Sunday, August 20, 2023

ఆధ్యాత్మ జ్ఞానాన్ని, బ్రహ్మతత్త్వాన్ని, మోక్షప్రాప్తిని అర్జునుడికి బోధించిన శ్రీకృష్ణుడు ..... ఆస్వాదన-134 : వనం జ్వాలా నరసింహారావు

 ఆధ్యాత్మ జ్ఞానాన్ని, బ్రహ్మతత్త్వాన్ని, మోక్షప్రాప్తిని

అర్జునుడికి బోధించిన శ్రీకృష్ణుడు

ఆస్వాదన-134

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (21-08-2023)

ధర్మరాజు సుఖంగా రాజ్యపాలన చేస్తున్నప్పుడు కృష్ణార్జునులు ఇంద్రప్రస్థపురంలో విలాసంగా విహరిస్తూ, సాధుసత్పురుషులతో గోష్టి జరుపుతూ కాలం గడుపుతుండేవారు. పాతరోజులనాటి కథలు చెప్పుకునేవారు. ఒకసారి మయసభను చూడడానికి కూడా వెళ్లారు. ఒకనాడు ఇద్దరూ ముచ్చటించుకొనే సందర్భంలో శ్రీకృష్ణుడు ధర్మరాజు పరిపాలనను మెచ్చుకుంటూ, అర్జునుడిని పొగిడాడు. అర్జునుడి వల్ల తాను మహదానందాన్ని పొందానని, ఆ తృప్తి చాలని, అన్న బలరాముడిని, తల్లి దేవకిని, తండ్రి వసుదేవుడిని, యాదవులను చూడాలని కోరిక కలుగుతున్నదని, తాను ద్వారకా నగరానికి వెళ్లివస్తానని, సరైన సమయంలో అన్నగారైన ధర్మరాజుకు ఈ విషయం చెప్పి ఆయన అనుమతి తీసుకొమ్మని అన్నాడు. ఇద్దరం హస్తినాపురానికి పోదామని, పోయి, తగిన సమయంలో ధర్మరాజుకు తాను ద్వారకకు పోదల్చుకున్న విషయం చెప్దామని కూడా అన్నాడు కృష్ణుడు.

అలాగే చేద్దాం అని అంటూ అర్జునుడు, యుద్ధానికి పూనుకున్నప్పుడు తన మనస్సు కలతచెంది, కుంగిపోయినప్పుడు శ్రీకృష్ణుడు కొన్ని తత్త్వబోధకాలైన మహావాక్యాలను బోధించాడని, తన మనస్సులో ఆ మాటల సారాంశాన్ని పదిలపరుచుకోలేకపోయానని, మళ్లీ ఆ మాటలనే వినిపించమని అడిగాడు శ్రీకృష్ణుడిని. ఆనాడు చెప్పిన మహావాక్యాలు బ్రహ్మపదసాధకాలని, ఆ వాక్యాల అర్థాన్ని అర్జునుడు మనసులో నిలుపుకోలేకుండా పోయాడని, అతడిని మందలించి, తత్సంబంధమైన ఒక కథను శ్రీకృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు వేదాంతం చెప్పమని ఒక బ్రాహ్మణుడిని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు కాశ్యపుడికి సిద్ధుడు బోధించిన వాక్యాలు చెప్పాడు. ఆ వాక్యాలను ఆ బ్రాహ్మణుడు కృష్ణుడికి చెప్పాడు. కృష్ణుడు ఆ మాటలను (పరతత్త్వాన్ని) అర్జునుడికి తెలియచేశాడు.

‘ధర్మ సాధనకు శరీరం గొప్ప సాధనం. ధర్మం విశిష్టమైన మోక్షజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ కారణాన మనుష్యుడు ఎలాగైనా సరే తన శరీరాన్ని రక్షించుకోవాలి. మూర్ఖుడు తన స్వభావ సిద్దగుణాన్ని, శక్తిని, కాల నియమాన్ని గుర్తించకుండానే ఆహారం తింటూ వుంటాడు. ఆహార పదార్థాలను మంచి-చెడులు పట్టించుకోకుండా తింటాడు. తిన్నవెంటనే మళ్లీ తింటాడు. తిన్న వెంటనే నిద్రలోకి జారిపోతాడు. అన్ని రోగ వికారాలకు (అసాధారణ స్థితి) మూలం ఆహారమే. ఇలా చేయడం వల్ల దేహ స్థితి మారుతుంది. అన్నిరోగాలు పుట్టుకొస్తాయి. కామక్రోధాదులు విజృంభించి దేహాన్ని నశింపచేస్తాయి. మర్మస్థానాలు దెబ్బతిని ప్రాణాలు పోతాయి.

‘ఈ రీతిగా బయటపడ్డ జీవుడు అతడు చేసిన పుణ్య-పాపకర్మల ఆధారంగా సిద్ధంగా వున్న గతులను పొంది, ఆయా గతుల వల్ల పుట్టిన సుఖదుఃఖాలను ఆయా సందర్భాలలో పొందుతూ వుంటాడు. జీవుడు తాను చేసిన పాప-పుణ్యకర్మల ఫలాన్ని సంపూర్ణంగా అనుభవించి తగిన జన్మను పొందుతాడు. మళ్లీ ఇలాగే జననమరణాలను అనుభవిస్తూ వుంటాడు. పాపం చేసినవారు నరకాన్ని, పుణ్యం చేసినవారు స్వర్గాన్ని అవశ్యం పొందుతారు. ఏ బంధస్పర్శా లేని మోక్షాన్ని వీరెవరూ పొందలేరు. స్వర్గ-నరకాలు రెండూ అంతర్దశలే తప్ప చివరి స్థితులు కావు. ధర్మపరులుగా బతికినవారు చంద్ర, నక్షత్ర, సూర్య మండలాలలో నివసిస్తారు. చేసిన పుణ్యఫలం ఎంతవరకు వుంటుందో ఆ చివరిదాకా అనుభవించిన తరువాత జీవుడు ఆ లోకం నుండి బయటకు వెళ్లగొట్టబడుతాడు. శాశ్వత స్థానం మోక్షం తప్ప మరొకటి కాదు’.

‘ఇక పుట్టడానికి కారణమైన గర్భం ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవాలి. శుక్లశోణితాలు తగినట్లుగా కలిసి స్త్రీ గర్భంలో బీజంగా ఒకచోట నిలుస్తాయి. అధి బ్రహ్మ సృష్టి సామర్థ్య శక్తి. అలా ఆ శుక్లశోణితాలు కలిసి పిండంగా వృద్ధిపొందుతాయి. ఆ బీజం పిండంలోపల చైతన్యస్వరూపంగా వుంటూ తల, చేతులు, కాళ్లు, పొట్ట, రొమ్ము, వీపు అనే అవయవాలను ఏర్పరుస్తుంది. పుట్టడానికి తగిన సమయం రాగానే గర్భం నుండి బయటపడి జీవుడు తన పూర్వజన్మ కర్మలకు తగిన రీతిలో వివిధ పద్ధతులలో జీవనం సాగిస్తాడు. ఆ కర్మలు తెగిన తరువాత చనిపోయి, మరలా, తన కర్మలకు అనుగుణమైన విధంగా జన్మ ఎత్తుతాడు. మానవుడు ఎంతదాకా ఉత్కృష్టమైన మోక్షస్థానాన్ని పొందకుండా వుంటాడో అంతదాకా మరలా-మరలా ఈ విధంగా చావు-పుట్టుకలను పొందుతూనే వుంటాడు.

(ఈ సందర్భాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ హెచ్ఎస్ బ్రహ్మానంద గారు ఇలా రాశారు. “ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా వీర్యరజస్సులు కలిసినప్పుడు, అందులోకి ప్రాణం అంటే బీజం ఎలా ప్రవేశిస్తున్నదనే విషయం పరమాశ్చర్యంగానే మిగిలిపోయింది. ఈ ఆశ్చర్యకార్యాన్ని పురాణాలు ‘బ్రహ్మ అనే ప్రతీకద్వారా వివరించాయి. శుక్లశోణితాల కలయికతో ఏర్పడ్డ బీజశక్తి పిండంలో ప్రాణశక్తిగా దాగి వుంటున్నది అనే విషయం గొప్ప వైజ్ఞానికసత్యం. అందుకే విగ్రహాది పూజలు చేసేటప్పుడు ఆ ప్రాణశక్తిని మనం ఆవాహన చేస్తాం. కాబట్టి దేహం వేరు, ప్రాణం వేరు. అందువల్ల పిండం వేరు. పిండంలోని జీవశక్తి వేరు. దానినే బ్రహ్మశక్తిగా చెప్పారు. కర్మఫలశేషమే జన్మకు కారణమని, కర్మానుభవ సంపూర్తి మరణకారణమని అర్థం. ఇదే జననమరణ చక్రభ్రమణానికి కారణం”).

శ్రీకృష్ణార్జునుల సంవాదంలో భాగంగా ఆధ్యాత్మవిద్యా రహస్యాన్ని, ఆధ్యాత్మజ్ఞానాన్ని బోధించమని అడిగిన భార్యకు భర్త చేసిన ఉపదేశమే “బ్రాహ్మణగీత” గా ప్రసిద్ధికెక్కింది. దాన్నే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు ఇలా. ‘వినడానికి, చూడడానికి, చేయడానికి వీలైన పనులు ఏవేవి వున్నాయో అవన్నీ కర్మలు. కర్మవాదులు అజ్ఞానమనే చీకటిలో వున్నవారై ఆ కర్మలు సమస్త సిద్ధులు ప్రసాదిస్తాయని అంటారు. అసలు ప్రపంచంలో నిష్కర్మత్వం అనే స్థితి లేదు. అట్లా వున్న స్థితి పరమోన్నతమైనది. అది బ్రహ్మ లక్షణం. అది నిష్కళంకంగా కనిపిస్తుంది. ఇక తక్కిన జగత్తంతా క్రియాత్మకమే. అక్షర పరబ్రహ్మతత్త్వం కేవలం పవిత్రమైన బుద్ధి విశేషం వల్ల మాత్రమే తెలుసుకోవచ్చు’.

‘ఒకప్పుడు మనస్సు, వాక్కు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి తమ ఇద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పమని అడిగారు. మనస్సు గొప్పదని ఆయన చెప్పాడు. తనను అలా తక్కువ చేసి మాట్లాడవచ్చా అని సరస్వతి బ్రహ్మను ప్రశ్నించింది. సమాధానంగా బ్రహ్మ, తనకు స్థిరమని, చరమని, రెండు మనస్సులున్నాయని, వాటిలో స్థిరం తన దగ్గరా, చరం సరస్వతి దగ్గరా వుంటాయని, ఆమె కంటే స్థిర చిత్తం గొప్పదని, కాబట్టి ఆమె అలా ప్రశ్నించడం సరికాదని అన్నాడు. సరస్వతి ఏమీ పలకకుండా వుండిపోయింది. వాక్కు, మనస్సులు ప్రవర్తించే రీతులు ఫలానా అని గుర్తించడం మోక్షానికి మూలమవుతుంది. మనస్సు ప్రశాంతతను పొందడమే ముక్తికి కారణం. వాక్కు రెండు విధాలుగా (శబ్దించేది-ఘోషిణి, శబ్దించనిది-అఘోషిణి) వుంటుంది. అఘోషిని గొప్పది, అవ్యయరూపమైనది. కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి జీవుడిని ఆశ్రయించి వున్నప్పటికీ ఒకదాని పని మరొకటి చేయలేవు’.

‘మనస్సు లేక ఇంద్రియాలు, ఇంద్రియాలు లేకుండా మనస్సు, రెండూ అనుభవాన్ని పొందజాలవు. రెండూ ప్రధానమే. మనస్సు ఇంద్రియాలను నియంత్రించగల సందర్భం వుంటుందేమో కాని, ఎక్కువగా ఇంద్రియాలు చెప్పినట్లే మనస్సు ప్రవర్తిస్తూ వుంటుంది. ప్రాణాపానాదులైన పంచవాయువులలో ఎవరు గొప్పవారన్న వాదనకు కూడా జవాబిచ్చాడు బ్రహ్మదేవుడు. ఎవరు అణగిపోతే ఇతరులంతా అణగిపోతారో, ఎవరు పనిచేయడం మొదలు పెట్టితే ఇతరులంతా తమ-తమ పనులు మొదలు పెట్టుతారో అట్లాంటివారు గొప్పవారన్నాడు బ్రహ్మ. వాయువులలో ప్రతి ఒక్కరూ ఒక విశిష్టవృత్తి కలవారన్నాడు. ఎప్పుడూ ఎవరివల్ల ఏ తీరుగా ఒక పని జరుగుతుందో అప్పుడు మాత్రమే వారు అధికులవుతారని, అట్లా అంతా ఒక్కొక్క సమయాన గొప్పవారే అవుతారని, అందువల్ల ఒకరినొకరు స్నేహభావంతో అనుసరించాలని, గౌరవించుకోవాలని చెప్పాడు.

‘ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం, పంచవాయువులు, వీటిని గురించి తెలుసుకోవడం ద్వారా ఈ తత్త్వాలకు అతీతమైన మహాతత్త్వాన్ని అంటే ఆత్మతత్త్వాన్ని గుర్తించడానికి సాధ్యమవుతుంది. కరణం, కర్మ, కర్త అనే మూడు కారకాలతోనే ప్రపంచమంతా నిండి వున్నది. కారకత్రయాన్ని ఆత్మగా కలిగిన జీవుడు తాను కర్తననే (అనుభవిస్తున్నాననే) భావాన్ని వదలిపెట్టి ప్రకాశిస్తాడు. ఇది మోక్షం అందుకునే విధం. గుణాలు మొత్తం తొమ్మిది. వాటిలో స్థిరత్వం, ఆత్మగౌరవం, సంతోషం అనేవి సాత్త్వికాలు. కోపం, ఉద్రేకం, దుఃఖం అనేవి రాజసాలు. భ్రాంతి, బడలిక, నిద్ర అనేవి తామసాలు. ఇవే లోపల వున్న శత్రువులు. వీటిని జయించడానికి ఏ అస్త్రం తగినదో దానిని ప్రయోగించి వీటిని జయించగలం. తరువాత ఐదు ఇంద్రియాలతోనూ మనస్సును జయించి, ప్రశాంత స్థితిని పొంది, మోక్షానికి ప్రయత్నం చేయాలి’.       

ఆధ్యాత్మవిద్యా రహస్యాన్ని, ఆధ్యాత్మజ్ఞానాన్ని శ్రీకృష్ణుడి ద్వారా తెలుసుకున్న అర్జునుడు ఉత్కృష్టమైన, జ్ఞానరూపమైన బ్రహ్మతత్త్వాన్ని వివరించమని కోరాడు. దానికి సమాధానంగా ‘గురుశిష్యసంవాదం అనే ఇతిహాసాన్ని చెప్పాడు. దాని సారాంశం ఇలా సాగింది.

‘ప్రాణులన్నీ సత్త్వంలోనే పుట్తాయి. అందులోనే ప్రవర్తించి, అందులోనే అణగిపోతాయి. మూడు గుణాలతో కూడిన సత్త్వచరిత్ర ఇదే. సత్త్వగుణ ప్రాధాన్యం తెలుసుకోదగ్గ విషయం. వేదమని, తపమని, ప్రజాపతి అని, సత్వానికి మారు పేర్లు. సత్త్వమంటే విస్తరించింది, గొప్ప మహిమ కలదైన పరమ వేదమైన తత్త్వం. కాబట్టి పుణ్యాత్ములు కామక్రోధాలను వదలిపెట్టి సత్వాన్ని ఎల్లప్పుడూ ఉపాసిస్తారు. సనాతనధర్మం శుభప్రదమైన అత్యుత్తమ మార్గం. దీనిద్వారా శ్రేయోరూపమైన మోక్షసాధన సులభం. ఆత్మవిద్యా సాధకులు కాకుండా ఎవరుకూడా మోక్షప్రాప్తిని పొందలేరు. బ్రహ్మదేవుడికైనా ఆధ్యాత్మ దర్శన మార్గం మాత్రం ఇదే. అంటే, 24 తత్త్వాలు ఏవైతే వున్నాయో వాటి తత్త్వాన్ని గురించిన దర్శనం కలిగి వుండడమనే అర్థం. ఎక్కువ-తక్కువ లేక ఎల్లప్పుడూ కలిసిన గుణత్రయమే “అవ్యక్త” అని ప్రసిద్ధమైన మహాతత్త్వం. అది శుభప్రదం, చలనం లేనిది, శాశ్వతమైనది కూడా. ఆ అవ్యక్తపదం సత్తు, అసత్తులకు అతీతమైన నిత్యతత్త్వం. దాని తత్త్వం తెలిసినవాడు విజ్ఞానం వల్ల పవిత్రుడై, గుణత్రయానికి అతీతుడై, ఏ కొరతాలేని శాశ్వతమైన మోక్షస్థానాన్ని సులభంగా పొందగలదు.

‘ఆ అవ్యక్తంలో మహత్తు పుట్తుంది. సృష్టిలో జరిగే అన్ని పనులను చేసేది, చూసేది, వినేది, జరిపేది అదే. అందుకే అది సృష్టికి ప్రభువు. దాని నుండి అహంకార తత్త్వం పుట్తుంది. ఈ లోకం ఇన్ని విధాలుగా ప్రవర్తించడానికి కారణం ఈ అహంకార భావనే మూలం. ఈ లోకంలోని ఆకర్షణ అంతా ఈ అహంకారతత్త్వ మహిమే. ఈ అహంకార తత్త్వానికున్న అపారమైన ప్రభావం వల్లే పంచమహాభూతాలు పుట్తున్నాయి. సమస్త ప్రాణులనూ తన ఆత్మలో దర్శించగలవాడికి సూక్ష్మతత్త్వ దర్శనం కలుగుతుంది. పంచభూతాలతో కూడిన ఈ శరీర సముద్రాన్ని దాటడం చాలా కష్టం. దాటాలంటే కామక్రోధాలను గెలవాలి. ఆత్మను ఆత్మలో చూసే యోగి సర్వవిదుడవుతాడు. ఆత్మ ఎన్నో రూపాలను పొందుతుంది. సద్బుద్ధికల ధీరులు పరంజ్యోతి తత్త్వాన్ని నిష్టతో సేవిస్తారు.

‘పరతత్త్వజ్ఞానం కలగడానికి మూలం లక్షణ జ్ఞానం. ఒక్కొక్కదానికి ఒక్కొక్క లక్షణం వున్నది. ఆ లక్షణాన్ని గుర్తిస్తే వీటికి అతీతమైన శక్తి ఎట్లా వుంటుందో తెలుస్తుంది. ఆయా తత్త్వాల లక్షణాలు: ధర్మం-అహింస, అధర్మం-హింస, దేవతలు-ప్రకాశత్వం, మనుష్యులు-కర్మ, ఆకాశం-శబ్దం, వాయువు-స్పర్శ, జ్యోతిస్సు-రూపం, జలం-రసం, పృథ్వి-గంధం, భారతి-సత్యం, మనస్సు-చింత, బుద్ధి-వ్యవసాయం, మహత్తు-ధ్యానం, అవ్యక్తం-సాధుత్వం, యోగం-ప్రవృత్తి, జ్ఞానం-సన్న్యాసం’.

‘జ్ఞానపూర్వకమైన సన్న్యాసస్వీకారం పరబ్రహ్మ ప్రాప్తిని కలిగిస్తుంది. ద్వంద్వరహితుడైన అతడిని జరామృత్యువులు ఏమీ చేయలేవు. ధర్మం అతడిని ఆశ్రయించి అన్నిటినీ దాటిస్తుంది. ఆత్మవేత్తైన యోగి గుణాలను వదిలిపెడతాడు. స్థిరత్వం పొందుతాడు. అప్పుడు అతడు అంతరాత్మతో ఆక్రమించబడుతాడు. దానితో ఎప్పటికీ తరగని శాశ్వతమైన మోక్షస్థానాన్ని పొందుతాడు. ప్రజాపతులలో బ్రహ్మ పెద్ద. అతడి కంటే ఆచింత్యమైన తత్త్వం కలిగిన విష్ణువు పెద్ద. దేవతలందరిలోనూ పెద్ద ఈశ్వరుడు. అందుకే మహాదేవుడు అంటారు. పేరుకు శివుడు, బ్రహ్మ, విష్ణువు అని వున్నా త్రిమూర్తులలోని వస్తువు మాత్రం ఒక్కటే. ఇలా సంపూర్ణంగా ఏఏ తత్త్వాలలో ఏది ప్రధానమో తెలుసుకోవడం బ్రహ్మజ్ఞాన సాధనకు హేతువవుతుంది. త్రిమూర్తులను ఒక్కటిగా గుర్తించడం అంటే తత్త్వజ్ఞానాలకు వన్నె పెట్టడమే అని అర్థం. జ్ఞానం విశిష్టమైనది. అది ఎప్పుడూ నశించదు. దానిని తెలియడం వల్ల అభిమానం, అహంకారం, మమత తొలగి మానవుడు నిర్మలుడవుతాడు. అట్లాంటివాడే మోక్షమార్గాన్ని అవలంభించ గలుగుతాడు.

ఈ విషయాలన్నీ శ్రీకృష్ణుడు ఆదరం నిండిన హృదయంతో చక్కగా బోధించాడు అర్జునుడికి. తాను ఉదహరించిన ఇతిహాసాలలోని పాత్రలు-పాత్రధారులు అన్నీ తానేనని చెప్పాడు. ఇతరులకు సాధ్యం కాని అతిరహస్యమైన మోక్షప్రాప్తిని గురించి అర్జునుడికి చెప్పానన్నాడు. నిర్మలం, స్థిరం అయిన అర్జునుడి మనస్సును అవ్యభిచార భక్తి నిష్ఠ కలిగినదిగా తనవైపు చేర్చమని చెప్పాడు. అనినిత్యం తాను చెప్పిన బ్రహ్మతత్త్వాన్ని అనుసరించమని అన్నాడు. యుద్ధ సమయంలో అమృతపదప్రాప్తి హేతువైన సమగ్ర జ్ఞానాన్ని బోధించానని, స్థిరమైన మనస్సుతో శమదమాదులు సాధించి తాను చెప్పిన తత్త్వజిజ్ఞాసలో ఆనందాన్ని నిరంతరంగా పొందమని ఉపదేశించాడు.   

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అశ్వమేధపర్వం, ప్రథమ-ద్వితీయాశ్వాసాలు

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

      

      

 

No comments:

Post a Comment