ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ ఎలా?
(అయోధ్య ‘రామ్ లల్లా’ విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట
వేడుక’ అంటే ఏమిటి?)
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (20-1-2024)
అయోధ్యలో నూతనంగా నిర్మించిన చారిత్రాత్మక రామ మందిరంలో,
జనవరి 22, 2024 మధ్యాహ్నం 12.20 గంటల శుభముహూర్తాన చారిత్రాత్మక ‘ప్రాణ ప్రతిష్ట
వేడుక’ కార్యక్రమానికి ముఖ్య అతిథి సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే. అదే
రోజున, యావత్ భారత దేశ ప్రజలు, వారివారి ఇళ్లల్లో
‘రామజ్యోతి’ వెలిగించి, దీపావళి పండుగలాగా ఆ వేడుకను
శోభాయమానంగా జరుపుకుంటున్నారు. ‘శ్రీరామజన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్’
సభ్యులు, పారదర్శకంగా ఎంపికచేసిన, ఐదేళ్ల వయసు పోలిన 51 అంగుళాల ‘రామ్ లల్లా
విగ్రహానికి’ ప్రాణశక్తిని ఆవాహన చేసే ‘ప్రాణప్రతిష్ట వేడుక’ను, ఆలయ ఆచారానికి, సాంప్రదాయానికి అనుగుణంగా జరుపుతున్నారు నిర్వాహకులు. ఈ
నేపధ్యంలో జనవరి 16 న ప్రారంభమై, ఏడు
రోజులపాటు నిర్విరామంగా సాంప్రదాయ, ఆచార బద్ధమైన పలు కార్యక్రమాలు నిర్వహించారు. వీటికి పూర్వరంగంలో, ట్రస్ట్ కార్యదర్శి చంపట్ రాయ్ పవిత్ర అక్షతల పంపిణీ కార్యక్రమానికి
ఆంగ్ల నూతన సంవత్సరంనాడు లాంఛనంగా శ్రీకారం చుట్టారు.
అసలు ఈ ‘ప్రాణ ప్రతిష్ట వేడుక’ అంటే ఏమిటి?
అందులో భాగంగా ఏమేమి జరుపుతారు? ఇతర దేవాలయాలలో ‘ప్రాణ
ప్రతిష్ట’ కార్యక్రమానికి అయోధ్యలో ‘ప్రాణ ప్రతిష్ట వేడుక’ కార్యక్రమానికి
విధానపరంగా తేడా లేదేమో కానీ, జరిగేది రామజన్మభూమిలో కాబట్టి,
యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నదికాబట్టి, విశేషమైతే
స్పష్టంగా ఉందనే అనాలి. ఏమిటా విశేషమంటే, విశేషమయినటువంటి భారతీయ
హైందవ సాంప్రదాయ పండగలన్నింటిలోకెల్లా ‘అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుక’ చాలా,
చాలా పెద్ద పండుగ అనాలి. మర్యాద పురుషోత్తముడు, సాక్షాత్తు విష్ణుమూర్తి
అంశావతారం, శ్రీరామచంద్రమూర్తి దివ్యమైనటువంటి జన్మభూమిలో, కొన్నివందల సంవత్సరాల
క్రితం శిధిలమైపోయిన రామాలయం, మరల అధ్బుతమైన కాంతులీనుతూ, భరతఖండంలో, నవీకరించిన అయోధ్యలో పునర్నిర్మితమై, రామ్ లల్లా విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట’
జరుగుతున్నది.
ప్రతిష్టాపన
కార్యక్రమం వేడుకలో, హైందవ సాంప్రదాయ ప్రకారంగా నిర్వహించేటువంటి శుభ
సమయంలో, భిన్నాభిప్రాయాలు వ్యక్రమవుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠాపన అనేటువంటిది ఒక
వ్యక్తి చేతుల మీదుగా చేయవచ్చా అనే యక్షప్రశ్నలు చాలామంది సోషల్ మీడియాలో
లేవనెత్తుతున్నారు. పీఠాదిపతులకు అనుకూలంగా, ప్రతికూలంగా వ్యాఖ్యానాలు
చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంప్రదాయాలన్నీ మాకే తెలుసు, మేమే చాలా గొప్పవాళ్లం, ఎదో ఒకటి
మాట్లాడటం ఇలా ఎప్పుడూ జరిగే విషయమే. అలాంటివారిని ఆక్షేపించి లాభంలేదు. ఎవరి
మనోభాలు వారివే కాబట్టి విమర్శల జోలికి పోకుండా, ఖమ్మం
జిల్లా, ముదిగొండ మండలం, మా స్వగ్రామం
ముత్తారంలో మా పూర్వీకులు నిర్మించిన అపర భద్రాచల రామాలయంలో అర్చకుడుగా
పనిచేస్తున్న ఆగమశాస్త్ర పండితుడు, వేదాధ్యయనం చేసి, ఎన్నో దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను జరిపించి మంచి పేరు
గడించిన బొర్రా వాసుదేవాచార్యులు గారితో సంభాషించిన తరువాత ఆ కార్యక్రమం ప్రత్యేకత, తంతు గురించి కొంత అవగాహన కలిగింది.
ప్రాణప్రతిష్ట అనేటువంటిది
ఏ ఒక్క వ్యక్తి చేయడు. ప్రాణప్రతిష్టాపన చేయడం కోసం, మొదలు ‘బ్రహ్మ’ అనే ఋత్విజుడిని ఎంచుకొంటారు. ఆది శంకరాచార్యుల
వారు ఏమన్నారంటే, ‘దేహో దేవాలయో ప్రోక్తః జీవోద్దేవో సనాతనః’
అని. అంటే, దేహమే దేవాలయం. జీవుడే సనాతనమైన దైవం అని అర్థం.
దేహం కాని దేవాలయం లేదు, జీవుడు కాని దేవుడు లేడు. దేహం లోనే
ధ్యానం చేయాలి, దేహం ఉన్నదే ధ్యానం చేయడం కోసం, దేహం లేకపోతే ఎక్కడి ధ్యానం ? ఒక దేవాలయాన్ని
నిర్మాణం చేసేటప్పుడు ఆ దేవాలయం శిఖరాన్ని శిరస్సుగాను. గర్భాలయాన్ని గళంగాను, లోపల
ఉండేటటువంటి మూర్తిని హృదయంగాను, అక్కడుండేటువంటి అంతరాత్మను జ్యోతిని దేవుడిగాను,
ఈ ప్రాకార మండపాన్ని ఉదరంగాను, అక్కడ వున్నటువంటి మెట్లను తొడలుగాను, దేవాలయానికి
ఆలయత్వం కలిగించేదాన్ని ధ్వజ స్తంభంగాను, ముందు ఉండే గాలిగోపురాన్ని
పాదంగాను భావిస్తారు.
ఇలాంటి ఆలయాన్ని మానవుడి రూపంలో మానవుడి ఆకృతిలో వుంచుతారని నమ్మకం. మానవుడి
ఆకృతిలో వుంచి లోపల వుండే జీవాత్మను, 'అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య
నారాయణః స్థితః' అని నారాయణ సూక్తంలో చెప్పినట్లు
ధ్యానిస్తారు. మానవుడికి ఎవరికైనా సరే ఒక వెలుగు వుంటుంది. ఆ స్పార్క్ నే జీవాత్మ
అంటారు. ఈ జీవాత్మే పరమాత్మలో లయబద్దంగా అనుగుణంగా, అనుబద్దంగా
వుంటుంది. ఆ జీవాత్మ అనే జ్యోతిని కొన్నివేల కణాలతో, అద్బుతమైనటువంటి
మంత్ర రూపకంగా, నిర్మాణం చేసేటటువంటి
ప్రక్రియ హైందవ,
వైదిక ధర్మశాస్త్రాలలో వుంది.
ఇప్పటికి కూడా కొందరు చెప్పుకునే విషయం ఒకటి వుంది. భగవత్ రామనుజ
స్వామి వారు ఆగమ శాస్త్రంలో జీవకళ, ప్రాణప్రతిష్ట,
కళాన్యాసం అనేవి వున్నాయా? లేవా అని ప్రశ్నిస్తే వున్నాయన్నారు మునులు. అయితే తాను
చనిపోతానని, మళ్లీ తన ప్రాణాలు తెచ్చిస్తారా? అని సవాలు విసిరారు. తెచ్చిస్తాం, ఇది ప్రధాన్యాసం అని చెప్పి వైఖానస ఆగమ పండితులు వచ్చారు శ్రీరంగంలో. స్వామివారిని
నిదురింప చేశారు. ఆ జీవకళను ఒక్కోక్కటీ
సహస్రారం (చిట్టచివరి స్థితి) దగ్గరి నుంచి పాదాల దగ్గరి వరకు ఒక్కోక్క
అంగానికి రూపకల్పన చేస్తూ ఆ జీవాన్నీ అవకర్షణ చేస్తూ ఆ జీవాన్నంతా కూడా ఒక కుంబంలో పెట్టేసేసి, ఆ
ప్రాణాన్ని ఆ శరీరాన్ని సిద్దం చేసారు. జీవం వెళ్లిపోయింది. కేవళం కళేబరం మాత్రం
మిగిలి వుంది. తరువాత మళ్లీ బ్రహ్మన్యాసము, అంతర్బహిర్మాత్రుకాన్యాసాలు
సృష్టించి రామానుజుల శరీరానికి పాదం దగ్గరి నుంచి శిరస్సు వరకు మళ్లీ కళ ఆవాహన చేశారు. కళావాహన చేసి
సహస్రారం నాడిపై ఆవాహన చేసిన వెంటనే రామానుజ స్వామి లేచి కూచున్నారు. ఇది ప్రాణాన్ని తీయటం, ప్రాణాన్ని పోయటం అనే
ప్రక్రియ వేదశాస్త్రానికి వుందని
చెప్పబడతూంది. ఇది శ్రీరంగంలో జరిగింది.
ప్రాణ ప్రతిష్ట గురించి వేదాలలో చెప్పిన ఓ అద్బుతమైన
ప్రక్రియ. ఎమిటా ప్రాణప్రతిష్ట అంటే, బ్రహ్మాన్యాసం
అనే న్యాసాన్ని చేసి పృథ్వీ తత్వం, అగ్ని తత్వం, వాయుతత్వం, జలతత్వం, తేజోతత్వం
అనే అయిదు తత్వాలను రూపొందింప చేస్తారు.
అది ఏమిటయ్యా అంటే, మానవుడు పుట్టంచేది కాదు. ఎంతో మంది సైంటిస్టులు చెబుతున్నారు భూమికి గురుత్వాకర్షణ శక్తి వుంది లాగేస్తోందని. ఇది
న్యూటన్ చెబితేనే తెలిసిందా? కానేకాదు. అది బద్ధమైనటువంటి శక్తి. పృథ్వీ శక్తి అద్బుతమైనది. దానినే
బంధనమంటారు. అటువంటి పృథ్వీశక్తి.
మండింపచేసే అగ్నిశక్తి, తడిచేసే జలశక్తి, గట్టి పడేసే
వాయుశక్తి, లాంటి పంచభుతాత్మక శక్తులను, పంచభూత శక్తులుగా, పంచ
అగ్నులుగా ఆవిర్భవింపజేసి సభ్యము, పౌండరీకం, అన్నాహార్యము, ఆహనీయము, అవశక్యం అనే అయిదు అగ్నులనుండి గార్హపత్య తృష్టి చంద్రజీవకళ, సభ్యాగు చంద్రజీవకళ, ఆహవనీయ మానవ చంద్రజీవకళ అనే
జీవకళలను కుంభంలో ఆవాహన చేస్తారు.
ఆవాహన చేసి, ఒక బ్రహ్మ, కొంతమంది ఋత్విజులను ఉంచి,
దేవతలకు హవిస్సును ఇచ్చి, జీవకళను పటిష్టత పరిచి, దేవాలయాన్ని ప్రతిష్ట చేసే బింబానికి పంచగవ్యాధివాసం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా పంచగవ్యాలైన పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రంతో
అభిషేకం చేస్తారు. అనంతరం పంచగవ్యప్రాసన, వాస్తు హోమం,
అకల్మష ప్రాయశ్చిత్త హోమం, రక్షాబంధనం
నిర్వహిస్తారు. విగ్రహంలో జీవ కళలను నింపే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని
నిర్వహించడానికి ఆగమశాస్త్రంలో నిష్ణాతులైన తత్సంబంధమైన ఆగమ పండితులను ఎంచుకొని, బ్రహ్మస్థానములో
ఆచార్యుడు ఆధ్వర్యుడిగా, తనతోపాటు మరి కొంతమంది ఋత్వికులుగా వుండి, వైదిక కార్యక్రమాలను జరిపి, పంచగవ్యాధివాసంతో అదివసింప చేసి, దాన్ని పరిగ్రీకరణ చేసి, జలాధివాసం, క్షీరాధివాసం, పుష్పాధివాసం, ధాన్యాదివాసం, పంచకషాయాధివాసం, రత్నాధివాసం అనే పంచతల్పాధి వాసాలను నిర్వహించి, విగ్రహాన్ని సంస్కరించి,
అగ్ని మధనం చేసి, ఆ యజ్ఞాగ్నిలో అంగహోమం జరుపుతారు.
ఆ తరువాత ఆ
బింబంలోకి ఒక్కోక్క జీవకళను ప్రవేశింపబెడతారు. ఒక్కొక్క అంగానికి ‘సుఖం
చరం తిష్ఠంతు స్వాహా’ అని రూపకల్పన చేస్తూ, గ్రహించబడిన
కలశంలో పవిత్ర ఓషధీ వస్తువులను, సుగంధ పరిమళ ద్రవ్యాలను,
బ్రహ్మముడితో కూడిన దర్భపవిత్రమును వుంచి, తాను సౌమనస్కచిత్తుడై,
‘బ్రహ్మన్యాసాన్ని, అంతర్, బహిర్మాతృక,
న్యాసాలను’ నిర్వహించి, ఆ కుంభంలో ‘సభ్యామృత చంద్రజీవ కళ, ఆహవనీయ మానద చంద్ర జీవకళ, అన్వాహార్య పూషా చంద్ర
జీవకళ, గార్హపత్యా తుష్టి చంద్ర జీవకళ,
అవసక్థ్య పుష్టి చంద్ర జీవకళ, ప్రాణ, అపాన,
వ్యాన, ఉదాన, సమాన
జీవకళలను, చతుష్షష్టి జీవకళలను, అవాహన
చేస్తారు.
ఆ తరువాత ఆత్మసూక్తంతో అభిమంత్రించి, ప్రాణప్రతిష్ట
చేస్తున్న (భగవంతుడు) స్వామివారి మూల మంత్రాలను జపించి, ఆ
స్వామివారి రూప లావణ్యాలను సంస్మరించుకుంటూ, ఆవాహన చేస్తారు. వేదమూర్తులు
నిర్ణయించిన సుముహూర్త సమయంలో యంత్ర, విగ్రహ ప్రతిష్టాపన
కాగానే, ‘ప్రధాన బ్రహ్మ’ ఆ శిలా విగ్రహంలో వేదమంత్రాలతో ‘కళావాహన, కళాన్యాసం’ ఆచరిస్తారు. ముందు పాదం, తరువాత గుల్పం, తరువాత జాను అంటె మోకాళ్లు,
ఆ తరువాత ‘బృ’ అంటే తొడలు,
‘కటి’ అంటే నడుము,
ఉదరం, ఉదర పార్ష్య భాగము, అదే విధంగా హృదయం, వక్షస్థలం, చక్షహు
కన్నులు, శ్రోత్రము, జిహ్వ, ‘ఆర్ద్ర’ అంటే వాసన చూసేవి, ఇవన్నీ కూడా ఒక్కోక్క శక్తిని ప్రవేశింపబెడతారు.
సాధారణంగా జరిగే సీతారామకళ్యాణ కార్యక్రమాలలో కూడా ఉత్సవ
విగ్రహాలకు స్వామి వారిని ఆవాహన చేస్తారు. ఏదైతే స్వామికి చెప్పుతారో, అంటే:
‘సీతారామచంద్ర దేవతా జివహః యహ జీవహః’ అని.
ఈ ప్రకృతిలో వుండే జీవం ఏదైతే వుందో, ఆ జీవం ఇక్కడికి రావాలి. ప్రాణం ఇక్కడికి
రావాలి. వాక్కు, పాణి అంటే చేతులు, ఆ తరువాత పాదాలు, పాయహ, ఉపస్థ, వచన-మాట్లే శక్తి, ఆధారం, జీర్ణక్రియ జరిగే శక్తి, వినగలి శక్తి, చూడగలిగే శక్తి, జిహ్వఆగ్ర, ఆదిత్య, ఇవన్నీ వచ్చేసేసి ఆ బింబంలో సుఖం చరిత్వంష్టు స్వాహా, సుఖం చరిత్వంష్టు స్వాహా, సుఖం చరిత్వంష్టు స్వాహా, అని చెపుతూ స్వామి వారిని ఆవాహన
చేయటం జరుగుతోంది. విగ్రహంలో సకల ప్రాణ శక్తితో చిరకాలము ఉండు గాక అని
దిగ్బంధన చేసి అర్చనాదికాలు నిర్వహిస్తారు. ఇదే, ఇదే ప్రాణప్రతిష్ట.
ఈ ప్రాణ ప్రతిష్ట జరుగగానే, ‘మంత్రాధీనంతు దైవతం, దైవాధీనం
జగత్సర్వం, తన్మంత్రం బ్రాహ్మణాదీనం బ్రాహ్మణో మమ దేవతా అని
చదువుతారు (ఈ జగమంతా దైవము యొక్క అధీనమై వున్నది. ఆ దైవం మంత్రానికి
అధీనమై ఉంటాడు. ఆ మంత్రం బ్రాహ్మణాధీనమై ఉంటుంది. బ్రాహ్మణులే నాకు దేవతలు). అలా
అంటూ, ఆ మంత్రాధీన శక్తిని
ఆ బింభంలోకి ప్రవేశింప చేస్తూ, జనవరి 22, 2024
మధ్యాహ్నం 12.20 గంటల శుభముహూర్తాన అయోధ్య రామాలయంలో జరిగే చారిత్రాత్మక ‘ప్రాణ
ప్రతిష్ట వేడుక’ కార్యక్రమంలో రామ్ లల్లా భగవాన్
ను యావత్ భారతీయులు ఆహ్వానిస్తున్నారు. యావత్
భారతీయుల హృదయ శక్తి, యావత్ భారతీయుల ప్రేరణా శక్తి, యావత్ భారతీయుల దృశ్య శక్తి,
యావత్ భారతీయుల శ్రవణ శక్తి, యావత్ భారతీయుల కీర్తణా
శక్తి అయిన ‘జై శ్రీరాం, జై శ్రీరాం, శ్రీరాం’ అన్న నినాదం,
ఆ ఒక్క పదమే వళ్లంతా పులకరించేలా చేస్తుంది. నూటనలబై కోట్ల మంది భారతీయుల ‘జై శ్రీరాం, జై శ్రీరాం, శ్రీరాం’ అనే
నినాదంతో జరుగుతున్న అమోఘమైన ప్రాణ ప్రతిష్ట వేడుక ఇది.
{‘రామ్ మందిర్
దేవాలయం’ నిర్మాణానికి, ఈ ప్రాణ ప్రతిష్ట వేడుక ప్రిలా
అసాధారణ రీతిలో జరగడానికి, ద్విగ్విజయంగా పరిపూర్ణ కృషి చేసిన వ్యక్తిగా ప్రధాని
నరేంద్ర మోడీని, నిర్ద్వందంగా, యావత్తు హిందు సమాజానికి
చెందిన ఆబాలగోపాలం, ఆసేతు హిమాచలం, యావత్ భారతీయులు, ఎప్పటికీ విధేయతతో జ్ఞాపకం వుంచుకుంటారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
అలాగే, ఆలయాన్ని కట్టాలని గుండె లోతుల్లోంచి భావించినా,
కట్టలేకపోయిన మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావుకు,
అయోధ్య వివాదాస్పద కేసును విజయవంతంగా వాదించిన సీనియర్ అడ్వకేట్, 96ఏళ్ల
పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కె పరాశరన్ కు, 1949 లోనే నెహ్రూ ఆదేశాలనుకాదని రామజన్మభూమిలో పూజలు చేసుకోవడానికి హిందువులకు
హక్కు కల్పించిన, నాటి ఫైజాబాద్ కలక్టర్, ఐసీఎస్ అధికారి, స్వర్గీయ కేకే నాయర్ కు కూడా ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు
హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియచేయడం కనీస ధర్మం.}
(ఆగమశాస్త్ర
పండితుడు, వేదాధ్యయనం చేసి, ఎన్నో దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ట
కార్యక్రమాలను జరిపించిన ముత్తారం సీతారామచంద్ర దేవాలయ ప్రధాన అర్చకుడు బొర్రా
వాసుదేవాచార్యులు గారికి ధన్యవాదాలతో)
No comments:
Post a Comment