అక్షరం-క్షరం తత్త్వాలను, జీవతత్త్వ-పరతత్త్వాలను,
విద్య-అవిద్యలను
వివరించిన భీష్ముడు
ఆస్వాదన-115
వనం జ్వాలా నరసింహా రావు
సూర్యదినపత్రిక (10-04-2023)
‘అక్షరం’ అనేది ఎలాంటిది? ‘క్షరం’ అంటే ఏమిటి? తెలపమని ధర్మరాజు పితామహుడిని అడిగాడు. ‘వశిష్ట-జనకుల
సంవాదం’ అనే ఇతివృత్తం ఆధారంగా ధర్మరాజుకు కావాల్సిన
విశేషాలన్నీ తెలుస్తాయని అంటూ ఆ వివరాలను చెప్పసాగాడు భీష్ముడు.
‘కరచరణాది
అవయవాలు కలిగి వుండి, ఆది, అంతం, క్షయం, వృద్ధి లేనటువంటి ఏకైక తత్త్వాన్ని
అక్షరం అని అంటారు. ఏకైకం అంటే నిర్విభేదం (విభేదం లేనిది), నిర్ద్వయం (ద్వయం
లేనిది), అద్వితీయం (ద్వితీయం లేనిది) అని తాత్పర్యం. సర్వత్రగామి, సర్వదర్శి,
సర్వగతి, సర్వశిరస్సు, సర్వానందం, సర్వశ్రోత అయ్యి,
అంతటా ఆవరించిన ఆ పరబ్రహ్మమే అక్షరం. అక్షరతత్త్వం నుండి 24 క్షరతత్త్వాలు
ఆవిర్భవించాయి’.
‘ప్రకృతి లేదా
ప్రధానం లేదా అవ్యక్తం అనబడే తత్త్వం ఒకటి. దాన్నుండి ఆవిర్భవించే మహత్తు రెండు.
అహంకారం మూడు. ఐదు పంచభూతాలు, ఐదు పంచగుణాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు
కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 24. క్షరమే 24 తత్త్వాలుగా
అవుతుంది. అక్షరతత్త్వానికి ఎక్కడా క్షరభావం వుండదు. అయితే క్షరతత్త్వాలు అన్నీ
అక్షరతత్త్వం తాలూకు విలాసాలే. ఈ 24 తత్త్వాలూ విజ్ఞానానికి అందుతాయి. 25 వ
అక్షరమైన పరమతత్త్వం విజ్ఞానానికి గోచారం కానిది. నాశనం లేనిది. మృతిలేనిది’.
‘అక్షరతత్త్వానికి
ప్రబోధం లేకపోతే సత్త్వరజస్తమోగుణాల సంయోజన కారణంగా నానాజాతులలో జన్మపరంపరలను
పొందుతూ వుంటుంది. ఇది అక్షరతత్త్వానికి ఒక క్రీడావిలాసం. సత్త్వరజస్తమోగుణాలను
అనుసరించడం వల్ల జన్మపరంపరలోనికి జారిపోయిన ఆ అక్షరతత్త్వం తనను తాను తెలుసుకోలేక అదే
తాను అనుకోని వాటిలో నివాసం సాగిస్తూ వుంటుంది. సత్త్వగుణానికి వశవర్తి అయ్యి, అక్షరతత్త్వం దివ్యత్వంతో సుఖాలను అనుభవిస్తూ
వుంటుంది. రజోగుణానికి వశవర్తి అయ్యి,
సుఖదుఃఖాలను చేరిసగంగా అనుభవిస్తుంది. తమోగుణానికి వశవర్తి అయ్యి కేవలం
పాపకృత్యాలనే ఆచరించి నరకం అనుభవిస్తుంది. అక్షరానికి స్వతస్సిద్ధంగా ఏ రంగూ లేదు.
త్రిగుణాలను ఆచరించడం వల్ల మార్పులకు లోనవుతుంది. సత్త్వరజస్తమోగుణాను సారంగా
వరుసగా తెలుపు, ఎరుపు,
నలుపు రంగులను పొందుతుంది. అహంకార గుణం ఈ
వికారాలకు కారణం. నిర్వికార స్థితిలో మళ్లీ ప్రదీప్తం అవుతుంది’.
‘అక్షరాతత్త్వం
క్రతువులు చేయడం, తీర్థయాత్రలకు తిరగడం, ఏకభుక్తాలు వుండడం, నేలమీద నిద్రపోవడం మొదలైన నియమాలతో శరీరాన్ని
సంకటపెట్తుంది. అది అచ్యుతమే (చ్యుతి లేనిది),
అమలమే (మలినరహితం) అయినప్పటికీ ఇప్పుడు అప్రబుద్ధం (జ్ఞాన ప్రబోధం లేనిది).
