకర్ర, బెల్లం’ పెట్తున్న సమయంలో, వ్యాఖ్యానిస్తూ, తాను కొంతకాలం క్రితం ఒకచోట ఇలాగే కల్యాణం జరిపిస్తున్నప్పుడు, ఎవరో లేచి, ‘జీలకర్ర, బెల్లం’ బదులు ‘పిజ్జా, బర్గర్’ పెట్టకూడదా స్వామీ అని అడిగాడట! ఆశ్చర్యపోయిన అర్చక స్వామి ‘జీలకర్ర, బెల్లం’ పెట్టడంలోని అర్థాన్ని విడమర్చి చెప్పినా వాడి బుర్రకు ఎక్కలేదట. బహుశా కొంతకాలం పోతే ‘పిజ్జా, బర్గర్’ పెట్టే ప్రభుద్దులు కూడా బయల్దేరుతారేమో?

         75 సంవత్సరాల వయసులో, ముందూ వెనుకా ఐదు తరాల వాళ్లను చూసిన మాలాంటి వారికి అభివృద్ధి పేరుతో వివిధ రంగాలలో చోటుచేసుకుంటున్న కొన్ని మార్పులు గమనిస్తుంటే ఆశ్చర్యం సంగతి అటుంచి, ఏంచేయాలో పాలుపోని పరిస్థితి కలుగుతున్నది. చిన్నతనంలో సరైన రహదారి కూడా లేని రోజుల్లో కాలినడకన గ్రామాలలో తిరిగి, ప్రమాదాలు కలిగే అవకాశం వున్న ఎద్దుల బండ్లమీద ప్రయాణం చేసి, సైకిల్ తొక్కి, స్కూటర్ ఎక్కి, ప్రయివేట్ బస్సుల్లో అతికష్టంగా ప్రయాణం చేసి, అలా, అలా, లగ్జరీ బస్సులు, కార్లు, విమానాలు ఎక్కిన మార్పుకు అలవాటు, సర్దుబాటు కాగలిగాం కాని, కాలక్రమేణా పలు విషయాలలో తలెత్తుతున్న వింత పోకడలను తట్టుకోవడం కష్టంగా వున్నదనాలి.

         అన్నపూర్ణ లాంటి తెలుగు రాష్ట్రాలలో ఏ పట్టణంలో, ఏ హోటల్లో పోయినా కడుపునిండా తినే తెలుగువారి భోజనం దొరకదు. అన్నం, కూర, పప్పు, నెయ్యి, సాంబారు, రసం, గోధుమ పిండి రొట్టె, పూరీ లాంటి పదార్ధాలతో భోజనం పెట్టే హోటళ్లు మచ్చుకైనా కానరావు. పేరుకు అన్నీ ఫైవ్ స్టార్, త్రీ స్టార్ హోటళ్లు. బిరియానీ, పలావ్, జింజర్ రైస్, పన్నీర్, మైదా పిండో మరేదో దానితో చేసిన బటర్ నాన్, నాన్, రోటీ, కుల్చా లాంటివి తినాల్సిందే. లేదా పస్తు వుండాల్సిందే. పొద్దున్నే లేవగానే మంచి ఫిల్టర్ కాఫీ ఇచ్చే హోటళ్లు అసలే లేవు. ఇక ధరల విషయానికొస్తే ఆకాశాన్నే కాదు, ఆపైన ఇంకేదన్నా గ్రహం వుంటే దాన్ని తాకేలా వుంటాయి. మామూలు జనాభా వున్న పట్టణానికి వెళ్లి హోటల్ రూమ్ అద్దెకు తీసుకుంటే, పన్నులు కాకుండా వేలరూపాయల్లో వుంటుంది. ఫుడ్ తడవకు ఒక్కొక్క వ్యక్తికి కనీసం అధమపక్షం రు. 500 పైనే వుంటుంది. ఇక మద్యం అలవాటున్నవారు ఒక్క పెగ్ ఆర్డర్ చేస్తే జేబులు చిల్లులు పడాల్సిందే. వాటర్ బాటిల్ కాని షోడాలు కాని షాపుకన్న పదిరెట్లు వుంటాయి. ప్రతి షాపులో అమ్మే వస్తువుల మీద ఎమ్మార్పీ వుంటుంది కాని నక్షత్రాల హోటళ్ళలో అలాంటి నియంత్రణ, నిబంధన వుండనే వుండదు. ఇక సినిమా హాళ్లలో తినుబండారాల ధరలు చెప్పనలవి కాదు. ‘పేదరాసి పెద్దమ్మ సంస్కృతి రోజుల రుచికరమైన భోజనం, సత్రాల భోజనం, తరువాత కాలంనాటి ఉడిపి హోటళ్ళ భోజనాలు ఏమయ్యాయి?

