శమీకుడి కొడుకు శృంగి శాపానికి గురైన పరీక్షిత్తు
శ్రీ మహాభాగవత కథ-5
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (07-09-2024)
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
ఒకనాడు హస్తినాపుర చక్రవర్తైన పరీక్షిత్తు తన ఆయుధాలను ధరించి అరణ్యానికి
వేటాడడానికి పోయి, అడవి జంతువులను వేటాడసాగాడు. మృగాలను చంపాలనే ఉత్సాహంతో అరణ్యమంతా కలియ
తిరిగాడు. అడవి పందులను, ఎద్దులను, తోడేళ్ళను, పెద్దపులులను, సివంగులను, ఖడ్గమృగాలను, అడవి గొర్రెలను, సింహాలను, ఏనుగులను మరెన్నో అడవి మృగాలను
మహారాజు తన నైపుణ్యంతో వధించాడు. ఇలా బాగా వేటాడి ఆకలి దప్పులతో మహారాజు బాగా
అలసిపోయాడు. చల్లటి నీటికొరకు అంతా వెతికి చివరకు ఒక తపోవనాన్ని చూశాడు.
ఆ తపోవనంలో, కదలకుండా, మెదలకుండా కళ్ళు మూసుకుని శాంతంగా కూర్చున్న శమీక మునీశ్వరుడిని చూశాడు. ఆ
ముని మౌనంగా, ప్రాణాయామం చేస్తూ, మనస్సును, పంచేంద్రియాలను బహిరంగంగా పోనీయకుండా బ్రహ్మాన్ని పొంది, దీర్ఘమైన జడలతో నల్లచారల
దుప్పి చర్మాన్ని ధరించి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ మునీశ్వరుడిని చూసి
పరీక్షిత్తు, తన నాలుక ఎండిపోతుంటే, హీన కంఠధ్వనితో, మెల్ల-మెల్లగా తన దాహం గురించి మునికి
తెలియచేశాడు. తనకు విపరీతంగా దాహంగా ఉందనీ, మంచినీళ్లు కావాలనీ, వేటాడడానికి సమయం దొరక్క, దాహంతో వచ్చాననీ, తన పరివారం దూరంగా ఉన్నారనీ అన్నాడు.
జవాబు రాకపోయే సరికి, శమీకుడు హరిచింతా పరతంత్రుడై ఉన్నాడనే విషయం తెలియక, పరీక్షిత్తుకు ఆగ్రహం
కలిగింది.
కళ్లుమూసుకుని
బ్రాహ్మణుడు గర్వంతో ఉన్నాడనీ, కనీసం సైగ చేసన్నా పిలవడం లేదనీ, కాసిని మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదనీ, ఏలాంటి మన్నన చెయ్యడం లేదనీ, ఒక పండైనా ఇవ్వడం లేదనీ, ఎంత తాపసైతే మాత్రం ఇంత పొగరా అని మండి పడ్డాడు రాజు. మంచినీరు
అడిగిన వారికి చల్లటి నీరు ఇవ్వడం అనేది కనీస ధర్మం అనీ, ఈ బ్రాహ్మణుడు మంచి నీరిచ్చి తన దాహం తీర్చడేమిటనీ కోపం
వచ్చింది. వేటవల్ల కలిగిన అపరిమితమైన దాహం కారణాన, రోషాగ్నితో, ఋషి తనను తిరస్కరించాడన్న భావం ఆయనలో
నాటుకుపోయింది. తనను ఋషి ఆదరించలేదని కుమిలిపోయి, అక్కడ చచ్చిన పామొకటి కనిపిస్తే దానిని తన వింటితో తెచ్చి, మహర్షి భుజం మీద పడవేశాడు పరీక్షిత్తు ఆవేశంతో. ఇలా చేసి
మహారాజు హస్తినాపురానికి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఇతర మునికుమారులు ఈ విషయం
మొత్తం చెప్పడానికి శమీక మహాముని కొడుకైన శృంగి దగ్గరికి వెళ్ళారు.