అక్షరతత్త్వానికి చావు, పుట్టుక, ముసలితనం లాంటివి ఏమీలేవు. అది అమలం. కాని
ఇవన్నీ తనకు ఉన్నాయని భావిస్తుంది. స్వతస్సిద్ధంగా నిర్గుణమైన అక్షరతత్త్వం
ప్రకృతి గుణాలు సంక్రమించడం వల్ల సగుణత్వాన్ని పొందుతున్నది. అక్షరతత్త్వం
అఖండశాంతి బోధతో మునుపటి గొప్పదనాన్ని మళ్లీ పొంది విరాజిల్లుతుంది’.
‘స్త్రీ-పురుషులు
పరస్పరం కలుస్తేనే మరొక రూపాన్ని ఉత్పత్తి చేయగలరు కాని, విడివిడిగా ఆ ఇద్దరిలో ఎవ్వరికీ ఆ నేర్పులేదు.
వేదం అదే చెప్తున్నది కూడా. చర్మం,
మాంసం, రక్తం అనేవి స్త్రీ నుండి; మజ్జ,
ఎముకలు, స్నాయువులు (ఆయువు పట్టులు) అనేవి పురుషుడి
నుండి బిడ్డకు లభిస్తాయని కూడా వేదం చెప్తున్నది. పురుషుడికీ, ప్రకృతికీ వున్న ఆకర్షణ నరనారీసంబంధం వరసే.
స్త్రీ-పురుష సంబంధం లాంటిదే ప్రకృతి-పురుషుల పరస్పరాకర్షణ. అదే సమస్త
ప్రాణికోటికి జన్మహేతువు. వేదాలు కూడా ఇదే చెప్తున్నాయి’.
‘సాంఖ్య, యోగ
శాస్త్రాలు అభిన్నాలు. రెంటికీ వేదమే జన్మస్థానం, ఆధారం. విత్తనం నుండి విత్తనం, దేహం నుండి దేహం, ఇంద్రియాల నుండి ఇంద్రియాలు, మనస్సు నుండి మనస్సు జన్మిస్తాయి. ఆత్మ అనేది
నిర్గుణం. దానికి భవబంధాలు, భవదుఃఖాలు, కర్మాచరణలు లాంటివి ఏవీ వుండవు. గుణాలు
ప్రకృతివే కాని పరమాత్మవి కావు. అజ్ఞానులు అక్షరతత్త్వాన్ని గ్రహించలేరు.
తెలుసుకోలేరు. జ్ఞానులైన సాంఖ్యులు, యోగులు, 25
వదైన అక్షరతత్త్వాన్ని దర్శిస్తారు. యోగం అంటే ధ్యానం. అది ప్రాణాయామం (సగుణత్వ
విధానం) అని, మానసిక ఏకాగ్రత (నిర్గుణత్వ పధ్ధతి) అని రెండు
రకాలుగా వుంటుంది. ఆత్మస్వరూపాన్ని నిరంతరం దర్శించుకొంటూ యోగి ఆనందిస్తాడు. ఇక
సాంఖ్యులు ఈ ప్రకృతిని అవ్యక్తం అని అంటారు. దీనికి ప్రసవించే ధర్మం వున్నది.
పురుషుడి వల్ల ఈ విస్తరణ అంతా జరుగుతుంది. పురుషుడే దీని అంతటికీ అధిష్ఠాత’.
‘అనులోమంలో
(పైనుండి కిందకు) నుండి సృష్టి జరుగుతుంది. ప్రతిలోమంలో (కిందినుండి పైకి) సంహారం
జరుగుతుంది. సృష్టి జరుగుతున్న సమయంలో ప్రకృతికి అనేకత్వం శోభిస్తుంది. ప్రళయ
సమయంలో ఏకత్వం విరాజిల్లుతుంది. ప్రకృతిలో వున్నందున పురుషుడుగా జీవుడు
ప్రకాశిస్తున్నాడు. ప్రకృతి వేరు, పురుషుడు వేరు అనేది స్పష్టం. ప్రకృతి
జ్ఞానం. పురుషుడు తెలుసుకోవాల్సినవాడు. ప్రకృతికి గుణాలున్నాయి. పురుషుడు
నిర్గుణుడు. ఇది సాంఖ్య పధ్ధతి. ఇలా 24 తత్త్వాలనూ గ్రహించి దర్శించుకొంటే మోక్షం
కలుగుతుంది. ఇది పునర్జన్మ లేని స్థితి. తత్త్వసమూహం వ్యక్తం కానిది. నాశవంతమైనది.
పురుషుడు ప్రకట స్వరూపుడు, క్షరం లేనివాడు. ఈ విషయం తెలిసిన వారు
నిర్భయంగా వుండగలరు’.
’25 వ తత్త్వమైన
అక్షరమే విద్య. ప్రకృతియే అవిద్య. జీవుడిని అక్షరమని, ప్రకృతిని క్షరమని అంటారు. ఈ రెంటినీ కలిపి
కొందరు క్షరాలు అని, మరికొందరు అక్షరాలని కూడా అంటారు. ఆద్యంతాలు లేకపోవడం, ఈశ్వరతత్త్వాన్ని కలిగి వుండడం, జీవుడికి,
ప్రకృతికి వున్న సాదృశ్యాలు. ప్రకృతి గుణాలను పొందినప్పుడు పురుషుడు (జీవుడు) తనను
తాను ప్రకృతిగా భావిస్తాడు కాబట్టి అతడిని క్షరం అని కూడా అనవచ్చు. ప్రకృతి
పురుషుడిని పొందినప్పుడు దానిని నిర్గుణం అనీ,
అక్షరమనీ వ్యవహరించవచ్చు. ఎన్నిరూపాలలో
ప్రకృతి విజృంభించినప్పటికీ, మమకారం, అహంకారం అనే రెండే దీని మూలతత్త్వాలు. ఈ రెండూ పరిహరించగలిగితే
ప్రకృతి పురుషుడిని ఏమీ చేయలేదు’.
‘నిశ్చేతనత, దుశ్చేష్టతలు ప్రకృతి లక్షణాలు. అలాంటి
ప్రకృతిని విడిచిపెట్టాలి. అప్పుడు నిశ్చయవృత్తితో నిరామయ, నిశ్చల,
నిర్మలపదాన్ని పొందవచ్చు. ఉత్తమ జ్ఞానం వల్ల నశించే ప్రకృతిని విడిచిపెట్టినప్పుడు
పురుషుడు 25 వ తత్త్వం అక్షరుడు అనబడుతాడు. దీనికంటే పైన వున్న ఉత్తమ తత్త్వాన్ని
సాంఖ్యులు తప్ప చాలామంది ఎరుగరు. క్షరుడు,
అక్షరుడు, ఉత్తముడు అప్రబద్ధులు (తెలుసుకోబడనివారు). 26 వ
తత్త్వం పురుషతత్త్వం. వరుసగా ఇవి తెలిసికొనబడనిది, తెలిసికొంటున్నది, తెలియబడినది. చివరిదైన పరతత్త్వం
జ్ఞానసంపన్నం, శుద్ధం,
కొలతకు అందనిది, శాశ్వతమైనది. ఇది 25 వ, 24 వ తత్వ్వాలను దర్శిస్తూ వెలుగొందుతుంది’.
‘దృశ్యము, అదృశ్యం అయిన ఈ జీవతత్త్వ పరతత్త్వాలను
బ్రహ్మము అని కూడా అంటారు. ప్రకృతికి అదిలేదు. ప్రకృతిని విడిచేసి జీవుడు తనను
తాను తెలుసుకొని పరతత్త్వాన్ని దర్శించేటప్పుడు ప్రకృతి తాలూకు సగుణత్వస్థితి
నశించిపోతుంది. తన్మయత్వాన్ని పొంది పురుషుడు కేవల జీవతత్త్వసిద్ధిని గ్రహిస్తాడు.
కేవలత్వాన్ని గుర్తించిన జీవుడు తనను తాను పరతత్త్వంగా దర్శించి తల్లీనుడౌతాడు
(తన్మయత్వం). అదే నిరామయం, అనంతం అయిన పదం. పురుషుడికి
సంబంధించిన ఏకత్వం, అనేకత్వం అనే విషయాలను శాస్త్రమర్యాదతో
తెలుసుకోవచ్చు. శ్రద్ధవున్నవాడు గ్రహించగలడు. పురుషుడు 26 వ తత్త్వంతో
కలిసినట్లయితే కేవలత్వనిర్మలత్వాది పరతత్త్వ లక్షణాలను పొందుతాడు. వాటితో సమైక్యం
చెందుతాడు’.
ఈ విధంగా
వశిష్టుడు జనక మహారాజుకు చెప్పిన మాటలను ధర్మరాజుకు వివరించాడు భీష్ముడు.
యోగ్యతాయోగ్యతలు చూడకుండా ఎవడికి ఇవ్వాలనుకుంటే వాడికి సామ్రాజ్యం అంతా
ఇవ్వవచ్చుకాని, విద్యను మాత్రం యోగ్యతలు లేనివాడికి ఎప్పుడూ
ఇవ్వవద్దని, అర్హుడు అయినట్లయితే ఆలస్యం చేయకుండా ఉపదేశించాలని వశిష్టుడు అన్న
విషయం కూడా చెప్పాడు. మొట్టమొదట ఈ తత్త్వరహస్యాన్ని బ్రహ్మదేవుడు వశిష్టుడికి, ఆయన
నారదుడికి, నారదుడు తనకు తెలియచేశాడని, తానిప్పుడు ధర్మరాజుకు ఉపదేశించానని భీష్ముడు
అన్నాడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, శాంతిపర్వం, షష్టాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment