సనాతన ధర్మబద్ధ రాజనీతి
నేటి మేటి పాలనకూ మార్గదర్శకమే!
(కణిక, నారద, ధౌమ్య, శ్రీరామ రాజనీతిజ్ఞత)
వనం
జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర
దినపత్రిక (ఏప్రియల్ 4, 2026)
ప్రాచీన భారత ఇతిహాసాలలో కనిపించే
రాజనీతి సూత్రాలు కేవలం ఆ కాలానికే పరిమితం కాలేదు. అవి
నేటి సమాజానికి, ప్రభుత్వాలకు, సంస్థల
నిర్వహణకు కూడా మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. కణికుడు సూచించిన దండనీతి, నారదుడు
వివరించిన ధర్మపాలన, ధౌమ్యుడు ఉపదేశించిన సేవాధర్మం, శ్రీరాముడు
చెప్పిన రాజవ్యవస్థ, ఇవన్నీ కలిసి ఒక సమగ్ర పాలనా తత్వాన్ని ప్రతిపాదిస్తాయి. ఈ
నాలుగు దృక్కోణాలు నాయకత్వంలో నిష్పక్షపాతం, జాగ్రత్త, నైతికత, బాధ్యత
అనే మౌలిక సూత్రాలను ప్రతిపాదిస్తూ, నేటి కాలానికీ
సహితం వందశాతం అన్వయిస్తాయి.
కురు సార్వభౌముడు దుర్యోధనుడి కోరికమేరకు, కణికుడు ఆయనకు
ఉపదేశించిన రాజధర్మం మహాభారతంలో అత్యద్భుతమైన ఘట్టాలలో ఒకటి. ప్రభువు అనేవాడు
ప్రబలమైన అధికారం కలవాడై, తగిన దండనీతిని అవలంబించి, ప్రజలను ధర్మ
మార్గాన నడిపించి, మంచి ప్రవర్తన కలవాడుగా వుండాలని, దండనీతిలో
స్వపరభేదభావం లేకుండా సమబుద్ధితో వుండాలని చెప్పాడు. అలా చేస్తే, రాజు
ఆజ్ఞానుసారం అన్ని జాతులవారు తమతమ జాతి ధర్మాలను ఉల్లంఘించక
ప్రవర్తిస్తారని, ఉత్తమపాలనకు అధికార బలం ఒక్కటే
చాలదనీ, నిష్పక్షపాతం, సత్ప్రవర్తనం, ప్రభుతకు పెద్ద
బలాన్ని చేకూర్చే గుణాలని, ఇవికూడా ప్రభువుకు వుండాలని అన్నాడు.
ఫలానా పని చేయవచ్చా, చేయకూడదా అని
ఆలోచించకుండా చెడునడవడి కలవాడైతే, తండ్రైనా, గురువైనా విడిచిపెట్టక
ప్రభువు శిక్షించాలని అంటాడు. ఏ పనైనా బుద్ధిమంతులతో ముందుగా విచారించి చేస్తేనే ఆ
పని చెడిపోకుండా వుంటుందని చెప్పాడు. ‘రాజైన వాడు మొదలు నేర్పుగాకాని, మెత్తగా కాని, భయంకరంగా కానీ, తనను
తాను రక్షించుకోవాలి. తనకు ప్రమాదం లేకుండా చూసుకుని
రాజధర్మాలు నడపాలి. తన లోపాలు ఇతరులు
తెలుసుకోకుండా, ఇతరుల లోపాలను తాను తెలుసుకుంటూ, దేశకాల పరిస్థితులను
ఎరిగి, మిత్రబలం కలవాడై, రాజు తన ధర్మాలను
నిర్వర్తించాలి. శత్రువులను బలహీనులైనప్పుడే చంపడం రాజనీతి. శత్రువు బలం చేకూర్చుకున్న
తరువాత జయించడం సాధ్యం కాదు’ అని చెప్పాడు.
