Monday, August 28, 2023

ఉదంకుడికి తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన శ్రీకృష్ణ పరమాత్మ ..... ఆస్వాదన-135 : వనం జ్వాలా నరసింహారావు

 ఉదంకుడికి తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన శ్రీకృష్ణ పరమాత్మ

ఆస్వాదన-135

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (28-08-2023)

ఆధ్యాత్మ జ్ఞానాన్ని, బ్రహ్మతత్త్వాన్ని, మోక్షప్రాప్తిని అర్జునుడికి బోధించి, అతడిని వాటిలో నిపుణుడిగా తీర్చిదిద్దిన అనంతరం శ్రీకృష్ణుడు, తన తండ్రి వసుదేవుడిని చూడాలని తన మనస్సు ఆరాటపడుతున్నదని అర్జునుడికి చెప్పి అతడి అంగీకారాన్ని కోరాడు. తనను సంతోషపూర్వకంగా ద్వారకకు పంపమని అడిగాడు. నరనారాయణులైన కృష్ణార్జునుల ఆత్మీయతకు ఇదొక నిదర్శనం. ఆ తరువాత ఉభయులూ ఇంద్రప్రస్థంనుండి హస్తినాపురం పోవడానికి నిశ్చయించుకున్నారు. కృష్ణార్జునులు హస్తినాపురం వెళ్తుండగా మార్గమధ్యంలో అర్జునుడు తమకు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో చేసిన సహాయానికి పలువిధాలుగా కృతజ్ఞతలు తెలియచేశాడు. ఆయన చలవ వల్లనే ధర్మరాజు సార్వభౌముడై అందరికీ పరమపూజ్యుడయ్యాడని అన్నాడు. అర్జునుడు తనమీద భక్తితో మాట్లాడిన మాటలకు శ్రీకృష్ణుడు అతడిని ప్రశంసించాడు. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ హస్తినాపురం ప్రవేశించారు.

ముందుగా వారిద్దరూ ధృతరాష్ట్రుడి గృహానికి పోయి ఆయనకు, గాంధారికి నమస్కరించారు. కుంతీదేవిని, విదురుడిని, ధౌమ్యుడిని, యుయుత్సుడిని, సంజయుడిని సందర్శించారు. ధర్మరాజును భక్తిపూర్వకంగా కలిశారు. మర్నాడు అందరూ కొలువుకూటంలో వున్నప్పుడు అర్జునుడు ధర్మరాజుకు, శ్రీకృష్ణుడు ద్వారకానగరానికి పోవాలనుకుంటున్న విషయం చెప్పి, ఆయన ద్వారకకు వెళ్లి బలరాముడిని, వసుదేవుడిని, దేవకిని, ఇతర బంధువులను సందర్శించి తిరిగి హస్తినాపురం వస్తాడని అన్నాడు. శ్రీకృష్ణుడు కూడా అదే విధంగా చెప్పి అశ్వమేధయాగం చేసే సమయానికల్లా తిరిగి హస్తిన చేరుకుంటానని అంటూ, ధర్మరాజుకు నమస్కరించాడు. కుంతికి, ద్రౌపదికి వెళ్లివస్తానని చెప్పాడు. సుభద్రను తనతోపాటు తీసుకెళ్తానని అన్నాడు. అలా శ్రీకృష్ణుడు ధర్మరాజు, అర్జునుడి అంగీకారం పొందాడు. శ్రీకృష్ణుడు ఆ విధంగా హస్తినాపురం నుండి సాత్యకి, సుభద్రలతో సహా బయల్దేరాడు.

ద్వారకకు వెళ్లే దారిలో శ్రీకృష్ణుడు ఉదంకుడి ఆశ్రమం దగ్గర ఆగాడు. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు నిర్వహించిన పాత్ర గురించి ఉదంకుడు వ్యంగ్యంగా, నిందాపూర్వకంగా పలికాడు. ఆయన మాటలను గ్రహించినట్లుగానే నటించి శ్రీకృష్ణుడు ఉదంకుడికి తాను చేసిన సంధి ప్రయత్నాలు వివరించాడు. తన మాటలు కౌరవులు వినలేదని చెప్పాడు. యుద్ధంలో మరణించి కౌరవులు స్వర్గలోకానికి వెళ్లారని, పాండవులలో కూడా వారైదుగురు తప్ప మిగిలిన వారంతా కౌరవుల గతినే పొందారని, కాల నియమాన్ని ఎంతటివారైనా అతిక్రమించలేరని స్పష్టంగా తెలియచేశాడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుడి మాటలకు ఉదంకుడికి ఆగ్రహం కలిగింది. కళ్లు చింత నిప్పులయ్యాయి. కౌరవ వంశాన్ని నాశనం చేసినందుకు భయంకర శాపం పెట్తానన్నాడు. తాను చెప్పే మాటలను వినమని, ఆ తరువాత ఆయన ఇష్టం వచ్చినట్లు చేయమని అంటూ శ్రీకృష్ణుడు ఉదంకుడికి ఇలా చెప్పాడు.

‘ఉదంకా! సత్త్వరజస్తమస్సు అనే గుణత్రయం నాలోనే వున్నది. దేవతలంతా నాలోనే పుట్టారు. నేనే సృష్టి అంతా వ్యాపించి వున్నాను. నాలోనే నిశ్చలంగా సృష్టి వున్నది. చిత్తు, అచిత్తు అనే తత్త్వాలు రెండూ నేనే! నాలుగు వేదాలు, నాలుగు వర్ణాలు, నాలుగు ఆశ్రమాలు, వాటికి సంబంధించిన విధులు, స్వర్గం, మోక్షం నా రూపాలే. యజ్ఞపరాయణులు నన్ను స్తుతించి పుణ్యఫలాన్ని పొందుతారు. పాపాత్ములు కూడా ప్రాయశ్చిత్త కర్మలు చేసి నన్ను స్తుతించి దోష విముక్తులౌతారు. యముడు నా పెద్ద కొడుకు. అవసరమైనప్పుడు ఆయ ఆవతారాలెత్తి లోకాన్ని కాపాడుతాను. సర్వలోకాలలో మహామహిమలు కలిగిన నేనే బ్రహ్మగా సృష్టిని, విష్ణువుగా స్థితిని, శివుడుగా లయాన్ని అనాయాసంగా చేస్తాను. లోకోపకార పనులను చేస్తూ అధర్మాత్ములను నశింపచేస్తాను. ధర్మాత్ములను రక్షిస్తాను. కౌరవపాండవులు సఖ్యతగా వుండడానికి అన్ని ప్రయత్నాలు చేశాను. వారే వినక యుద్ధంలో మరణించారు.

శ్రీకృష్ణుడు చెప్పినదంతా విన్న ఉదంకుడు తాను నిర్మలుడినయ్యానని, గర్వం అణగిపోయిందని అన్నాడు. తన మనోనేత్రాలు ఆనందించే విధంగా తనకు శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని చూపించమని ప్రార్థించాడు ఉదంకుడు. దయామయుడైన శ్రీకృష్ణుడు తాను అర్జునుడికి చూపించిన విశ్వరూపాన్ని ఉదంకుడికి చూపాడు. అది చూసి తన కళ్లకు, మనస్సుకు తృప్తి కలిగిందని అన్నాడు ఉదంకుడు. తిరిగి ఆయన సహజ రూపాన్ని ధరించమని వేడుకున్నాడు. సహజ రూపం ధరించిన శ్రీకృష్ణుడు వరం కోరుకొమ్మని ఉదంకుడికి చెప్పగా, తన చేరువలో నీరు వుండే విధంగా అనుగ్రహించమని అన్నాడు. తనను స్మరిస్తే నీళ్లు ఎప్పుడైనా లభిస్తాయని వరం ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ఉదంకుడు వుంటున్న నిర్జల ప్రదేశంలో ఆయనకు ఇష్టమైనప్పుడు మేఘాలు నీళ్లు కురిపిస్తాయని, వాటికి “ఉదంక మేఘాలు” అనే పేరు కలుగుతుందని, అవి ఆ ప్రదేశంలో చక్కగా వ్యాపించి సంచరిస్తాయని అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు అంతర్థానమయ్యాడు.

ఉదంకుడికి అలా చెప్పి ఆయన్ను వీడి శ్రీకృష్ణుడు ద్వారకానగరం చేరుకున్నాడు. ద్వారకావాసులంతా శ్రీకృష్ణ సందర్శనంతో ఉప్పొంగిపోయారు. దేవకీవసుదేవులను, బలరాముడిని, ఇతర బంధువులను, స్నేహితులను చూసిన శ్రీకృష్ణుడు వారివారికి తగిన విధంగా మర్యాదలు చేశాడు. భారత యుద్ధాన్ని గురించి సంపూర్ణంగా వినాలని వున్నదని దాన్ని తనకు చెప్పమని అడిగాడు వసుదేవుడు. భారతయుద్ధ కథ చాలా పెద్దదని, దాన్నంతా చెప్పడానికి చాలా రోజులు పట్తుందని, ముఖ్యమైన ఘట్టాలు చెప్తానని అన్నాడు కృష్ణుడు.

కౌరవపాండవ సైన్యాల పరిమాణాన్ని, భీష్ముడు సైన్యాధిపతి కావడాన్ని, అతడు శిఖండి చేతిలో పడిపోవడాన్ని, అంపశయ్యమీద వుండడాన్ని, ద్రోణాచార్యుడి పోరాటాన్ని, అతడి మరణాన్ని, కర్ణుడి మరణాన్ని, శల్యుడు ధర్మరాజు చేతిలో చావడాన్ని, భీముడి చేతిలో దుర్యోధనుడి ఓటమిని, ప్రాణాలు విడవడాన్ని, పాండవుల విజయాన్ని, అశ్వత్థామ చేసిన ఘోరాన్ని మొదలైన అంశాలతో 18 రోజుల భారత యుద్ధాన్ని సంక్షిప్తంగా చెప్పాడు శ్రీకృష్ణుడు. అభిమన్యుడి చావును గురించి వివరంగా చెప్పలేదు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అశ్వమేధపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

 

   

      

      

 

No comments:

Post a Comment