శృంగి
దగ్గరకు వెళ్లిన మునికుమారులు, ఆయన తండ్రి మెడలో, మంచినీళ్లకోసం వచ్చిన మహారాజు
పామును వేసి పోయాడని చెప్పారు. అది విని శృంగి కోపంతో రెచ్చిపోయాడు. మహారాజును
ఏవిధంగానూ దూషించని తన తండ్రి మీద, ఆశ్రమవాసులను తప్ప ఇతరులను ఎప్పుడూ కలవని తన తండ్రి మీద, కంద మూలాలు తిని ఎల్లప్పుడూ సమాధిలో ఉండే తన తండ్రి మీద, విష్ణువు తప్ప ఇతర ప్రపంచం తెలీయని తన తండ్రి మీద, సాక్షాత్తూ బ్రహ్మర్షి అయిన తన తండ్రి మీద, చచ్చిన పామును వేయాల్సిన అవసరం ఆ మహారాజుకు ఏమిటి అని
మండిపడ్డాడు శృంగి. ఇలా చచ్చిన పామును తన తండ్రి మెడ మీద వేసిన దుర్జనులను
శిక్షించాలి కదా అనుకున్నాడు. వెంటనే మహారాజును శపించడానికి సిద్ధమయ్యాడు. ‘చచ్చిన
సర్పాన్ని వింటి కొప్పుతో తీసుకుని వచ్చి మౌనంగా తపస్సు చేసుకుంటున్న తన తండ్రి
భుజం మీద పెట్టిన ఆ రాజు, హరికేశవులు అడ్డుపడ్డా, నాటి నుండి ఏడవ రోజున తక్షక ఫణీంద్రుడి విషం కాటుకు
చస్తాడు’ అని గర్జిస్తూ శాపం
పెట్టాడు.
ఇలా శాపం
పెట్టి తండ్రిని చూడడానికి బయల్దేరాడు శృంగి. ఆయన అక్కడికి చేరి చూస్తే ఇంకా ఆ
పాము కళేబరం తండ్రి మెడలో అలాగే చుట్టుకుని ఉన్నది. అదింకా బతికే ఉందేమోనని భయంతో
ఏడ్వసాగాడు శృంగి. ఆ ఏడుపు విని శమీకుడు సమాధిని చాలించాడు. మెల్లగా కళ్ళు
తెరిచాడు. తన మెడలో వేలాడుతున్న పాము కళేబరాన్ని చేత్తో తీసేసి దూరంగా పారేసి
కొడుకును చూశాడు. కొడుకు ఎందుకు విచారిస్తున్నాడనీ, ఆ పాము తన మెడమీదికి ఎలా
వచ్చిందనీ అడిగాడు ఆయన్ను. రాజురావడం దగ్గర నుండి తాను శాపం పెట్టడం వరకూ అంతా
చెప్పాడు. అప్పుడాముని, తన దివ్యజ్ఞానంతో, ఇలా చేసింది పరీక్షిన్మహారాజు అని
తెలుసుకుని, కొడుకు చేసిన పనికి విచారించాడు. ఎందుకిలా చేశావనీ, రాజు ద్రోహబుద్ధితో తనకు అపకారం చెయ్యలేదు కదా అనీ, అలాంటప్పుడు తక్షకుడి పాలు కమ్మని శాపం పెట్టడం తప్పుకదా
అనీ కొడుకును మందలించాడు.
