జన్మభూమిలో రఘురాముడు
(‘మహర్షి వాల్మీకి’ నుండి ‘రాజర్షి నరేంద్ర మోడీ’ దాకా
అయోధ్య)
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (14-01-2024)
{మహర్షి వాల్మీకి రచించిన ఆదికావ్యం
సంస్కృత రామాయణంలో ‘రామజన్మబూమి’ గా
ప్రసిద్ధికెక్కిన ‘అయోధ్య’కు సంబంధించిన అనాది కాలంనాటి, అనేక విషయాలను స్పష్టంగా వర్ణించారు.
‘రామ్ మందిర్ దేవాలయం’ నిర్మాణానికి, పరిపూర్ణ కృషి చేసిన వ్యక్తిగా నరేంద్ర మోడీని, యావత్ హిందు సమాజానికి చెందిన
ఆబాలగోపాలం, ఆసేతు హిమాచలం, ఎప్పటికీ జ్ఞాపకం వుంచుకుంటుంది.} – సంపాదకుడి క్రోడీకరణ
అయోధ్యలో నూతనంగా నిర్మించిన చారిత్రాత్మక
రామ మందిరంలో, జనవరి 22, 2024 మధ్యాహ్నం 12.20 గంటల శుభముహూర్తాన జరుగనున్న చారిత్రాత్మక ‘ప్రాణ
ప్రతిష్ట వేడుక’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర
మోడీ, అదే రోజున, యావత్ భారత దేశ ప్రజలు, వారివారి ఇళ్లల్లో ‘రామజ్యోతి’ వెలిగించి, దీపావళి పండుగలాగా ఆ వేడుకను శోభాయమానంగా జరుపుకోవాలనీ, పెద్ద
సంఖ్యలో ఒకేసారి అందరూ అయోధ్యకు వచ్చి ఇబ్బందికి గురికావద్దనీ, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
‘శ్రీ రామజన్మ భూమి తీర్థ్ క్షేత్ర
ట్రస్ట్’ సభ్యులు, పారదర్శకంగా ఎంపికచేసిన, ఐదేళ్ల వయసు పోలిన 51 అంగుళాల ‘రామ్
లల్లా విగ్రహానికి’ ప్రాణశక్తిని ఆవాహన చేసే ‘ప్రాణ ప్రతిష్ట వేడుక’ ను, ఆలయాల ఆచారానికి, సాంప్రదాయానికి అనుగుణంగా
నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. దీన్ని పురస్కరించుకుని ఏడు రోజులపాటు
నిర్విరామంగా జరుగనున్న సాంప్రదాయ, ఆచార బద్ధమైన పలు కార్యక్రమాలు జనవరి 16 న ప్రారంభం అవుతున్నాయి. వీటికి పూర్వరంగంలో, ట్రస్ట్ కార్యదర్శి చంపట్ రాయ్ పవిత్ర అక్షతల పంపిణీ
కార్యక్రమానికి ఆంగ్ల నూతన సంవత్సరంనాడు లాంఛనంగా శ్రీకారం చుట్టారు.
మహర్షి వాల్మీకి రచించిన అద్భుతమైన
ఆదికావ్యం సంస్కృత రామాయణంలో ‘రామజన్మబూమి’ గా ప్రసిద్ధికెక్కిన ‘అయోధ్య’కు
సంబంధించిన అనాది కాలంనాటి, సహజసిద్ధమైన విశిష్టత సంతరించుకున్న, అనేక విషయాలను
స్పష్టంగా వివరించడం జరిగింది. ఇప్పటిలాగానే, ఆకాలంలో కూడా సరయూ నది ఒడ్డ్డ్డున
వున్న అయోధ్యా నగరానికి ఒకవైపున ‘గంగా, పంచల ప్రదేశ్’, మరోవైపున ‘మిథిలా’ వుండేవి. కాలక్రమేణా అయోధ్య పరిమాణంలో కుంచించుకు పోవడమే కాకుండా, అక్కడి నదులు కూడా వాటి మార్గాన్ని మార్చుకున్నాయి.
వర్తమాన పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా, ప్రధాని నరేంద్ర మోడీ భవిష్యత్ విజన్ మేరకు, అయోధ్య నగరాన్ని, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో, మెరుగైన అనుసందానాలతో, పౌర సౌకర్యాల కల్పన పునరుద్ధరణతో సహా, అనాదిగా, పరంపరగా వస్తున్న దాని
అద్భుతమైన వారసత్వాన్ని సంరక్షించే దిశగా పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే
డిసెంబర్ 30, 2023 న ప్రధాని మోడీ, అనేకానేక
సౌకర్యాలతో ఆధునీకరించబడిన ‘అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్’ భవనాన్ని, నూతనంగా నిర్మించిన ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని’ ప్రారంభించారు.
