శ్రీమన్నారాయణుడి లీలావతారాలు
శ్రీ మహాభాగవత కథ-7
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (21-10-2024)
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
శ్రీమహావిష్ణువు
దివ్యకథలను అందరూ ఆదరిస్తారు. ఎందుకంటే ఆ కథలు శుభ గుణాలను అందిస్తాయి కాబట్టి. ఆ
కథలన్నీ వినడానికి అమృతప్రాయంగా ఉంటాయి. మనం చేయాల్సిందల్లా ఆ కథలను మంచి భావంతో
ఆస్వాదించడమే! శ్రీమన్నారాయణుడి లీలావతారాలను, బ్రహ్మదేవుడిని జగత్ సృష్టి గురించి
నారదుడు అడిగిన సందర్భంలో ఆయనకు వివరించాడాయన. ఆ లీలావతారాలను వరాహ అవతారంతో మొదలు
పెట్టాడు బ్రహ్మదేవుడు.
హిరణ్యాక్షుడు
అనే దానవుడు భూమిని చాపగా చుట్టి తన బాహుబలంతో ఎత్తుకుపోయాడు ఒకానొక సందర్భంలో.
అప్పుడు విష్ణుమూర్తి తన ఆకృతి నుండి కోరలుకల ఒక పందిగా రూపాంతరం చెందాడు. సముద్రం
మధ్యన దాగి ఉన్న ఆ రాక్షసుడిని ఎదుర్కుని, తన దంతాలతో పట్టి చంపాడు. దీని తరువాత అవతారం
‘సుయజ్ఞావతారం’. స్వాయంభువ మనువు కూతురు ఆకూతికి, రుచి ప్రజాపతికీ పుట్టినవాడు సుయజ్ఞుడు. ఇతడు ఇంద్రుడు అనే
పేరుతో వర్ధిల్లి, విష్ణువు లాగానే కష్టాల నుండి ప్రపంచాన్ని గట్టెక్కించాడు. ఇతడి తాత మనువు
సుయజ్ఞుడిని ‘పరమ పుణ్యమూర్తైన శ్రీహరి’ అని పిలిచాడు. జ్ఞాన నిథి అయిన ఆ సుయజ్ఞుడు శ్రీహరిగా అవతారం ఎత్తాడు.
సాంఖ్యయోగాన్ని
ప్రవర్తింప చేసిన ఉపదేశకుడు విష్ణు అంశతో జన్మించిన కపిలుడు. కర్దమ ప్రజాపతికి, అతడి భార్య దేవహూతికి కపిలుడు అన్న పేరుతో అవతరించాడు
శ్రీహరి. కపిలుడు యోగసిద్ధుడై ఆ దంపతులను సంతోషపెట్టాడు. నారాయణుడితో యోగాన్ని
కలిగించడానికి అనువైన సాంఖ్యయోగాన్ని కపిలుడు తన తల్లికి చెప్పి, ఆమె చెడు కర్మలను తుడిపేశాడు. ఆమెకు మునులు ఉపాసించే
ముక్తి మార్గాన్ని దర్శింపచేశాడు. కొడుకు కావాలని వేడుకున్న అత్రిమునికి శ్రీహరి
దత్తాత్రేయుడుగా జన్మనెత్తాడు. బ్రహ్మ మానస పుత్రులుగా ప్రసిద్ధికెక్కిన సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే నలుగురు, వాస్తవానికి, విష్ణుదేవుడి కళలతో ఒప్పారే ఒకే ఒక్కరి
కింద లెక్క.
దక్షుడి
కూతురు మూర్తీ, ధర్ముడు దంపతులు. వారికి నరుడు, నారాయణుడు పుట్టారు. వారిద్దరూ బదరీ వనానికి వెళ్లి ఘోరమైన
తపస్సు చేస్తుంటే ఇంద్రుడికి తన పదవి పోతుందేమోనని భయం వేసింది. అప్సరసలను పంపించి
తపస్సు భగ్నం చేయడానికి ప్రయత్నించినా ఫలితం కనబడలేదు. వారి ధ్యానం మరింతగా
పెరిగిపోయింది. వారికి అప్సరసల మీద కోపం రాలేదు. నరనారాయణులు సృష్టి, స్థితి, సంహారాలు చేయగల శక్తిమంతులు. అందువల్ల, నారాయణుడు తన తొడను చీల్చగా అందులోంచి ఊర్వశి మొదలైన
స్త్రీలు పుట్టారు. వారంతా అప్సరసల కన్నా అందంగా ఉండడంతో ఊర్వశిని తమ నాయికగా
స్వీకరించారు వారు. వారంతా ఆమెతో సహా దేవలోకానికి తిరిగిపోయారు. నరనారాయణావతారం
లోకాలన్నిటినీ పవిత్రం చేసింది.
