పరీక్షిత్తుకు ముక్తి మార్గాన్ని తెలియచేసిన శుకుడు
శ్రీ మహాభాగవత కథ-6
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (14-10-2024)
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
ప్రాయోపవేశంలో ప్రవేశించి, శ్రీహరి కథలను వినాలనీ, తనకు హరిమీద భక్తి కలగాలనీ, తద్వారా ముక్తి పొందాలనీ ఆసక్తితో ఉన్న పరీక్షిత్తు దగ్గరకు వచ్చిన అవధూత
మూర్తి, వేదవ్యాస మహర్షి కొడుకు, శుక మహర్షిని, ‘కాలం చెల్లిపోతున్నవారు భగత్ప్రాప్తిని పొందాలంటే ఉపాయం ఏమిటి? వారి కర్తవ్యాకర్తవ్యాలు ఏమిటి’ అని ప్రశ్నించిన పరీక్షిత్తుకు సమాధానం చెప్తాడు శుకుడు
వివరంగా.
‘ముక్తిని
కోరుకునేవాడు విష్ణువును గురించే ఆలకించాలి, ఆరాధించాలి, స్తుతించాలి, తలచాలి. సర్వం ఈశ్వరమయంగా భావించినప్పుడే మోక్షం కలుగుతుంది. సాంఖ్య యోగం
వల్ల స్వధర్మాచరణ ద్వారా జీవులందరూ తమ ఆయువు తీరేదాకా విష్ణువును
ధ్యానించగలుగుతారు. నా తండ్రి వ్యాస భగవానుడు ద్వాపర యుగంలో భాగవతాన్ని అధ్యయనం
చేయించాడు. భాగవతం మోక్షమార్గాన్ని ప్రతిపాదించే శాస్త్రం. భాగవతంలోని భగవంతుడి
అవతార లీలలు నా మనస్సును ఆకట్టుకున్నాయి. ఆ ఆనందమే నన్ను చదివించేలా చేసింది. నీకు
ఆ భాగవత తత్త్వాన్ని తెలియచేస్తాను. శ్రద్ధతో విను. భాగవతాన్ని వినడం వల్ల నీకు
భగవంతుడి మీద ప్రేమ కలిగి, విష్ణువును సేవించాలనే బుద్ధి పుడుతుంది. రెప్పపాటు కాలం హరినామ స్మరణ చేసినా
చాలు, ముక్తి కలుగుతుంది’ అని ఖట్వాంగ
మహారాజు వృత్తాంతాన్ని చెప్పాడు శుక మహర్షి పరీక్షిత్తుకు.
పూర్వం
ఖట్వాంగుడు అనే రాజు ఏడు దీవులకు ఏలిక. ఒకనాడు, రాక్షసుల చేతిలో ఓడిపోయిన ఇంద్రుడు, సహాయం చేయమని ఖట్వాంగుడి దగ్గరకు వచ్చి అడిగాడు. వెంటనే
భూలోకం నుండి స్వర్గలోకం వెల్లి ఖట్వాంగుడు రాక్షసులను అంతం చేశాడు. దేవతలు
ఆనందించి, ఆయన్ను వరం కోరుకొమ్మని అడగ్గా, తనెంత కాలం బతుకుతానో చెప్పమని కోరాడు. ముహూర్త కాలం అంటే, రెండు గడియలు మాత్రమే అని చెప్పారు దేవతలు. రాజు క్షణాల
మీద భూలోకానికి తిరిగి వచ్చాడు. అన్నిటినీ తక్షణమే త్యజించి విరాగి అయ్యాడు.
వెంటనే గోవింద నామాన్ని ధ్యానించాడు. స్థిర చిత్తంతో రెండు గడియల్లోనే ముక్తి
పొందాడు. ఈ కథ చెప్పి , పరీక్షిత్తుకు ఏడురోజులు దాటిన తరువాత కానీ ఆయువు తీరదు
కాబట్టి, అంతవరకు విష్ణు ధ్యానం చేస్తే, మోక్షపథం పొందే వీలుంది అని అన్నాడు శుకుడు. భగవంతుడిని
ధ్యానం చేసే విధానం వివరంగా చెప్పాడు శుకుడు.
