Sunday, June 30, 2024

స్వారోచిషుడే స్వారోచిష మనువు {మనుచరిత్ర కథ (5 & 6)} : వనం జ్వాలా నరసింహారావు

 స్వారోచిషుడే స్వారోచిష మనువు

మనుచరిత్ర కథ (5 & 6)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (01-07-2024)

వరూధిని కొడుకు స్వరోచికి ఇందీవరాక్షుడి కూతురు మనోరమతో వివాహం

స్వరోచి బాణ ప్రయోగం వల్ల రాక్షసాకారాన్ని వీడి నిజరూపాన్ని ధరించిన గంధర్వరాజు ఆకాశంలో వున్న తన విమానం నుండి భూమ్మీదకు దిగాడు. తనతో పోరాడిన రాక్షసుడు గంధర్వాకారం దాల్చడం స్వరోచికి విస్మయం కలిగించింది. కిందికి దిగిన గంధర్వుడు స్వరోచిని ఆలింగనం చేసుకున్నాడు. తాను స్వరోచి తల్లికి సోదరుడినని, అందువల్ల అతడు తన మేనల్లుడని, తన పేరు ఇందీవరాక్షుడని, మనోరమ తన కుమార్తె అని, ముని శాపాన తనకు రాక్షసత్వం కలిగిందని, చివరకు తన ప్రియపుత్రికనే భక్షించడానికి పూనుకున్నానని అన్నాడు గంధర్వరాజు. ఇలా ఇందీవరాక్షుడు తన విషయం చెప్తుంటే ఆయన కూతురు మనోరమ తండ్రి పాదాలకు నమస్కారం చేసింది.

ఆ తరువాత ఇందీవరాక్షుడు తన శాప వృత్తాంతాన్ని వివరించాడు స్వరోచికి. మోసం చేసి తాను ఒక ముని దగ్గర వైద్యశాస్త్రాన్ని అభ్యసించిన కారణాన ఆయన తనను రాక్షసుడివి కమ్మని శపించినట్లు చెప్పాడు. తన అపరాధాన్ని మన్నించమని మునిని కోరానని, శాపం పోవడానికి ఎన్ని దినాలు పట్టుతుందని అడిగానని, అప్పుడాయన కనికరించి స్వల్పకాలంలోనే అని చెప్పాడని అన్నాడు. రాక్షసాకారంలో తాను తన కుమార్తెను మింగబోయే సమయంలో ఒకానొక మహానుభావుడు వేసిన బాణం వల్ల తన శరీరం దహించి దివ్యరూపం వస్తుందని శాప విమోచన కూడా చెప్పాడని అన్నాడు. తన రాక్షసత్వం పోగొట్టి తనకు మహోపకారం చేసిన స్వరోచికి ప్రత్యుపకారంగా తన కూతురునిచ్చి వివాహం చేస్తానని చెప్పాడు ఇందీవరాక్షుడు. తాను నేర్చుకున్న వైద్యశాస్త్రాన్ని కూడా తన కూతురుతో సహా స్వరోచికిస్తానని అన్నాడు. స్వరోచి దానికి అంగీకరించాడు.

తమరాజుకు శాప విమోచనం కలిగిన సంగతి తెలుసుకొని, మర్నాడు, ఇందీవరాక్షుడి పూర్వ సేవకులైన గంధర్వులు అక్కడికి వచ్చి ఆయన దర్శనం చేసుకొన్నారు. స్వరోచి, మనోరమ సహితంగా ఇందీవరాక్షుడు స్వర్ణమయ రథం ఎక్కి ఆకాశమార్గాన మందరగిరికి (గంధర్వ పురానికి) పోయారు. ఆ తరువాత ఇందీవరాక్షుడు మందరాద్రి విశేషాలను స్వరోచికి వివరించాడు. ఒక రాజమందిరంలో స్వరోచిని విడిది చేయించాడు ఇందీవరాక్షుడు. స్వరోచిని, మనోరమను పెళ్లికొడుకుగా, పెళ్లికూతురుగా అలంకారం చేశారు పేరంటాలు. ఆ తరువాత ఇరువురూ వివాహ వేదికకు చేరుకున్నారు. పెండ్లికుమారుడైన స్వరోచికి మామైన గంధర్వరాజు శాస్త్రోక్తంగా మధుపర్కాన్ని ఇచ్చాడు. గంధర్వరాజు విష్ణుమూర్తిని పూజించిన విధంగా అల్లుడిని గౌరవించి లక్ష్మీ సమానురాలైన కూతురును స్వరోచికి ధారాపూర్వకంగా సమర్పించాడు. అంటే కన్యాదానం చేశాడు. తదనంతరం మంగళసూత్ర ధారణ, తలంబ్రాల కార్యక్రమం నడిచింది. అగ్నికి ప్రదక్షిణ నమస్కారాలు కూడా జరిగాయి. అరుంధతీదేవికి నమస్కారం చేయించారు వధూవరులను.

వంద భద్రజాతి ఏనుగులను ఇందీవరాక్షుడు అల్లుడైన స్వరోచికి అరణంగా ఇచ్చాడు. తండోపతండాలుగా హయాలను కానుకగా ఇచ్చాడు. రత్నాలతో ప్రకాశించే విమానాన్ని కానుకగా ఇచ్చాడు. కూతురు మనోరమకు అనేక రకాల ఆభరణాలను, పనిముట్టులను, వస్త్రాలను, వస్తుసమూహాలను దాచుకోవడానికి చక్కటి పెట్టెలను, సుగంధ ద్రవ్యాలను, పనికత్తెలను, దాసీజనాన్ని అరణంగా ఇచ్చాడు ఇందీవరాక్షుడు. కొన్ని గ్రామాలను కూడా వివాహ సమయంలో అరణంగా ఇచ్చాడు కూతురుకు.

పెండ్లికి వచ్చిన వారందరికీ కట్నకానుకలు ఇచ్చి ఇందీవరాక్షుడు సత్కరించాడు.

స్వరోచికి, వనదేవతకు పుట్టినవాడే స్వారోచిష మనువు

స్వరోచి, మనోరమలు వివాహానంతరం కలిసిమెలిసి సుఖాలను అనుభవించారు. అలా వుండగా ఒకనాడు విచారంగా వున్న భార్యను చూసి కారణం అడిగాడు స్వరోచి. తన మీద అమితమైన ప్రేమకల ఇద్దరు చెలికత్తెలు ఒక ముని శాపం వల్ల రోగపీడితులై వున్నారని, వారి రోగం పోగొట్టే విధానం తెలియక విచారపడుతున్నానని, కాబట్టి స్వరోచి ఆ రోగం పోగొట్టుతే తనకు సౌఖ్యం వుంటుందని చెప్పింది మనోరమ. భార్యను విచారపడవద్దని అంటూ, తాను నేర్చుకొన్న వైద్యశాస్త్రాన్ని ఉపయోగించి ఆమె చెలికత్తెల రోగబాదను మాన్పిస్తానని అన్నాడు స్వరోచి. ఆమె చెలికత్తెలు ఎక్కడున్నారో చెప్తే వైద్యం చేస్తానని, అక్కడికి మనోరమను కూడా తనతో రమ్మని చెప్పి, ఇద్దరూ కలిసి వారిదగ్గరికి వెళ్లారు. తనకు తెలిసిన వైద్యం ద్వారా వారికి దివ్య ఔషధం ఇచ్చి, ఆ రోగానికి తగ్గ అనుపానం, పథ్యం కూడా ఇచ్చి, రోగ నిర్మూలన చేసి వారిని ఆరోగ్యవంతులుగా మార్చాడు స్వరోచి.

రోగబాధ నుండి విముక్తి పొందిన ఆ ఇరువురు చెలికత్తెలు పూర్వపు కాంతిని పొంది, స్వరోచిని స్తోత్రం చేశారు. ఆయన చేసిన మహోపకారానికి ప్రత్యుపకారంగా తాము ఏమీ ఇవ్వలేకపోయినప్పటికీ, ఆయన సంపాదించదానికి అవసరమైనవి కొన్ని తమ దగ్గరున్నాయని వాటిని ఇస్తామని చెప్పారు. వారిలో ఒకామె, తాను మందారుడు అనే విద్యాధరుడి కూతురినని, తన పేరు విభావసి అని, భూమ్మీద కల మృగాల, పక్షుల మాటల అర్థం తనకు తెలుసని, ఆ గొప్ప విద్యను తన దగ్గరనుండి గ్రహించి తనను పెండ్లి చేసుకొమ్మని స్వరోచిని కోరింది. ఆ వెంటనే మరొకామె తన పేరు కళావతి అని, తాను ఒక ముని కుమార్తెనని, తనతల్లి తనను పుట్టగానే వదిలి వెళ్లిపోయిందని, ఒక గంధర్వుడు తనను కోరగా తన తండ్రి నిరాకరించడం వల్ల ఆయన్ను ఆ గంధర్వుడు చంపాడని, తనకు దిక్కుతోచక ప్రాణత్యాగం చేద్దామనుకుంటే ఆకాశవీధిలో పోతున్న పార్వతీదేవి వారించిందని, తనకు మహారాజైన స్వరోచి భర్త కాగలదని అన్నదని, అతడిని వివాహం చేసుకొని సకల సౌఖ్యాలు అనుభవించమని అన్నదని చెప్పింది.

తనకు పార్వతీదేవి ‘పద్మిని అనే విద్యను కూడా ఉపదేశించినట్లు పేర్కొన్నది కళావతి. దానిని స్వరోచికి ఉపదేశిస్తానని చెప్పింది. విభావసి, కళావతిల నుండి రెండు విద్యలను నేర్చుకున్నాడు స్వరోచి. ఒక సుముహూర్తంలో ఆ ఇద్దరినీ వివాహం చేసుకున్నాడు. వారి వివాహ సమయంలో దేవదుందుభులు మోగాయి. మలయమారుతం వీచింది. ఆ విధంగా మనోరమను, విభావసి, కళావతిలను పెండ్లి చేసుకొని తన ముగ్గురు భార్యలతో సుఖంగా జీవించసాగాడు స్వరోచి.

ఈ నేపధ్యంలో స్వరోచి ఒకనాడు వేటాడదలచి అడవికి పోయాడు. ఆయన వేటాడుతుంటే జంతుజాలాలు భయపడి పారిపోసాగాయి. ఆపుడు ఆయన దృష్టి ఒక అడవి పందిమీద పడింది. స్వరోచి ఆ సూకరాన్ని చంపడానికి ధనుస్సు సంధించగా ఒక ఆడ లేడి రాజును చూసి మనుష్య భాషలో దాన్ని చంపవద్దని, అది అతడికి ఏ అపకారం చేయలేదని, దాన్ని వదిలి తనను చంపమని అన్నది. ఎందుకు ఇలా చావడానికి సిద్ధపడ్డావని లేడిని అడిగాడు స్వరోచి. తన హృదయం స్వరోచి మీద లగ్నమై వున్నదని, మదన తాపంతో బాధపడుతున్నానని, తనను కూడమని కోరింది లేడి. ఆమె మృగమని, తాను నరుడినని ఇద్దరికీ సంబంధం ఎలా కుదురుతుందని ప్రశ్నించాడు స్వరోచి. తనను స్వరోచి ప్రేమతో కౌగలించుకుంటే చాలునని అనగానే స్వరోచి అలాగే చేశాడు.

తక్షణమే ఆ లేడి ఒక మనుష్య స్త్రీ ఆకారంలో కనిపించింది. అలా ఆమె  లేడి రూపం ధరించడానికి, ఆ తరువాత మనుష్య స్త్రీ కావడానికి కారణం ఏమిటని అడిగాడు స్వరోచి. తాను ఆ వనానికి దేవతనని, స్వరోచి వల్ల ఒక ‘మనువును కనాలని దేవతలు కోరగా ఆయన దగ్గరకు వచ్చానని, తనను కలిసి కొడుకును కనమని, దానివల్ల పుణ్యలోకాలు కలుగుతాయని చెప్పింది. దానికి అంగీకరించిన స్వరోచి ఆమెతో సుఖాలను అనుభవిస్తుండగా ఆమె గర్భాన్ని దాల్చింది. ఒక శుభ దినాన సింహపరాక్రమ సమానుడైన, మన్మథుడిని మించిన సౌందర్యం కల, సార్వభౌమ లక్షణాలు కల, సద్గుణాలు కల, అభిమానధనుడైన ఒక కుమారుడిని కన్నది ఆ వనదేవత.

స్వారోచిషుడు అన్న పేరు కల ఆ బాలుడు ఇంద్రియ నిగ్రహం కలవాడై, విష్ణుదేవుడిని గూర్చి బహుకాలం తపస్సు చేశాడు. ఆ ఆదినారాయణుడు కొంతకాలానికి అతడికి ప్రత్యక్షమయ్యాడు. స్వారోచిషుడు విష్ణును పరిపరి విధాల స్తోత్రం చేశాడు. ఆయన దశావతారాలలో ఏమేమి చేశాడో వర్ణించాడు. విష్ణుమూర్తి ఏం వరం కావాల్నో కోరుకొమ్మని స్వారోచిషుడికి చెప్పాడు. విష్ణుమూర్తి సమీపంలో సంచరించే వృత్తిని తనకిమ్మని స్వారోచిషుడు ప్రార్థించాడు. రెండవ మనువుగా నీతిని, ధర్మాన్ని వృద్ధిపరచి, చక్కగా భూమిని పాలించి, ఆ తరువాత సాలోక్య పదవిని పొందమని స్వారోచిషుడికి చెప్పాడు నారాయణుడు. అలా చెప్పి స్వారోచిషుడిని మనుపదానికి పట్టాభిషిక్తుడిని చేసి అంతర్థానం అయ్యాడు విష్ణుమూర్తి.

స్వారోచిషుడు మనుత్వాన్ని పొంది శాస్త్ర పద్ధతిన దుష్టులను శిక్షిస్తూ, శిష్టులను రక్షిస్తూ, భూమిని పాలించాడు. స్వారోచిష మనువుగా ప్రసిద్ధికెక్కాడు. చివరకు దేవత్వాన్ని పొందాడు. 

(వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ ప్రచురించిన మనుచరిత్రము,

పంచమాశ్వాసం షష్టాశ్వాసంఆధారంగా)

No comments:

Post a Comment