         హోటెల్ రూమ్ లో సర్వీసుకు బాయ్ ని పిలిస్తే ఎక్కడకూడా తెలుగు వచ్చిన వాడు రాడు. వచ్చేవాడిది ఏభాష అనేది మనకు అర్థం కాదు. విదేశాల స్టైల్లో ఆలోచనలైతే వుంటాయి కాని సౌకర్యాలు మాత్రం అధ్వాన్నం. స్టైల్ గా టబ్ బాత్ వుంటుంది కాని దానికి అవసరమైనవేవీ పనిచేయవు. చూడడానికి అది అసహ్యంగా వుంటుంది. పోనీ మన అలవాటు ప్రకారం స్నానం చేద్దామంటే బకెట్, మగ్ ఇవ్వరు. వేడినీళ్లు ఎటువైపు నల్లా తిప్పితే వస్తాయో అడిగితే రూమ్ బాయ్ కి అర్థం కాదు. తెలిసినవాడు మరొకడు వుంటాడు. వాడిని పిలవాలి. ఇంకో దరిద్రం, రూమ్ కు వచ్చే ప్రతివాడూ ఎక్కడెక్కడో తిరగిన మట్టి తగిలిన బూట్లు వేసుకుని వస్తాడు. ఆ బూట్లతోనే మనగదిలో కులాసాగా విహరిస్తాడు. రూముల్లో వుండే ఏసీలు, టీవీలు ఒకపట్టాన పనిచేయవు. వాటి మెకానిక్ వేరే వుంటాడు. రూమ్ లో దిగినవారికి ఇవన్నీ సరిదిద్దేలా చేయించడానికి చాలా సమయం పడుతుంది. పెద్దపెద్ద హోటళ్లు వుంటాయి కాని, గదుల్లో దిగేవారి డ్రైవర్లు రాత్రిపూట వుండడానికి అందుబాటు ధరల్లో ఎలాంటి సౌకర్యం వుండదు. ఒకప్పుడు డ్రైవర్లు వేరు. ఇప్పుడు వారు కూడా స్వంత వూర్లో తమ ఇంట్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వారిని పరాయి వూరికి వెళ్లినప్పుడు కార్లో పడుకోమనడం అన్యాయం. అట్లా అని చెప్పి తమతోపాటు వారికి కూడా ఖరీదైన గది ఖర్చు భరించలేము. హోటల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చే ముందర వారికొరకు డార్మెట్రీ లాంటి ఏర్పాటు నిబంధన వుంటే మంచిదేమో!  

         ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నిత్య జీవితంలో ఇలాంటివి ఎన్నో!!! డాక్టర్ దగ్గరికి పోతే పాతరోజుల్లాగా వంటి మీద చేయి వేసి, స్టెతస్కోప్ పెట్టి పరీక్ష చేసి, చూడడం గత చరిత్ర అయిపోయింది. గుడికి పోతే దేముడి దగ్గర కొబ్బరికాయ కొట్టనివ్వరు. తీర్థం ఒకచోట, ప్రసాదం ఇంకొక చోట ఇస్తారు. వివిధ రకాల సేవల పేరుమీద చార్జీలు వుంటాయి. మొదట్లో పెద్ద గుళ్లకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు గ్రామాలకు, చిన్నచిన్న దేవాలయాలకు కూడా పాకింది. అన్నింటికీ అనవసరమైన పరిమితులు.

ఇంటికి కావాల్సిన నెలవారీ సరుకులు ఒకప్పుడు హాయిగా దగ్గరలోని కోమటి కొట్టుకు పోయి, స్వచ్చమైన, కల్తీలేని వాటిని, కొట్టువాడి ముందర పరీక్షచేసి చూసుకుని, తూకం వేయించుకుని కొనుక్కునే వాళ్లం. ఇప్పుడు సంస్కృతి మారింది. పెద్దపెద్ద సూపర్ బజార్లలోకి పోయి, మనమే మనకు కావాల్సిన సామాన్లు వెతికి పట్టుకుని, ఒక బండిలో వేసుకుని తెచ్చుకోవాలి. అన్నీ పాక్ చేసి వుంటాయి. ఇన్ని గ్రాములు, ఇన్ని కేజీలు అని వుంటుంది వాటిమీద. నిజంగా అంత తూకం వుంటాయా? లేదా? సందేహమే! పైగా ఒక ఎక్ష్పైరీ డేట్ వేస్తారు. అందులో ఎంత కల్తీనో తెలుసుకునే మానిటరింగ్ మెకానిజం లేదనాలి. తెచ్చుకున్న తరువాత విప్పిచూస్తే కొన్నిట్లో పురుగులు వుంటాయి. ఇదేంది అని అడుగుతే పాకింగ్ చేసింది మేం కాదుకదా! అని జవాబు. ఇక మెడిసిన్స్ షాప్ కు పోతే మనకు కావాల్సింది ఒక ఐదారు టాబ్లెట్స్ అయినా వాడు మొత్తం స్ట్రిప్ కొనమంటాడు. అసలే మెడిసిన్స్ ధరలు చాలా ఎక్కువ. అదనంగా ఇలాంటి దోపిడీ. ఏ వస్తువు కొన్నా (ఫర్నీచర్ దగ్గర నుండి, ఎలెక్ట్రానిక్ పనిముట్ల వరకు) వాటికి రిపేర్ వస్తే, కొన్న చోట కాకుండా వేరే వర్క్ షాప్ కు వెళ్లాలి. వాళ్లకు ఫోన్ చెయ్యాలంటే, టోల్ ఫ్రీ అనే నెంబర్ కు చేయాలి. అది ఏ దేశంలో వుంటుందో తెలియదు. వాళ్లు ‘ఒకటి నొక్కు, రెండు నొక్కు...’ అంటూ డిస్కనెక్ట్ చేస్తారు. 

         అసలు చిన్న చిన్న దుకాణాల సంస్కృతి పూర్తిగా పోవడం చాలా దురదృష్టం. చిన్నతనంలో తెల్ల కాగితాలు, పెన్సిల్, సిరా బుడ్డి, పిప్పరమింట్లు, చాక్లెట్లు, నువ్వుల జీడీలు, బిస్కట్లు లాంటివి కొనుక్కోవడానికి అక్కడక్కడ చాలా చిన్నచిన్న దుకాణాలు వుండేవి. ఇప్పుడు చిన్న గుండు సూది కొనాలన్నా పెద్ద షాపుకు పోవాల్సిందే! అధిక ధరలు చెల్లించాల్సిందే. ఇంటి ముందుకు, తాజా కూరగాయలు తెచ్చి అమ్మే రోజులు పోయి కూరగాయల మార్కెట్లు వెలిసాయి. వాటిమీద బతికేవారు ఉపాధి కోల్పోయారు. రైతుబజారు వాన్లలో ఇంటి ముందుకు వచ్చే కూరలను నేలమీద పెట్టి అమ్ముతుంటారు.

         ఫామిలీ డాక్టర్ సంస్కృతి పోయింది, పరాయి ఊరుకు వెళ్లినప్పుడు బంధువుల ఇళ్లలో వుండే అలవాటు పోయింది, చక్కటి, చిక్కటి స్వచ్చమైన పాలను ఇంటి ముందర కొనుక్కునే ఆచారం పోయింది, ఇంటి వెనుక పెరుగు చిలికిన చల్ల కడుపు నిండా తాగే రోజులు పూర్తిగా పోయాయి. వేరు శనగపప్పుతో ఎవరికివారు శనగ నూనె చేయించుకుని ఏడాది పొడుగూతా వాడే అలవాటు పోయింది. నడక ప్రయాణం కనుమరుగైంది. కడుపు నిండా భోజనం తినే సంస్కృతి స్థానంలో పిజ్జా, బర్గర్స్ వచ్చాయి. స్వచ్చమైన వెన్న, నెయ్యి లభ్యమయ్యే ప్రదేశాలు మచ్చుకైనా లేవు. జొన్న చేలలో ఉప్పు, కారం కలుపుకున్న దోసకాయలు కాని వుస బియ్యం కాని తినే రోజులు ఇకరావేమో! చేలల్లో పెసరకాయలు వలుచుకు తినే అదృష్టం ఇక లేనట్టేనేమో. అన్నీ ఫాస్ట్ ఫుడ్సే. పెరుగు, నెయ్యి, పాలు, తేనె, కూరలు, నూనె, ఒకటేమిటి, అన్నీ పాక్ చేసిన (కల్తీ) ఆహారాలే!!! చివరకు సీజనల్ పండ్లు కూడా కల్తీనే! కాలుతీసి కాలు బయట పెట్టకుండా, కనీస వ్యాయాయమం లేకుండా, వంటికి చెమట పట్టకుండా, నిరంతరం ఏసీ గదుల్లో వుంటూ, అన్నీ ఇంటి ముంగిటకే!!! బాత్రూమ్ కూడా బెడ్రూమ్ కు అనుభంధమే!!! ఇలా రాసుకుంటూ పొతే ఎన్నో వున్నాయి. ఇలా ఎన్నో కోల్పోతున్నాం. ఇంకా ఎన్ని కోల్పోవాలో?

         అభివృద్ధీ నీ పయనం ఎటువైపు? అంటున్నారు ఆలోచనాపరులు!!! అర్థంపర్థం లేని నీ వేగంతో పరుగులెత్తాలా? వేగం తగ్గించి తలపట్టుకోవాలా? వేగవంతమైన మార్పు ప్రజలను పిచ్చిగా మార్చే ప్రపంచాన్ని ఊహించిన ఆల్విన్ టాఫ్లర్ ఆలోచన వాస్తవరూపం దాల్చిందనడంలో ఆశ్చర్యం లేదు!!!

No comments:

Post a Comment