సంస్కృతి, నాగరికత, సభ్యతలను యుగయుగాలుగా నిలిపింది వేదం
ఋగ్యజుస్సామాథర్వ
వేదాల సారం-8
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(22-1-2024)
‘ఆలోచన
మాత్రమే ప్రాణులలో మానవుడి విలక్షణత, విశిష్టత, మహాత్తత. మానవుడు తాను గెలిచాను అని అనుకున్నది,
ఓటములకు ఒప్పుకున్నది, సాధించినది,
సాధించనున్నది, సాధించలేనిది,
వీటన్నింటికి యోని, మూలం ఆలోచనే. ఆలోచన అర్థం, అనర్థం అవుతున్నది. న్యాయం, అన్యాయం, సత్యం, అసత్యం, క్రమం, అక్రమం అవుతున్నది. జగత్తులకు కళ్యాణకరం, వినాశకరం
అవుతున్నది. అన్నింటికీ మూలం ఆలోచనే కదా! ఆలోచనే శాస్త్రం, విజ్ఞానం, సైన్స్, దృష్టి.
చివరకు ఆలోచనే ఆలోచన. వేదం ఆలోచన మాత్రం కాదు. వేదం శాస్త్రాలకు తల్లి లాంటిది.
తల్లి ఎంతమంది పిల్లలనైనా ఇవ్వగలదు. కాని, ఎందరు పిల్లలయినా ఒక తల్లిని ఇవ్వలేరు!
మానవుడు వాస్తవాలపై జీవించడం లేదు. సృష్టి ప్రారంభమై కోట్ల సంవత్సరాలు
దాటిపోయినది. ఇంత సుదీర్ఘ కాలంలో శాస్త్రం, సైన్స్, ఏదేదో కనుగొన్నానని మానవుడు విర్రవీగుతున్నాడు. కాని నాటి నుండి నేటివరకు
మనిషికి ‘జీవితం’ అనే పదం కూడా అర్థం కాలేదు. అర్థం చేసుకొవడానికి ఎంతో కాలం
పరుగులు సాగినవి. నేడు అవి ఆగినవి’.
‘యాంత్రిక
నాగరికత మనకు వర్తకం, వాణిజ్యం, వ్యాపారం లాంటి వాటిని ఎన్నింటినో
నేర్పినప్పటికీ జీవించడం మాత్రం నేర్పలేదు. పోనీ నేర్పడం నిలిపి వేసినది అందాం. జీవితం
అనేది గొప్ప విషయం. అది విలక్షణం, విశుద్ధం, విశ్వాత్మకం. బ్రతుకును గురించి తెలిసినవాడు లేడు. మనం గాలి వల్ల
బ్రతుకుతున్నామా? నీటి వల్ల బ్రతుకుతున్నామా? కుటుంబం వల్ల బ్రతుకుతున్నామా? సమాజం వల్ల
బ్రతుకుతున్నామా? ఏమో? ఏమిటో? ఏదో? అన్నింటి కలయిక, కూడిక, సమాహారం వల్ల బ్రతుకుతున్నామా? అట్లయితే మనం పోయినా అవి పోవడం లేదే? ఆధునిక సైన్స్
సామాన్యుడి ఆలోచనలను అంతమొందించింది. తాను చెప్పిందే నమ్మమన్నది. సామాన్యుడిలో
సైన్స్ మూఢనమ్మకాలను కలిగించింది. ఎలా అంటే, నేటి సైన్స్ సైన్సుగా లేదు. సైన్స్
వ్యాపారమైంది. వాణిజ్యానికి ప్రచార సాధనమైంది. అది సామాన్యుడిని ముంచింది.
ఆస్పత్రులే జీవితం అని భ్రమింప చేసింది. మనం ఆ భ్రమలోనే బతుకుతున్నాం’.
‘మనిషి గాలి, నీరు, ఆహారం మీద మాత్రమే జీవించడం లేదు. అతడు ‘విశ్వాసం’ మీద
జీవిస్తున్నాడు. విశ్వాసానికి హేతువు ఉండదని కాదు. కాని దాన్ని వెతకడానికి ఈ
ముష్టి బతుకు చాలదు. వేదం విశ్వాసం. వేదం అపౌరుషేయం. భగవంతుడు ప్రసాదించినది. ఆ
విశ్వాసమే ఈ జాతి సంస్కృతిని, నాగరికతను, సభ్యతను ఇన్ని లక్షల సంవత్సరాలు నిలిపి ఉంచినవి. అంత మాత్రాన అర్థం
తెలిసికొనరాదను నియమం లేదు. జ్ఞానం సూర్య తేజం లాంటిది. దానిని మూసి వుంచే శక్తి
ఎంతటి వారికీ లేదు’.
‘వేద మంత్రంలో
సంపద కొరకు వాయువును ఆరాధించమన్నాడు. వాస్తవానికి వాయువే కదా సకల సంపదలకు కారణం.
వాయువు మాత్రమే కాకపోవచ్చును. వాయువు కూడా కావచ్చును. వాయువే అని ఒక పరిశీలన. మరో
మంత్రంలో అపానములాను గురించి చెప్పాడు. పిండోత్పత్తికి అవి కారణం అంటున్నాడు. అదే
సత్యమా? మరో మంత్రంలో దీర్ఘ రోగాలకు, చికిత్సకు
వాయువే కారణం అంటున్నాడు. యోగవైద్యంలో చాలావరకు శ్వాసను నియంత్రించే ప్రక్రియ వల్ల
రోగం నివారించబడుచుతున్నది. జల చికిత్స లాంటివి ఆధునిక వైద్యంలో వున్నాయి. ఇది
వాయు చికిత్స కావచ్చు. ఇది మాత్రమే చికిత్స అంటే అది వేరే విషయం. ఇంకో మంత్రంలో
బలి గురించి చెప్పబడింది. బలి మానవుడి విశ్వాసం. అరిషడ్వర్గముల బలి జ్ఞాన మార్గం. మానవుడు
తొలిగా నరబలితో ప్రారంభమైనాడు. బలి త్యాగానికి సంకేతమా?
నరబలి నుండి నారికేళ బలి వరకు మనం ఎంత దూరం పయనించాం!!!’.
‘వేదం ఏకవచనం. వేదం పవిత్ర విద్య అని అథర్వ వేదం, శతపథ బ్రాహ్మణం, తైత్తరీయ బ్రాహ్మణం చెపుతున్నాయి. అందువల్ల వేదం పవిత్ర విద్య అవుతున్నది. ఇక పోతే, వేదాః అంటే వేదములు. ఇది బహువచనం. వేదాలు నాలుగు. అవి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, బ్రహ్మవేదములు. బ్రహ్మవేదానికే అథర్వణ వేదం అని పేరు. వేదాలు: సంకల్పం, రహస్యం, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, వ్యాఖ్యానాలు, పురాణాలు, స్వరాలు, సంస్కారాలు, నిరుక్తాలు, అనుశాసనాలు, అనుమార్జునాలు, వాక్కు, వాక్యం సహితంగా నిర్మించబడినాయి. వేదాలు ప్రజాపతి సంబంధాలు. ప్రజలను సృష్టించి పోషిస్తున్నాడు కాబట్టి ప్రజాపతి అయినాడు. ప్రజాపతి సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ప్రజాపతి ఏ ఒక్కడూ కాదు. 39 రకాల సృష్టి, స్థితులకు కారణభూతుడు. ఇది సత్యం. దీనికి తిరుగులేదు. సమస్తం ప్రజాపతి. సమస్తం సృష్టిస్థితి కారణం. అందుకే ప్రజాపతి అపరిమితుడు అవుతున్నాడు. ప్రకృతికి, పరమాత్మకు పరిమితి లేదు. వారు అపరిమితులు. ప్రజాపతి సమస్తం. వేదం సమస్తం. అనంతం. అపరిమితం’.
‘మానవుడికి
తెలియపరచింది వేదం. తెలియటమే జ్ఞానం. జ్ఞానం సాపేక్షం. ఒకసారి తెలిసిందాన్ని
తిరిగి చెప్పడం జ్ఞానం కాదు. అది పునరుక్తి. పునరుక్తులు జీవితంలో తప్పవు.
అంతమాత్రం చేత పునరుక్తి జ్ఞానం కాబోదు. ఒకనాడు నరుడికి అన్నం అంటే ఏమిటో తెలియదు.
అన్నాన్ని వేదం తెలియపరిచింది. అప్పుడు అది జ్ఞానం అవుతుంది. అన్నం తెలిసిన తరువాత
చెప్పడం జ్ఞానం కాదు. అలాగే వస్త్రం, కుటుంబం,
బంధుత్వం, గ్రామం, రాజ్యం. వీటిని
అన్నింటినీ వేదమే తెలిపింది. తెలియక ముందు అది జ్ఞానం అవుతుంది. వేదం అవుతుంది.
సత్యస్వరూపుడైన పరమాత్మ మానవుడికి ఏనాటికీ అందడు. కాబట్టి భగవంతుడి గురించిందంతా
జ్ఞానం అవుతుంది. సత్య స్వరూపాన్ని దర్శించడానికి నిత్యం జరిగే అన్వేషణ జ్ఞానం
అవుతుంది. పరమాత్మ అనంతం. అంతంగల నరుడు అనంత బ్రహ్మను దర్శించజాలడు. అందుకే
అన్వేషణ, అన్వేషణ. అన్వేషణే జ్ఞానం! అదే వేదం!!! మానవుని లౌకిక, పారలౌకిక, ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ వేదమే
ప్రవచించింది’.
‘పరమాత్ముడు పరిపూర్ణంగా ఎవరికీ అవగతం
కాడు, దర్శనం ఇవ్వడు. నిత్యాన్వేషణ వల్ల భగవంతుడు అంశామాత్రం గోచరిస్తాడు. ఆ
విధంగా అంశామాత్ర లబ్దులు వారి వారి దశలను బట్టి సాధువులు, యతులు, తపస్వులు, మహాత్ములు,
అవతారాలు అవుతున్నారు. వీరే మునులు, ఋషులు, మహర్షులు అవుతున్నారు. అజ్ఞానులు వారినే పరమాత్మగా భావిస్తున్నారు.
ఆరాధిస్తున్నారు. అలాంటివారు అంశామాత్ర పరమాత్మను ఆరాధిస్తున్నారు! మహర్షులు, మహాత్ములు నిస్వార్ధులు, నిష్కల్మషులు.
తేజోమూర్తులు. వారు వేద మంత్రాలను దర్శించారు. మానవ జీవితాన్ని సమున్నతం చేయడానికి
కృషి చేశారు. వారు అనేక సంస్థలను, ఆచారాలను, సంప్రదాయాలను ఏర్పరిచారు. వారి దివ్వెలవలె తమను తాము కాల్చుకున్నారు.
లోకాలకు నిత్యకాంతులను ప్రసాదించారు. వారు సూర్య చంద్రుల లాంటివారు. పర్వతముల లాంటివారు.
నదుల లాంటివారు. వృక్షముల లాంటివారు!’.
‘ప్రకృతి
ప్రాణులకు సర్వస్వం అందిస్తుంది. వారి నుంచి ఏదీ ఆశించదు. అది అందుకున్న దానికి
వెల ఇంతలు తిరిగి ఇస్తుంది. అందుకే మనం జీవిస్తున్నాం. అయితే,
మహాత్ములు, మహర్షులు, మహా పురుషులు ఉన్న సమాజంలోనే నీచులు, నికృష్టులు, స్వప్రయోజనపరులూ ఉంటారు. ఈ స్వప్రయోజనపరులు సమాజం సంతాన్ని
తమకోసం వాడుకుంటారు. జనం వారినే నమ్ముతారు. ఈ నీచులు మహర్షులు, మహాత్ములు ఏర్పరచిన సంస్థలను, ఆచారాలను, సంప్రదాయాలను దిగమ్రింగుతారు. వాటి స్థానంలో ఆత్మ కోల్పోయిన గాజు
బొమ్మల్లాంటి ఆచార సంప్రదాయాలను కల్పిస్తారు. తమవే నిజమైనవని నమ్మిస్తారు. జనం ప్రాణం
ఉన్న రూపాలను విడుస్తారు. ఈ స్వప్రయోజనపరులు, నీచులు అనాదిగా
సమాజాన్ని మోసగిస్తున్నారు’.
‘వేదం ఏనాటిది?
ఎన్నడు మొదలైంది? వేదం అనాగరిక మానవుని కాలం నుంచి నిర్మలంగా, నిష్కల్మషంగా ప్రవహించింది. మనిషి మనసు మలినాన్ని దూరం చేసింది. మానవుని
దైవత్వపు అంచులకు కొనిపోయింది. స్వప్రయోజనపరులకు వేదం లెక్కలోనిది కాదు. వారు
వేదాన్ని వేలం వేయగలరు. తాము చెప్పిందే వేదం అని నమ్మించగలరు. నమ్మించారు కూడా.
దొంగ వేదాలు సృష్టించారు. అందుకే “విస్సన్న చెప్పిందే వేదం” అన్న
సామెత వచ్చింది. వేదం అలాంటి గందరగోళంలో ఉన్నప్పుడు వ్యాసభగవానుడు అవతరించాడు.
వేదానికి కలిగిన ఈ దుస్థితిని చూచాడు. దుఃఖించాడు. అంతటితో చాలించలేదు. వేదాన్ని
పరిష్కరించడానికి ఉపక్రమించాడు. అంతటి దుస్థితి నుంచి నిజమైన వేదాన్ని వెలికి
తీయడం సామాన్యం కాదు. రాళ్లలో వజ్రాన్ని వెతకడం లాంటిది!’
‘వ్యాసభగవానుడు
ఒక మహత్తర కార్యానికి పూనుకున్నాడు. మానవ కల్యాణం కోసం మహా యజ్ఞాన్ని
ప్రారంభించాడు. అప్పుడు ఆ మహర్షికి ఎన్ని సమస్యలు ఎదురైనాయో! ఎందరు వైరులు
ఎదురైనారో! ఎందరిని ఎదిరించాల్సి వచ్చిందో? ఇదంతా ఎందుకు? వ్యాస భగవానుడికి స్వార్థం లేదు. స్వప్రయోజనం లేదు. కేవలం మానవ
కళ్యాణానికే వేదాలను పరిష్కరించ పూనుకున్నాడు. వ్యాసమహర్షికి ఎన్ని వందల వేల
విద్వత్ శిష్యులో! ఒక మహావటం కాదు, పంచవటి. ఆ నీడన
వ్యాసభగవానుడు ఆసీనుడు. అతడు చంద్రుడు. అతని శిష్యులు వేనవేల నక్షత్రాలు!
ఒక్కొక్కరి ముందు తాళపత్ర రాశి! శిష్యుల వేదాధ్యయనం. తొలుతగా వారు
పరిష్కరిస్తున్నారు. వారు వ్యాసుడికు అందిస్తున్నారు. వ్యాసమహర్షి నిశితంగా
పరిశీలిస్తున్నారు. వేదం కానిదాన్ని ఒకవైపు విసురుతున్నారు. వేదాన్ని తనదగ్గర భద్ర
పరుస్తున్నారు. వ్యాసుని పక్కన ముని శిష్యులు వేదపు ప్రతులను సిద్ధం చేస్తున్నారు!
ఎంతటి నిమగ్నత! ఎంతటి ధ్యానం! ఎంతటి మౌనం! ఎంత నిశ్శబ్దం! (ఇది రచయిత దాశరథి
రంగాచార్య ఉహా చిత్రం)’.
‘వ్యాసమహర్షి
నిర్వహించిన మహత్కార్యాన్ని తలుచుకుంటే వళ్లు జలదరిస్తుంది. అందరు ఋషులు, అందరు
మునులు, అందరు కవులు, అందరు యోగులు తమ
జీవితాలను దివ్వెలను చేసినారు. తాము తిమిర బాధలను అనుభవించారు. లోకాలకు వెలుగు
ప్రసాదించారు! మనిషి జీవితాన్ని ఆదర్శం వైపు నడిపారు. మానవుడిలో దైవత్వాన్ని
వెలికి తీశారు! వారి నిరంతర యజ్ఞం, యత్నం, ప్రయత్నం వల్లనే మనం ఇంకా మనుషులుగా ఉన్నాం. నదీనదాలు, పర్వతాలు, వృక్షాలూ, మనకు
ఎంతో ఉపకారం చేస్తున్నాయి. వాటివల్లనే మనం జీవిస్తున్నాం.
‘ఈ నాటి
యంత్రయుగపు నరరాక్షసుల ప్రయత్నాలు నాటి వేదవ్యాసుడి వేద పరిష్కార మహాత్కార్యంలో
ఎదురై ఉండవచ్చు. వేదం మానవుడికి సమస్తం నేర్పింది. మానవుడు కొన్నింటినే నేర్చాడు.
వాటిని అలవాటుగా, ఆచారంగా చేసుకున్నాడు. వ్యాసభగవానుడు అందరినీ ఎదిరించాడు. కలుపు వేదాన్ని, చీడ వేదాన్ని, నకిలీ వేదాన్ని, దొంగ వేదాన్ని సాహసోపేతంగా తొలగించాడు. అందుకే అతడు వ్యాసభగవానుడు
అయ్యాడు. వ్యాసుడిది అవతారం. అతడు భగవానుడు. అతడు నారాయణుడు. అతడు మనకు అక్షయ సంపద
ప్రసాదించాడు. వ్యాసుడు వశిష్టుడి మునిమనుమడు. శక్తికి పౌత్రుడు. నిష్కల్మషుడు.
పరాశరుడి పుత్రుడు. శ్రీశుకుడి తండ్రి. తపోధనుడు’.
‘మనకు
ప్రస్తుతం లభిస్తున్నవి నాలుగు వేద సంహితలు. అవి, ఋగ్వేద, కృష్ణ
యజుర్వేద తైత్తిరీయ, సామవేద, అథర్వవేద
సంహితలు. వ్యాసభగవానుడు కృపావాత్సల్యములు గలవాడు. తీరికలేని అజ్ఞాన సంతతి
రానున్నదని గ్రహించినాడు. ఏకవేదాన్ని నాలుగుగా నిర్మించాడు. తరగని సంపదను
కలిగించేది సంహిత. సంహిత వర్గ సంయోగం. వేదం లోని కొంత భాగమే శాస్త్రం.
సంధించబడినది. దీన్నే మనం ఇప్పుడు సంకలనం అంటున్నాం. వేదం రామాయణం, భారత, భాగవతాదుల లాంటిది కాదు. అది ఒక కవి రచించనది
కాదు. కావ్య, ఇతిహాస, పురాణాల లాగా
నిరంతర కథాగమనం ఉండదు. వేదం సంహిత మంత్రాల, సూక్తాల కూర్పు
మాత్రమే. వేదం అపౌరుషేయం. అంటే నరుడు చెప్పింది కాదు. ఋషులు మంత్రాలను, సూక్తులను దర్శించారు. వారు కర్తలు కారు, ద్రష్టలు.
స్మర్తలు మాత్రమే. కనుగొని గుర్తుంచుకున్నవారు. ఎన్ని యుగాలుగా ఎందరు ఋషులు
వేదాలను దర్శిస్తున్నారో? చెప్పడం అసాధ్యం. భారతీయులకు కాలం
అనంతం, బ్రహ్మ, పరమేశ్వరుడు. ఇవేవి మానవ కొలతలకు అందవు’.
(డాక్టర్
దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)
No comments:
Post a Comment