Wednesday, October 2, 2024

విరాధ వధ : వనం జ్వాలా నరసింహారావు

 విరాధ వధ

వనం జ్వాలా నరసింహారావు

భక్తిపత్రిక (అక్టోబర్ నెల, 2024)

{రామాయణం కావ్యం. కవిగా వాల్మీకి చెప్పినదానిని వ్యాఖ్యానకర్తలు బహుకోణాల్లో విశ్లేషించారు. ఆంధ్రవాల్మీకి వాసుదాసస్వామి రచించిన మందరం, రామాయణాన్ని యధాతథంగా, కావ్యరూపంగా, అందిస్తుంది. అదే సమయంలో ఆయా సన్నివేశాలకు వ్యాఖ్యానకర్తలు చెప్పిన విశ్లేషణలను కూడా పొందుపరిచారు. దండకారణ్యంలో విరాధ వధ, శరభంగ మహర్షి దర్శనం తరువాత సీతారామలక్ష్మణులు నడిచివెళ్లిన విధానాన్ని కవితారూపంలోనే కాకుండా వ్యాఖ్యాన రూపంగా వాసుదాసస్వామి వివరించారు}

వనవాసం సందర్భంలో సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించారు. అక్కడ వారికి ఒక రాక్షసుడు ఎదురుపడ్డాడు. వాడు పొడుగాటి దేహంతో, వికార ఆకారంతో ఉన్నాడు. పులిచర్మం కప్పుకున్నాడు. లోతైన పెద్ద కళ్లున్నాయి. భయంకరమైన పెద్ద నోరుంది. వాడు పెడ బొబ్బలు పెట్టుతూ ముందుకు వచ్చాడు. సీతాదేవిని ఎత్తుకుని, చంకలో వుంచుకున్నాడు. రామలక్ష్మణులను, మీ నెత్తురు తాగుతానని హెచ్చరించాడు.

‘నువ్వెవరివి అని ప్రశ్నించిన రాముడికి జవాబివ్వకుండా, ‘నువ్వెవరివి అని ఎదురు ప్రశ్నించాడు. తాము ఇక్ష్వాకు వంశంలో జన్మించిన క్షత్రియులమనీ, అడవిలో తిరుగుతున్నామనీ, చెప్పాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు రాక్షసుడు, తన తండ్రి జయుడనీ, తల్లి శతహ్రదనీ, తెలియచేశాడు. తనను ‘విరాధుడు’ అని పిలుస్తారనీ, తపస్సు చేసి శస్త్రంతో చావకుండా బ్రహ్మ నుండి వరం పొందాననీ చెప్పాడు. ‘కనుక మీరు బతకాలనుకుంటే ఈ స్త్రీని  వదిలి వెళ్లండి’ అని శాసించాడు.

విరాధుడి మాటలకు కోపం తెచ్చుకున్న శ్రీరామచంద్రుడు, బాణం ఎక్కుపెట్టాడు. పదునైన బాణాలను రాక్షసుడిమీద వేశాడు. అవి విరాధుడి దేహాన్ని చీల్చి, భూమిలోకి దూసుకు పోయాయి. బాణాల బాధను సహించలేని విరాధుడు, జానకిని నేలమీద పడేసి రామలక్ష్మణుల మీదికి పోయాడు. రాముడి బాణాలు తననేమీ చేయలేవని నవ్వి, భయంకరమైన తన శరీరాన్ని పెంచాడు. దేహంలో నాటుకుని పోయిన బాణాలన్నీ నేలరాలాయి. శ్రీరామచంద్రమూర్తి మరి కొన్ని బాణాలను వేశాడు. చివరకు రామలక్ష్మణులిద్దరూ వాడి మీద దూకారు. విరాధుడు వాళ్లిద్దరినీ ఎత్తుకుని ఆకాశంలో పరుగెత్తాడు. 

అది చూసిన సీతకు భయం కలిగింది, ఏడ్చింది. అది విన్న శ్రీరామలక్ష్మణులు విరాధుడి చేతులను నరికారు. ఆయుధాలతో చావని విరాధుడు చేతులు లేనివాడయ్యాడు. కత్తులతో నరికినా, బాణాలతో గుచ్చినా, నేలమీద వేసి గుద్దినా, చావని విరాధుడిని ఒక గుంట తీసి పూడుద్దామన్నాడు లక్ష్మణుడితో రాముడు.

         ఇది విన్న విరాధుడు, ‘శ్రీరామచంద్రా! మీరెవరో ఇప్పుడు తెలుసుకున్నా. నువ్వు శ్రీరాముడివనీ, అవతార మూర్తియైన భవంతుడవనీ, సీతాదేవి లక్ష్మి అని తెలుసుకున్నాను. నేను పూర్వం తుంబురుడనే గంధర్వుడిని. రంభతో కూడి కామావేశాన మర్యాద తప్పి సంచరిస్తుంటే, కుబేరుడు నన్ను రాక్షసుడివి కమ్మని శపించాడు. దశరథ కుమారుడు శ్రీరాముడు ఎప్పుడు నన్ను చంపుతాడో అప్పుడు నాకు రాక్షసత్వం పోతుందని, గంధర్వ రూపం వస్తుందని అన్నాడు. శ్రీరఘురామచంద్రమూర్తీ! మీ దర్శనం వల్ల నా శాపం తొలగింది. నన్ను పూడ్చి వేయండి. స్వర్గానికి పోతాను’ అన్నాడు.

అదే దారిలో ఒకటిన్నర ఆమడ దూరం పోయాక శరభంగ మహర్షి ఆశ్రమం వున్నదనీ, ఆయన్ను దర్శించుకుంటే సీతారామలక్ష్మణులకు మేలు కలుగుతుందనీ సలహా ఇచ్చాడు. శ్రీరామచంద్రమూర్తి చెప్పిన విధంగా లక్ష్మణుడు విరాధుడి దేహం పక్కనే ఒక గుంతలో వేసి, పెద్ద రాయితో పూడ్చారు. భయంతో, శోకంతో ఖిన్నురాలై వున్న సీతాదేవిని శ్రీరాముడు ఓదార్చిన తరువాత ముగ్గురూ శరభంగుని ఆశ్రమానికి వెళ్లారు.

శరభంగ మహర్షి దర్శనం

అక్కడ, శరభంగుండితో సంభాషిస్తున్న ఇంద్రుడిని చూశారు సీతారామలక్ష్మణులు. శ్రీరాముడు రావడం చూసిన ఇంద్రుడు, శరభంగుండితో రహస్యంగా, తానిప్పుడు శ్రీరాముడితో సంభాషించే సమయం కాదని చెప్పి వెళ్లి పోయాడు. అలా ఇంద్రుడు పోగానే, శ్రీరామచంద్రమూర్తి, సీతాలక్ష్మణులతో సహా శరభంగ మహర్షిని సమీపించి, ఆయన పాదాలకు నమస్కరించాడు.

ఇంద్రుడు అక్కడకు రావడానికి కారణం ఏమిటని శ్రీరామచంద్రమూర్తి శరభంగుండిని అడిగాడు. జవాబుగా ‘రామచంద్ర దేవా! నేను తపస్సు చేసి సంపాదించిన బ్రహ్మలోకానికి నన్ను పిలుచుకొని పోవడానికి ఇంద్రుడు ఇక్కడకు వచ్చాడు. అయితే, నువ్వు అతిథిగా నా దగ్గరకు వస్తున్నావని తెలిసింది. బ్రహ్మలోక ప్రాప్తికంటే నీ దర్శనం శ్రేష్ఠం కాబట్టి ఇంద్రుడితో పోవడానికి మనసొప్పలేదు. ఫలితంగా నీ దర్శన భాగ్యం కలిగింది. ఇక దేవతలు దర్శించే త్రిదివమునకు పోతాను. స్వర్గలోకం, బ్రహ్మలోకంలోని భోగస్థానాలను సంపాదించడానికి నేను చేసిన పుణ్యమంతా నీకిస్తాను. గ్రహించు. మున్ముందు మీరుండడానికి సరైన స్థలం సుతీక్ష్ణుడనే ముని చెప్తాడు. అడవిలోనే ఆయన వున్నాడు. ఆయన్ను కలవండి’ అని చెప్పాడు శరభంగుడు. అలా చెబుతూనే తన శరీరాన్ని అగ్నిలో ప్రవేశింపచేశాడు.

శరభంగుడు ఆవిధంగా పరమపదం చేరుకున్నాడు. అక్కడున్న ఋషులందరూ రాముడిని కలిసి, రక్షించమని వేడుకున్నారు. ఆత్మరక్షణ విషయంలో తాము సమర్థులం కామని అన్నారు వారు. తాము పరాధీనులమనీ, భగవంతుడొక్కడే ఆపద్భాంధవుడనీ భావించామన్నారు. మునుల శరణాగత రక్షణే పరమ ధర్మమనే జ్ఞానం కల శ్రీరాముడు అంగీకరించాడు.

మందాకినీ తీరంలో పంపానది ఒడ్డున, చిత్రకూట పర్వతం దగ్గర నివసిస్తున్న ఋషులను రాక్షసులు బాధించి చంపుతున్నారని ఋషులు చెప్పారు. తాము రాక్షసుల చేతిలో చావకుండా దయాగుణంతో ఆలోచించి కాపాడమని కోరారు. తాము అనన్యులమనీ, రాముడి రక్షకత్వాన్ని కోరి, ఆయనెప్పుడు అవతరిస్తాడా, ఎప్పుడు దర్శనమిస్తాడా అని ఎదురుచూస్తున్నామని, ప్రార్థించారు. శ్రీరాముడు మునులకు అభయమిచ్చాడు. శరభంగుడి సూచన మేరకు సుతీక్ష్ణాశ్రమానికి బయల్దేరారు ముగ్గురూ.

శ్రీరాముడు ఋషిమయమైన దండాకారణ్యం ప్రవేశించగానే ఆయన వెంట ఋషులు కూడా రాసాగారు. వారందరూ భగవత్ ధర్మ కర్మనిష్టపరులైనప్పటికీ అంతా ఒక రకం వారు కాదు. కాబట్టి తత్త్వ విచారంలో సందేహాలున్నాయి వారికి. శ్రీరామాదులు అలా పోవడం వల్ల ఋషుల సందేహాలు ఎలా తీరాయంటే, ఎల్లప్పుడూ ఋషులు బ్రహ్మవిచారంలోనే వుంటారు కాబట్టి. సీతారామలక్ష్మణుల ముగ్గురి స్థితి వాళ్లకు ప్రణవాన్ని జ్ఞాపకానికి తెచ్చింది, అని మందారాన్ని రచించిన వాసుదాసస్వామి చెప్పారు.

ప్రణవాకృతి శ్రీరామచంద్రుడే!

మొదటిసారి దండకలో ప్రవేశించినప్పుడు దారి చూపిస్తూ, లక్ష్మణుడు ముందు నడిచేవాడు. దండకలో ప్రవేశించి ఋషులతో స్నేహం అయిన తరువాత, ముందు శ్రీరామచంద్రమూర్తి పోతున్నాడు. ఆయన వెనుక రామలక్ష్మణులకు మధ్యలో సీత పోతున్నది. ఆమె వెనుక దనుర్ధరుడై లక్ష్మణుడు నడుస్తున్నాడు. ఈ మార్పుకు కారణాన్ని వాసుదాసస్వామి ఇలా వ్యాఖ్యానించారు.

వారు ముగ్గురూ అలా నడిచి పోతుంటే ఋషులకు ప్రణవం నడిసిపోతున్నట్లు అనిపించింది. ఇలా జరగడంలో ప్రణవస్వరూపం, ప్రణవార్థం వుందని ఆయన అంటారు. ఓమ్అనేది ప్రణవ మంత్రం. ఆ  అక్షరానికి ప్రణవమని పేరుంది. ఈ ‘ఓమ్’ అనేది కేవలం ఒక అక్షరం మాత్రమే కాదు. దాంట్లోఅకార, ఉకార, మకారాల’ మూడక్షరాలున్నాయి. వాటి కలయికే ’ఓమ్.’ ‘‘అ+ఉ’=సంధి కలిసి ‘ఓ’ అయింది. దానికి ‘మ్’ చేరగా ‘ఓమ్’ అయింది. ఇందులో ‘అకారం, ఉకారంరెండూ అచ్చులు కావడంతో సజాతీయాలు ఒక విజాతీయంతో కలిసి ఒక్కటైనందున దాన్ని ఏకాక్షరమంటారు.

ఇక ప్రణవానికి అర్థమేంటో తెలుసుకోవాలి. ఈ జగత్తు విష్ణువు వల్ల పుట్టింది. ఆయనలోనే వుంది. ఈ ప్రపంచానికి స్థితి సంయమకర్త ఆయనే. ఆయనే జగత్తు. జగత్సృష్టి, స్థితి, సంహారాలు చేసేవాడు విష్ణువే. ఆయననే అకారవాచ్యుడంటారు. అకార, మకారాల మధ్యన వుండే ఉకారం లక్ష్మీదేవిని గురించి చెప్తున్నది. సర్వదేవేశ్వరుడైన విష్ణువును అకారంతోను, విష్ణువుతో ఉద్దృతి (వేలికితీయబడిన) అయిన లక్ష్మీదేవిని ఉకారంతోనూ చెప్పడం జరిగింది. విష్ణువే శ్రీరామచంద్రమూర్తి. లక్ష్మియే సీత. శేషుడే లక్ష్మణుడు. ఈ తత్వాన్ని బోధిస్తూ వాళ్లు ఈ వరుసలో నడచారు. ఇందులో విష్ణువు, సర్వదా లక్ష్మీ విశిష్టుడై వుంటాడుకాబట్టి విడిచి వుండడు.

ఉకారం లక్ష్మిని తెలుపుతున్న కారణాన జీవుడు ఈమెను దాటికాని భగవంతుడిని చూడలేడు. ఈమెకే మాయ అని పేరుంది. ఈ మాయను దాటనివాడికి భగవత్ప్రాప్తి లేదు. కాబట్టి జీవుడు ఆమెను అనుసరించి పోవాలి. జీవుడిని భగవంతుడికి కలపడమే ఆమె కృత్యం. దీన్నే పురుషకారం అంటారు. కాబట్టు ‘ఉకారం’ జీవాత్మ-పరమాత్మలకు నిత్య సంబంధాన్ని చెప్తున్నది. ఈమె ఇరువురి మధ్యన వుండడం వల్ల భగవదనుగ్రహం ఆమె వల్లే రావాలి. మూర్తీభివించిన భగవంతుడి కరుణే లక్ష్మీదేవి. భగవంతుడి ప్రాప్తి లక్ష్మీదేవి వల్లే కలగాలి! భగవంతుడు కూడా కరుణవల్లే జీవుడిని అనుగ్రహించాలి.

విష్ణువు వక్షస్థలంలో కదా లక్ష్మీదేవి వుండేది! తన హృదయానికి తెలియకుండా ఎవరైనా ఏపనైనా ఎలా చేయగలరు? కాబట్టి శిరస్సు విష్ణువనీ, కంఠం కింది మధ్యభాగం లక్ష్మీదేవి అనీ, భగవత్ సంకల్పం ప్రకారమే లక్ష్మీదేవి చేస్తున్నదనీ అర్థం. ఇక లక్ష్మణుడు శ్రీరాముడికి దాసుడుకానీ ఇతరులకు కాదు! శ్రీరాముడు ముందుపోవడం వల్ల ఆయనను అనుసరించి సీత, ఆమె వెనుక లక్ష్మణుడు పోవడమంటే, ఈ ఇరువురికీ రక్షకుడు రాముడైనట్లు, ప్రకృతికి, జీవుడికి ధారణ, పోషణకర్త భగవంతుడే అని స్పష్టమవుతున్నది. లక్ష్మణుడు ఇరువురికీ వెనుకపోవడం వల్ల అయనకు సీతారాములిద్దరూ సేవ్యులే అని అనుకోవాలి. అలా వారిద్దరినీ ఏకకాలంలో సేవించడం వల్లనే జీవునికి పరమార్థం నెరవేరుతుందని లక్ష్మణుడు నిరూపించాడు.

ప్రపంచమంతా భగవంతుడే అన్నప్పుడు, స్థూలంగా మనకు కనపడే ప్రకృతినీ, దానికి జీవభూతుండైన పురుషునీ, వీటిని శరీరంగాకల బ్రహ్మమును, మూడింటినీ ఒక్కటిగానే గ్రహించాలి. స్థూల శరీరం కనబడ్తుంది. సూక్షమైన అంతర్యామి మనకు కనబడడం లేదు. వ్యష్ఠిగా భేద దృష్టితో చూస్తే, తత్త్వాలు మూడని చెప్పాల్సి వుంటుంది. సమిష్ఠిగా చూస్తే ఒక్కటనే చెప్పాలి. ఈ మూడు ఏ దశలోనూ వేరు కాదు. ఏది, ఏకాలంలో, ఏ అవస్థలో వేరుపడకుండా, నిత్యంగా, సత్యంగా అంటివుంటాయో, అది ఆ పదార్థంగానే చెప్పడం లోక వ్యవహారానుసారం.

ఎండను చెప్పినప్పుడు సూర్యుడు లేనిదిగానూ, సూర్యుడిని చెప్పినప్పుడు ఎండలేనివానిగా గ్రహింపలేం. మూడు వేరని కూడా అనవచ్చు. ఒకటనికూడా అనవచ్చు. జీవుడు కడతేరే మార్గం లక్ష్మణ చర్య, కైంకర్యం వల్ల నేర్చుకోవాలి. ఇప్పుడు జీవుడైన లక్ష్మణుడు పరమాత్మ ఐన రామచంద్రమూర్తికి మధ్యలో సీత (ప్రకృతి) వున్నది. ఆమె తెర అడ్దం తీస్తేనేకాని రాముడు లక్ష్మణుడికి కనబడడు. వారిరువురికి సేవచేస్తేనే ఆ అడ్దం తొలగిపోతుంది. ఇది వారి అనుగ్రహంవల్ల రావాల్సిందేకాని మన ప్రయత్నం వల్ల సాధ్యమయ్యేది కాదు. దీనిని గ్రహించిన ఋషులకు తమ సందేహాలు తొలగిపోయాయి.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

 

No comments:

Post a Comment