Sunday, January 14, 2024

వేదం మానవ జాతికి భగవంతుడు ప్రసాదించిన తొలి ప్రసాదం .... ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-7 : వనం జ్వాలా నరసింహారావు

 వేదం మానవ జాతికి భగవంతుడు ప్రసాదించిన తొలి ప్రసాదం

ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-7

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (15-01-2024)

         ‘వ్యాస భగవానుడు మానవ సమాజ శ్రేయోభిలాషి. అతడు రానున్న కలియుగాన్ని దర్శించాడు. నాటి అవిశ్రాంత మానవుడిని దర్శించాడు. అతని ఆజ్ఞతను దర్శించాడు. స్వప్రయోజన తత్త్వాన్ని, స్వార్థాన్నీ, కాలుష్యాన్నీ కూడా దర్శించాడు. వ్యాస భగవానుడు అనంత వేదాలను సహితం దర్శించాడు. వేదాల విశాలతను, కలియుగపు సంకుచిత నరుణ్ణి చూశాడు. అతడికి జాలి కలిగింది. కలియుగ మానవులకు ఉపకారం చేయాలనుకున్నాడు. ఉపకారం చేయడమే అతడి జీవితం. వ్యాసభగవానుడు కృపావాత్సల్యాలు కలవాడు. రానున్న కాలంలో జనానికి తీరిక ఉండదనీ, వాళ్లు అజ్ఞానులనీ గ్రహించాడు. అట్లా గ్రహించి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగుగా విభజించాడు.’

‘దేవతల గుణగణాలను  స్తుతించేది (10,589 కవితలు) ఋగ్వేదసంహిత. యజుర్వేదం రెండు భాగాలుగా చేశారు వ్యాసభగవానుడు. యజ్ఞయాగాది క్రతువులను నిర్దేశించేది (1975 పద్యగద్యాలు) శుక్లయజుర్వేద సంహిత. (19,200 పదాలు) కృష్ణయజుర్వేద సంహిత సహితం యజ్ఞయాగాది క్రతువులను నిర్దేశిస్తూ బ్రాహ్మణ సహితమై ఉంటుంది. దేవతలను ప్రసన్నులను చేసే గాన విధిని వివరిస్తుంది (1875 గేయాలు) సామవేద సంహిత. బ్రహ్మ జ్ఞానం సహితంగా అనేకానేక లౌకిక విషయాల వివరణ లభిస్తుంది (5977 గద్యపద్యాలు) అథర్వవేదం సంహిత లో’.            

‘యజుర్వేదం యజ్ఞయాగాది క్రతువులను నిర్దేశిస్తుంది. అందువల్ల యజుర్వేదమే ఎక్కువ ఉపయోగంలో ఉంది. మిగతా మూడు వేదాలకన్నా ఎక్కువమందికి తెలిసింది. యజుర్వేదం రెండుగా ఉండడానికి కారణం మహీధర భాష్యం వివరించింది. వేదవ్యాసుడు వేదాలను ఋగ్యజుస్సామాథర్వ  వేదాలుగా విభజించాడు. వాటిని క్రమప్రకారం తన శిష్యులు పైలా, వైశంపాయన, జైమిని, సుమంతులకు ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు ఉపదేశించారు. వైశంపాయనుడు యజుర్వేదాన్ని యాజ్ఞావల్క్యాదులకు ఉపదేశించాడు. ఒకప్పుడు వైశంపాయనుడికి కోపం వచ్చింది. యాజ్ఞావల్క్యుడిని ఆశ్రమం నుంచి వెళ్లగొట్టాడు. యాజ్ఞవల్క్యుడు యోగబలంతో తాను నేర్చిన యజుర్వేదాన్ని వాంతి చేశాడు. వైశంపాయునుడి ఆదేశం ప్రకారం అతడి ఇతర శిష్యులు తిత్తిరి పక్షులై వాంతిలో ఉన్న విద్యను స్వీకరించారు. ఆ యజస్సులు బుద్ధిమలినాలు. అందువలన కృష్ణ యజుస్సులు అయినాయి.

‘యాజ్ఞవల్క్యుడు గ్రంథాలు విడిచి వెళ్లి ఉంటాడు. అతడు యోగవిద్య తెలిసినవాడు. నేర్పిన విద్య మరచిపోయి వదలి ఉంటాడు. వైశంపాయనుడు యజుర్వేదం ఒక్క యాజ్ఞవల్క్యుడికి మాత్రమే ఉపదేశించలేదు. ఇతర శిష్యులు కూడా ఉన్నారు. యాజ్ఞవల్క్యుడు విశేషంగా నేర్చినదాన్ని గురువు అన్య శిష్యులకు ఉపదేశించి ఉండవచ్చు. వారిలో తిత్తిరి మహర్షి గ్రహించింది కృష్ణ యజుర్వేదం అయింది. బుద్ధిమాలిన్యం వల్ల “కృష్ణములు” అయినవి అన్నది సరికాదు. దీనికి బుద్ధిమాలిన్యం అంటదు. ఇది వ్యాసుడి నుంచి వైశంపాయనుడికి వచ్చింది. ఇదే శుద్ధయజుర్వేదం. దీనినే తిత్తిరి మహర్షి చెప్పాడు. శుక్ల, కృష్ణ యజుర్వేదాలు సమానాలు. వీటిలో ఏది మిన్నకాదు. శుక్ల యజుర్వేదీయులు కృష్ణ యజుర్వేదాన్ని తక్కువగా చూస్తారు. కొందరు కృష్ణ యజుర్వేదాన్ని బ్రాహ్మణంగా పరిగణిస్తారు. దాన్ని వేదంగా అంగీకరించరు. స్థూలంగా శుక్ల యజుర్వేదం ఉత్తరాదివారికీ, కృష్ణ యజుర్వేదం దక్షిణాది వారికి వర్తిస్తుంది. వస్తుతః ఉత్తరాదివారికి అహంకారం ఎక్కువ! దాక్షిణాత్యులను తమతో సమంగా, నేటికీ, గుర్తించరు! ఉత్తర భారతం వారు తెల్లవారు. వారి యజుర్వేదం శుక్ల యజుర్వేదం. దక్షిణ భారతం వారు నల్లనివారు. వారి యజుర్వేదం కృష్ణ యజుర్వేదం అయింది. ఈ శుక్ల, కృష్ణాలు చంద్రుడి శుక్ల, కృష్ణ పక్షాల వలన వచ్చినవి’.

‘వేదంలో భూమి గుండ్రంగా ఉందని వాచ్యంగా చెప్పబడలేదు. భూగోళం మీద ఆధారపడిన శాస్త్రం వారికి తెలుసు. భూమి గుండ్రంగా ఉంది. అది తన చుట్టూ తాను తిరగడానికి 60 గడియలు లేక 24 గంటలు పడుతుంది. భూమి తిరుగుతున్నప్పుడు సూర్యుడికి ఎదురుగా ఉన్న భాగానికి పగలవుతుంది. చాటుగా ఉన్న భాగానికి రాత్రి అవుతుంది. వేదానికి రాత్రింబవళ్ళు తెలుసు. పగలు, రాత్రి ఆచరించవలసిన వాటిని వేదం నిర్దేశిస్తుంది. వేదంలో పక్షానికి చంద్రుని కాంతి, వెన్నెల ఆధారం. భూమి నిరాధారంగా వ్రేలాడుతున్నదని వేదం వివరించింది. అలాగే చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు. అతడికి సూర్యునివలన కాంతి లభిస్తున్నది అని చెప్పింది’.

‘భూమ తన చుట్టూ తాను తిరుగుతున్నది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అలా తిరిగేటప్పుడు సూర్యుని కాంతి చంద్రుని మీద పడుతుంది. అదే వెన్నెల అవుతుంది. వెన్నెల పక్షం రోజులు పెరుగుతూ పూర్ణిమ అవుతుంది. పక్షం అంటే సరిగ్గా పదిహేను రోజులు కాదు. చాంద్రమాసపు నెలలో సగం. తదుపరి పక్షం రోజులు తరుగుతూ అమావాస్య అవుతుంది. సాయంకాలం తరువాత పెరిగే వెన్నెలను శుక్ల పక్షం అంటాం. శుక్ల పాడ్యమి నుండి వెన్నెల రోజుకు రెండు గడియలు పెరుగుతుంటుంది. అలా తొలి 15 రోజులు రెండు గడియల చొప్పున 30 గడియలు అవుతుంది. పూర్ణిమ రాత్రి సాంతం వెన్నెల ఉంటుంది. కృష్ణ పాడ్యమి నుంచి వెన్నెల రోజుకు రెండు గంటలు తగ్గుతుంటుంది. అంటే పాడ్యమి నాడు రెండు గడియలు తప్ప రాత్రంతా వెన్నెల ఉంటుంది. ఆ విధంగా తరుగుతూ పక్షానికి వెన్నెల పూర్తిగా లేని అమావాస్య వస్తుంది.

‘లెక్క వేస్తే, వెన్నెల గడియలు రెండు పక్షాలలోనూ ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి శుక్ల, కృష్ణాలు రెండూ సమానమే! ఆధిక్యత దేనికీ లేదు. అలాగే శుక్ల, కృష్ణ యజుర్వేదాలు సమానాలే! రంగును బట్టి ఒకటి హెచ్చు, ఒకటి తగ్గు కాదు. వాస్తవానికి బ్రహ్మ నుంచి వేదవ్యాసుడికి, ఆయన నుంచి వైశంపాయనునిడికి, క్రమానుగతంగా తిత్తిరి ఋషి నుంచి వచ్చిందే నిజమైన యజుర్వేదం. యాజ్ఞవల్క్యుడు అలిగి వెళ్లాడు. ఋషికి కోపం త్యాజ్యం! గురువైన వైశంపాయనుడిని సాధించదలచాడు!! సూర్యుడి నుండి యజుర్వేద ఉపదేశం పొందాడు. ఇది బ్రహ్మ నుంచి వచ్చింది కాదు. అంటే కృష్ణ యజుర్వేదం కన్నా తక్కువే కదా? వేదాలలో ఒకదాన్ని తక్కువ, మరొకదాన్ని ఎక్కువ చేయడం సరైంది కాదు. ఉత్తరాదివారు దక్షిణాదివారికి యజుర్వేదం ఇవ్వలేదు. దక్షిణాదివారు తమ యజుర్వేదం ఏర్పరుచుకున్నారు. దానిని ఉత్తరాది వారు కృష్ణ యజుర్వేదం అన్నారు. కృష్ణం అంటే నలుపు. నలుపు తెలుపు కన్న తక్కువేమీ కాదు’.

‘చైత్రాది పన్నెండు మాసాల పేర్లు వేదంలో చెప్పబడ్డాయి. పక్షం కనిష్ట కాలమానంగా కనిపిస్తుంది. రెండు పక్షాలు ఒక మాసం అంటుంది. వేదాలలో వారాల జాడ కనిపించలేదు. వేదంలో చెప్పిన నెలకు, చంద్రుని నడక, నక్షత్రాలు ఆధారాలు! మన కాలమానానికి శాస్త్రీయ ఆధారం వుంది వేదంలో. వేదం ఋతువులను గురించి అనేక చోట్ల చెప్పింది. అవే: వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, శిశిర ఋతువులు’.

‘భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటుంది. అందువల్ల రాత్రింబగళ్ళు ఏర్పడుతున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఒక సారి సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి 365 రోజుల 6 గంటలు పడుతుంది. అది భగవన్నిర్ణయం. ఈ 6 గంటలను ఏకాలమానమూ పూరించలేకపోతున్నది! మనది చాంద్రమానం. నెలలు చంద్రుడిని బట్టి లెక్కిస్తాం. ఏనెలా సరిగ్గా 30 రోజులు ఉండవు. మొత్తం మీద సంవత్సరానికి గల రోజులను పూరించడానికి అధికమాసం వస్తుంది. అధికమాసం కూడా శాస్త్రీయమే! ఆ నెలలో పూర్ణిమ, అమావాస్య వస్తాయి. అధికమాసం వచ్చిన సంవత్సరానికి 365 రోజుల 6 గంటలు సరిపోతుంది. మళ్లీ తరగడం మొదలవుతుంది. ఈ అధికమాసం వల్లే ఋతువులు సరిగ్గా ఆ నెలల్లోనే వస్తాయి. చైత్ర, వైశాఖాలు వసంతం; జ్యేష్ట, ఆషాఢమాసాలు గ్రీష్మం; శ్రావణ, భాద్రపదాలు వర్షం; ఆశ్వీజ, కార్తీకాలు శరత్తు; మార్గశిర, పుష్యాలు హేమంతం; మాఘ, ఫాల్గుణాలు శిశిరం వస్తాయి. ఇంత శ్రమించి సశాస్త్రీయమైన కాలమానాన్ని వేదం నిర్ణయించింది’.

         ‘బ్రాహ్మణములు, అరణ్యకములు, ఉపనిషత్తులు వేదానికి అనుబంధాలు. అవి వేదానికి చివరివి. అందువలన వేదాంతములు అయినాయి. ఒక వాదం ప్రకారం వేదాంతం జ్ఞాన ప్రధానం. వేదం కర్మ ప్రధానం. కొందరు వేద వ్యాఖ్యాతలు వేదంలోనే జ్ఞానం ఉందంటున్నారు. వారు కర్మ పరమైన, జ్ఞానపరమైన అర్ధాలు చూపుతున్నారు. ఈ వాద, ప్రతివాదాలు ఆగవు. సాగుతూనే ఉంటాయి. వేదం కర్మలు కామ్యకర్మలు. ప్రస్తుతం ప్రపంచంలో వున్న అన్ని మతాలవీ కామ్య కర్మలే! ఆదర్శానికి తప్ప అందరి కర్మలూ కామ్యములే! నిష్కామకర్మ ఆదర్శప్రాయం. ఆచరణ ఉండదని కాదు. అరుదు. అన్వేషించాలి. వేదాంతం జ్ఞాన ప్రధానం కావచ్చు. జ్ఞానం సాంతం నిష్కామం కాదు. అయితే వేదాంతానికి వైరాగ్యం అనే అర్థం మాత్రం సమంజసం కాదు. జ్ఞానం జీవితం బాగుపరుచుకోవడానికి కాని వదులుకోవడానికి కాదు!’.

         ‘బ్రాహ్మణం వేదంలో భాగమనీ, కాదనీ రెండు రకాల వాదనలున్నాయి. ఆపస్తంబమహర్షి సంహిత, బ్రాహ్మణము కలిస్తే వేదం అవుతుందని అంటున్నాడు. బోధాయన మహర్షి ఆపస్తంబ మహర్షి వాదనను బలపరుస్తున్నాడు. అలా అయితే వేదాలు నాలుగు అని ఎందుకు పరిమితి వుండాలి? అన్న వాదన తలెత్తింది. ఎందుకంటే వేదం అపరిమితం కదా! వేదం కర్మ, బ్రహ్మ ప్రతిపాదకం. ద్రవ్య దేవతా ప్రాతిపదికం. మంత్ర భాగం, సంహిత. బ్రాహ్మణము విధి అర్థవాదాది రూపకం. యజుర్వేదం యాగస్వరూపాన్ని నిరూపిస్తున్నది. కర్మ స్వరూపం తెలిపేది యజుర్వేదం. కాబట్టే దానికి కర్మకాండ విషయంలో అధిక ప్రాధాన్యత ఉంది. కర్మ కేవలం మంత్రం కాదు. విధి విధానానికి సహితం ప్రాధాన్యత ఉంది. కాబట్టి బ్రాహ్మణం లేని యజుర్వేద కర్మ ఉండదు. దాన్ననుసరించే యజుర్వేదాలు రెండు అయ్యాయి. శుక్ల యజుర్వేదం మంత్ర భాగం మాత్రమే, సంహిత మాత్రమే. ఇందులో బ్రాహ్మణం లేదు. కృష్ణ యజుర్వేదం బ్రాహ్మణాత్మకం. దీంట్లో మంత్రం, విధి విధానం వివరంగా చెప్పబడింది. కృష్ణ యజుర్వేదపు పూర్తి పేరు “కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత”. తిత్తిరి మహర్షిచే దర్శించబడి ప్రచారం పొందినందున దీనికి ఆ పేరు వచ్చింది. మంత్ర బ్రాహ్మణ సహితం అయినందున విశాలమూ, విస్తృతమూ, బృహద్గ్రంథం అయింది.

         ‘వేదం సాంతం సుందరం, సుస్వరం, సుదర్శనమే! ఎంత చెప్పినా తక్కువే! వేదం పంచభూతాలను, పర్యావరణాన్ని కాపాడింది. వేదం కథ, నవల, టీవీ సేరియల్, సినిమా కాదు. వేదం పవిత్రం, పావనం, పరిశుద్ధం. దీనిని విశ్వాసంతో, నిష్కల్మషంగా, ప్రసన్న చిత్తంతో అధ్యయనం చేయాలి. వేదం మానవ జాతికి భగవంతుడు ప్రసాదించిన తొలి ప్రసాదం. దాన్ని ఇంట్లో పెట్టుకుని నమస్కరించినా చాలు. ఫలితం కనిపిస్తుంది. వేదం ఏ కొందరి సొత్తు కాదు. వేదం సమస్త మానవాళిది’.      

         మానవ జాతి సాంతం వ్యాసభగవానునికి రుణపడి ఉంటుంది. ఏమి చేసినా అతని ఋణం తీరదు. అతడు మనకు తరగని సంపద ఇచ్చాడు. అది అక్షయపాత్ర. ఇవ్వదలిచినంత ఇచ్చినా ఇంకా మిగిలి ఉంటుంది. భారతదేశానికి వేదం పవిత్రం. ఆనందపు ఆవేశం నుండి బయటపడితే వేదం ప్రత్యక్షం అవుతుంది. వేదం పవిత్రాతిపవిత్రం. వేదం పావనం. మంత్రానికి మాన్యత ఉంది. మంత్రానికి ప్రభావం ఉంది. వేదం ఒక ఆకాశం. ఒక సముద్రం’.

(డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)

 

No comments:

Post a Comment