రాజు తన పనులను గురించి, శత్రువుల పనులను
గురించి, విసుగు లేకుండా దూతల
ద్వారా తెలుసుకోవాలని, శత్రుదేశాల విషయాలను తెలుసుకోవడానికి పలువురు తెలివైన
వేగులవారిని నియమించాలని, పలువిధాలైన ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ప్రభువుకు
ప్రమాదాలు కలగకుండా పరిశీలించి, ప్రమాదం కలిగించే
వ్యక్తులు, ఆయుధాలు వుంటే తొలగించి, పరిశుద్ధంగా
వుంచాలని అంటాడు. రాజైనవాడు తనకు ఫలానా వారు నమ్మదగినవారని, లేదా, నమ్మదగిన వారుకాదని అనకూడదు.
‘నిశ్చయ బుద్ధితో ఎవ్వరినీ నమ్మకుండా తన రక్షణ తానే
ప్రధానంగా చూసుకోవాలి. ప్రభువు తనను తాను జాగ్రత్తగా రక్షించుకున్నట్లే, తన
రహస్యాలోచనాన్ని కూడా రక్షించుకోవాలి. రహస్యాలోచన
వెల్లడి కాకుండా రక్షించుకునే బలం వల్లే అన్ని పనులు ఫలవంతమౌతాయి. రహస్యాలోచన
వెల్లడైతే పనులను ఫలవంతం కావించడం ఎవరి తరం కాదు’. అన్నాడు.
‘చెడు నడవడికల నీచులు చేతులు జోడిస్తారు.
నమస్కారాలు చేస్తారు. ఇంపైన మాటలు మాట్లాడుతారు. కపటపు
వినయాలు ప్రదర్శిస్తారు. దుర్మార్గుడు తనకు అనుకూలమయ్యేంతవరకు స్నేహితుడిలాగా
నటించి, ఆ తరువాత, పాములాగా తన
క్రూరకృత్యాలనే కోరలతో కరుస్తాడు. ఎక్కువ కోపం కానీ, స్నేహంకానీ, వాటి అనుభవ
కాలానికే ఇతరులకు తెలియచేయాలి. అవసరమైనప్పుడు శత్రువును భుజం మీద ఎక్కించుకుని, సమయం రాగానే
మట్టికుండను రాతిమీద కొట్టినట్లు నాశనం చేయాలి. లోగడ తనకు అపకారం చేసిన
వారు తగ్గినా,
ఆదరించకూడదు.
ముళ్ళు చిన్నదే అయినా అది పాదంలో ఉంచకూడదు. అపకారాలు చేసేవాళ్ళను
సామదానభేదోపాయాలతో నమ్మకం కలిగించి, ఆలస్యంకాకుండా
మట్టుబెట్టాలి. ఏవిధంగానైనా రాజనీతితో శత్రువును హతమార్చాలి. అపకారాలు చేసేవారిని
శత్రువులైనా, బంధువులైనా అశ్రద్ధ చేయకూడదు. ఆత్మరక్షణ
అన్నింటికన్నా ప్రాధాన్యం.’
నేటి ప్రభుత్వ వ్యవస్థల్లోనూ, న్యాయ
వ్యవస్థలోనూ ఇదే నిష్పక్షపాతం అత్యంత కీలకం. నేటి కార్పొరేట్ ప్రపంచంలోనూ, రాజకీయ
రంగంలోనూ వ్యూహాత్మక ఆలోచన, సమాచార సేకరణ, సమయస్ఫూర్తి
విజయానికి కీలకం. నేటి డిజిటల్ యుగంలో డేటా సెక్యూరిటీ, గోప్యత
పరిరక్షణ కూడా ఇదే సూత్రానికి ఆధునిక రూపం.
మహాభారతంలోనే మరోఘట్టం నారదుడు ధర్మరాజుకు
చెప్పిన రాజనీతి. ‘పూర్వీకులు
ఏర్పరిచిన ధర్మపద్దతిని రాజు ఆచరించాలి. ధర్మాన్ని
తెలుసుకుని, ధర్మార్థకామాలు ఒకదానికొకటి బాధించకుండ, కాలోచితాలుగా
వాటిని విభజించి సేవించాలి. ధర్మం మీదనే మనస్సు నిలిపి, చేయాల్సిన రాజకార్యాలను
స్వబుద్ధితో ఆలోచించాలి. ప్రభుత్వ ఉద్యోగాలలో
స్థిరంగా యోగ్యులైన వారిని వారి-వారి శక్తి సామర్థ్యాలను గుర్తించి, గౌరవ భావంగా
స్థిరంగా నియమించాలి. పుణ్యాత్ములను, శాస్త్ర నియమాలు
బాగా తెలిసినవారిని, రాజుమీద ప్రేమ కలవారిని, తాతతండ్రుల
నుండి వంశపారంపర్యంగా కొలువు చేస్తున్న వారిని, ఉత్తములను మంత్రులుగా
ఏర్పరుచుకోవాలి. రాజుకు రహస్యాలోచనను ఇతరుల చెవిన పడకుండా జాగ్రత్త పడాలి. రాజు సలహాదారులు
ధర్మాధర్మాలు తెలిసి, వివిధ శాస్త్రాలను
అధ్యయనం చేసి, పక్షపాత బుద్ధి లేకుండా వుండాలి’ అన్నాడు నారదుడు.
‘యుద్ధాలలో విజయాన్ని సాధించడంలో నిపుణులైన వారిని, ఎదిరించనలవికాని
పరాక్రమవంతులను,
విశ్వాసపాత్రులను, గౌరవానికి అర్హులైన
వారిని, రాజు మేలు కోరే వారిని సైన్యాధ్యక్షులుగా నియమించాలి.
పలుకుబడి కలిగి, క్రియాశీలియై, తన
పరిమితిమీరి, ఇతరులతో చేతులు కలిపి, రాజుకు వ్యతిరేకంగా
మంత్రి కార్యాలోచన చేయకుండా జాగ్రత్త పడాలి. అధికార పక్షంలో వుంటూ, ప్రయోజనాలు
పొంది, బలపడి, దురాశా దురహంకారాలు
పెంచుకుని, అన్యులతో చేతులు కలిపి, అధికార పక్షాన్ని
బలహీనపరిచే వ్యతిరేక వర్గాన్ని సృష్టించే వెన్నుపోటుదారులంతా ఈ కోవకు చెందిన
మంత్రులే. అలాంటి వారిని ఒక కంట కనిపెట్టి వుండడం మంచిదని’
నారదుడు ఆ కాలంలోనే హెచ్చరించాడు.
‘శాస్త్ర పాండిత్యం, స్వీయ ప్రతిభ
కలిగిన,
ఆస్థానజ్యోతిష్కులు
భూకంపాలు, వానలు, వరదలు లాంటి ఉత్పాతాలను కనిపెట్టి
విరుగుడు సూచించాలి. వైద్యులు సమర్థులై ప్రజలమీద ప్రేమతో సేవలు చేయాలి.
మనోవ్యాధులకు, శారీరక వ్యాధులకు
చికిత్స చేయగలగాలి. పన్నులు వసూలు చేయడం లాంటి ధనార్జన రూపక రాచకార్యాలలో
పరిశుద్ధులైన వారిని, పాపరహితమైన చిత్తవృత్తి కలవారిని, నీతిమార్గంలో
నడుచుకునేవారిని, రాగద్వేషరహితమైన సమబుద్ధితో వ్యవహరించేవారిని, నైపుణ్యం
కలవారిని నియమించాలి. వ్యక్తుల యోగ్యతలకు
అనుగుణంగా ఉన్నత, మాధ్యమిక, కింది స్థాయి
ఉద్యోగాల్లో నియామకం జరగాలి. సేవకులందరికీ కొరతలేకుండా తగుజీతాలు సకాలంలో ఇవ్వాలి.
రాజు కొరకు యుద్ధంలో మరణించిన వీర సైనికుల కుటుంబాలకు సరైన ఆర్ధిక సహాయం చేయాలి’
అన్నాడు నారదుడు.
‘లోభులను, దొంగలను, స్నేహానికి
అయోగ్యులను,
శత్రువుల
పట్ల పక్షపాతం కలవారిని, ధైర్యంలేని వారిని, దుర్మార్గులను, రాజకార్యాలు
నిర్వహించడానికి పంపకూడదు. ప్రభుత్వ ఉద్యోగులలో ముఖ్యులు ధనాశాపరులై, అవినీతిపరులు
కాకుండా జాగ్రత్త పడాలి. (లంచగొండులైన ప్రభుత్వ
ఉద్యోగుల పట్ల ప్రభువు ఎలా అప్రమత్తుడై ఉండాలో నారద మహర్షి అప్పుడే సూచించాడు).
అనావృష్టి లేకుండా, ఎల్లప్పుడూ చెరువులు నిండి కళకళలాడాలి.
ఉదారబుద్ధితో పేదరైతులకు ధాన్యపు విత్తనాలు, వర్తకులకు నూటికి
రూపాయి మాత్రమే వడ్డీ చొప్పున ప్రభుత్వపరంగా అప్పులు లభించాలి. (నారద మహర్షి
మాటలను బట్టి మహాభారత కాలంలోనే అధికాహారోత్పత్తికి విత్తనాలు, ఆర్థికాభివృద్ధికి
తక్కువ వడ్డీతో రుణాలు ప్రభువులు ఇచ్చేవారని అర్థం చేసుకోవాలి). వికలాంగులను, అనాధలను
దయతో పోషించాలి. మేలుచేసిన వ్యక్తులను ఉచితరీతిన సత్కరించాలి.’
‘ఆదాయంలో నాల్గవ భాగాన్ని లేదా మూడవ భాగాన్ని లేదా సగభాగాన్ని
మాత్రమేఖర్చు చేయాలి కాని అంతకు మించి చేయకూడదు. ఆయుధ శాలలు, ధనాగారాలు, అశ్వశాలలు, గజశాలలు, కోశాగారాల లాంటి
వాటి పాలనలో ఎంతో నమ్మదగిన వారిని, రాజుపట్ల
భక్తి కలవారిని, సమర్థులైన వారిని, నియమించాలి.
ప్రజలంతా రాజును ప్రశంసించే విధంగా గురువులను, వృద్ధులను, గొప్ప వ్యాపారులను, ఆశ్రితులను, సజ్జనులను, పేదరికం రాకుండా
కాపాడాలి. మంత్రులు, సైన్యాధిపతులు, హితులు, రాకుమారులు, పండితులు, ఆసీనులై వుండగా
ప్రతిదినం కొలువు తీరాలి. సమర్థులైన గూఢచారులను నియమించుకోవాలి.
ఎదుటివారి ఎత్తుగడలను తెలుసుకోవాలి. ఆత్మరక్షణకు, శత్రు శిక్షణకు
అవసరమైన చర్యలు తీసుకోవాలి.’
నారద మహర్షి ధర్మరాజుకు చెప్పిన రాజనీతిలో ధర్మాన్ని
ఆధారంగా చేసుకుని, కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన
సూచించాడు. సరైన వ్యక్తులను సరైన స్థానాల్లో నియమించడం, నిష్పక్షపాత
సలహాదారులను ఎన్నుకోవడం, మంచి పాలనకు ఆధారం. నేటి ప్రభుత్వాల్లోనూ, సంస్థల్లోనూ
మెరిట్ ఆధారంగా నియామకాలు, పారదర్శకత ఎంతో అవసరం. యుద్ధంలో
మరణించిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలని నారదుడు సూచించడం, నేటి
పెన్షన్ విధానాలకు పూర్వగామిగా కనిపిస్తుంది. రైతులకు విత్తనాలు, వ్యాపారులకు
తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వాలని చెప్పడం, ఆధునిక
సంక్షేమ పథకాలతో పోల్చదగినది. వార్తా
నిర్వహణపై నారదుడు చెప్పిన మాటలు నేటి మీడియా, కమ్యూనికేషన్
వ్యవస్థలకు కూడా వర్తిస్తాయి. సరైన సమాచారం సమయానికి ప్రజలకు చేరకపోతే, ప్రభుత్వం-ప్రజల
మధ్య దూరం పెరుగుతుంది. ఫేక్ న్యూస్, అపోహలు పెరిగే
ప్రమాదం ఉంటుంది. అందుకే సమాచార వ్యవస్థ బలంగా ఉండాలి.
మహాభారతం మరో సందర్భంలో, ధౌమ్యుడు చెప్పిన
సామాన్య సేవానియమావళి సహితం ఇదే పద్ధతిలో కొనసాగింది. ధౌమ్యుడు పాండవులకు చెప్పిన
సేవాధర్మాలు, బహుశా నాటి నుండి నేటి వరకు ఒకరి
దగ్గర కొలువు (ఉద్యోగం) చేసే ఎవరికైనా ఆచరణ యోగ్యాలే. వాటిని అందరూ విధిగా తెలుసుకోవాల్సిందే, ఆచరణలో
పెట్టాల్సిందే!!! అలా చేస్తే, కొలువు చేస్తున్న
ప్రతివారికీ సర్వదా శ్రేయస్కరం. ధౌమ్యుడి మాటల్లోనే ఆ వివరాలు:
“రాజులను
(ఆధునిక యజమాని, లేదా బాస్)
సేవించి జీవించేవాడు చాలా జాగ్రత్తగా వుండాలి. తగిన పద్ధతిలో సభలో (పని చేసే చోటులో)
అడుగు పెట్టాలి. తన స్థానానికి తగిన ఆసనంలో కూర్చోవాలి. తన వేషధారణ, ఆకారం వికృతంగా
వుండకూడదు. సమయం, సందర్భం తెలుసుకుని మసలుకుంటే, రాజుకు
(యజమాని లేదా బాస్) గౌరవపాత్రుడు అవుతాడు. ‘నేను రాజు కొలువులో వున్నాను, రాజుతో చనువుగా
వున్నాను, నాకేమిటి’ అని మర్యాదను అతిక్రమించ కూడదు. రాజు
ఇంటికన్నా అందంగా ఇల్లు కట్టుకోకూడదు. సేవకులు రాజు కంటే ఏ విషయంలోనూ అధికులుగా
వుండకూడదు. రాజు (బాస్) తో సన్నిహితంగా ఉండడంలో తప్పులేదు కాని, రాజుగారి దగ్గర
వుండే చాలామందికి కష్టం కలిగించే పనుల్లో మాత్రం జోక్యం చేసుకోకూడదు. అలా చేస్తే
సేవకుడి (ఉద్యోగి) శక్తి బహిర్గతం కావచ్చును కాని, ఆ తరువాత హాని
కలగడం మాత్రం తధ్యం”.
“రాజు దగ్గర మౌనంగా వుండకూడదు. అలా అని చెప్పి, పదిమందితో ఆర్భాటంగా
మాట్లాడడం మంచిది కాదు. తనకు దగ్గరి వారైన ఇతరులతో కలిసి తాను రాజుతో మాట్లాడడం
ఉత్తమం. రాజుగారి కొలువులో (ఆధునిక పరిభాషలో, యజమాని
కార్యాలయంలో) రాజుకు మరీ ఎట్ట ఎదురుగా వుండకూడదు. అలాగని, మరీ వెనుకగా
కూర్చోకూడదు. ఏదో ఒక పక్కన నిలబడి (వీలున్నంత సేపు) సేవించాలి. రాజు ముఖం మీదనే
దృష్టి సారించి సభలో మెలగాలి. కార్యాలయంలో మాటలు ఎప్పటికీ, ఎక్కడా బయట
పెట్టకూడదు. బయట ఎక్కడైనా రాజుకు సంబంధించిన మాటలు వింటే, అవి
వినదగినవైతేనే రాజుకు చెప్పాలి. చెప్పేటప్పుడు సేవకుడు కొంత
విచక్షణ చూపాలి. విన్న మాటల్లో నిజానిజాలు
తెల్సుకోవాలి. రాజుకు అనవసరమైన విషయం అసలే చెప్పరాదు. రాజుకు అప్రియమైన విషయం
ఎప్పుడూ చెప్పకూడదు”.
“రాజు అనుగ్రహిస్తేనే ఆసనాలు ఎక్కాలి (కుర్చీమీద కూర్చోవాలి).
అలాగే వాహనాలు కూడా. రాజు అనుగ్రహించకుండా, రాజానుగ్రహం
లేకుండా, శ్రేష్టమైన ఆసనాలు, పెద్ద
పెద్ద వాహనాలు తమంతట తాము అధిరోహించడం తప్పు. రాజు
(బాస్) తనను గౌరవించాడని ఉబ్బిపోకూడదు. అవమానించాడని కుంగిపోకూడదు. ఆ రెంటినీ
లెక్కించకుండా ఎప్పటిలాగే రాజు దగ్గర పనిచేస్తే సేవకులకు మంచి జరుగుతుంది. ఆపదలు
తొలగిపోతాయి. రాజు ఎవరినైనా రక్షించాలని కాని, శిక్షించాలని
కాని నిర్ణయిస్తే, అ అవిషయాలు సేవకుడికి తెల్సినా, అవి
అమలు కాకముందే బయట పెట్టకూడదు. రాజుకు (బాస్)
దగ్గరగా మెలిగే ఏనుగుతో కాని, దోమతో కాని, వైరం కలిగే
విధంగా ప్రవర్తించ కూడదు”.
రామాయణంలో, భరతుడికి శ్రీరాముడు
బోధించిన రాజధర్మంలో ప్రదామైనది: మంత్రి, పురోహితుడు,
యువరాజు, సేనాపతి, దౌవారికుడు లేదా ద్వారపాలకుడు,
అంతర్వంశికుడు లేదా అంతఃపుర కార్యనిర్వాహకుడు, కారాగారాధిపతి, అర్థసంచయికుడు (ధనం సంపాదించేవాడు), కార్యనియోజకుడు, ప్రాడ్వివాకుడు
(న్యాయమూర్తి), సేనానాయకుడు, నగరాధ్యక్షుడు, కర్మాంతికుడు
(ప్రభుత్వ పద్దుల అధిపతి), ప్రతిరోజూ సభను అలంకరించే సభ్యుడు, ధర్మాధ్యక్షుడు, దండపాణి
లేదా దండపాలుడు, దుర్గపాలుడు, రాష్ట్రంతపాలుడు, అనే 18 మంది తీర్థుల నియామకం.
ధౌమ్యుడు చెప్పిన సామాన్య సేవానియమావాలి, ధర్మరాజుకు
నారద మహర్షి చెప్పిన రాజనీతి విషయాలు, ఇన్ని వందల, వేల సంవత్సరాల
తరువాత కూడా ఆచరణీయం. అలాగే శ్రీరాముడు తమ్ముడికి తెలియచేసిన రాజధర్మాలు, సత్త్వశుద్ధి,
ఎల్లప్పుడూ,
ధర్మపాలనకు, ప్రభు క్షేమానికి, ప్రజా క్షేమానికి
విశేషంగా దోహదపడుతుంది. కణికుడు, నారదుడు, ధౌమ్యుడు, శ్రీరాముడు
ప్రతిపాదించిన రాజనీతి సూత్రాలు సమగ్రంగా పరిశీలిస్తే, అవి
కేవలం రాజులకు మాత్రమే కాకుండా నేటి రాజకీయ నాయకులకు, పరిపాలకులకు, ఉద్యోగులకు, ప్రతి
వ్యక్తికీ మార్గదర్శకాలు.
నైతికత, జాగ్రత్త, బాధ్యత, సమన్వయం
అనే నాలుగు మూల సూత్రాలు ఈ ఉపదేశాల సారం. మొత్తంగా చూస్తే, ప్రాచీన
రాజనీతి కేవలం చరిత్ర కాదు. అది నేటి
సమాజానికి కూడా దిశానిర్దేశం చేసే జీవంతమైన తత్వం. ఆధునిక సాంకేతికత, వేగవంతమైన
జీవనశైలిలోనూ ఈ సూత్రాలను అనుసరించగలిగితే, సమాజంలో
న్యాయం, శాంతి, అభివృద్ధి
మరింత బలపడతాయి. పాత జ్ఞానం, కొత్త కాలానికి
అన్వయించినప్పుడు మాత్రమే నిజమైన ప్రగతి సాధ్యమవుతుంది.


ఏ ఎండకాగొడుగంటే అర్ధమేంటండి ? ;)
ReplyDeleteఏ ఎండకాగొడుగు అనే ప్రయోగం వ్యాసంలోనే లేదు కదా, దానికి అర్ధమేంటండి అని అడగటం ఏమిటండీ? వ్యాసంలోని విషయం గురించి అడగకుండా అనవసరప్రసంగాలు చేయవచ్చా?
ReplyDeleteధన్యవాదాలు
Delete