ఉత్తానపాదుడు
అనే రాజు సాటి రాజుల్లో మేటిగా పేరు తెచ్చుకున్నాడు. అతడి కొడుకు ధ్రువుడు. గొప్ప
తపస్సు చేశాడు. సశరీరుడుగా ఆకాశంలో స్థిరమైన స్థానాన్ని పొందాడు. ‘ధ్రువుడు’ గా ఒప్పుతూ నేటికీ, విష్ణువుతో సరిసాటిగా ఉన్న పుణ్యాత్ముడు. వేనుడు అనే రాజు
కొడుకు పృథుడు భగవంతుడి అంశతో పుట్టాడు. భూమిని ఆవుగా చేసి అన్ని ఓషధులనూ పిండిన
ఘనుడు. అగ్నీధ్రుడు కొడుకు నాభికి, ఆయన సతి సుదేవికి లేదా మేరుదేవికి శ్రీమహావిష్ణువు ఋషభుడు అనే పేరుతో
అవతరించాడు. బ్రహ్మ చేసిన యాగం నుండి విష్ణువు హయముఖుడిగా ఉద్భవించాడు. వేదమూర్తైన
హయగ్రీవుడి ముక్కుపుటాల ఊపిరుల నుండి వేదాలు పుట్టాయి. ఒక సారి యుగాంతంలో సమస్త
ప్రపంచం నీటితో నిండిపోయింది. అప్పుడు దేవదేవుడు మత్స్యావతార రూపంలో సమస్త భూమినీ, ప్రాణి కోటినీ ఆదుకోవడమే కాకుండా, బ్రహ్మ నోటినుండి జారిపడ్డ వేదమార్గాలన్నీ చిక్కుపడకుండా
విడి-విడి శాఖలుగా ఏర్పాటు చేశాడు. తిరిగి వాటన్నిటినీ బ్రహ్మకు అందించాడు. ఒక
పెద్ద నావమీదకు వైవస్వత మనువును ఎక్కించి, ఆ జలప్రళయంలో అది మునిగి పోకుండా రక్షించాడు.
అమృతం కొరకు
దేవదానవులు పాల సముద్రం చిలికే సమయంలో కవ్వం కొండ సముద్రంలో మునిగి పోసాగింది.
శ్రీహరి తాబేలు రూపంలో (కూర్మావతారం) ఆ కొండను తన వీపుమీద మోశాడు. నరసింహావతారం
ఎత్తి, భయంకరంగా ప్రకాశించే గోళ్లతో, హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని సంహరించాడు.
గజరాజు మొసలికి చిక్కి వెయ్యేళ్లు పోరాడి ‘హరీ నీవే నాకు దిక్కు’ అని ప్రార్థించగానే మొసలిని చంపి గజేంద్రుడిని కాపాడాడు.
వామనావతారంలో బలి చక్రవర్తిని మూడు అడుగుల నేల అడిగి ముల్లోకాలనూ ఆక్రమించాడు.
పరమాత్మ ఒకసారి హంసావతారం కూడా ధరించాడు. నారదుడిలో ఆత్మ తత్త్వాన్ని
ఉత్తేజింపచేసే భాగవత పురాణాన్ని ఆయనకు బోధించాడు. మనువుగా అవతారం ఎత్తి
చక్రాయుధాన్ని చేతబూని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశాడు. ధన్వంతరిగా అవతరించి ఆయుర్వేద విద్యను కలిపించాడు.
జమదగ్ని కొడుకుగా పరశురామావతారంలో రాజలోకాన్ని తెగనరికి, సమస్త భూమండలాన్ని బ్రాహ్మణులకు దానం చేశాడు.
లోకహితం కోరి శ్రీరాముడుగా
జన్మించాడు. లోకోత్తర సౌందర్యరాశి సీతను శివదనుర్భంగం చేసి వివాహమాడాడు. తండ్రి
ఆనతిమేరకు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. ఖర-దూషణాది రాక్షసులను చంపాడు. వానర
నాయకుడు సుగ్రీవుడితో స్నేహం చేశాడు. వాలిని చంపాడు. సీతాపహరణం చేసిన రావణుడితో
యుద్ధం చేయడానికి లంకకు పోవడానికి సముద్రం మీద వారధి కట్టించాడు. సకల
భూప్రపంచాన్ని గడగడలాడించిన రావణుడిని సంహరించాడు. తిరిగి అయోధ్యకు వచ్చి రామరాజ్య
పాలన చేశాడు. శ్రీరామావతారం లోకాన్ని పుణ్యన్యవంతం చేసింది.
శ్రీమహావిష్ణువు రాక్షస సంహారం చేసి, భూభారాన్ని తగ్గించడం కొరకు, యాదవ వంశంలో బలరామకృష్ణ రూపాలలో అవతరించాడు. సామాన్య
జనులకు వశంకాని అలౌకికమైన పనులెన్నో చక్కబెట్టి పరమవిభుడయ్యాడు. శకటాసుర వధ, మద్ది చెట్లను నేలకూల్చడం, తన నోరు తెరచి చరాచర జీవకోటిని తల్లికి చూపడం, కాళీయ మర్ధన, మయాసురుడిని మట్టుపెట్టడం, గోవర్ధనగిరి పర్వతాన్ని వేలుమీద ఎత్తడం, బృందావనంలో రాసకేళీ, కంస వధ, శిశుపాల వధ .....ఇలా ఎన్నో విధాలుగా సాధు జనాలను
రక్షించాడు.
శ్రీహరి వేదశాఖల మీద ఆపేక్షతో పరాశర
మహర్షి కొడుకుగా పుట్టాడు. వేదవ్యాసుడుగా ప్రసిద్ధికెక్కి వేదాలను విభజించాడు.
బుద్దావతారంలో విష్ణువు దురాచారాలను తుడిచిపెట్టి దానవులను తుదముట్టిస్తాడు.
కలికాలంలో దైవ చింతన, ధర్మ చింతన సన్నగిల్లినప్పుడు మహావిష్ణువు కల్కిగా అవతరిస్తాడు. లోకంలో
అధర్మాన్ని పారద్రోలుతాడు. ధర్మాన్ని నిలబెట్టి లోకాలను కాపాడుతాడు.
పరమాత్మ విభిన్న కార్యాల నిమిత్తం
మాయాగుణ భూఇష్టమైన అవతారాలు ఎత్తుతుంటాడు. భగవంతుడు సృష్టి ఆరంభంలో తపస్సుగా, బ్రహ్మగా, ఋషులుగా, తొమ్మిదిమంది ప్రజాపతులుగా అవతరించి లోకాలను పుట్టిస్తుంటాడు. ధర్మం, విష్ణువు, యాగాలు, మనువులు, ఇంద్రుడు మొదలైన అవతారాలు ఎత్తి ప్రపంచస్థితిని
కల్పిస్తుంటాడు. అధర్మంగా, రుద్రుడుగా, మహాసర్పాలుగా, రాక్షసులుగా రూపెత్తి ప్రళయం తెస్తాడు. ఇలా ఆ పరమాత్ముడు సృష్టి, స్థితి, ప్రళయాలకు కారణభూతుడై వెలుగొందుతాడు.
ఇదంతా చెప్పిన బ్రహ్మదేవుడు, నారదుడితో ఇలా అన్నాడు: ‘ఈ పురాణగాథలను భగవంతుడు రచించాడు.
ఆ భాగవతం పరమ భక్తులకు కల్పవృక్షం లాంటిది. శాస్త్రాలన్నింటిలోను ఉత్తమమైనది.
దీన్ని నువ్వు లోకంలో మరింతగా విస్తరింప చేసి రచించు. అన్ని జన్మలలోకీ మానవ జన్మ
చాలా విశేషం కలది. అందునా బ్రాహ్మణ వంశంలో పుట్టడం మరింత గొప్ప వింత. విష్ణుమూర్తి
మహిమను నిత్యం కొనియాడాలి’.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం,
రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment