Sunday, April 16, 2023

ముక్తికి వైరాగ్యమే మూలమని, వైరాగ్యానికి జ్ఞానమే ఆధారమని స్పష్టం చేసిన భీష్ముడు .... ఆస్వాదన-116 : వనం జ్వాలా నరసింహారావు

 ముక్తికి వైరాగ్యమే మూలమని,

వైరాగ్యానికి జ్ఞానమే ఆధారమని స్పష్టం చేసిన భీష్ముడు

ఆస్వాదన-116

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (17-04-2023)

‘ధర్మాధర్మాల విచారం లేనిది, అన్ని సంశయాలను పోగొట్టేది, చావు-పుట్టుకలు లేనిది, శుచి-శుభ్రత కలిగినది, శాశ్వతమైనది, మార్పులేనిది, పరం అని పిలువబడేది, దుఃఖాన్ని పోగొట్టేదైన తత్త్వాన్ని  బోధించమని తాత భీష్ముడిని కోరాడు ధర్మరాజు. మహాజ్ఞానైన మహర్షి యాజ్ఞవల్క్యుడు జనక మహారాజుకు ఈ విషయాలను వివరించాడని, ఆయన మాటల్లోనే వాటిని తాను చెప్తానని భీష్ముడు ధర్మరాజుతో అన్నాడు. అని అంటూ, ఈ విధంగా చెప్పసాగాడు.

‘పదికల్పాలు ఒక పగలు. పదికల్పాలు ఒక రాత్రి. పగటిపూట సృజన, రాత్రిపూట ప్రళయం. అన్నిటికంటే ముందు ఓషధీ సృష్టి జరుగుతుంది. దీనికొరకు ఈ బ్రహ్మాండంలో విధాతను సృష్టిస్తుంది. అతడు పంచభూతాలను సృష్టిస్తాడు. వీటికి సారభూతమైన గుణాలను ఐదు ఇంద్రియాలు గ్రహిస్తాయి. ఈ ఇంద్రియాలకు మనస్సు ప్రభువు. ఇంద్రియాలు ఏమీ గ్రహించలేవు. గ్రహించేది మనస్సే. మనస్సు నిద్రపోతే ఇంద్రియాలు అన్నీ నిద్రపోతాయి. ఇంద్రియాలు నిద్రపోయినా మనస్సు మాత్రం నిద్రపోదు. అందువల్ల మనఃప్రధానాలు ఇంద్రియాలు. మనస్సు కనుక విషయాసక్తి నుండి వెనక్కు మళ్లితే ఇంద్రియాలు అన్నీ దానితోపాటే వెనక్కు మళ్లుతాయి. కాబట్టి ఇంద్రియ నిగ్రహంతో పాటు మనోనిగ్రహం కూడా అత్యవసరం’.

‘బుద్ధి ఆధ్యాత్మమని, బోద్ధవ్యం ఆధిభూతమని, క్షేత్రజ్ఞుడైన జీవుడే ఆధిదైవతమని వేదాలు చెప్తున్నాయి. అహంకారమనేది ఆధ్యాత్మం. దానికి అభిమానమనేది ఆధిభూతం. ఆధిదైవతమేమో రుద్రుడు. చిత్తం ఆధ్యాత్మం, చేతయితవ్యం దానికి ఆధిభూతం, పరబ్రహ్మం దానికి ఆధిదైవతం అని ఆగమాలు చెప్తున్నాయి. ప్రకృతి, పురుషుల పద్ధతులు వినడం వల్ల మనస్సు నిర్వికారత్వాన్ని పొందుతుంది. ప్రకృతి అనేది గుణరూపాలను వ్యాప్తి పొందిస్తుంది. పురుషుడు చైతన్య సహితుడు. ప్రకృతికి చైతన్యం లేకపోయినా పురుషుడి ప్రకాశంలో తాను జగత్భారాన్ని వహిస్తుంది. పురుషుడిని కూడా తనవెంట తిప్పుకుంటుంది’.

‘పురుషుడి యథార్థరూపాన్ని గ్రహించగల జ్ఞానం ప్రకృతికి లేదు. కానీ, ప్రకృతిని తెలుసుకోగల జ్ఞానం, చైతన్యం పురుషుడికి వున్నాయి. ఈ కారణాన ప్రకృతి అచేతన అని, పురుషుడు సచేతనుడని అర్థమవుతున్నది. పురుషుడు ప్రకృతిలో వుంటాడు. ప్రకృతిని తనలో నిలుపుకొంటాడు. కానే ఈ కలయికవల్ల తాను మాత్రం ఏ వికృతినీ పొందడు’. భీష్ముడు కొనసాగిస్తూ ఇంకా ఇలా చెప్పాడు.

