Monday, August 7, 2023

ధర్మరాజుకు సమస్త ధర్మాలను ఉపదేశించి నిర్యాణం చెందిన భీష్ముడు ..... ఆస్వాదన-132 : వనం జ్వాలా నరసింహారావు

ధర్మరాజుకు సమస్త ధర్మాలను ఉపదేశించి నిర్యాణం చెందిన భీష్ముడు

 ఆస్వాదన-132

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (07-08-2023)

ధర్మాలు అనేక విధాలుగా ఉంటాయని, వాటిలో ఆచరించదగిన ఉత్తమ ధర్మం ఏదని పితామహుడిని ప్రశ్నించాడు ధర్మరాజు. ధర్మం ఇలాంటిదని ఆ ధర్మ స్వరూపం తెలిసిన మహనీయులు మాత్రమే చెప్పగలరని, కాల పరిణామం వల్ల ధర్మం అందుకు భిన్నంగా గోచరిస్తుందని, స్పష్టతను కోల్పోయి మరుగున పడుతుందని భీష్ముడు అన్నాడు. పరిశీలాత్మకమైన సూక్ష్మబుద్ధి లేనందువల్ల ఒక్కొక్కప్పుడు అధర్మం ధర్మమనే భావన కలిగిస్తుందని, ఇది ధర్మం, ఇది అధర్మం, అని సరిగ్గా చూపలేక పోవడం వల్ల, ధర్మబోధ చేసేవారు ఆ ధర్మం విలక్షణత్వాన్ని తొలగేట్లు చెప్పడం వల్ల ధర్మం దారితప్పుతున్నదని, దానివలన దోషం ఏర్పడుతుందని చెప్పాడు. ధర్మ సూక్ష్మం తెలియని వారి బోధలు విని కార్యాచరణకు పూనుకునేవారికి చివరకు దుఃఖమే మిగులుతుందని, ధర్మం చాలా సూక్ష్మమైనదని, దానిని పవిత్ర చరిత్రుల దగ్గరే నేర్చుకోవాలని అన్నాడు భీష్ముడు. 

భీష్ముడి మాటలు విన్న ధర్మరాజు, ధర్మసూక్ష్మం అంటే ఎలాంటిదో తెలియచేయమని కోరాడు. ధర్మవిశేషాన్ని తెలిసికొనటంలో మూడు దశలున్నాయని, అహింస, దానం, సత్యం, క్రోధపరిత్యాగం అనేవి ఉత్తమ ధర్మాలని, ఈ గుణాలు ధర్మానికి పరమావధులని, కాబట్టి ధర్మరాజు తన మనసును ఆ గుణాలను అనుసరించే విధంగా చేయాలని చెప్పాడు భీష్ముడు.  అలాగే, రజస్తమోగుణ వికారాలు గల మనస్సున్నవారు ధర్మాన్ని ద్వేషిస్తారని, వారు నరకానికి వెళ్తారని, సత్యవ్రత పరాయణులు నిరంతరం ధర్మాన్నే సేవిస్తారని, వారు స్వర్గలోక నివాసానికి అర్హులని, మంచిబుద్ధికలవారు ధర్మాన్నే ఆశ్రయించి సేవిస్తుంటారని తన జవాబును కొనసాగించాడు భీష్ముడు.

సాధువులు, అసాధువులనేవారు ఎటువంటివారో చెప్పమని అడిగాడు ధర్మరాజు పితామహుడిని. సమాధానంగా భీష్ముడు ఇలా చెప్పాడు. ‘అసాధువులు తమంత తాము తెలిసినవారు కారు. ఇతరులు బోధించిన సదుపదేశాలను గ్రహించలేరు. సాధువులు అట్లా కాదు. వారు స్వయంగా తెలిసినవారు. ఇతరులు మంచి చెప్పగా స్వీకరిస్తారు. వారు శిష్యులతో కలిసి భుజిస్తారు. తగినవారికి దారి ఇచ్చి గౌరవిస్తారు. ఋజుమార్గాన్ని అనుసరిస్తారు. రక్షణ కోరిన వారిని కాపాడుతారు. సరసభోజనం, భార్యాసంభోగం,  గురువులను గౌరవించటం, నిర్మలహృదయాలను, నిత్య సంతోషాన్ని కలిగి ఉండటం వారి లక్షణాలు. వారు విషయ చాపల్యాన్ని వదులుతారు. పాపాలకు ప్రాయశ్చితం చేసికొంటారు. దర్మాన్ని అప్రకాశంగా ఆచరిస్తారు. భూతదయను ప్రదర్శిస్తారు’.

         ధర్మరాజు తన తరువాత ప్రశ్నను ఈ విధంగా అడిగాడు. ‘లోకంలో కొందరికి ప్రయత్నం లేకుండానే దనం లభిస్తుంది. ధర్మాన్ని ఆచరించేవారు, నీతి తెలిసినవారు పెక్కు మంచి పద్ధతులతో ధనాన్ని కోరినా అది లభించరు. కొందరికి అది లభించినా అది వారి సౌఖ్యానికి ఉపయోగపడదు. గురుబోధ ఎక్కువగా లేకపోయినా కొందరికి విద్య అలవడుతుంది. కొందరు బోధ పొంది కూడా దుర్విద్యులౌతున్నారు. కొందరు రోగాల పాలబడి దెబ్బలు తినకుండా చావరు. కొందరు గడ్డిపరక తగలటంచేత కూడా మరణిస్తారు. ఇలాంటి వైపరీత్యాలకు కారణం ఏమిటి?’.

సమాధానంగా భీష్ముడు ఇలా చెప్పాడు ధర్మరాజుకు. ‘విత్తు లేకుండానే చెట్టు మొలుస్తుందా? అదే విధంగా, పూర్వజన్మలో చేసిన కర్మ ఈ జన్మలో ఫలాన్నిస్తుంది. గతంలో దానాలవంటి సత్కార్యాలు చేస్తే ఈ జన్మలో ప్రయత్నం లేకుండానే కోరికలు ఫలిస్తాయి. పూర్వజన్మలో తపస్సులు చేస్తే ఈ జన్మలో అనేక సౌఖ్యాలూ, గురుసేవ చేస్తే విద్యాబలం, అహింస పాటిస్తే నిండు సుఖజీవితం లభిస్తాయి. అటువంటివి పూర్వజన్మలో చేయకపోతే ఈ జన్మలో అనేక కష్టాలు కలుగుతాయి. ఎల్లప్పుడూ ధర్మం మీద నిష్ఠ కలవాడికి కాలమే ధర్మరహస్యాన్ని కలిగిస్తుంది. ధర్మసాధనవలన మానవుడు ఇహలోకంలో శాంతినీ, పరలోకంలో ఆనందాన్ని పొందుతాడు. మోక్షాన్ని సాధిస్తాడు. దానం, తపస్సు, పెద్దలను సేవించడం, ప్రాణులను హింసించకుండా వుండడం  అనేవి సమస్త జనులు విధిగా ఆచరించాల్సిన కార్యాలు.

వేదవ్యాస మునీంద్రుడు ధర్మరాజుకు మార్గదర్శని, వాసుదేవుడు ఆరాధ్య దైవమని, అందువల్ల చింత విడిచి పెట్టి, శాంతవృత్తితో ప్రజలను పాలించుమని, ఆయనకు సర్వత్రా విజయం లభిస్తుందని భీష్ముడు చెప్పాడు. భీష్ముడి సాటిలేని మాటలు విన్న ధర్మరాజు ముఖం వికసించింది. అప్పుడు వేదవ్యాసుడు భీష్ముడిని చూసి, ఆయన ఉపదేశానుసారం ధర్మరాజుకు జ్ఞానం కలిగిందని, అతడి సోదరులు, కృష్ణుడు, ఆప్తులైన రాజులు, ధృతరాష్ట్రుడు ఆయన్ను తగినట్లుగా గౌరవించి అతడి దయకు పాత్రులయ్యారని, ఇక ధర్మరాజుకు సెలవియ్యమని, సమయం వచ్చినప్పుడు భీష్ముడి వద్దకు తిరిగి వస్తాడని అన్నాడు.

వేదవ్యాసుడి మాటలకు స్పందించిన భీష్ముడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు. ‘నువ్వు పట్టణానికి వెళ్లు. నీకు సర్వశుభాలూ కలుగుతాయి. నీ బుద్ది ధర్మంలో వుండుగాక. యయాతిలాగా సమగ్ర దక్షిణలతో యజ్ఞాలు నిర్వహించు. రాజధర్మాలతో ప్రజలను రంజింపజేయి. నీ బంధువులు, స్నేహితులు నిన్ను ఆశ్రయించి సుఖిస్తారు. సూర్యుడు మకర రాశిలో (ఉత్తరాయణం) ప్రవేశించడం తెలిసికొని నా దగ్గరికి రా. నువ్వూ, నీ తమ్ములూ, ధృతరాష్ట్రుడూ సుఖంగా ఉండండి’. ధర్మరాజు ఆనందంతో భీష్ముడికి సాష్టాంగ దండప్రణామం చేసి వెళ్లి వస్తానని చెప్పి హస్తినాపురం చేరాడు. భీమాదులు తనను సేవిస్తూ ఉండగా ధర్మరాజు పట్టాభిషేక సమగ్ర రాజ్యాధికారాన్ని పొంది ఆనందించాడు. రాజ్యాన్ని స్వీకరించి, ప్రజలు మెచ్చుకొనేటట్లు పాలిస్తూ ఏభై రోజులు గడచిన తరువాత సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించాడని తెలిసికొని భీష్ముడిని దర్శించటానికి బయలుదేరాడు.

గాంధారి, ధృతరాష్ట్రుడూ, కుంతి ముందు నడువగా, శ్రీకృష్ణుడిని, ఆయన తమ్ముడు సాత్యకిని, తన తమ్ములైన భీమాదులను, విదుర సంజయులను, యుయుత్సుడిని, కృపాచార్య, ధౌమ్యుడిని, ఋత్విక్కులను  వెంటబెట్టుకుని ధర్మరాజు భీష్ముడి దగ్గరికి బయల్దేరాడు. అనేక రకాల వస్తువులను, పవిత్రాగ్నిని తనతోపాటు తీసుకెళ్లాడు. భీష్ముడికి దగ్గరలో తన రథం దిగాడు. వెంటనే శ్రీకృష్ణాదులు కూడా తమతమ రథాలు దిగారు. ధర్మరాజు వారితో కలిసి వ్యాసుడు, నారదుడు, దేవలుడు మొదలైన మహర్షులు సేవిస్తున్న భీష్ముడి దగ్గరికి వెళ్లి వారికి నమస్కరించాడు. ధ్యానమగ్నుడై ఉన్న భీష్ముడికి తన రాకను తెలియపర్చి ఆయనకు నమస్కరించాడు. ఉత్తరాయణం రాగానే అగ్ని మొదలైన తీసుకొనిరాదగిన వస్తువులనన్నిటినీ తీసుకొచ్చానని చెప్పాడు. మంత్రవేత్తలైన పురోహితులు వచ్చారన్నాడు. శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడు సమస్త బంధువులు, బ్రాహ్మణులు, పౌరులు వచ్చారని చెప్పాడు. మాఘమాసం శుక్లపక్షం వచ్చిందని భీష్ముడు సంతోషించాడు. అందరిని ఆదరంగా చూచాడు. ధర్మరాజును కొనియాడాడు. ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. ఆయన వేదశాస్త్రాలు చదివావడని, వ్యాసాదులు బోధించిన ధర్మాలు విన్నాడని, పాండవులను పుత్ర ప్రేమతో ఆదరించమని, ధర్మరాజు ఆయన పట్ల భక్తి ప్రేమలు కలవాడని,  అవినీతుపరులైన దుర్యోధనాదులను గురించి విచారించవద్దని అన్నాడు.

ఆ తరువాత శ్రీకృష్ణుడి వైపు చూసి ‘దేవదేవా! జీవాత్మకా! దేవవంద్య! శంఖచక్ర గదాపద్మ చారుహస్త! వాసుదేవ! త్రివిక్రమ! వరద! వరమపురుష! ఇవే నా ప్రణతులు. కరుణించు. నీవేనాకు బలం, నేను నీ భక్తుడను. ఆలుబిడ్డలు లేనివాడను, మిక్కిలి దయతో కాపాడి నాకు అనుజ్ఞనివ్వు! పాండవులకు నీవే దిక్కు. శ్రీకృష్ణుడే పక్షంలో ఉంటే ఆ పక్షంలో విజయం తథ్యమని నేను దుర్యోధనుడికి చాలాసార్లు చెప్పాను. కాని, అతడు వినలేదు. తనవారిని నశింపజేసి, తానూ నశించాడు. నీ వెవరో నాకు తెలుసు. నరనారాయణులు లోకరక్షణార్థం అవతరించి భూతలం మీద తిరుగుతారని వ్యాసనారద మహర్షులు నాతో చెప్పారు' అని అన్నాడు. శ్రీకృష్ణుడు అత్యాదరంతో భీష్ముడితో ఇలా అన్నాడు. 'శాంతనవా! నీలో ఏ దోషం లేదు. పైగా పితృభక్తితో మరణాన్ని సైతం నీ అదుపులో పెట్టుకోగలిగావు. నీకు నేను అనుజ్ఞ ఇచ్చాను. నీతోడివారైన వసువులను కలువు’.

         భీష్ముడు సంతోషించి పాండవులను, ధృతరాష్ట్రుడు మొదలైనవారిని చూశాడు. 'మీరుకూడా ఆజ్ఞ ఇచ్చినట్లే కదా!’ అని అడిగాడు. అందరినీ ఆలింగనం చేసికొన్నాడు. క్రౌర్యం మాని, సత్యాన్ని నిత్యం పాటించండని పలికాడు. బ్రాహ్మణులను గౌరవించమనీ, యజ్ఞాలు చేయమనీ ధర్మరాజుతో చెప్పి మౌనం వహించాడు. యోగధారణ ద్వారా సమాధిలోనికి వెళ్లి ప్రాణవాయువులను శరీరం నుండి వెడలించాడు. శరీరం మీద వున్న బాణాలు రాలిపోయాయి. అది చూచి అందరూ ఆశ్చర్యపడ్డారు. భీష్ముడి ఆత్మ అతడి కపాలాన్ని చీల్చికొని నక్షత్రం లాగా ఎగిరిపోయింది. దేవతలు పూలవాన కురిపించారు. వాద్యాలు మ్రోగించారు. భీష్ముడిని స్తుతించారు. ఈ విధంగా మహనీయుడైన భీష్ముడు శరీరం విడిచి స్వర్గం చేరిపోయాడు.

పాండవులూ, ధృతరాష్ట్రుడూ రాజలాంఛనాలతో చందన కాష్టాలతో చితిని పేర్చారు. గంగానదీ జలాలతో ఆయన శరీరాన్ని స్నానం చేయించారు. ఒడలికి చందనం పూశారు. మేలైన పట్టు వస్త్రం కట్టారు. ఆభరణాలతో అలంకరించారు. సామవేద పఠనం జరిగింది. హోమం చేశారు పురోహితులు. ధర్మరాజు బ్రాహ్మణ సమూహానికి బంగారాన్ని వేడుకగా ఇచ్చాడు. భీష్ముడి శవాన్ని తల వైపున నకులసహదేవులు, కాళ్లవైపున ధృతరాష్ట్ర ధర్మరాజులు పట్టుకొని శవ వాహనం మీద వుంచారు. ఆ విధంగా వారు పాడెను తమ బుజాలమీద పెట్టుకొని మోశారు. భీమార్జునులు వింజామరలతో వీచారు. యుయుత్సుడు గొడుగు పట్టాడు. ధౌమ్యుడు కర్మకాండ జరిపాడు. భీష్ముడి శరీరాన్ని చితిమీద వుంచి అగ్నికి ఆహుతి చేసి దహన సంస్కారం చేశారు. చితాగ్నిలో లెక్కలేనంత నేయి పోశారు. ఈ విధంగా శవ దహనకార్యం శాస్త్ర సమ్మతంగా వైభవోపేతంగా ఆచరించి అంతా అప్రదక్షిణంగా మరలి స్నానాల కొరకు గంగానదికి వెళ్లారు. వారి వెంట వ్యాసుడు, నారదుడు, దేవలుడు మొదలైన మునిపుంగవులు కూడా వెళ్లారు. కౌరవులంతా పత్నీ సహితంగా గంగలో మునిగి భీష్ముడికి నువ్వులు, నీళ్లు వదిలారు.

ఆ సమయంలో గంగాదేవి జలాల నుండి పైకిలేచి పుత్రశోకంతో విలపించింది. భీష్మ వ్యక్తిత్వాన్ని కీర్తించింది. తన తనయుడైన భీష్ముడు గొప్పవాడని, ధరణిలో అతనంతటి వాడు మరొకడు లేడని నిరూపించాడని, అతడి నడవడి చాలా గొప్పదని, గట్టి పట్టుదల కలవాడని, నిర్మలమైన బుద్ధికలవాడని, క్షత్రియ ధర్మశీలి అని, పరమ దయాస్వభావుడని, పితృ భక్తిలో అగ్రేసరుడని, పెద్దలందరికీ ప్రియమైన వాడని, అధికంగా విద్యా పరిశ్రమ సలిపినవాడని, పరశురాముడంతటివాడు తన కుమారుడి బలాన్ని కదిలించలేక భంగపడ్డాడని, అంతటి శక్తి సంపన్నుడు సామాన్యుడైన శిఖండితో యుద్ధంలో శరతల్ప గతుడు కావడం దురదృష్టమని చెప్తూ దుఃఖించింది గంగాదేవి. శ్రీకృష్ణుడు, కృష్ణద్వైపాయనుడు ఆమెను ఓదార్చారు. ఆమెను చింతించవద్దని, ఆమె కుమారుడు వసువులలో చేరాడని, అతడు సాటిలేని మహిమ కలవాడని, అతడి కొరకు శోకించవద్దని చెప్తూ ఇంకా ఇలా అన్నాడు శ్రీకృష్ణుడు.

చ:       అతని శిఖండి యేల? యమరాధిపుడున్ సమయింపఁ జాలునే?

యతడు నిజేచ్ఛ జేసి నరునంచిత దివ్యశరంబు లంగ సం

గతములు చేసి పాన్పుగ సుఖస్థితి మృత్యువు మాన్చియుండి కీ

ర్త్వతిశయ మొంది తా వలచినప్పుడు వోయె విషాద మేటికిన్?

         (ఒక్క శిఖండి మాత్రమే కాదు ఆ దేవేంద్రుడైనా నీ కుమారుడిని సంహరించగలడా? భీష్ముడు తన ఇష్ట ప్రకారం అర్జునుడి దివ్యశరాలను తనువుమీద నాటించుకొని, ఆ దివ్యబాణాలే తనకు పాన్పుగా సుఖంగా పవళించి, మృత్యువును దూరంగా వుంచి, ధర్మరాజుకు సమస్త ధర్మాలను ఉపదేశించి, పేరు ప్రతిష్టలు గడించి, తాను కోరుకున్నప్పుడే శరీరాన్ని వదిలేశాడు. అలాంటి ధర్మాత్ముడి కొరకు నువ్వు శోకించవద్దు).    

అని శ్రీకృష్ణుడు మహనీయుడైన భీష్మడి చరిత్రకు భరతవాక్యం పలికాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనిక పర్వం, పంచమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment