గంగావతరణం
వనం జ్వాలా నరసింహారావు
భక్తి మాసపత్రిక (సెప్టెంబర్ నెల, 2023)
(భగీరథుని తపస్సు వల్ల గంగ నెలకు
దిగివచ్చిన వృత్తాంతాన్ని అందరూ స్మరిస్తారు. అయితే అంతకంటే ముందుగా హిమవంతుని
కూతురే అయిన గంగ... అంతకు పూర్వ యుగాలలోనే ఆకాశగంగగా మారింది. కుమారసంభవ గాథలో
ముఖ్యపాత్ర పోషించింది. ఆంధ్రవాల్మీకి వాసుదాసస్వామి రచించిన రామాయణం ‘మందరం’
ఆధారంగా గంగా వృత్తాంతం)
కోసల దేశంలో, సరయూ నదీతీరానున్న
అయోధ్యా నగరం వైభవోపేతమైనది. చక్కటి వీధి వాకిళ్లతో, తలుపులతో, మంగళకరమైన పచ్చని తోరణాల స్తంబాలతో వుండేది. విశాలమైన అంగడి వీధులుండేవి. భయంకర
శతఘ్నుల ఆయుధాలనుంచిన భవనాలుండేవి. శిల్ప కళాకారుల సమూహాలతో, శ్రీమంతులైన పండితులతో, ఎత్తైన ధ్వజాలతో, తియ్య మామిడి తోపులతో, ‘లక్ష్మీ పురాన్ని’ సహితం
మరిపించేదిగా వుండేది. సంతాన ప్రాప్తి కలగడం లేదని చింతిస్తుండే ఆ దేశ మహారాజు దశరథుడు, అశ్వమేధ యాగం, పుత్ర కామేష్ఠి యాగం చేయాలని భావించి, రెండింటికీ ఋత్విజుడిగా వ్యవహరించాల్సిందిగా, ఋశ్యశృంగుడిని ప్రార్తించాడు. పుత్ర కామేష్ఠి యాగం చేస్తే, ఆయనకు
నలుగురు కొడుకులు జన్మిస్తారని ఋశ్యశృంగుడు చెప్పాడు.
శ్రీరామ జననం
దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేస్తుండగా అగ్నిహోత్రం మధ్యనుండి బయట కొచ్చిన
ప్రాజాపత్య మూర్తి, భగవత్ పూరితమైన పాయసాన్నం ఇచ్చాడు. దాన్ని స్వీకరించి భార్యల దగ్గరికి పోయిన దశరథుడు, పాయసం
సగం మొదలే కౌసల్యకిచ్చాడు. ఆమె దాన్ని తాగింది. మిగిలిన సగంలో సగం (పాతిక భాగం)
రెండో భార్యైన సుమిత్రకు ఇచ్చాడు. మిగిలిన పాతిక భాగాన్ని రెండు భాగాలు చేసి,
ఒకభాగం కైకకు, మరో భాగం
తిరిగి సుమిత్రకు ఇచ్చాడు. తొలుత పాయసాన్ని తాగిన కౌసల్యకు శ్రీరాముడు జన్మించి
జ్యేష్ఠడయ్యాడు. వెంటనే తాగిన కైకేయికి , రెండవవాడుగా
భరతుడు పుట్టాడు. పాతిక, పరక వేర్వేరుగా తాగిన సుమిత్రకు
లక్ష్మణ, శత్రుఘ్నులు కవలలుగా జన్మించారు. ఆ రాజకుమారులంతా అస్త్ర శస్త్ర విద్యలన్నీ నేర్చారు.
విశ్వామిత్రుని రాక
ఒకనాడు
విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చి, దశరథుని
కలుసుకుని.....తానిప్పుడు ఒక యజ్ఞం చేద్దామని సంకల్పించుకొని,
దీక్ష పూనానని చెప్పాడు. తన
యజ్ఞాన్ని విఘ్నం చేయాలని మారీచ, సుబాహువులు
అనే ఇద్దరు రాక్షసులు పంతం పట్టారని చెప్పాడు.
యజ్ఞాన్ని రక్షించగల సమర్థుడు శ్రీరాముడు కనుక అతడిని తనతో పంపమని కోరాడు. మారీచాది రాక్షసుల సమూహాన్ని శ్రీరాముడు సులభంగా చంపగలడని, శ్రీరాముడికి తానెన్నో శుభాలు కలిగిస్తానని అంటాడు.
ఆ మాట వినగానే ముఖం విలవిల బోయిన దశరథుడు, శ్రీరాముడికప్పుడు కేవలం పదహారో సంవత్సరం నడుస్తున్నదని, కాబట్టి పంపలేనని, యజ్ఞం రక్షించడానికి తానే స్వయంగా వస్తానంటాడు. ఆ తరువాత
విశ్వామిత్రుడికి కోపం రావడం, శ్రీరాముడిని
విశ్వామిత్రుడితో పంపమని వశిష్ఠుడు నచ్చచెప్పడం, లక్ష్మణుడితో సహా రామచంద్రుడిని మునివెంట పంపేందుకు దశరథుడు అంగీకరించడం జరిగింది. అలా ’కౌసల్యా
నందనుడైన’ శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ
సమేతంగా విశ్వామిత్రుడివెంట వెళ్తుంటే, దేవతలు శుభశకునాలను ప్రదర్శించారు.
తాటక వధ
ప్రయాణంలో
విశ్వామిత్రుడు, రామలక్ష్మణులకు సరయూనది
చరిత్రను, దాని పుట్టు పూర్వోత్తరాలను చెప్పాడు. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా ధన ధాన్య సమృద్ధి
కలిగి వుండేదని, అక్కడ ‘మలద’, ‘కరూశ’ మని రెండు వూళ్లు ఉండేవని చెప్పాడు. కొంతకాలం
గడిచిన తర్వాత, అక్కడికి వెయ్యేనుగుల
బలంకల, తాటక అనే
యక్ష స్త్రీ వచ్చిందని, ఆమె మారీచుడు అనే రాక్షస కొడుకును
కనిందని,
వాళ్లు
ప్రతిరోజు ఈ ప్రాంతంలో కనిపించిన ప్రతివాడినీ తినడంతో, ఇదొక
శ్మశానంగా మారిపోయిందని, నిష్కారణంగా,
అధర్మంగా, ఇంత మందిని చంపుతున్న తాటకను స్త్రీ వధ అధర్మమని భావించక చంపమని, రాముడిని
విశ్వామిత్రుడు ఆదేశిస్తాడు.
విశ్వామిత్రుడు
సత్యమే చెప్పాడని,
తానే దీన్ని చంపాలని,
లక్ష్మణుడితో
అంటుండగానే, అక్కడికి వచ్చిన రాక్షసి
తాటక భయంకరాకారంతో రాముడి మీద
పడబోయింది. వెంటనే
విశ్వామిత్రుడు, హుంకారంతో అదిలించి, రామభద్రుడికి
‘జయం, జయం’ అని దీవించాడు. తాటక,
మాయలతో, విపరీతంగా రాళ్ల వాన కురిపించసాగింది. ఆలశ్యం చేస్తే,
సంధ్య వేళైతే, చంపడం
అసాధ్యమని విశ్వామిత్రుడు
హెచ్చరిస్తాడు. కనబడని తాటకను ధ్వనిని
బట్టి గుర్తించి, తీక్షణమైన బాణాన్ని సంధించి,
దాని రొమ్ములో నాటుకునేటట్లు వేయడంతో, ఆ
రాక్షసి చచ్చిపోయి, భూమి అదిరిపోయేటట్లు
దబీలుమని పడిపోయింది.
ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి అవతార
కార్యధురంధరత్వం స్త్రీ వధతో ప్రారంభమవుతుంది.
స్త్రీ వధ పాపమని రామాయణంలోనే భరతుడి మాటల వల్ల, హనుమంతుడి
మాటల వల్ల తెలుస్తోంది.
అలాంటప్పుడు శ్రీరాముడు ఎందుకు స్త్రీ వధ చేశాడు? అంటే, స్వధర్మ
నిర్వహణ తన విధి అని భావించిన శ్రీరామచంద్రమూర్తి
తాటకను చంపడం దోషం కాదు. విశ్వామిత్రుడి
ఆజ్ఞ పాలించమని దశరథుడు ఆదేశించడం కూడా కారణమే.
కుమార సంభవం
(విశ్వామిత్ర ప్రబోధం: విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం
రామలక్ష్మణులను తీసుకు వెళ్లాడు. దారిమధ్యలో అనేక కథలను, గాథలను వివరించాడు.
కొన్ని అస్త్రవిద్యలను రామలక్ష్మణులకు బోధించాడు. రాముని చేత తాటక సంహారం
చేయించాడు. సీతాకల్యాణానికి ముందుగా మిథిలా నగరానికి వెళ్లే దారిలో గంగావతరణ గాథను
చెప్పాడు. కుమార సంభవ గాథ కూడా గంగావతరణ నేపధ్యంలోనే వస్తుంది. వాల్మీకి
రామాయణాన్ని యధాతథంగా అనుసరిస్తూ రచించిన వాసుదాసస్వామి మందరాన్ని వివరణలతో సహా
చదివిన వారికి అనిర్వచనీయ అనుభూతి కలుగుతుంది).
విశ్వామిత్రుడి
యాగరక్షణ పూర్తైన తరువాత (జరుగనున్న
సీతారామ కల్యాణ ఘట్టం కొరకు) మిథిలానగరం దిశగా ప్రయాణం కొనసాగిస్తూ, గంగానదీ తీరంలో విశ్వామిత్రుడి
చుట్టూ కూర్చున్న రామలక్ష్మణులకు, దాని వృత్తాంతాన్ని విశ్వామిత్రుడు వివరించాడు.
‘హిమవంతుడు మేరుపర్వతం కూతురైన
మనోరమను పెళ్లి చేసుకున్నాడు. ’గంగ”,
’ఉమ’ అని, ఇద్దరు
కూతుళ్లను కన్నాడు. దేవతలు హిమవంతుడిని కలిసి, తమ
కొరకు గంగను మూడు మార్గాల్లో ప్రవహింపచేసి, ఒక
మార్గాన్ని తమకిమ్మని వేడుకున్నారు. వారికోరిక
మేరకు గంగను వెంటనే
ఇవ్వడంతో వారామెను తమ లోకానికి తీసుకుపోయారు. ఆ
విధంగా పర్వతరాజు కూతురైన గంగ ఆకాశానికి పోయింది.
ఆ తరువాత శివపార్వతుల కల్యాణం జరిగింది. కుమార సంభవం కోసం
శివతేజాన్ని బ్రహ్మ సూచనమేరకు అగ్నిహోత్రుడు గంగలో విడిచ పెట్టాడు. గంగ
సౌందర్యవంతమైన రూపాన్ని ధరించి ఆయన్ను సమీపించగా, తన సర్వావయాలనుండి తనలో వున్న
తేజస్సును ఆమెలో విడిచాడు. దాంతో
గంగా ప్రవాహమంతా మిక్కిలి తేజస్సుతో ప్రకాశించింది.
గర్భ
వేదనను సహించలేక దిగాలుపడిన గంగ, అగ్నిహోత్రుడి సూచనమేరకు తన గర్భాన్ని హిమవంతం
కిందిభాగంలోని శుక్ల శోణితాల్లో విడిచింది. ఆ ప్రదేశం వెండి, బంగారం అయింది. దాని వేడిగాలికి బూడిదైన ప్రదేశం రాగి,
ఇనుము అయింది. మలినం నిలిచిన ప్రదేశం సీసం, తగరం అయింది. అది ప్రవహించిన
ప్రదేశంలో అనేక ధాతువులు ఏర్పడ్డాయి. ప్రత్యక్షంగా ఎక్కడైతే గర్భం నిలిచిందో అదంతా
బంగారు మయమయింది. అది వ్యాపించిన ప్రాంతంలోని చెట్లు, తీగలు, పొదలు, పచ్చిక బంగారమయింది. అప్పటినుంచి
బంగారం అగ్ని వర్ణంలో వుండడంతో జాత రూపం అనే పేరొచ్చింది. శరవణంలో పుట్టిన కొడుకును, ఇంద్రాది దేవతలు,
తమ సేనలకు నాయకుడిగా అభిషేకం చేశారు.
సగరుడి మరణం తర్వాత సగరకుమారులకు తర్పణాలు విడవడం కోసం భగీరథుడు
గంగను తెచ్చేందుకు గోకర్ణానికి పోయి తపస్సు
చేశాడు. ప్రత్యక్షమైన బ్రహ్మను, గంగా
తీర్థంతో తన తాతల బూడిద రాసులను తడిపితే వారందరు స్వర్గానికి పోతారని,
అలా వరమివ్వమని కోరాడు. అందుకు బ్రహ్మ, ‘ఆకాశగంగ భూమిపై పడితే ఆ వేగాన్ని,
భారాన్ని భూమి భరించలేదుకాబట్టి దాన్ని భరించేందుకు శివుడిని
ప్రార్థించమని’ సూచిస్తాడు. భగీరథుడు శివుడి
కొరకు తపస్సు చేయడంతో, గంగానదిని తన శిరస్సుపై ధరిస్తానని శివుడు
మాటిస్తాడు. కానీ సహించరాని వేగంతో వస్తున్న ఆకాశగంగ పొగరు చూసిన
శివుడు,
రోషంతో
విజృంభించడంతో రుద్రుడి జడలో ప్రవేశించిన ఆకాశ గంగ, వెలుపలకి
రాలేక,
అందులోనే
చాలా సంవత్సరాలు సుళ్లు తిరుగుతూ బాధ అనుభవించింది.
‘ఆ తరువాత శివుడు, తన జడల
గుంపును కొంత సడలించడంతో, ఆ
సందులోంచి కొంచం పరిమాణంలో గంగానది బిందు
సరోవరం నుండి ఏడు పాయలుగా పారి, హ్లాదిని, పావని, నళిని అనే మూడు
పాయలు తూర్పు ముఖంగా, సుచక్షువు, సీత, సింధు అనే మూడు
పాయలు పడమటి దిక్కుగా పారాయి. మిగిలిన ఏడో పాయ భగీరథుడి వెంట వచ్చింది. అలా
ఆకాశాన్నుండి చీలిపోయి, శివుడి జటాజూటంలోకి చొరబడి, అక్కడినుంచి
భూమి పైకొచ్చింది. ఆ పవిత్రమైన గంగా జలాలో దేవతలు, దేవర్షులు,
భూమ్మీద వున్నవారు అందులో స్నానం చేసి తరించారు. భగీరథుడి
కోరిక నెరవేర్చేందుకు గంగ పాతాళానికి పోయి, ఆయన తాతల
బూడిదమీద ప్రవహించడంతో, సగర పుత్రులంతా స్వర్గానికి పోయారు.
గంగ పవిత్రం కావడానికి అసలు కారణం, విష్ణుపాదంలో పుట్టడమేనని కొందరు, హరుడి శిరస్సునందుండి పడడం వల్ల పుణ్య నది అయిందని మరికొందరు వాదిస్తారు. ఈ
వివాదాన్ని పరిష్కరించేది వాల్మీకి రామాయణమేనని ఆంధ్రవాల్మీకి వాసుదాసుగారి
అభిప్రాయం. రామాయణం మూల శ్లోకంలో పుణ్యగంగ, పుణ్యశివుడి శిరస్సులో పడింది అని వుంది!.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా).
>> శ్రీరాముడికప్పుడు కేవలం పదహారో సంవత్సరం నడుస్తున్నదని....
ReplyDeleteపొరబడ్డారండీ. దశరథుడు రాముణ్ణి ఊనషోడశవర్షప్రాయుడనే అన్నాడు. దాని అర్ధం పదహారు కన్నా తక్కువ అని. అయనకు పదమూడవ యేడు కాబోలు నడుస్తున్నది అప్పుడు. తరువాతి కాలంలో సీతమ్మవారు చెప్పిన లెక్కలు ఆధారంగా చూడాలి.
గంగ పవిత్రం కావడానికి అసలు కారణం, విష్ణుపాదంలో పుట్టడమేనన్నది నిర్వివాదం. స్వతఃపవిత్ర కాబట్టే గంగ శివుని శిరస్సున ఉండగలిగే భాగ్యాన్ని పొందింది. గంగాస్పర్శతో సగరపుత్రులకు ఊర్ధ్వలోకప్రాప్తి అన్నది ముందే విదితం కాబట్టి శివజటాజూటం చేరేటప్పటికే గంగను పవిత్రగా తెలుసుకోవాలి. తత్కారణం విష్ణుపాదోధ్బవి కావటమే అన్నది స్పష్టం. అందువలననే రామాయణం మూల శ్లోకంలో పుణ్యగంగ, పుణ్యశివుడి శిరస్సులో పడింది అని వుంది.
ReplyDelete