‘సప్తర్షి మండలంలో అరుంధతిని చూడగలిగిన శక్తి కంటికి వున్నప్పటికీ అరుంధతి కనపడకపోతే వాడి ఆయుర్దాయం ఇక ఒక సంవత్సరం మాత్రమే అని గ్రహించాలి. నాసికకు కుడివైపున ఒక ముక్కు వూడిపోయినట్లు తన చూపులకే అనిపిస్తే వాడు కూడా ఒక సంవత్సరం కంటే ఎక్కువ జీవించడు. నిండు చందమామ మకిలి పట్టినట్లు బూజురు-బూజురుగా కనిపిస్తే అతడూ సంవత్సరం తరువాత బతకడు. ముఖవర్చస్సు ఇదివరకు లాగా కాకుండా బాగా పెరిగినట్లు కనబడినా, తరిగినట్లు కనబడినా, తెలివి కూడా అలాగే పెరిగినట్లో, తరిగినట్లో అనిపించినా వాడు ఆరునెలల్లో సెలవు తీసుకుంటాడని గుర్తించాలి. సూర్యచంద్ర బింబాలలో తొర్రెలు కనబడితే వాడు వారం రోజులకంటే ఎక్కువ బతకడు. గుడికి పోయినప్పుడు అక్కడి సుగంధ ద్రవ్యాలు దుర్గంధంలాగా సోకితే వాడు ఆరునెలల్లో చనిపోతాడు. ఇవన్నీ బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పిన మాటలు.

‘జీవాత్మ, పరమాత్మల ఏకత్వమహిమను ఎరుకపరచడమే విజ్ఞానం (విద్య) చేసే పని. చిత్తశాంతి లేనివారికి పరానందం లభించదు. ఏకత్వమహిమ సిద్ధించదు. మమకారాన్ని విడిచిపెట్టుకుంటే మోక్షం లభిస్తుంది. ఇదే ముక్తికి మార్గం మరి వేరే మార్గాలు లేనే లేవు. జనన మరణాలను జయించడమే మోక్షపదవి. అది కేవలం జ్ఞానం చేతనే లభిస్తుంది కాబట్టి జ్ఞానసాధన అనేది అన్ని రకాలా ఉత్తమోత్తమ కర్తవ్యం. జ్ఞానం కావాలనుకునే శిష్యుడికి శ్రద్ధ వుండాలి. శ్రద్ధ లేకపోతే జనన మరణ రూపకమైన అజ్ఞానం వదలదు. అజ్ఞానం వల్ల జీవాత్ముడు కర్మాచరణబంధనంలో కూరుకొనిపోతాడు. అతడికి జననమరణాదులు అంతరించవు. మోక్షపదం లభించదు. సరైన జ్ఞానం కలవాడికి ముక్తి కరతలామలకం. శోకహేతువైన మొహాన్ని లేదా శోకాన్ని విడిచిపెట్టి, జ్ఞానం వల్ల కలిగే ధైర్యాన్ని నిలుపుకోవాలి’.

ఈ విధంగా యాజ్ఞవల్క్య మహర్షి వచనాలను (గొప్ప విద్యను) ధర్మరాజుకు భీష్ముడు  ఉపదేశించాడు. ఆ మాటలకు ధర్మరాజు సంతోషించి, తన మనసులో వున్న మరో అనుమానాన్ని గురించి అడిగాడు. ‘గృహస్థ ధర్మాన్ని వదలకుండా మోక్షం పొందవచ్చా?’ అని ప్రశ్నించాడు పితామహుడిని. ‘జనక-సులభాదేవిల సంవాదం గా ప్రసిద్ధికెక్కిన ఒక ఇతిహాసాన్ని ధర్మరాజు ప్రశ్నకు సమాధానంగా ప్రస్తావించాడు భీష్ముడు. ఆ ఇతిహాస సారాంశాన్ని వివరించాడిలా.

‘ముక్తికి వైరాగ్యమే మూలం. వైరాగ్యానికి జ్ఞానమే ఆధారం. జ్ఞానంతో కలిగిన విరక్తి అంతరంగంలో వుంటే సుఖదుఃఖాలు, రాగద్వేషాలు లాంటి వాటికి అతీతంగా జీవించవచ్చు. వేదాంత గ్రంథాలు చదివిన మోక్షవేత్తలు జ్ఞాననిష్ట, కర్మనిష్ట అనే రెండు మార్గాలు చెప్తుంటారు. కాని సులభమైన మూడో మార్గం కూడా వున్నదని కొందరంటారు. గృహస్థాశ్రమం వదిలేసి సన్న్యాసాశ్రమం స్వీకరించినంతమాత్రాన సాంగత్యం వదలాలని లేదు. గృహస్థాశ్రమం వద్దని ద్వేషించడం కూడా ఒక సంగమే (తగుల్కోలు). రాగమే కాదు, ద్వేషం కూడా పంకిరాదు. సన్న్యాసాశ్రమం స్వీకరించడానికి చిహ్నాలైన కాషాయధారణ, ముండనం, దండకమండల వహనం లాంటివి మోక్షాన్ని ఇవ్వవు. బాహ్య చిహ్నాలకు జ్ఞానప్రదానశక్తి వుండదు. జ్ఞానమనేది ఆత్మగుణం. ఈ చిహ్నాలు ఏవీ లేకుండానే జ్ఞాని కావచ్చు. దుఃఖ తొలగిపోతుందని కాషాయాది చిహ్నాలను స్వీకరిస్తారు. జ్ఞానం వల్ల మాత్రమే ముక్తి లభిస్తుంది. చిహ్నాలవల్ల కానేకాదు’.

భీష్ముడి ద్వారా ‘జనక-సులభాదేవిల సంవాదం గా ప్రసిద్ధికెక్కిన ఇతిహాస సారాంశాన్ని విన్న ధర్మరాజు, తన తరువాత ప్రశ్నగా ‘శుకుడికి వైరాగ్యం ఎలా కలిగిందని అడిగాడు. వేదవ్యాసుడు శుకుడికి చేసిన ఉపదేశ సారాంశాన్ని వివరించాడు భీష్ముడు ధర్మారాజుకు ఆయన మాటల్లోనే.

‘మనస్సును, ఇంద్రియాలను మర్దించి స్వాధీనం చేసుకోవాలి. వాటిని ఎప్పుడూ తప్పుడు దారిలోకి రానివ్వద్దు. అదుపులో వుంచుకోవాలి. క్రోధత్యాగం, సత్యం, నిగ్రహం, ఋజుత్వం, తపస్సు, అహింస అనేవి ధర్మానికి ఆకారాలు. శరీరం నురుగుతో చేసిన పంజరం లాంటిది. ఇందులో ఒక పిట్టలాగా వుంటున్నది ప్రాణం. దీనిని మరచి తిరగడం తగదు. లెక్కపెట్టుతూ వుంటే సంవత్సరాలు వెళ్లి పోతుంటాయి. ఇలా క్రమంగా ఆయుర్దాయం తరగిపోయి, చివరకు పిట్ట ఎగిరిపోతుంది. సంసారం ఒక సముద్రం. చంచలమైన ఇంద్రియాలే నీళ్లు. అరిషడ్వర్గమే మొసళ్లు. దీనిని దాటడానికి ధైర్యం ఒక్కటే తెప్ప. దానితోనే తరించాలి. కామాది సౌఖ్యాలతో తృప్తుడై జీవుడు ఏమరితే మృత్యువు తన్నుకొనిపోతుంది’.

‘కాలం లోకాన్ని ఎన్నో ఇబ్బందులపాలు చేస్తున్నదని గమనించి అత్యంత ధైర్యంతో ధర్మాచరణం ఒక్కటే ఏకాంతం అనే నిర్ణయం తీసుకొని కాలవికారాలను జయించగలగాలి. మానవజన్మ బహుదుర్లభం. దాన్ని ఒక సోపానంగా చేసుకొని నిచ్చెన ఎక్కి, మోక్షపదం అందుకోవాలి. పూర్వజన్మల లక్షణాలు దరికి రానివ్వకూడదు. భోగాలను వదిలి, నిస్సంగుడై, నిర్మలాంతరంగుడై తాదాత్మ్యంలో తపస్సు చేసుకునేవాడు సంసార సముద్రాన్ని తేలికగా దాటుతాడు. భోగానికి, త్యాగానికి కాని ధనం ఎందుకు? శత్రు సంహారం చేయలేని బలదర్పాలు ఎందుకు? ధర్మాచరణానికి పూనుకొని జ్ఞానం ఎందుకు? జితేంద్రియుడు కాలేనప్పుడు ఆత్మతత్త్వం గురించి శ్రమపడి తెలిసికొని ఏమి లాభం?’.

వ్యాసుడు ఇలా ఉపదేశించేసరికి శుకుడికి ముక్తిమార్గం తెలిసిపోయిందని, ఆత్మ నివాత నిశ్చల ద్వీపంలాగా ప్రకాశించిందని, తండ్రిని వదిలి వెళ్లిపోయాడని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.     

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, షష్టాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

         

       

No comments:

Post a Comment