ఒకనాటి ఉదయాన, వాల్మీకి తమసా
నదీతీరంలో తిరుగుతూ, ఒక క్రౌంచమిధునాన్ని చూసిన సమయంలో
ఒక బోయవాడు, జంటలోని
మగపక్షిని బాణంతో కొట్టడంతో అది నేల పైనబడి, నెత్తుటిమడుగులో, తన
సమీపంలోనే కొట్టుకుంటూ చావడానికి చేరువలో వుంది. తమ జంటలో
ఒకరు ప్రాణాలు పోగొట్టుకుంటూ విలవిలా తన్నుకుంటుంటే, భరించలేక
దుఃఖంతో కూయ సాగింది ఆడ పక్షి. చనిపోయిన మగడిని చూస్తూ ఏడుస్తున్న ఆడ
పక్షిని, నేలమీద పడి వున్న మగపక్షినీ తదేక ధ్యానంతో చూసిన
వాల్మీకి తక్షణమే బోయవాడిని
శపించాడు.
శపిస్తూ ఆదికవి నోటినుండి వెలువడిన వాక్యాలు
సమాక్షరాలైన, నానార్థాలతో కూడిన నాలుగు పాదాల ఆశీర్వాదంగా మారిన
శ్లోకమైంది. ఆదికావ్యంగా ప్రసిద్ధికెక్కిన వాల్మీకి రామాయణ రచనకు ఆ విధంగా బీజం పడింది.
దరిమిలా వాల్మీకి మహర్షి 24,000 సంస్కృత శ్లోకాలతో, శ్రీరాముడి ప్రాముఖ్యతను స్తుతిస్తూ
శ్రీరామాయణాన్ని ఆదికావ్యంగా రచించారు. వాల్మీకి సంస్కృతంలో రాసిన శ్రీమద్రామాయణంలో
సాక్షాత్తు లక్ష్మీదేవైన సీతాదేవి, మహావిష్ణువైన
శ్రీరామచంద్రమూర్తి కథానాయకీ, నాయకులు. వీరు త్రేతాయుగంలో
ధర్మ సంస్థాపన చేసేందుకు మానుష రూపంలో అవతరించారు. సంస్కృత
భాషలో వాల్మీకి రచించిన రామాయణాన్ని, మూలంలోని 24,000 శ్లోకాలకు, శ్లోకానికి ఒకటి
చొప్పున, తెలుగులో 24,000 పద్యాలతో, ప్రతిపదార్థ
తాత్పర్స్య సహితంగా, యథావాల్మీకంగా, ఆంధ్రవాల్మీకిగా
ప్రసిద్ధికెక్కిన స్వర్గీయ వావిలికొలను సుబ్బారావు, 9
సంపుటాలలో ‘శ్రీమదాంధ్ర వాల్మీకి
రామాయణం మందరం’ పేరుతో వంద సంవత్సరాల
క్రితం అనువదించారు ప్రప్రధమంగా. ఈ మందర సంపుటాలు
సమకాలీన ‘ఆధ్యాత్మిక, బహువిషయ విజ్ఞానసర్సస్వాలు’ గా విస్తృతంగా
భావిస్తారు.
వాల్మీకి తాను రచించిన 24,000 శ్లోకాలను సీతారాముల కవల పిల్లలైన లవ, కుశులతో (సీత
అడవిలో వున్నప్పుడు) కంఠస్థం చేయించాడు. ఆ బాలురిద్దరూ అయోధ్యకు పోయి, పురవీధుల్లో, ఋషుల, సాధువుల సమూహాల మధ్యన రామాయణ కావ్యగానం చేశారు. ఆ
విషయం తెలుసుకున్న శ్రీరాముడు వారిని తనవద్దకు పిలిపించుకుని, తమ్ముల సమక్షంలో వారితో పాడించి విన్నాడు. ఆ విధంగా
మొట్టమొదటిసారి సీతారాముల కథ ప్రపంచానికి బహిర్గతమైంది. ‘మహర్షి వాల్మీకి’ నుండి ‘రాజర్షి
నరేంద్ర మోడీ’ దాకా, ఆధ్యాత్మికంగా, ధర్మబద్ధంగా విలసిల్లిన, అందరికీ సుపరిచయమై, ప్రసిద్ధికెక్కిన ‘అయోధ్యాపుర’
వర్ణనతో రామాయణ గాథ ఆరంభం అవుతుంది.
సంస్కృత వాల్మీకి రామాయణం, వావిలికొలను సుబ్బారావు తెలుగు యధావాల్మీకం అలనాటి
అయోధ్యను కళ్లకు కట్టినట్లు వివరించారు. సరయూ
నదీతీరంలోని కోసల దేశంలో వున్న అయోధ్యా నగరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో వుండేవారు.
చక్కటి రాజవీధులతో అలరారుతు,
అందాలొలికే ఆ అయోధ్యా పురం ‘లక్ష్మీ పురం’ నే మరిపించేది మాత్రమే కాకుండా, స్వర్గ నగరమైన అమరావతికి దీటుగా వుండేది. భగవంతుడు శ్రీ మహావిష్ణువు (శ్రీరాముడు) అక్కడ
పుట్టినందువల్లే, ఆ పుణ్యనగరం ‘అయోధ్య’ గా కీర్తించబడింది. భగవంతుడైన
విష్ణువు ఎక్కడుంటాడో, అదే పరమ పదం. ఆయన సేవే మోక్షం. అదే సర్వ కర్మలను ధ్వంసం
చేస్తుంది.
అయోధ్యా
పురంలోని బ్రాహ్మణులు అడిగిన వారికి లేదనకుండా శక్తికొలది దాన ధర్మాలు చేసేవారు. అక్కడి వారెవరికీ,
ఇతరులను యాచించాల్సిన పనేలేదు. వేదాధ్యయనం చేయడం వారికి నిత్య
కృత్యం. బ్రాహ్మణులుపదేశించిన కార్యాలలో ఆసక్తి కలిగి క్షత్రియులు నడచుకునేవారు.
వైశ్యులు రాజులకు అనుకూలంగా వుండేవారు. వంచన, దొంగతనం అనే వాటిని దరికి
రానీయకుండా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు చేదోడువాదోడుగా, కుల విద్యలు నేర్చుకుని,
కులవృత్తులలో నిమగ్నమై కార్మిక, కర్షక వర్గాల వారు వుండేవారు. వీరు-వారు అనే భేదం లేకుండా
అయోధ్యా నగరంలోని ప్రజలందరు సద్గుణవంతులే. అలాగే, ఆ
కాలంలో అన్ని జాతుల వారు కూడా విద్య నేర్చుకునేందుకు అర్హులనే విషయం అయోధ్య నగర
వాసుల గురించి వాల్మీకి వర్ణించినప్పుడు
అపష్టం చేయడం జరిగింది.
అయోధ్యా
నగరాన్ని ఇక్ష్వాకుల సూర్య వంశానికి చెందిన దశరథ
మహారాజు, సమర్థులైన మంత్రుల తోడ్పాటుతో పరిపాలించేవాడు. భోగభాగ్యాలెన్ని వున్నా కుమారులు కలగని దశరథుడు, పుత్రకామేష్ఠి యాగం చేస్తుండగా,
అగ్నిహోత్రం మధ్యనుండి ప్రాజాపత్య మూర్తి దివ్యపరమాన్నమున్న బంగారు పాత్రతో బయట కొచ్చి దానిని ఆయనకిచ్చి, అందులోని పాయసాన్ని తన భార్యలతో తాగించమని చెప్పాడు. పాయసం
తాగిన తర్వాత ఆయన భార్యలు గర్భవతులయ్యారు. ఆ
తర్వాత, పన్నెండో నెలలో, చైత్ర
మాసం, శుక్లపక్షం, నవమి తిథి నాడు, పునర్వసు
నక్షత్రంలో, అభిజిల్లగ్నం, కర్కాటక లగ్నంలో,
చంద్రుడిని కూడిన బృహస్పతి కలిగిన ఉదయాన, దశరథుడి జ్యేష్ట భార్య కౌసల్యా
దేవి జగత్ పాలకుడైన శ్రీమహావిష్ణువు అర్థాంశమూర్తి, శుభ లక్షణాల రఘువంశ వర్ధనుడిని,
శ్రీ రాముడికి జన్మనిచ్చింది. ఆ విధంగా, అలనాటి ‘అయోధ్య’ శ్రీరాముడి జన్మస్థలం, లేదా, రామజన్మ భూమి అయింది. ఆ
పరంపరతో, అదే అయోధ్య,
ఈ నాడు ‘రామ్ లల్లా విగ్రహం’ వుండే చారిత్రాత్మక రామ మందిరానికి నిలయమైంది.
ఆధునిక భారతదేశ చరిత్రలో ‘అయోధ్య వివాదం’ వివిధ న్యాయ
స్థానాలలో ఒక ప్రాధాన్యతను సంతరించుకున్నది. అయోధ్యలోని ఒక ప్రాచీన కట్టడంలో వున్న
వివాదాస్పద స్థలంలోనే శ్రీరాముడు జన్మించాడని, అదే ఆయన జన్మభూమని, అక్కడొక రామాలయం వుండేదని, దాన్ని 1528 లో బాబర్ కూలగొట్టించి బాబ్రీ మసీదు
నిర్మించాడని అందువల్ల ఆ స్థలంపై హక్కు తమదేనని హిందువులు న్యాయస్థానాన్ని
ఆశ్రయించారు. ఈ వివాదానికి స్వస్తివాక్యం పలుకుతూ, నవంబర్ 9, 2019 న ఐదుగురు సభ్యులున్న సుప్రీంకోర్ట్ ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఇచ్చిన ఆదేశంలో, అయోధ్యలో వివాదాస్పద స్థలంలో ‘రామ్ మందిర్ దేవాలయం’ నిర్మించడానికి ట్రస్ట్ ను, ధర్మకర్తల మండలిని ఏర్పాటుచేయమని చేయమని చెప్పింది.
ఆలయాన్ని నిర్మించేందుకు 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని హిందువుల ఆరాధ్య దైవం, సాక్షాత్తు భగవత్ స్వరూపుడు, కోర్ట్ న్యాయశాస్త్ర వ్యక్తిగా గుర్తించిన ‘రామ్ లల్లా
విరాజ్మాన్’ కు అప్పగించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. 2010 అలహాబాద్
హైకోర్టు తీర్పులో పేర్కొన్నట్లు, వివాదాస్పద భూమి విభజన
సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు, అయోధ్యలో ‘రామ్ మందిర్ దేవాలయం’ నిర్మించడానికి, ఫిబ్రవరి 5, 2020 న, 15 మంది సభ్యులతో కూడిన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర
మోడీ. నిర్మాణానికి అవసరమయ్యే అంచనా వ్యయమైన రు 18,000 కోట్లను ప్రజల నుండి విరాళాలుగా సేకరిస్తున్నారు ట్రస్ట్ సభ్యులు. మొట్టమొదటి
విరాళంగా కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి ఇచ్చింది.
ఆగస్ట్ 5,
2020 న ప్రధాన మంత్రి మోడీ భూమిపూజ చేసి ఆలయ పునాదిరాయి వేశారు.
డిజైన్ మార్పువల్ల నిర్మిస్తున్న ‘రామ్ మందిర్ దేవాలయం’ మొదట్లో అనుకున్న దానికంటే రెండింతలవుతున్నది. ట్రస్ట్ కు
కేటాయించిన 70 ఎకరాల భూమి మీద 2.77 ఎకరాల స్థలంలో రామ్ లల్లా కేంద్ర బిందువుగా
నిర్మిస్తున్న ప్రధాన దేవాలయంతో సహా అనేక ఆలయాల నిర్మాణం జరుగుతున్నది. అష్టభుజ
ఆకారపు గర్భగుడి, వృత్తాకార చుట్టుకొలతల నిర్మాణాలు కూడా అక్కడ వుండబోతున్నాయి. ఆలయం
నాలుగు మూలల గోడతో చుట్టబడిన 750 మీటర్ల
విస్తీర్ణం కలిగిన ప్రాకారం కలిగివుంటుంది. భక్తులు ధ్యానం చేసుకోవడానికి ప్రత్యేక
ఏర్పాట్లున్నాయి.
‘రామ్ మందిర్ దేవాలయం’ నిర్మాణానికి, అసాధారణ రీతిలో, ద్విగ్విజయంగా పరిపూర్ణ కృషి చేసిన వ్యక్తిగా ప్రధాని నరేంద్ర
మోడీని, నిర్ద్వందంగా, యావత్తు హిందు సమాజానికి చెందిన ఆబాలగోపాలం, ఆసేతు హిమాచలం, ఎప్పటికీ విధేయతతో జ్ఞాపకం వుంచుకుంటుందనడంలో ఏమాత్రం
అతిశయోక్తి లేదు. అలాగే, ఆలయాన్ని కట్టాలని గుండె లోతుల్లోంచి భావించినా, కట్టలేకపోయిన మాజీ ప్రధాని స్వర్గీయ
పీవీ నరసింహారావుకు, అయోధ్య వివాదాస్పద కేసును విజయవంతంగా వాదించిన సీనియర్ అడ్వకేట్, 96ఏళ్ల పద్మవిభూషణ్
అవార్డు గ్రహీత కె పరాశరన్ కు, 1949 లోనే నెహ్రూ ఆదేశాలనుకాదని రామజన్మభూమిలో పూజలు చేసుకోవడానికి హిందువులకు
హక్కు కల్పించిన, నాటి ఫైజాబాద్ కలక్టర్, ఐసీఎస్ అధికారి, స్వర్గీయ కేకే నాయర్ కు కూడా ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు హృదయపూర్వకంగా
ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియచేయడం కనీస ధర్మం.
No comments:
Post a Comment