నా
బాల్యం...చిన్ననాటి కబుర్లు-Part TWO
వనం
జ్వాలా నరసింహారావు
బతుకమ్మ పండుగ వచ్చిందంటే మా అక్కయ్యతో పాటు మాకూ సంబరమే! దసరా
పండుగకు ముందు వచ్చేది బతుకమ్మ పండుగ. ఒక విధంగా దసరా, బతుకమ్మ పండుగలు ఏక కాలంలోనే జరుపుకుంటాం. బతుకమ్మ
పేర్చడానికి కావాల్సిన పూలను మేం ఇంటింటికి వెళ్లి సేకరించేవాళ్లం. మా జీతగాళ్లు
తంగేడు ఆకును, పూతను తెచ్చే వాళ్లు. ఆ పూలతో, తంగేడు పూతతో బతుకమ్మను పేర్చేవారు. ఒక్కొక్కరి స్థోమతను బట్టి బతుకమ్మను
పేరుస్తారు. బతుకమ్మ ఒక సంరక్షిత దేవత. తెలుగువారు, అందులో తెలంగాణ వారు ప్రముఖంగా పూజించే దేవత బతుకమ్మ. బతుకమ్మ బొమ్మను వుంచాల్సిన పళ్లెం, ఆకులతో కాని,
వెదురుతో కాని చేసే వాళ్లు. గుమ్మడి పూలు పళ్లెంలో అమర్చి, చుట్టూ ఇతర పూలను చేర్చి, పసుపుతో తయారు చేసిన
బతుకమ్మ (గౌరమ్మ) ను వుంచేవారు. ఇలాంటివే మరికొందరు చేసిన వాటిని ఒక స్థలంలో వుంచి
పూజిస్తారు. ధర్మాంగ-సత్యవతి దంపతులకు లక్ష్మీదేవి కటాక్షం వల్ల పుట్టిన బిడ్డ
బతుకమ్మ. బతుకమ్మను ఆడేటప్పుడు పాటలు పాడుతూంటారు స్త్రీలు.
ఉదాహరణకు..."ఒక్కొక్క పూవేసి చందమామ, ఒక్క ఝాము ఆయె
చందమామ, పోయిరా గౌరమ్మా, పోయిరా
గౌరమ్మా, పోయి అత్తవారింట్లో గౌరమ్మా, బుద్ధిగా
వుండాలి గౌరమ్మా...." అనే పాటలు పాడేవారు. కథ చెప్పుకోవడం, బిస్తీ గీయడం, చెమ్మ చెక్క లాడడం, బతుకమ్మ పండుగలో భాగం. బతుకమ్మలను ఓ చోట చేర్చి స్త్రీలు లయబద్ధంగా పాటలు
పాడుతూ చప్పట్లు కొడుతూ ఆడుతుంటే మేమూ ఆనందించేవాళ్లం. ఓ గుడి ముందో, లేకపోతే ఎవరో ఒకరి ఇంటి ముందో దీనికి అనువుగా వుండే స్థలాన్ని ఎంపిక
చేసుకునేవారు. ఎనిమిది రోజులపాటు...అమావాస్య రోజున ఎంగిలి పువ్వుతో మొదలెట్టి,
తొమ్మిదో రోజున మా వూరు సమీపంలోని ముత్తారం పక్కన వున్న వూర చెరువు
దగ్గర చద్దుల బతుకమ్మ ఆడేవారు. ఆడి, బతుకమ్మను నీటి ఒడిలో
చేర్చేవారు. చద్దుల బతుకమ్మ రాత్రి బాగా పొద్దుపోయే దాకా ఆడేవారు. స్త్రీలతో పాటు
పురుషులు కూడా వచ్చి దూరం నుంచి చూసి ఆనందించేవారు. ఐదు రకాల ప్రసాదాలను ఆ పండుగలో
పంచి పెట్టే వారు. పెసర పప్పు, గోధుమ పిండి, బియ్యం పిండి, కొబ్బరి, అల్లంతో
తయారు చేసినవవి. ఒకప్పుడు తెలంగాణ మొత్తం విరివిగా ఆడే బతుకమ్మ, నగరాల్లో దరిమిలా దాదాపు కనుమరుగై, గ్రామాల్లో కూడా
అదే స్థితికి చేరుకుని, మళ్లీ ఇటీవలే తెలంగాణ జాగృతి పుణ్యమా
అని గత వైభవాన్ని గుర్తుకు చేస్తోంది. బతుకమ్మ పండుగను బలే ఎంజాయ్ చేసే వాళ్లం
మేం.
బాల్యంలో...ఆ మాటకొస్తే కొంచెం పెద్దైన తరువాత కూడా ఆనందంతో
జరుపుకున్న ఇతర పండుగలు దసరా, దీపావళిలు. దసరాకు, మా
ఊరూ-వాడా, వూరి బయట పైలు పెంట సమీపంలో, పాఠశాలకు ఎదురుగా, పాతిన జమ్మి చెట్టు దగ్గర
గుమిగూడి, "శమీ శమయతే పాపం, శమీ
శతృ వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య
ప్రియ దర్శనం" అంటూ ఒక కాగితం మీద రాసి, జమ్మి కొమ్మకి
గుచ్చి, రామ చిలుక దర్శనం చేసుకునే వాళ్లం. విజయ దశమి (దసరా)
కి, మా ప్రాంత పరిసరాలకి కొంత అవినాభావ సంబంధముంది. మా
వూరికి అతి సమీపంలో వున్న "బాణాపురం" గ్రామ సరిహద్దులలోని జమ్మి
చెట్టుపైనే, పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందర, వారి శస్త్రాస్త్రాలను వుంచారట. అదే విధంగా, సమీపంలోని
మరో గ్రామం నేలకొండపల్లిలో "విరాటరాజు గద్దె" వుంది. భీముడు వంట చేసిన
పెద్ద గాడి పొయ్యిలు కూడా వున్నాయి. ఇప్పుడా గద్దె పురా తత్వ శాఖ వారి ఆధీనంలో
వుంది. దసరా పండుగ రోజుల్లో మా ఇంట్లో బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేసేవారు. ఇక
వూరి బయట వున్న జమ్మి చెట్టు వద్ద, "యాట" (మేక పోతు కాని, గొర్రె కాని) ను బలి ఇచ్చేవారు.
సాధారణంగా గ్రామాల్లో దసరా పండుగ నాడు నివురు గప్పిన నిప్పులా వున్న తగాదాలే మన్నా
వుంటే బయట పడతాయి. ఒక ఏడాది మా వూళ్లో అదే జరిగింది. మా గ్రామ రాజకీయాలనే పూర్తిగా
మార్చి వేసిన ఆ వివరాలు మరో సందర్భంలో ప్రస్తావిస్తాను.
మేం ఆనందంగా జరుపుకుంటుండే మరో పండుగ దీపావళి. దీపావళికి
మా చిన్నతనంలో "రోలు-రోకలి"
అనే ఒక పనిముట్టును మా వూరి వడ్రంగితో తయారు చేయించేవారు నాన్న గారు.
అందులో పౌడర్ (పొటాషియంతో చేసిందను కుంటా)
లాంటిది వేసే రాపిడి కలిగించితే బాంబ్ ధ్వనితో మోగేది. అదే విధంగా, రాత్రిపూట కాల్చుకునే టపాసులు ఎంతో
ఆనందాన్ని కలిగించేవి. అన్ని టపాసుల్లోకి చీమ టపాకాయలు బలే మజా వచ్చేవి. దీపావళి
నాడు కాల్చగా మిగిలినవి బధ్రపర్చుకుని, కార్తీక పౌర్ణమికి
కాల్చే వాళ్లం. ఆ రోజున ముత్తారం దగ్గరలో వున్న వూర చెరువులో
దేవుడి "తెప్ప ఉత్సవం" జరిగేది.
దీపావళి పండుగకు ముత్తారం నుంచి దేవుడి ఉత్స విగ్రహాలను వూరేగింపుగా
మా వూళ్లోకి తీసుకొచ్చేవారు. కొఠాయి మీద వుంచి పూజలు చేసే
వాళ్లు. ఆ రోజంతా హడావిడే. చాలా సరదాగా
గడిచేది. ముక్కోటి ఏకాదశికి కూడా దేవుడు వూళ్లోకి వచ్చేవాడు.
ముక్కోటి రోజుల్లో జొన్న పంట "వూస బియ్యం"
తయారయ్యేవి. జొన్న కంకులలోంచి అవి కొట్టుకుని
వుడకబెట్టుకుని తింటుంటే బలే సరదాగా వుండేది.
మా ఇంటి ముందు భాగాన వున్న ధాన్యం పాతర్లు
మరో పండుగ "సంక్రాంతి". ఆ పండుగ రోజుల
నాటి గొబ్బిళ్లు, హరిదాసులు, "గంగిరెద్దులు",
రేగు పళ్లు....మళ్లీ మళ్లీ జ్ఞప్తికి వస్తున్నాయి.
సంక్రాంతికే పంటలు ఇంటికి చేరేవి. కల్లాలు పూర్తై,
ఎడ్ల బండ్లలో, "బోరాల" లో నింపుకుని పుట్లకు-పుట్ల ధాన్యం ఇంటికి వస్తుంటే బలే
ఆనందంగా వుండేది. మా జొన్న కల్లం మా ఇంటి పక్కనే తోటలో వేసే వాళ్లం.
ధాన్యం కొలవడానికి ఉపయోగించే "కుండ"
లు, "మానికలు", "తవ్వలు" "సోలలు", "గిద్దెలు" మా వూరి రైతుల్లో అతి కొద్ది మందికి మాత్రమే
వుండేవి. మా ఇంట్లో వుండేవి. ధాన్యం కొలవడానికి
మా ఇంటి నుంచి చాలా మంది తీసుకెళ్తుండేవారు. కుండకు పదిన్నర మానికలు...మానికకు రెండు తవ్వలు, నాలుగు సోలలు, పదహారు గిద్దెలు...తవ్వకు రెండు సోలలు, ఎనిమిది గిద్దెలు...సోలకు నాలుగు గిద్దెలు...ఇదీ కొలత. అలానే, ఐదు కుండలైతే
ఒక "బస్తా" ధాన్యం అవుతుంది.
అలాంటి ఎనిమిది బస్తాలు కలిస్తే ఒక "పుట్టి"
అవుతుంది. కొలత కొలిచేటప్పుడు కుండకు కాని,
మానికకు కాని, తవ్వకు కాని, సోలకు కాని, గిద్దెకు కాని, ధాన్యం
పూర్తిగా నిండి పై వరకు వచ్చే విధంగా పోయాలి. ఎడ్ల బండిపైన "బోరెం" వేసి, ఎనిమిది నుంచి
పది బస్తాల ధాన్యాన్ని నింపి ఇంటికి తోలేవారు. ధాన్యం ఇంటికి
చేర్చిన తరువాత, "పాతర" లో కాని,
"గుమ్ములు" లో, "ధాన్యం కొట్టుల" లో కాని భద్రపరిచేవారు.
మార్కెట్ అనుకూలంగా వున్నప్పుడు అమ్మేవారు. ఆ ధాన్యంలోనే
కొన్ని బస్తాలు మరుసటి సంవత్సరానికి విత్తనాలుగా ఉపయోగించేందుకు వేరే భద్రపరిచేవారు.
ఆశ్చర్యకరమైన విషయం....పంట కోసినప్పటి నుంచి,
ధాన్యం ఇంటికొచ్చే వరకు, లక్షలాది రూపాయల విలువ
చేసే ఆ పంట మొత్తం బహిరంగంగా పొలాలలో పడి వుండేది. రాజకీయ కొట్లాటలున్న
గ్రామాలలో తప్ప, మిగతా చోట్ల ఏ రైతుకు కూడా అభధ్రతా భావం వుండకపోయేది.
పొలంలో కల్లం పూర్తైన తరువాత, వూళ్లోని కొంత
మందికి "మేర" అని ఇచ్చే ఆచారం వుండేది. గ్రామంలోని కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి,
చాకలి, నీరుకాడు, షేక్ సింద్....ఇలా
కొద్ది మందికి కల్లంలో కొంత ధాన్యం వారు ఏడాది పొడుగూ చేసే పనులకు ప్రతిఫలంగా ఇవ్వడం
ఆనవాయితీ. ఆ ప్రక్రియ అంతా కళ్లల్లో మెదుల్తూంది.
అలానే శ్రీరామ నవమి, గోదా కల్యాణం పండుగలు. భద్రాచలంలో వలెనే ప్రతిసంవత్సరం శ్రీరామనవమి నాడు, ముత్తారంలో
కూడా కళ్యాణోత్సవం అశేష జనవాహిని మధ్య జరుగుతుంది. చుట్టుపక్కల
గ్రామాలనుండి వేలాది భక్తులు ఆ వేడుకను చూసేందుకు తరలి వస్తారక్కడికి. భద్రాచలంలో మధ్యాహ్నం జరిగే కళ్యాణోత్సవం, ముత్తారంలో
సాయంత్రం జరుగుతుంది. గోదాదేవి కళ్యాణం భోగి రోజున
జరుగుతుంది. సాధ్యమయినంతవరకు ఈ రెండు కార్యక్రమాలకు చిన్నతనం
నుండి నేటి వరకు హాజరవుతూనే వున్నాం. బాల్యంలో ఎద్దుల బండ్లు
కట్టుకొని, వాటిలో శివారు గ్రామమైన మావూరినుండి దేవుడు
పెళ్లి చూడడానికి ముత్తారం పొయ్యే వాళ్లం. కచ్చడపు బండ్లలో
కూడా వెళ్తుండే వాళ్లం అప్పుడప్పుడు. దేవుడు పెళ్లికి కొన్ని
గంటల ముందు-జరిగిన తర్వాత దేవాలయం పరిసరాలన్నీ కోలాహలంగా
వుండేవి. పల్లెటూళ్లల్లో ఆ సందడిని "తిరునాళ్లు" అని పిలిచే వాళ్లం. ఆ రోజున ఎక్కడెక్కడినుండో, చిరు వర్తకులు అక్కడ
కొచ్చి, తమ దుకాణాలను పెట్టి సరకులమ్మేవారు. పట్టణాలలో ఎగ్జిబిషన్ సందడిలాంటిదే కాసేపు కనిపించేది. ఇప్పటికీ దుకాణాలు పెటుతున్నప్పటికీ, బాల్యం నాటి
సందడికి మారుగా కొంచం పట్టణ వాతావరణం చోటుచేసుకుంటున్నట్లు అనిపిస్తుంటుంది.
ముత్తారం దేవుడి పెళ్లిలో మా పక్క గ్రామంలో నివసించే మా దాయాదులు,
వరుసకు పెదనాన్న గారైన వనం శ్రీరాం రావుగారి కుటుంబమంతా వచ్చేది.
ముత్తారంలోనే స్థిరపడి పోయిన వనం గోపాలరావు బాబాయింట్లో అందరం కలిసి
ఆనందంగా గడిపిన ఆ రోజులు జీవితాంతం గుర్తుంచుకునే మధురమైన జ్ఞాపకాలు.
మా గ్రామంలో ముస్లింలు పది-పదిహేను కుటుంబాల వరకున్నారు. వాళ్ల పండుగలను
హిందు-ముస్లింల ఐక్యతకు ప్రతీకగా జరుపుకునే వాళ్లం. అన్నింటిలోకి ప్రధానమైంది, అట్టహాసంగా
జరుపుకునే పండుగ "పీర్ల పండుగ". గ్రామంలో బత్తుల వారి ఇంటి సమీపంలో
"పీర్ల గుండం" వుంది. దాన్నిండా కణకణలాడే నిప్పులు పోసి, ఆ నిప్పుల్లోంచి పీర్లను ఎత్తుకునే వ్యక్తులు నడిచి పోతుంటే బలే గమ్మత్తుగా
వుండేది. మొత్తం పదకొండు "సరగస్తులు", దినం విడిచి
దినం జరుపుకునే వాళ్లం. పీరు అంటే ఒక పెద్ద పొడగాటి గడ లాంటి కర్రకు జండాలు కట్టి,
ఆ గడలను బొడ్లో దోపుకుని, హిందు-ముస్లిం అన్న తేడా
లేకుండా అందరూ ఎత్తుకుని ఆనందించేవారు. మా కుటుంబానికి వంశ పారంపర్యంగా
"హస్సేన్-హుస్సేన్" పీర్లుండేవి. ఏడవ సరగస్తు నాడు వాటిని
బయటకు తీసేవారు. కుదాయ్ సాహిబ్ వీటిని నిర్వహించేవాడు.
చిన్నతనంలో మా ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం (రాత్రవుతుండగానే)
జరిగే ఒక కార్యక్రమం నాకింకా గుర్తుంది. మాది
పెద్ద వ్యవసాయం. జీతగాళ్లు కూడా పది మందికి పైగా వుండేవారు.
రోజువారీ కూలీకి వచ్చే వాళ్లు కూడా కొందరుండేవారు. పొలం పనులు చూసుకుని ఇంటికి తిరిగొచ్చి, పశువులకు ఆ
రోజుకు వేయాల్సిన దానా, ఇతర పనులు పూర్తైన తరువాత జీత
గాళ్లకు "పొగాకు" పంచే
కార్యక్రమం మొదలయ్యేది. జీత గాళ్లకు ఏటా ఇచ్చే జీతంతో పాటు,
ఏడాదికి రెండు జతల చెప్పులు, ప్రతి రోజు
తాగడానికి (పీల్చడానికి) పొగాకు (లేదా బీడీలు) ఇవ్వడం ఆనవాయితీ. మా నాన్న గారు ఒక కుర్చీలో కూచుని, హుందాగా ప్రతి
రోజు పొగాకు కాడల పంపకం చేసేవారు. ఒకే సారి నెలకో-పదిహేను రోజులకో కలిపి ఇవ్వక పోయేవారు. పొగాకు
పంపిణీ జరిగే సమయంలోనే ఆ రోజు పొలం పనులను సమీక్షించేవారు. జీత
గాళ్లకు పొగాకు ఇవ్వడానికి మేం పొగాకు పంట కూడా వేసే వాళ్లం మొదట్లో. ఆ తరువాత రోజుల్లో పొగాకు పంట వేయడం ఆపుచేశాక బీడీలు పంపకం చేసే వాళ్లం.
జ్వాలా గారూ !
మీ బాల్యపు స్మృతులు ఎన్నో అంశాల్ని స్పృశిస్తూ విజ్ఞానదాయకంగా ముందుకు సాగుతున్నాయి. ఎక్కడికక్కడ మీరు ప్రస్తావిస్తున్న వివిధ పదాలను వివరిస్తూ ముందుకు సాగండి. అప్పుడే మీ రచన మరింత ప్రయోజనాత్మకం కాగలదు. అంచేత విస్తర భీతి లేకుండా వివరణాత్మకంగా రాయండి.
' తెలంగాణ జాగృతి' పుణ్యమా అని బతుకమ్మ పండుగ గత వైభవాన్ని సంతరించుకుంటున్నది సరే. తెలంగాణ జాగృతి వారు అమాయకపు తెలంగాణ పల్లె పడుచులలా స్వచ్చందంగా బతుకమ్మ ఆడడం లేదే ? ' మీ పరిశ్రమ కాడికొచ్చి బతుకమ్మ ఆడతం. ఎన్ని లక్షలిస్తవ్ బిడ్డా ! ' అంటూ జాగృతి కార్యకర్తలు బెదిరింపుగా ముందే ఫోన్లు చేసి కప్పం వసూలు చేసుకున్న తరువాతే అక్కడికొచ్చి బతుకమ్మ ఆడుతున్నారనేది జగమెరిగిన సత్యమే కదా ! మరి జాగృతి బతుకమ్మ పండుగ పురావైభావాన్ని ఇనుమడింపజేస్తున్నదనే ఇంకా మనం నమ్ముదామా ?
ఎంగిలి పువ్వు, బిస్తీ గీయడం, కచ్చడపు బండ్లు వగైరా పదాలను అక్కడికక్కడే వివరిస్తే బాగుండేది. నేనైతే ఈ పదాల్ని మొదటిసారిగా వింటున్నాను.గొన్నన బళ్ళు (గొనప బళ్ళు), గొల్లెన బళ్ళు, కొల్లారు బళ్ళు వగైరాల గురించి కొంత వినివున్నాను. బహుశా కచ్చడపు బళ్ళు అంటే గూటి బళ్ళవలె మొత్తం చెక్కతో గూడులానిర్మించి వెనుకపక్క తలుపు ఉండే బళ్ళా ? పోతే కుప్ప నూర్చినప్పుడు కళ్ళాల్లో ధాన్యం 'మేర' తీసుకునే వివిధ వృత్తిదారుల్లో మీరు పేర్కొన్న 'నీరుకాడు' అంటే వెట్టివాడేనా ? (మా ప్రాంతంలో పొలాలకి వెట్టి వాళ్ళే నీరు పెట్టేవారు). ఇకపోతే' షేక్ సింద్' అనే పదమే నాకు కొరుకుడు పడలేదు.నాకు తెలిసిన మేరకు దళితుడికి జీతభత్యాలు ఇవ్వకుండా వెట్టివాడుగా గొడ్డు చాకిరీ చేయించుకుంటూ అప్పుడప్పుడూ వాడికి చెయ్యి విదిలిస్తుంటారు గ్రామ పెత్తందార్లు.' షేక్ సింద్' వెట్టివాడికంటే ఒక మెట్టు పైన ఉంటాడు. అతడు సాధారణంగా ముస్లిం అయివుంటాడు.అతడికి గ్రామస్తులు ఫలసాయం అనుభవించమని కొంత ఊరుమ్మడి పొలం ఇచ్చి అతనిచేత ఊడిగం చేయించుకుంటూ ఉంటారు. కరెక్టేనా ?
చివరిగా ఒక ముఖ్యమైన విషయం. నేలకొండపల్లిలో విరాటరాజు గద్దె ఉన్నదనీ, ఆ
గ్రామ సమీపంలోని బాణాపురంలోని జమ్మిచెట్టు మీదనే పాండవులు తమ ఆయుధాల్ని దాచిపెట్టి విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేశారని మీరు నమ్ముతున్నట్లుంది.కాని శాస్త్రజ్ఞులు తేల్చినదేమ౦టే
విరాటరాజు మత్స్య దేశానికి రాజు. అతని రాజధాని వైరాట నగరం. రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్పూర్ కి
పశ్చిమంగా ఉన్నదే మత్స్య దేశం. జైపూర్ కి నలభై మైళ్ళ దూరంలో ఉన్న బైరాట్ నగరమే నాటి విరాట రాజు రాజధాని అయినట్టి వైరాట నగరం.
ఏమైనా మీ స్మృతులు మథురంగా ఉన్నాయి. వీటికి తోడు ఎక్కడికక్కడ సంక్లిష్ట పదాలకు వివరణలు కూడా జతచేస్తే మీ రచన వినోదంతోబాటు చదువరులకు విజ్ఞానాన్నీ పంచగలదు.
మీ.. ముత్తేవి రవీంద్రనాథ్.
రవీంద్రనాథ్ గారు...మీకు నా సమాధానం...
ReplyDeleteజ్వాలా గారూ !
మీ బాల్యపు స్మృతులు ఎన్నో అంశాల్ని స్పృశిస్తూ విజ్ఞానదాయకంగా ముందుకు సాగుతున్నాయి. ఎక్కడికక్కడ మీరు ప్రస్తావిస్తున్న వివిధ పదాలను వివరిస్తూ ముందుకు సాగండి. అప్పుడే మీ రచన మరింత ప్రయోజనాత్మకం కాగలదు. అంచేత విస్తర భీతి లేకుండా వివరణాత్మకంగా రాయండి.
' తెలంగాణ జాగృతి' పుణ్యమా అని బతుకమ్మ పండుగ గత వైభవాన్ని సంతరించుకుంటున్నది సరే. తెలంగాణ జాగృతి వారు అమాయకపు తెలంగాణ పల్లె పడుచులలా స్వచ్చందంగా బతుకమ్మ ఆడడం లేదే ? ' మీ పరిశ్రమ కాడికొచ్చి బతుకమ్మ ఆడతం. ఎన్ని లక్షలిస్తవ్ బిడ్డా ! ' అంటూ జాగృతి కార్యకర్తలు బెదిరింపుగా ముందే ఫోన్లు చేసి కప్పం వసూలు చేసుకున్న తరువాతే అక్కడికొచ్చి బతుకమ్మ ఆడుతున్నారనేది జగమెరిగిన సత్యమే కదా ! మరి జాగృతి బతుకమ్మ పండుగ పురావైభావాన్ని ఇనుమడింపజేస్తున్నదనే ఇంకా మనం నమ్ముదామా ?
కేవలం, జాగృతి బతుకమ్మ ఆటను పాపులర్ చేసిందన్న నేపధ్యంలోనే తప్ప, వారి బెదిరింపులను నేను సమర్థించే ఉద్దేశంతో రాయలేదు.
ఎంగిలి పువ్వు, బిస్తీ గీయడం, కచ్చడపు బండ్లు వగైరా పదాలను అక్కడికక్కడే వివరిస్తే బాగుండేది.
"ఎంగిలి పువ్వు" అనే ప్రక్రియ అమావాస్య నాడు బతుకమ్ముల ఆరంభ సంరంభం...."బిస్తీ గీయడం" అంటే, ఇద్దరు స్త్రీలు ఒకరి చేతుల్లో క్రాస్ గా మరొకరి చేతులు వేసి గిర-గిరా తిరిగే ఆట...."కచ్చడపు బండ్లు" అంటె చిన్న గుడిసె ఎద్దుల బండ్లు. దొరలు, దొరసానులు ప్రయాణించడానికి ఉపయోగించే చిన్న బండ్లు
నేనైతే ఈ పదాల్ని మొదటిసారిగా వింటున్నాను.గొన్నన బళ్ళు (గొనప బళ్ళు), గొల్లెన బళ్ళు, కొల్లారు బళ్ళు వగైరాల గురించి కొంత వినివున్నాను. బహుశా కచ్చడపు బళ్ళు అంటే గూటి బళ్ళవలె మొత్తం చెక్కతో గూడులానిర్మించి వెనుకపక్క తలుపు ఉండే బళ్ళా ?
పోతే కుప్ప నూర్చినప్పుడు కళ్ళాల్లో ధాన్యం 'మేర' తీసుకునే వివిధ వృత్తిదారుల్లో మీరు పేర్కొన్న 'నీరుకాడు' అంటే వెట్టివాడేనా ? (మా ప్రాంతంలో పొలాలకి వెట్టి వాళ్ళే నీరు పెట్టేవారు).
నీరు కాడు అంటే వరిపొలాలకు నీరు పెట్టేవాడే!
ఇకపోతే' షేక్ సింద్' అనే పదమే నాకు కొరుకుడు పడలేదు. నాకు తెలిసిన మేరకు దళితుడికి జీతభత్యాలు ఇవ్వకుండా వెట్టివాడుగా గొడ్డు చాకిరీ చేయించుకుంటూ అప్పుడప్పుడూ వాడికి చెయ్యి విదిలిస్తుంటారు గ్రామ పెత్తందార్లు.' షేక్ సింద్' వెట్టివాడికంటే ఒక మెట్టు పైన ఉంటాడు. అతడు సాధారణంగా ముస్లిం అయివుంటాడు.అతడికి గ్రామస్తులు ఫలసాయం అనుభవించమని కొంత ఊరుమ్మడి పొలం ఇచ్చి అతనిచేత ఊడిగం చేయించుకుంటూ ఉంటారు. కరెక్టేనా ?
"షేక సింద్"....వూళ్లో పోలీస్ పటేల్, మాలీ పటేల్, పట్వారీ వ్యవస్థలున్న రోజుల్లో, ఒక గ్రామ చప్రాసీలాగా పని చేసే వ్యక్తి. అతనే కులంవాడైనా కావచ్చు. సాధారణంగా ముస్లిం కాని, దూదేకుల కానీ అయి వుంటారు.
చివరిగా ఒక ముఖ్యమైన విషయం. నేలకొండపల్లిలో విరాటరాజు గద్దె ఉన్నదనీ, ఆ గ్రామ సమీపంలోని బాణాపురంలోని జమ్మిచెట్టు మీదనే పాండవులు తమ ఆయుధాల్ని దాచిపెట్టి విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేశారని మీరు నమ్ముతున్నట్లుంది.కాని శాస్త్రజ్ఞులు తేల్చినదేమ౦టే విరాటరాజు మత్స్య దేశానికి రాజు. అతని రాజధాని వైరాట నగరం. రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్పూర్ కి పశ్చిమంగా ఉన్నదే మత్స్య దేశం. జైపూర్ కి నలభై మైళ్ళ దూరంలో ఉన్న బైరాట్ నగరమే నాటి విరాట రాజు రాజధాని అయినట్టి వైరాట నగరం.
నేలకొండపల్లిలో విరాటరాజు గద్దె విషయాన్ని పురాతత్వ శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు. అక్కడే భీముడు (వలలుడు) వంట చేసిన గాడి పొయ్యిలున్నట్లు కూడా వాళ్లు ధృవీకరించారు.
ఏమైనా మీ స్మృతులు మథురంగా ఉన్నాయి. వీటికి తోడు ఎక్కడికక్కడ సంక్లిష్ట పదాలకు వివరణలు కూడా జతచేస్తే మీ రచన వినోదంతోబాటు చదువరులకు విజ్ఞానాన్నీ పంచగలదు.
మీ.. ముత్తేవి రవీంద్రనాథ్.
జ్వాలా నరసింహారావు
ప్రియమైన జ్వాలా గారూ !
ReplyDeleteమహాభారతం ప్రకారం మత్స్య దేశానికి రాజధాని వైరాట నగరం.కురుక్షేత్ర సంగ్రామ కాలంలో దానికి ప్రభువు విరాట రాజు. భారత యుద్ధంలో విరాటరాజును ద్రోణుడు సంహరిస్తాడు. గంగా యమునల మధ్య చేది రాజ్యాన్ని స్థాపించిన ఉపరిచర వసువు యొక్క ఐదుగురు కుమారుల్లోని మత్స్యుడనేవాడి పేరిట ఈ రాజ్యమేర్పడింది.ఉపరిచర వసువు ప్రథమ కుమారుడైన బృహద్రథుడు చేది రాజ్యానికి తూర్పుగా, గంగానది దక్షిణతీరంలో మగధ రాజ్యాన్ని స్థాపించగా, మత్స్యుడు ఘూర్జర దేశానికి సమీపంలో మత్స్య రాజ్యాన్ని స్థాపించాడు. మహాభారతంలోని కర్ణ పర్వంలోని ఒక శ్లోకం మత్స్య దేశ ప్రజలను సత్య సంధులని వర్ణించింది.మత్స్య, ఘూర్జర రాజ్యాలు రెండూ సమీప రాజ్యాలు (Neighboring Kingdoms). ప్రస్తుత రాజస్థాన్ రాష్ట్రంలోని బైరాట్ నగరమే ఒకప్పటి విరాట రాజు పాలించిన మత్స్య దేశానికి రాజధాని అని చారిత్రకులు నిర్ధారించారు. రాజస్థాన్ లోని ధోల్పూర్, భరత్ పూర్ ప్రాంతాలలోని పర్వతమయ రాజ్యమే మత్స్యదేశమని సువిఖ్యాత చరిత్రకారుడు సి.వి.వైద్య తన 'Epic India' గ్రంథంలో పేర్కొన్నారు.(పేజీ 19). జరాసంధుడి దాడులకు తట్టుకోలేక సాటి ఉత్తర భారత రాజ్యాలైన పాంచాల, శూరసేన రాజ్యాల ప్రజల వలెనే మత్స్య దేశస్థులు కూడా పశ్చిమ దిశగా పలాయనం చిత్తగించారట. ఒకప్పుడు నేటి రాజస్థాన్ రాష్ట్రానికి నైరుతి భాగంలో స్థాపించబడిన ఘూర్జర రాజ్యం అనంతర కాలంలో పశ్చిమ సముద్రంలోని కచ్, కాంబే సింధుశాఖల వరకు విస్తరించింది. ఘూర్జర రాజ్యం పేరు మీదుగానే గుజరాత్ ఏర్పడింది.
చరిత్ర పరిశోధకులు పలు అంశాలను లోతుగా పరిశీలించి మత్స్య దేశం యొక్క భౌగోళిక ఉనికిని నిర్ధారించారు.అజ్ఞాతవాసం ముగియగానే పాండవుల సేనలు, విరాటరాజు సేనలు ఉపప్లావ్యం అనే ప్రదేశంలో విడిస్తే, అక్కడినుంచి కౌరవుల వద్దకు శాంతి దూతగా బయలుదేరిన కృష్ణుడు హస్తినాపురం చేరేలోపు మార్గమధ్యంలో ఏయే ప్రాంతాలను దాటుకుంటూ వెళ్ళాడో, వాటి మధ్య దూరాలు ఎంత ఉండి ఉంటాయో కూడా శాస్త్రీయంగా నిర్ధారించారు. యమునా నది, వృకస్థల, దశార్ణ దేశం, పాంచాల దేశం, శూరసేన దేశం, యకృత్ లోమానః ,కురుక్షేత్ర మొదలైన ప్రదేశాల భౌగోళిక ఉనికిని ఖచ్చితంగా నిర్ధారించి, వాటి ఆధారంగా
రాజస్థాన్ లోని జైపూర్ కి తూర్పు దిశగానూ, ధోల్పూర్, భరత్ పూర్ పర్వతమయ ప్రాంతాలకు పశ్చిమ దిశగానూ ఉన్న ప్రదేశమే ఒకప్పటి మత్స్య దేశమని తేల్చారు. జైపూర్ కి నలభై మైళ్ళ దూరంలో ఉన్న నేటి
బైరాట్ నగరమే నాటి విరాటరాజు రాజధాని అని కూడా నిర్ధారించారు.
పాండవులు యమునా నదీ తీరం నుంచి, రోహితక, శూరసేన రాజ్యాల భూభాగాలగుండా దశార్ణ దేశానికి ఉత్తర దిశగా ప్రయాణించి మత్స్య దేశ రాజధాని వైరాట నగరం చేరుకున్నట్లు భారతంలో చేసిన వర్ణననుబట్టి కూడా మత్స్య దేశం, వైరాట నగరం యొక్క ఉనికిని సశాస్త్రీయంగా నిర్ధారించారు.
పైపెచ్చు మత్స్యదేశం బౌద్ధ, జైన సాహిత్యాల్లో ప్రస్తావించబడిన షోడశ మహాజనపదాలలో ఒకటి. ఆ పదహారు రాజ్యాలూ ఇవి: మగధ, కోసల, వత్స, అవంతి,అంగ, కాశి, వైశాలి, మల్ల, చేది, కురు, పాంచాల, మత్స్య, శూరసేన, గాంధార, కాంభోజ, అశ్మక రాజ్యాలు.
కొందరు మితిమీరిన ప్రాంతీయ అభిమానంతో ఎక్కడెక్కడో జరిగిన గాథలను తమ ప్రాంతానికి ముడిపెట్టే ప్రయత్నాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. వాటికి మనం పెద్దగా Credence ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడి మత్స్య దేశం, ఎక్కడి వైరాట నగరం ? ఎక్కడి నేలకొండపల్లి ?
ఈ విషయంలో మీతో విభేదిస్తున్నందుకు బాధ కలుగుతున్నా, 'స్పర్థయా
వర్ధతే విద్యా' అని మనసా వాచా నమ్మేవాడిగా, నా భిన్నాభిప్రాయాన్ని నిర్మొగమాటంగా మీకు తెలపక తప్పడం లేదు. శాస్త్రీయ దృక్పథంతో సానుకూల ధోరణితో ఆలోచించాల్సిందిగా మనవి.
మీ కృషి మున్ముందు కూడా అవిరళంగా సాగాలని కోరుకుంటూ--
మీ... ముత్తేవి రవీంద్రనాథ్.
sir,
ReplyDeleteI am 20-25 years younger than you and grew up in a village near karimnagar.By reading this, i am reliving my childhood. My experiences were exactly same.
thanks for sharing..
sr