ఇంకా ఇలా
అన్నాడు శమీకుడు: ‘పరీక్షిన్మహారాజు తల్లి గర్భంలో ఉండగానే చావాల్సినవాడు శ్రీకృష్ణుడి
దయతో బతికాడు. ప్రజారంజకంగా పాలన చేస్తున్నాడు. సమ బుద్ధితో భూమిని పాలిస్తున్న
అతడిని ఇంత చిన్న అపరాధానికి అంత పెద్ద శాపం పెట్టవచ్చా? ఈ రాజు చనిపోతే రాజ్యం అస్తవ్యస్తమౌతుంది. మంచినీళ్లు
అడిగిన వాడిని మనం సత్కరించి పంపాల్సింది. మహారాజు పరీక్షిత్తు తిరిగి ప్రతిశాపం
పెట్టలేడుకదా?’ ఇలా శమీకుడు చాలా చాలా పరితపించాడు.
ఒక ముని కుమారుడిని పిలిచి జరిగిన వృత్తాంతం అంతా రాజుకు తెలిపి రమ్మని పంపాడు. అతడి
ద్వారా పరీక్షిత్తు శాప వృత్తాంతం మొత్తం విన్నాడు. తక్షకుడి విషాగ్నికి తాను
చనిపోనున్నాననీ, అది తన విరక్తికి బీజం అవుతుందనీ
భావించి, హస్తినాపురంలో ఏకాంతంగా ఆలోచించడం
ప్రారంభించాడు.
తాను
శమీకుడి విషయంలో చేసిన తప్పును నెమరేసుకున్నాడు పరీక్షిత్తు. ‘దైవయోగాన్ని దాటడం
ఎవరికీ సాధ్యం కాదు. చేసిన పాపానికి తగిన కీడు అనుభవించక తప్పదు. విషాగ్నికి
ప్రాణాలు పోతే పోనీ! గోవులకు, బ్రాహ్మణులకు, దేవతలకు ఎప్పుడూ కీడు కలిగించాలనే ఊహ నాలో పుట్టకుండా ఏం చెయ్యాలి?’ అని తనలో తానే వితర్కించుకున్నాడు. తనకు ఏడవ రోజున
తక్షకుడి వల్ల మరణం సంభవిస్తుందని తెలిసినవాడు కాబట్టి పరీక్షిత్తు భూలోక భోగాలను
విసర్జించి నిరాహార దీక్ష చేయాలని సంకల్పించుకున్నాడు. హరి చరణాలను స్మరించుకుంటూ
గంగానదీ తీరంలో ప్రాయోపవేశంలో ప్రవేశించాడు. ఆ సమయంలో ఆయన్ను చూడడానికి వచ్చిన
అనేకమంది బ్రహ్మర్షి, రాజర్షి, దేవర్షి, మహర్షులకు అర్ఘ్యపాదాద్యులిచ్చి కూర్చోబెట్టాడు. తనకు
పాపాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పమని వారిని అడిగాడు. ఏంచేస్తే
ముక్తి కలుగుతుందో చెప్పమన్నాడు.
అక్కడున్న
ఋషులను చూసి పరీక్షిత్తు, శ్రీహరి కథలను వినాలని ఉందనీ, అందువల్ల, ఏడు రోజుల్లో ఏవిధంగా తనకు ముక్తి కలుగుతుందో వేద వాక్యానురీతిగా తనకు
సెలవివ్వమనీ ప్రార్థించాడు పరీక్షిత్తు. అతడికి జవాబివ్వడానికి మునులంతా సమాలోచనలు
చేస్తున్న సమయాన వేదవ్యాస మహాముని కుమారుడైన శుక (యోగీంద్రుడు) మహర్షి అనే ఒక
అవధూత మూర్తి అక్కడికి వచ్చాడు. అందరూ ఆయనకు స్వాగతం పలికారు. ‘ఈ రోజో, రేపో దేహాన్ని విడిచిపెట్టబోయే దేహదారికి ఏమి జపిస్తే, ఏమి వింటే, ఏమి చేస్తే, దేనిని సేవిస్తే, ఈ సంసారాన్ని విడిచే స్థితి కలుగుతుంది? ఆ విషయం చెప్పు’ అని అడిగాడు పరీక్షిత్తు శుక యోగీంద్రుడిని.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment