ఆంధ్ర జ్యోతి దిన పత్రిక (26-06-2011)
క్షీణిస్తున్న పార్లమెంట్ జవాబుదారీ
వనం జ్వాలా నరసింహారావు
పౌర సమాజానికి చెందిన కొందరు స్వయం ప్రకటిత నేతల ఒత్తిళ్లకు లొంగి, చట్టాల రూపకల్పనకు సంబంధించి పూర్తి అధికారాలను కలిగున్న పార్లమెంటు పరిధి నుంచి ఆ అధికారాలను పార్లమెంటే తర శక్తులకు బదిలీ చేసే ప్రసక్తి లేదని కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలైన పార్టీ వర్కింగ్ కమిటీ స్పష్టం చేసింది. పార్లమెంటు సార్వభౌమాధికారం విషయంలో సీనియరు కాంగ్రెస్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ ఇటీవల వెలిబుచ్చిన అభిప్రాయానికి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారం ఏచూరి కూడా మద్దతిస్తున్న ధోరణిలో మాట్లాడారు. అదుపులు అన్వయాలకు లోబడి పార్లమెంటు ప్రజాస్వామ్య వ్యవస్థలైన చట్ట సభలు, కార్య నిర్వాహక అధికారి, న్యాయ వ్యవస్థలు పని చేయాలి. ఈ మూడింటి లో ఒకటి ఎక్కువ మరోటి తక్కువ అనలేం. అలాంటప్పుడు, వీటిని అధిగమించి, లోక్ పాల్ పేరుమీద నో, మరే పేరు మీదో, ఇంకో సమాంతర వ్యవస్థ పెత్తనం చేయడం సబబే నా? వాస్తవానికి, రాజ్యాంగానికి లోబడి చట్టాలను చేసే నిర్ణయాధికారం-సార్వభౌమాధికారం, నూటికి నూరుపాళ్లు పార్లమెంటు దే అయినా, ఒక సంస్థగా-వ్యవస్థగా, భారత పార్లమెంటుకు రాజ్యాంగ పరంగా సంక్రమించిన అధికారాలను కార్య నిర్వహణ సంస్థ చేతుల్లో పెట్టడంతో, పరోక్షంగా ఉనికిని కోల్పోతున్న నేపధ్యంలో, భవిష్యత్ లో దాని ప్రధాన బాధ్యతైన జవాబుదారీతనంతో వ్యవహరించడం క్లిష్టమౌతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టయిన పార్లమెంటు ఉభయ సభల, రాజ్యాంగపరమైన శాసనాధికార పర్యవేక్షణా సామర్థ్యం, జవాబుదారీ, క్రమేపీ క్షీణ దశకు చేరుకుంటున్నాయని ఐక్య రాజ్య సమితి సామాజికాభివృద్ధి పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలోని, ప్రజాస్వామ్యం-పరిపాలన-మానవ హక్కుల కార్యక్రమ అంశాలకు సంబంధించిన ఒక అధ్యయనంలో పేర్కొనడం జరిగింది. జవాబుదారీకి ప్రతీకలుగా, పార్లమెంటులో ప్రవేశ పెట్టి చర్చించాల్సిన వివిధ తీర్మానాలు, రాజ్యాంగ పరమైన పార్లమెంటు పర్యవేక్షణా బాధ్యతలు, సభా సంఘాల పనితీరు లాంటివి, నిర్వీర్యమై పోతున్నాయి. ప్రపంచీకరణ దిశగా దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ, పార్లమెంటు అధికారాలను హరించి వేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న పలు అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించి పార్లమెంటుకు సరైన పర్యవేక్షణ లేదు. ఆ ఒప్పందాల విషయంలో పార్లమెంటు వెలుపల తీసుకున్న నిర్ణయాలు తిరుగులేని విగా వుండడంతో, పార్లమెంటు ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోంది. ఎన్నికల ద్వారా రాకుండా బాధ్యతాయుతమైన విధులు నిర్వహించే పలు వ్యవస్థలకు బదలాయించిన అధికారాలపై కూడా పార్లమెంటు పర్యవేక్షణ బలహీనంగా వుంది. అదుపులు-అన్వయాల విషయంలో పార్లమెంటుతో సమానమైన అధికారాలను కలిగున్న కార్య నిర్వహణ వ్యవస్థ తనను శాసించే దిశగా పార్లమెంటు అడుగులు వేస్తోంది. అలానే న్యాయ వ్యవస్థ కూడా పార్లమెంటును ఆదేశించే సందర్భాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. శాసనాధికారాలున్న చట్టసభల పరిస్థితి ఇలా కావడానికి కారణాలను రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్తలు, పార్లమెంటరీ అధ్యయన నిపుణులు అన్వేషించే ప్రయత్నం చేశాయి.
శాసన సంబంధమైన ప్రక్రియలో జాప్యం జరుగుతున్నదనే సాకుతో, చట్టాల రూపకల్పన-నిర్ణయాధికారం కలిగిన పార్లమెంటు, చట్టం స్థానంలో "ఆర్డినెన్సుల" ను తెచ్చేందుకు, కార్య నిర్వహణ వ్యవస్థకు (నిర్వహణాధికారికి-ప్రధానికి), అధికారాలను కట్టబెడుతూ పోవడం, భారత పార్లమెంటుకున్న అతి పెద్ద బలహీనతనాలి. మరో విధంగా చెప్పుకోవాలంటే, ఎగ్జిక్యూటివ్ అధికారాలను సమీక్షించే విషయంలో పార్లమెంటు నిష్ఫలత స్పష్టంగా కనిపిస్తోంది. పెరుగుతున్న సామాజిక అవసరాలకు-ఆధునిక పార్లమెంటరీ పద్ధతులకు అనుగుణంగా వ్యవహరించగల సామర్థ్యం-అభిరుచి చాలామంది పార్లమెంటు సభ్యులలో అంతగా లేకపోవడం కూడా జవాబుదారీ క్షీణించడానికి దోహదపడుతోంది. రోజు-రోజుకు పుట్టుకొస్తున్న రాజకీయ పార్టీలు సంస్థాగతంగా పటిష్ఠంగా వ్యవహరించలేక పోవడం, ఆ పార్టీల ప్రతినిధులు స్థానిక అవసరాల దృష్ట్యా చట్ట సభలకు ఎన్నిక కావడంతో, పార్లమెంటు సమిష్టి కార్యాచరణకు అవరోధాలు కలుగుతున్నాయి. జవాబుదారీ తనం తగ్గడానికి ఇది మరో కారణం.
పార్లమెంటు నిర్వర్తించాల్సిన విధులను, దానంతటదే పరిత్యజించడం ఆశ్చర్యకరమైన అంశంగా పరిగణించాలి. ఎన్నికల-పార్టీల రాజకీయాల కారణాన తప్పనిసరిగా తలెత్తే పరిస్థితులు, చట్టాల రూపకల్పనలో అలసత్వం-ఆలశ్యం జరగడానికి దోహదపడుతున్నాయి. పార్లమెంటు సభ్యులు, సరైన కారణాలు లేకపోయినా, చట్ట సభలో అవరోధాలు కలిగించి శాసన ప్రక్రియను ఆలశ్యం చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, క్రమం తప్పకుండా ఎన్నికలు జరగడం, శాంతియుతంగా అధికార మార్పిడి జరగడం, నిష్పాక్షికంగా వ్యవహరించే స్వతంత్ర న్యాయ వ్యవస్థ రూపు దిద్దుకోవడం, చైతన్యవంతమైన పౌర సమాజం బలీయం కావడం లాంటివి భారత దేశ ప్రజాస్వామ్యాన్ని కొంత మేరకైనా పటిష్టం చేశాయి. తరతరాలుగా, గుత్తాధిపత్యంతో కొందరు మాత్రమే రాజ్యాధికారం చలాయించే స్థితిలో వుండే భారతీయ సమాజంలో, నెమ్మదిగా సామాజిక చైతన్యం-విప్లవం వస్తుందని, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాధమిక హక్కులు కాపాడబడతాయని, సార్వజనీన ఓటు హక్కు మార్పుకు సంకేతమని భావించిన దేశ పౌరుల నమ్మకం వమ్మైందని అనాలి. తమ ఓటు హక్కు ద్వారా గెలిపించిన ప్రజా ప్రతినిధులుండే చట్ట సభల (పార్లమెంట్-శాసన సభలు) పని తీరు అసంతృప్తికి గురి చేస్తున్నాయన్న భావన కలుగుతోంది పౌరులకు.
భారత దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో చోటుచేసుకుంటున్న వైఫల్యాలకు-సాఫల్యాలకు, పార్లమెంటు బాధ్యత ఎంతనేది చర్చనీయాంశం. పార్లమెంటు పనితీరుకు సంబంధం లేకుండా, ప్రజాస్వామ్యం మనుగడ సాగే వీలు లేదు. అదే విధంగా పలు ప్రజాస్వామ్య సంస్థల పని తీరు కూడా పార్లమెంటు నిర్వహణా విధానంపైనే ఆధార పడి వుంటుంది. తమకు టికెట్ ఇచ్చి అవకాశం కలిగించిన రాజకీయ పార్టీల ఆలోచనా సరళి-ప్రభావం, పార్లమెంటు సభ్యులపై ప్రస్ఫుటంగా వుంటుంది. ఈ నేపధ్యంలో, తప్పైనా-ఒప్పైనా, అర్హతల-యోగ్యతల దృష్ట్యా కాని, నిబద్ధత దృష్ట్యా కాని, పార్లమెంటేరియన్ పనిలో నాణ్యత క్షీణిస్తున్నదనే నిపుణుల అభిప్రాయం. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లతో పోల్చి చూస్తే, ఈ నాటి పార్లమెంటు సభ్యులలో చాలా మంది విద్యార్హతలు ఉన్నత స్థాయిలో వున్నప్పటికీ, ఎన్నికైన వారిలో గణనీయమైన సంఖ్యలో, నేరచరిత్ర కలిగినవారు కూడా వుండడంతో, దాని ప్రభావం కూడా పార్లమెంటు పనితీరుపై పడుతోంది.
భారతీయ ఓటర్లు తమదైన ప్రత్యేక శైలిలో, వారి-వారి ప్రాధాన్యతలను బట్టి, రాజకీయ అనుబంధాలకు అనుగుణంగా, మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ, ఎన్నుకునే విభిన్న మనస్తత్వాల కలగూరగంప పార్లమెంటు-అందునా ప్రత్యేకించి లోక్ సభ. మామూలు సాదాసీదా అభ్యర్థులను ఓటర్లు గెలిపించిన సందర్భాలు, యోధానుయోధులను మట్టి కరిపించిన ఉదాహరణలు కోకొల్లలు. ఒక గుర్తింపు పొందిన రాజకీయ పక్షాన పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలిచిన వ్యక్తి, పార్టీ వీడిన మరు క్షణం ఘోరంగా ఓటమి పాలైన సందర్భాలున్నాయి. ఎన్ని పార్టీలు మారినా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా, అఖండమైన మెజారిటీతో గెలిచిన వారూ వున్నారు. ఎవరిని, ఎప్పుడు ఎందుకు భారతీయ ఓటరు గెలిపించుతాడో-ఓటమి పాలు చేస్తాడో తెలుసుకోవడం అంత సులువైన విషయం కాదు. ఇలాంటి ప్రాధాన్యతలే, పార్లమెంటుకు గెలిచే అభ్యర్థుల సామాజిక కూర్పును ఒక్కో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేసరికి మారుస్తున్నది. ఒక నాడు ఆంగ్ల విద్యను అభ్యసించ గలిగిన లాయర్లు, అగ్రకులాలకు చెందిన విద్యావేత్తలు, ధనవంతులు మాత్రమే పార్లమెంటులో అడుగు పెట్టగల సత్తా వుండేది. కాలం మారింది. ధన బలం, అంగ బలం, కుల బలం వున్న అన్ని సామాజిక వర్గాల వారితో సహా, రిజర్వేషన్ల మూలాన, వెనుక బడిన వర్గాలకు, షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డు తెగలకు చెందిన వారు కూడా పార్లమెంటుకు-చట్ట సభలకు ఎన్నిక కాగలుగుతున్నారు. మహిళలకు ఇంకా రిజర్వేషన్లు కలిగించ లేకపోవడంతో, అనుకున్నంత మంది ఎన్నికవడం లేదు. మొత్తం మీద, మారుతున్న సామాజిక-ఆర్థిక-రాజకీయ పరిస్థితులకనుగుణంగా, వైవిధ్యంతో కూడిన సామాజిక ప్రయోజనాలను ప్రతిబింబించే విభిన్న వ్యక్తులతో పార్లమెంటు ఏర్పాటవుతోందిప్పుడు.
ఇందిరా గాంధి హయాంలో 1975 లో విధించిన అత్యయిక పరిస్థితి, భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత విషాద సంఘటనగా పేర్కొనాలి. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకున్న దురదృష్టమైన నిర్ణయమది. అంతకు ఐదారు సంవత్సరాల క్రితం నుంచే, కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు బలమైన ముఠా నాయకులు, రాజకీయంగా లబ్ది పొందాలని పట్టుదలతో, జాతి ప్రయోజనాలను భంగం వాటిల్లే విధంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం మొదలైంది. అదే క్రమంలో, కాంగ్రెస్ పార్టీతో సహా పలు రాజకీయ పార్టీలు సంస్థాగతంగా బలహీన పడడం, పార్లమెంటులోకి అడుగు బెట్టే రాజకీయ పార్టీల సంఖ్య ఒక నాటి ఐదు నుంచి సుమారు నలభైకి పెరగడం, ఒక సారి గెలిచిన వ్యక్తి మళ్ళీ గెలుస్తారో-లేదో అన్న అపనమ్మకంతో, "ఆయారం-గయారాం" రాజకీయాలకు ఒడిగట్టడం, పార్లమెంటు వ్యవస్థ జవాబుదారీ కుదించసాగాయి.
రాజ్యాంగ, ఆర్థిక, పాలనా పరమైన అధికారాలున్నప్పటికీ, పార్లమెంటు మౌలిక లక్ష్యం, చట్టాలను రూపొందించడం. రాజ్యాంగాన్ని సవరించే ఏకైక శక్తి పార్లమెంటు. పన్నులు విధించాలన్నా, నిధులు ఖర్చు చేయాలన్నా, పార్లమెంటు ఆమోదం తప్పని సరి. అధికార పార్టీ ప్రతిపాదించిన బడ్జెట్ కు పార్లమెంటు ఆమోద ముద్ర పడటం జరగకపోతే, ఆటోమేటిక్ గా, ఆ ప్రభుత్వం పార్లమెంటు విశ్వాసం కోల్పోయినట్లే. ఇక మంత్రివర్గం యావత్తు పార్లమెంటుకు సమష్టిగా బాధ్యత వహించాలి. ప్రభుత్వం ప్రజలకు నేరుగా కాకుండా పార్లమెంటు ద్వారా జవాబుదారీ. ప్రభుత్వ ప్రప్రధమ జవాబుదారీ సంవిధానం, పార్లమెంటులో ప్రవేశ పెట్టి-చర్చించే అవిశ్వాస తీర్మానం. ప్రతిపక్షాలు ప్రతిపాదించే ఆ తీర్మానం నెగ్గితే, ప్రభుత్వం పడిపోయినట్లే. కాకపోతే, చట్ట సభలో గణనీయమైన మెజారిటీ కలిగున్న ప్రభుత్వానికి ఎప్పుడూ ఢోకా లేదు. ఇంత పటిష్టమైన అధికారాలు కలిగిన పార్లమెంటును, 1975 లో ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో, పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుంది ఎగ్జిక్యూటివ్. ఎమర్జెన్సీ విధింపుతో సమాంతరంగా, ప్రాధమిక హక్కులను హరించి వేసే, రాష్ట్రపతి ఉత్తర్వులకు పార్లమెంటు ఆమోద ముద్ర వేయించుకో కలిగింది ఇందిరా గాంధి. ఎమర్జెన్సీ విధింపును, ప్రాధమిక హక్కుల హరింపును, లోక్ సభ ఆమోదం కొరకు ప్రతిపాదించినప్పుడు, సభలో ఓటింగు చేసిన వారిలో 336 మంది సభ్యులు అనుకూలంగా తల వూపడమంటే, ఎగ్జిక్యూటివ్ అధికారానికి దాసోహం అన్నట్లే కదా! మరో విధంగా చెప్పుకోవాలంటే, సంస్థాగతంగా పటిష్టంగా వున్న పార్టీ గణనీయమైన సంఖ్యాబలంతో వున్నప్పుడు, అవిశ్వాస తీర్మానాలు ఏమీ చేయలేవు.
అవిశ్వాస తీర్మానాల ద్వారా, ఇతర రకాలైన సభా తీర్మానాల ద్వారా, రాజ్యాంగ పరంగా సంక్రమించిన అధికారాలతో ప్రభుత్వాలను ఇబ్బందికి గురిచేయగల పదునైన ఆయుధాలు, తమ చేతులో వుంచుకున్న ప్రతి పక్షాలు సహితం, పార్లమెంటును జవాబుదారీగా వుంచడంలో విఫలమవుతున్నాయి. ఒకప్పుడు అధికారంలో కొచ్చిన రాజకీయ పార్టీలు కూడా, ప్రతిపక్ష పాత్ర సక్రమంగా పోషించలేక పోవడానికి కారణం, సంస్థాగతంగా సరైన నిర్మాణం లేకపోవడమే. బ్రిటన్ లో మాదిరి, "షాడో ప్రభుత్వం" ఏర్పాటుచేయగల సామర్థ్యాన్ని పెంపొందించుకో లేకపోతున్నాయి. పబ్లిక్ అకౌంట్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ, ప్రత్యేక కారణాలకొరకు ఏర్పాటు చేసే పలు అడ్ హాక్ కమిటీల లాంటి పార్లమెంటరీ కమిటీలున్నప్పటికీ, అవి రూపొందించిన నివేదికలను, సర్వసాధారణంగా పార్లమెంటు పరిగణలోకి తీసుకోక పోవడం కూడా జవాబుదారీ క్షీణించడానికి కారణమౌతోంది.
పార్లమెంటులో శాసన నిర్మాణానికి అంచలంచలుగా ప్రక్రియ వుంది. బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత, ముసాయిదాను చర్చకొరకు పరిశీలించేందుకు తక్షణమే ఓటింగు పెట్టవచ్చు. లేదా, ప్రవేశపెట్టిన సభా సభ్యుల సెలెక్ట్ కమిటీకి కాని, ఉభయ సభల సంయుక్త సెలెక్ట్ కమిటీకి కాని పంపవచ్చు. ప్రజాభిప్రాయ సేకరణకొరకు కూడా పంపవచ్చు. కాకపోతే ఈ ప్రక్రియ అరుదుగా జరుగుతుంటుంది. లోక్ పాల్ బిల్లు విషయంలో, ఈ ప్రక్రియకు అవకాశం వుండొచ్చేమో! సింహభాగం బిల్లులను సెలెక్టు కమిటీలకే పంపి తాత్కాలికంగా చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం. క్లాజు వారీగా బిల్లుపై చర్చ, సవరణల పరిశీలన, సవరణలకు మంత్రివర్గం ఆమోదం-తిరస్కారం, తర్వాత ఓటింగు జరుగుతుంది. సంబంధిత సభలో నెగ్గిన తర్వాత, మరో సభకు పంపి ఇదే ప్రక్రియను అనుసరిస్తారు. ఉభయ సభలలో ఓటింగు తర్వాత, రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపడం జరుగుతుంది. ఆమోదం పొందినంత మాత్రాన యాంత్రికంగా-స్వయం చలనంగా చట్టం కాదు. చాలా సందర్భాలలో (కావాలనే?) మరిచి పోవడంతో, రాజ్యాంగపరంగా జారీ చేయాల్సిన గెజెట్ నోటిఫికేషన్ ఆలశ్యం కావడం, చట్టం కాగితాలకే పరిమితమై పోవడం జరుగుతుంటుంది.
పార్లమెంటు సభా సమావేశాల సమయం క్రమేపీ తగ్గుతోంది. వాయిదా తీర్మానాల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోంది. అనేక సందర్భాలలో సభ్యులు మూకుమ్మడిగా నిల్చొని, ఎవరేం మాట్లాడుతున్నారో తెలియనందున, సభ నిర్వహణకు అంతరాయాలు కలగడం సభా సమయం తగ్గిపోవడానికి మరో కారణం. రాజ్యాంగపరంగా విధిగా కావాల్సిన "కోరం" లేకుండా కూడా సభను నిర్వహించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి ఒక్కో సారి. విధి లేని సందర్భాలలో సభాపతి వాయిదా మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తోంది. పార్లమెంటు సభ్యులకు తమ నియోజకవర్గ ఓటర్లతో నిరంతరం సంబంధాలుండడం తప్పనిసరి. నియోజక వర్గానికి పోవడం చేస్తున్నారు కాని, తమకు కేటాయించిన నియోజకవర్గ అభివృద్ధి నిధులను సక్రమంగా ఉపయోగించుకోలేక పోతున్నారు. దురదృష్టవశాత్తు, నియోజకవర్గానికి చెందిన పలువురి దృష్టిలో ఎంపీ అంటే, తమకు కావాల్సిన సొంత పనులు చేసిపెట్టే మనిషి మాత్రమే అన్న అభిప్రాయం వుంది. పార్లమెంటు సభ్యులకు కూడా వారి అవసరం వుండడంతో, వారు కూడా దానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. వెరసి ఇవన్నీ కూడా, జాతీయ ప్రాముఖ్యత సంతరించుకున్న అంశాలపై వారు శ్రద్ధ వహించకుండా వ్యవహరించేందుకు దోహద పడుతున్నాయి. జవాబుదారీ లోపించడానికి ఇవి కూడా కారణాలవుతున్నాయి.
భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుందేమో కాని, ఆ వ్యవస్థకు మూలస్థంభమైన పార్లమెంటు జవాబుదారీ ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఈ నేపధ్యంలో, అన్నా హజారే లాంటి వారు ప్రతిపాదించిన "లోక్ పాల్" వ్యవస్థ, కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ చెప్పినట్లు "జవాబుదారీ తనం లేని సమాంతర ప్రభుత్వం" లాంటిది కాదా? లెజిస్లేచర్, జుడీషియరీ, ఎగ్జిక్యూటివ్ ల కంటే ఎక్కువ అధికారాలను కలిగుండే వ్యవస్థ కాదా?
No comments:
Post a Comment