Sunday, January 28, 2024

భారతీయ నాగరికత, సంస్కృతి, సంప్రదాయం హిమవదున్నతం, నిత్యనూతనం ..... ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-9 : వనం జ్వాలా నరసింహారావు

 భారతీయ నాగరికత, సంస్కృతి, సంప్రదాయం హిమవదున్నతం, నిత్యనూతనం

ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-9

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (29-01-2024)

         ‘యుగయుగాలుగా ఋషులు దర్శించిన వేదాన్ని వేదవ్యాస మహానుభావుడు సంహితలుగా చేశాడు. వాటిని నాలుగు భాగాలుగా ఏర్పాటుచేసి విభజించాడు. వ్యాసుడు అలా కూర్చిన తరువాత మంత్రద్రష్టలు లేరు. వ్యాసభగవానుడు వేదానికి ఒక పాదం ఏర్పరచాడు. అలా ఏర్పాటు చేసినది మాత్రమే వేదం. ఇందులో చేరనిది వేదం కానే కాదు. మనకు వేదం అని తెలిసింది ‘వేదం సంహిత.’ వీటి కూర్పరి వేదవ్యాస మహర్షి. ఆ విధంగా వేదాన్ని నాలుగు విధాలుగా విభజించడాన్ని వేదచతుష్టయి అంటారు. వేదచతుష్టయి వేదాల విషయ నిర్ణయం చేస్తుంది. వాటిలో, “ఋగ్వేద సంహిత” దేవతల గుణగణాలను స్తుతిస్తుంది. “యజుర్వేద సంహిత” వివిధ యజ్ఞాలను నిర్దేశిస్తుంది. “సామవేద సంహిత” దేవతలను ప్రసన్నులను చేయడానికి గానవిధిని నిర్ణయిస్తుంది. “అథర్వవేదం సంహిత” బ్రహ్మజ్ఞానం సహితంగా అనేకానేక లౌకిక విషయాలను వివరిస్తుంది. వేదత్రయి అని మరొక విభజన కూడా ఉన్నది. ఇది పద్య, గద్య, గేయ విభజన. వేదాలు పద్యంలో దర్శించినవీ, గద్యంలో దర్శించినవీ, గేయంలో దర్శించినవీ, ఉన్నాయి. ఇది ఛందో విభజన.’

         ‘వేదాన్ని దర్శించడానికి వేద దృష్టి కావాలికాని, హ్రస్వదృష్టి, అన్య దృష్టి చాలవు. పరిమిత దృష్టితో అపరిమిత వేదాన్ని దర్శించడం కువ్యాఖ్యానం అవుతుంది. భారత వేదాన్ని భారత కొలమానంలో కొలవాలి. పాశ్చాత్య కొలమానాలు అందుకు పనికికావు. దురదృష్టవశాత్తు వేదత్రయి అంటే, వేదాలు మూడేనని మనను నమ్మించారు పాశ్చాత్యులు. భాగవతంలో “వేదమేకంచతుర్విధం” అని చెప్పబడింది. కాబట్టి మన ప్రమాణాలే ఆధారం. వేద సంహితలు నిర్ద్వందంగా నాలుగేన్నాయి. అవే, “ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద” సంహితలు. యజుర్వేద సంహితలు తిరిగి రెండు భాగాలు. “శుక్ల యజుర్వేద సంహిత, కృష్ణ యజుర్వేద సంహిత.” వేదం “బ్రహ్మ, ఆత్మ, బ్రహ్మ ఆత్మల ఏకత్వం” అనే మూడు విషయాలను ప్రతిపాదిస్తుంది.’

         ‘వేదాన్ని అర్థం చేసుకోవడానికి మహర్షులు ఒక నిర్దిష్ట పధ్ధతి ఏర్పరిచారు. అవి “శిక్ష, వ్యాకరణం, నిఘంటు, ఛందస్సు, జ్యోతిషం, శిల్పం” అనే ఆరు వేదాంగాలు; “గాంధర్వవేదం, ఆయుర్వేదం, ధనుర్వేదం, అర్థవేదం” అనే నాలుగు ఉపవేదాలు. వేదార్థాన్ని గ్రహించడానికి ఉపనిషత్తులు, కణాదుని వైశేషికం, గౌతముని న్యాయం, కపిలుని సాంఖ్యం, పతంజలి యోగం, జైమిని పూర్వ మీమాంస, బాదనారాయణుని ఉత్తర మీమాంస ఉపకరిస్తాయి. వేదవాక్కును అర్థం చేసుకోవడానికి ఐదు దిశలు ఉన్నాయి. ఆన్నమయం (ఇది భౌతికం), ప్రాణమయం (ఇది దృష్టి గోచరం), మనోమయం (ఇది మనసును గ్రహించడం), జ్ఞానమయం (ఇది బుద్ధిని గ్రహించడం), ఆనందమయం (ఇది వేదంలో లీనం కావడం). జీవిత పరమావధి ఆనందమే. ఆనందోబ్రహ్మ’.

         ‘వేదానికి శ్రుతి అని పేరు కూడా ఉన్నది. శ్రుతి అంటే చెవిన పడింది, విన్నది అని అర్థం. వేదం అపౌరుషేయం. అలా అంటే అది మానవుడు చెప్పింది కాదని అర్థం. వేదం మానవుడి కన్నా అతీతమైంది. వాస్తవంగా వేదం మానవ శక్తిని మించినది. అందుకోసం అపౌరుషేయం అనే వాస్తవ సత్యాన్ని వచించారు మహర్షులు. అపౌరుషేయం అనే స్ఫూర్తితోనే అన్య మతాల వారు తమ గ్రంథాలను భగవంతుడే వచించాడు అని చెప్పారు. భగవంతుడు పరాత్పరుడు. జగత్పిత. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ప్రవక్త కావచ్చు. కాని వేరువేరు మతాలకు వేరువేరు భగవంతులు లేరు. ఉండరు. ఉండకూడదు. మానవాళిది ఒకే అదితి భూమి. ఒకే ఆకాశం. ఒకే భగవంతుడు. పరాత్పరుడు, ఈశ్వరుడు, మానవ జాతి సహితంగా సమస్త ప్రాణిజాలానికి అతడే సృష్టికర్త. తల్లి, తండ్రి అన్నీ ఆయనే. అలాంటి పరాత్పరుడు ఒక మతాన్ని నమ్మిన వారి పాపాలు మాత్రమే దూరం చేయడు. వారికి మాత్రమే మోక్షం ఇస్తానని అనడు. అది సత్యానికి దూరం. అసత్యం అవుతుంది.’

         ‘భగవంతుడు సత్య స్వరూపుడు. పరాత్పరునికి అసత్యం అనంత దూరపుది. అంటే ప్రవక్తలు చెప్పి భగవంతుడు చెప్పాడు అన్నారు!! వేదం చెప్పిన అపౌరుషేయం మాత్రమే సత్యం. భగవంతుడు ఒక విశ్వాసపు వారిని మాత్రమే ఉద్ధరిస్తాడనడం బూటకం. అపౌరుషేయం సహేతుకం. మిగతావి నిర్హేతుకాలు! వేదంలో ప్రతిసూక్తి ద్రష్ట పేరు ఋషిగా చెప్పబడింది. అతడు వేదసూక్తపు కర్త కాదు. ద్రష్ట స్మర్త మాత్రమే! అతడు సూక్తాన్ని విన్నాడు. విన్నది కాబట్టి శ్రుతి అయింది. విని దాన్ని అక్షరబద్ధం చేశాడు. వేదం పుట్టిన్నాడే అక్షరం ఉంది. అంతేకాదు శాస్త్రీయమూ, పరిపుష్టమూ, అయిన సంస్కృత భాష ఉంది. ఛందస్సు ఉంది. ఎంతటి నాగరిక జాతి అవుతే సంస్కృతం వంటి భాష ఆవిర్భవించాలి? ఎంతటి సంస్కారం గల జాతి అవుతే సకల ప్రాణులూ సుఖించాలి (సర్వేపిసుఖినస్సంతు) అని నినదించాలి? అన్ని పురాతన నాగరికతలు నశించి పోయాయి. కాని భారత నాగరికత, సంస్కృతి, సంప్రదాయం ఇంకా నిత్యనూతనంగా వెలుగొందుతున్నది. అదీ 1200 సంవత్సరాల పరాయి పాలన తరువాత! ఎంత మహాత్తమమైనదండీ మన దేశం, మన జాతి, మన సభ్యత, మన సంస్కారం, మన సాహిత్యం, మన సంగీతం, మన కళలు?.’

         ‘భారత శాస్త్రం ప్రకారం కాలం అనంతం. కాలం ఎప్పుడు ప్రారంభం అయింది? కాలం ఎప్పుడు అంతం అవుతుంది? ఇది తెలిసినవాడు లేడు. ప్రభువులు, ప్రభుత్వాలు, ఋషులు, ప్రవక్తలూ అందరినీ కాలం మింగేస్తుంది. యుగాలు, అంతం అవుతాయి. ప్రళయం వస్తుంది. మళ్లీ సృష్టి ప్రారంభం అవుతుంది. కాలం నిరంతరం సాగుతూనే ఉంటుంది. కాలమే సృష్టిస్తుంది. కాలమే రక్షిస్తుంది. కాలమే కష్టాలు కలిగిస్తుంది. కాలమే సర్వాన్నీ అంతం చేస్తుంది. కాలం మాత్రం సాగుతూనే ఉంటుంది. కాలానికి నిలకడ లేదు. కాలానికి కళ్ళూ, నోరూ ఉంటే ఎన్ని వాస్తవాలు వెల్లడించగలదో? కాలాన్ని జయించినవాడు లేడు. కాలం అజేయం. అందుకే “కాలోయం బ్రహ్మ” అన్నారు. ఈ కాలానికి నరుడు కొన్ని కొలతలు ఏర్పరచుకున్నాడు. అందుకు భూమి సూర్యుని చుట్టూ తిరిగి వచ్చిన కాలాన్ని సంవత్సరం అన్నాం. అది అంత నిర్దిష్టం కాదు. సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి 365 రోజుల 6 గంటలు పడుతుంది. ఆ ఆరు గంటలు సరిచేయడానికే నెల రోజుల వ్యత్యాసం, అధిక మాసాలు, లీప్ సంవత్సరం మొదలైనవి. అవి ఎప్పుడో కలుపుతాయి. ప్రతి ఏడాదీ జరగదు! మరి దీని నిర్దిష్టత ఏంటి?.’

         ‘నాలుగు యుగాల మొత్తం కాలం 43,20,000 (కృత: 17,28,000, త్రేతా: 12,96,000, ద్వాపరం: 8,64,000, కలియుగం: 4,32,000) సంవత్సరాలు. సృష్టి కాలం 4 కోట్ల 32 లక్షల సంవత్సరాలు. 4000 యుగాల తరువాత ప్రళయం. 4000 యుగాల కాలం సృష్టి ఉండదు. తరువాత సృష్టి మొదలు. సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు 195,58,85,120 పైగా సంవత్సరాలు గడిచాయి. కేవలం వందల, వేల సంవత్సరాల చరిత్ర మాత్రమే కలిగిన పాశ్చాత్యుల కొలతలతో వేదకాలాన్ని కొలవడం గజం బద్దతో ఆకాశాన్నీ, బకెట్ తో సముద్రాన్ని కొలవడం లాంటిది. వేదం ఒకసారి పుట్టి ఒకనాటికి ముగిసిన కావ్యం లాంటిది కాదు. అదొక నది, ఒక స్రవంతి, ఒక ప్రవాహం. ఋషులు దర్శించిందాన్నల్లా అక్షరబద్ధం చేస్తూ పోయారు. అందుకే వేదం అనంతం అన్నారు. ఈ అనంత స్రవంతులను వేదవ్యాసుడు సంహితలు చేశాడు. అప్పుడు అది సకల నదులు కలిసిన సముద్రం అయింది. వేదం సముద్రమై సమస్త ప్రాణులకూ సాయపడుతున్నది.’

‘కలియుగం ప్రారంభమై ఇప్పటికి 5100 సంవత్సరాలు. భారతం ద్వాపరాంతం, కలియుగారంభంలో రచించబడింది. ఆ తరువాత వ్యాస రచన భాగవతం. భాగవతంలో వేదసంహితల గురించి చెప్పబడింది. వేదం సంహితలుగా ఏర్పడి 5000 సంవత్సరాలైంది. వేదం ఎప్పుడు ప్రారంభం అయిందీ చెప్పడం సాధ్యంకాదు. ఇంతకాలంగా ఒక నాగరికత, ఒక సభ్యత, ఒక సంస్కృతీ నిలిచి ఉండడం ప్రపంచంలో కనీవినీ ఎరుగని వింత!!.’

‘వేదం సంస్కృత భాషలో ఉంది. సంస్కృతానికి సంబంధించినంతవరకు తొలుత వ్యాకరణం ఆవిర్భవించింది. వ్యాకరణాన్ని అనుసరించి భాష ఏర్పడింది. అందుకే అది సంస్కృతం అయింది. సంస్కృతానికి స్వంత లిపి లేదు. అందుకోసం దేవనాగరి లిపిని ఆవిష్కరించారు మహర్షులు. లిపిని వేరుగా ఆవిష్కరించడానికి కారణం అది అన్ని భాషలకు ఉపయోగపడాలని. దేవనాగరి లిపి పరిపూర్ణమూ, నిర్దిష్టమూ. దీని అక్షరమాలనే, లిపులు వేరైనా, భారతీయ భాషలన్నీ అనుసరిస్తున్నాయి. అక్షరమాలలన్నీ “” తోనే మొదలైతాయి. జీవితం, భాష “అమ్మ”తో మొదలవుతుంది. దేవనాగరి లిపితో ఏ ఉచ్ఛారణనైనా వ్రాయవచ్చు. అంతటి సుసంపన్నమైన లిపిని మన మహర్షులు మనకు అందించారు. వేల సంవత్సరాలుగా ఆ లిపి నిరంతరాయంగా మానవజాతికి అక్షరామృతం ప్రసాదిస్తున్నది.’

‘ఇన్ని వేల సంవత్సరాలుగా సంస్కృతం హిమవదున్నతమై, నిశ్చలంగా సూర్యకాంతి వలె, సజీవంగా నిలిచి ఉంది. ఇందుకు సాక్ష్యం అనంతమూ, అమరమూ అయిన సంస్కృత సాహిత్యం! వేదం, ఉపనిషత్తు, రామాయణం, భారత, భాగవతాలు కాలపు జరా జీర్ణాలను ఎదిరించి నిత్యనూతనంగా విరాజిల్లుతున్నాయి. వేదం తొలినుంచే అక్షరబద్ధం అయింది. దీనికి భాష ఉంది. లిపి ఉంది. ప్రాణం ఉంది. వేదం భూమి, ఆకాశం, వాయువు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల వంటిది. ఇది శాశ్వతం. ఏ ఒక్క సమాజపు సొత్తు కాదు. ఇది సమస్త మానవాళికి చెందింది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సమస్త ప్రాణి జాలానికి వెలుగు ప్రసాదిస్తాడు. వేదం సూర్యుడిలాంటిది. తూర్పున ఆవిర్భవించింది. సకల ప్రాణిజాలానికి కాంతి ప్రసాదిస్తున్నది.

         ‘వేదాన్ని అర్థం చేసుకోవడానికి స్వర జ్ఞానం అవసరం. మన మహర్షులు వేదాన్ని భద్రపరచడానికి మహాయజ్ఞం సాగించారు. వారు వేదపు అక్షరాలకు స్వరం కూర్చారు. స్వరానికి నిర్దిష్టత, శ్రావ్యత, మహిమ కలిగించారు. వేదానికి “ఉదాత్త, అనుదాత్త, స్వరిత, ఏకశ్రుతి” అనే నాలుగు స్వరాలున్నాయి. అర్థాన్ని పరిరక్షించడానికి స్వరం ఉపకరిస్తుంది. స్వరాన్ని బట్టి అర్థం మారుతుంది. వేదం శ్రుతి, అంటే విన్నది. వినసొంపైనది. స్వరయుక్తంగా చదివిన వేదం శ్రావ్యం. మహిమాన్వితం. అక్షరాన్నీ, స్వరాన్నీ ఇంతకాలంగా భద్రపరచిన ఉదాహరణ సృష్టిలో మరొకటి లేదు. తాళపత్ర, భూర్జర పత్రాల మీద వ్రాసుకుని, వాటిని వల్లించి, ఇన్ని వేల సంవత్సరాలు భద్ర పరచడం ప్రపంచ వింతల్లో సర్వ ప్రథమం కావాలి. అక్షరం, నాదయ్తుక్తమైన వేదం జరాజీర్ణాలకు అతీతంగా నిత్య యవ్వనిలా నిలిచి ఉండడం వింత మాత్రమే కాదు, మహత్తు కూడా.’

         ‘ఋషి సూక్తానికి కర్త మాత్రం కాదు. వేదం అపౌరుషేయం. ఋషి ఆ సూక్తానికి ద్రష్ట. స్మర్త మాత్రమే. అతడు ఆ సూక్తాన్ని అతీంద్రియంగా దర్శించి, దాన్ని గుర్తు పెట్టుకున్నాడు. వాస్తవానికి ఎవడూ దేనికీ కర్తకాదు. అన్నింటి కర్త పరాత్పరుడే. అతడు చేయిస్తున్నాడు. మనం చేస్తున్నాం. పరమపిత పరమేశ్వరుడు ఈ జగన్నాటక కర్త, దర్శకుడు. మనమంతా అతడు ఆడించినట్లు ఆడేవాళ్ళమే! మనం కర్తలమే అనుకుంటే మనం అనుకున్నవి అన్నీ కావాలి కదా! అలా కావడం లేదు! ఇది సర్వే సర్వత్ర అనుభవమే!! కాని కొందరు చెప్పడానికి ఇష్టపడరు!! వారు సత్యానికి తొడుగు వేస్తున్నారు. ఋషికి వేషం, వయస్సు ప్రధానం కావు. అతని జ్ఞానమే ప్రధానం. యువకుడైనా జ్ఞాని అయినవాడిని దేవతలు పెద్దగా భావిస్తున్నారు. వేదం ఋషులు అందరూ కూడా అపౌరుషేయానికి ద్రష్టలు, స్మర్తలు కారు.’

‘వేదాల్లో దేవతలను అనేక విధాలుగా చెప్పడం జరిగింది. ప్రాచీనులుగా పుట్టినవారు దేవతలు, ప్రాచీనంగా పుట్టిన వారు మనుష్యులు. సత్యమే దేవతలు. అసత్యం మనుష్యులు. దేవతలందరి స్థానం పృథ్వియే అవుతున్నది. వేదం దేవతలను, మనుష్యులను సమానంగా భావిస్తున్నది. ఋషులు లాంటి నరులు స్వయం కృషితో దేవతలైనారు. వాస్తవంగా వేదం మానవుడిని, అతడి కృషిని, విశ్వాసాన్ని, మహాత్తునూ ఎక్కువగా విశ్వసిస్తున్నది. శుక్ల యజుర్వేద తొలిమంత్రంలో చెప్పిన విధంగా, దైవ సహాయం, ఈశ్వర సంకల్పం అవసరం. ఈ అనంత విశ్వ సత్యాన్ని వేదం ఆవిష్కరించింది. మానవ జీవితానికి కేవలం ఆధ్యాత్మికం కాని, కేవలం హేతువాదం కాని సరిపడవు. మానవ జీవితం ఏకాకి కాదు. అది అనేక విధాల  సమాహారం. వేదం ఈ పరమ సత్యాన్ని గుర్తించింది. దీన్నిం కాదనడం కేవలం వాదన మాత్రమే!’.

(డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)

No comments:

Post a Comment