ఓంకారాన్ని స్మరిస్తూ యోగనిష్ఠతో
ప్రాణవాయువును స్వాదీనంలోకి తెచ్చుకోవడం, మనస్సు అనే పగ్గాన్ని చేజారనీయకుండా
గట్టిగా పట్టి ఉంచడం, భక్తే లక్షణంగా కల యోగాన్ని ఆశ్రయించడం, తద్వారా విష్ణు
పథాన్ని చేరుకోవడం గురించి చెప్పాడు. ధారణ అంటే ఏమిటి, ఎలాంటి సాధనతో అది నిలబడుతుంది, దాని స్వరూపం ఎలా ఉంటుంది, అది జీవుల మానసిక మాలిన్యాన్ని ఎలా రూపుమాపగలుగుతుంది అనే
విషయాలను పరీక్షిత్తు ప్రశ్నలకు జవాబుగా వివరించాడు శుకుడు.
‘పండితుడైన వాడు ప్రాణవాయువులను
బిగబట్టి శ్వాస జయాన్ని సాధించాలి. సర్వమయుడైన విరాట్పురుషుడి విగ్రహంతో మోక్షగామి
(ముముక్షువు) తన మనస్సును సంధానించాలి. బుద్ధిమంతుడు వాసుదేవుడిని సేవించాలి.
విష్ణువును స్మరించని వాడు మత్తులో ఉన్నవాడితో సమానం. పరమేశ్వరుడిని మనస్సులో
ధారణతో నిలుపుకోవాలి. ఆయన ప్రతి అవయవాన్నీ ఒక్కటొక్కటిగా అనుక్షణమూ ధ్యానించాలి. పరిపూర్ణమైన
నిశ్చలబుద్ధి కుదిరేదాకా ఆ భగవత్ చింతనాసక్తి తోనే ఉండాలి. శరీరాన్ని విడిచి పెట్టే
సమయంలో ఇంద్రియ సాంగత్యాన్ని వదిలిపెట్టాలి. ఇలా బ్రహ్మలోకానికి పోవాలనుకున్న యోగి
ఆకాశమార్గంలో పోతుంటాడు. పోయి, పోయి విష్ణువు స్థానమైన శింశుమార చక్రం చేరుకుంటాడు. విష్ణు లోకానికి
వెళ్ళినవాళ్ళు విష్ణు పదాన్ని పొంది ప్రకాశిస్తుంటారు’.
ఇలా చెప్పిన శుకుడు పరీక్షిత్తుకు భక్తి
మార్గమే ముఖ్యమని అంటాడు. ‘జగన్నాథుడైన శ్రీహరి సర్వ ప్రాణుల్లో ఆత్మరూపంలో
ఉంటాడు. నిత్యం నమస్కరించతగినవాడు. ఎల్లకాలం భక్తుల పట్ల వాత్సల్యం కలవాడు.
ఆత్మరూపి. ఇలాంటి శ్రీమహావిష్ణువు కథాసుధను సంతృప్తిగా ఆస్వాదించే భక్తులు
పుణ్యాత్ములు. ఆ లక్ష్మీనాయకుడి కథలు అమృతోపమానాలు. అవి విన్నవారికి వీనుల విందుగా
ఉంటుంది. విష్ణు గాథలు, కీర్తనలు వింటూ కాలాన్ని వెళ్ళబుచ్చేవాడి ఆయువు గట్టిది. హరినామ సంకీర్తనలు
వినని చెవులు కొండలలో గుహల లాంటివి’ అని చెప్పాడు శుక మహర్షి.
చనిపోవడం అనే భయం ఏమాత్రం లేకుండా,
ధర్మార్థ కామాలను మూడింటినీ మానుకుని, ఆ పురుషోత్తముడి మీదనే మనస్సును నిలుపుకుని, అంత్యకాలం గడపాలనే అభిప్రాయానికి వచ్చాడు పరీక్షిత్తు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment