బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన 1600 సంవత్సరంలో రాయల్ చార్టర్ ద్వారా జరగడంతో మన దేశంలో ఆంగ్లేయుల పాలనకు అంకురార్పణ మొదలైంది. డచ్, బ్రిటిష్ కంపెనీలతో పాటు అడుగుపెట్టిన ఫ్రెంచ్ కంపెనీ అంతగా పురోగతి సాధించ లేకపోయింది. జహంగీర్ వంటి మొఘల్ చక్ర వర్తులతో బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులు సత్సంబంధాలు పెంపొందించుకోసాగారు. దరిమిలా సూరత్ లోనూ ఈస్ట్ ఇండియా కంపెనీ వెలిసింది. బాంబే, ఈస్ట్ ఇండియా కంపెనీకి దక్కడంతో, పదిహేడవ శతాబ్ది ఆరంభానికల్లా, వాణి జ్యపరంగా పటిష్ఠమైన స్థితికి చేరుకున్నారు ఆంగ్లేయులు.
మొఘలాయి సామ్రాజ్యం-దాని చక్రవర్తి ఔరంగజేబు పతనంతో భారతావనిలో చోటుచేసుకున్న అనిశ్చిత స్థితి బ్రిటీష్ వారికి కలిసొచ్చిందనాలి. నాదిర్ షా లాంటి వారి దండయాత్రలు మొదలయ్యాయి. ఢిల్లీలో రక్తపాతం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ వదిలి వెళ్లిన నాదిర్ షా, తన వెంట, మొఘల్ సామ్రాజ్య గుర్తుగా మిగిలిన "నెమలి సింహాసనం" తీసుకెళ్లాడు. ఒకటి వెంట మరొకటిగా ఏడు దండయాత్రలు జరిగాయప్పట్లో. కష్టాల కడలిలో మునుగున్న భారతదేశంలో బ్రిటీష్ ఆధిపత్యానికి మార్గం సుగమం అయింది. అప్పటికే, బ్రిటీష్ ప్రభుత్వ ఆదాయంలో పది శాతానికి పైగా ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచే రాసాగింది. ఆంగ్లేయులకు, ఫ్రెంచ్ వారికి మధ్య సుదీర్ఘంగా జరిగిన పోరాటంలో విజయం సాధించిన బ్రిటన్ భారత దేశంలో అధికారానికి చేరువై, సిపాయిల తిరుగుబాటు నాటికి పట్టు సాధించింది.
1857 నాటి సిపాయిల తిరుగుబాటులో మొఘలాయుల చివరి చక్రవర్తి బహదూర్ షా జఫర్, తాంతియా తోపే, రాణి ఝాన్సీ లక్ష్మి బాయి లాంటి వారు పాల్గొన్నారు. బ్రిటన్ లోని పార్లమెంటరీ ప్రభుత్వం, అప్పటివరకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన స్థానంలో, నేరుగా పాలన సాగించాలని నిర్ణయం జరిగింది. వాస్తవానికి, సిపాయిల తిరుగుబాటు పూర్వ రంగంలోనే, ఒక మోస్తారు సాంస్కృతిక విప్లవం, భారతావనిలో వేళ్లూనుకోవడమే కాకుండా, రాజకీయ చైతన్యానికి కూడా బీజాలు పడ్డాయి. 1885 లో లార్డ్ డఫరిన్ ఆశీస్సులతో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం జరిగింది. ఆదిలోని కాంగ్రెస్ మితవాద భావాల అధినాయకత్వం ఒక వైపు బ్రిటీష్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూనే, మరొక వైపు, పరోక్షంగా ప్రభుత్వ వ్యతిరేకతకు పునాదులు వేయ సాగింది. బెంగాల్ విభజన నిర్ణయం దేశ వ్యాప్త ఆందోళనకు దారితీసింది. నోబెల్ బహుమతి గ్రహీత రబీంద్రనాథ్ ఠాగూర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడారప్పట్లో. స్వదేశీ ఉద్యమం, విదేశీ వస్తువుల బహిష్కరణ నినాదం ఊపందుకుంది. ఉద్యమకారులపై ప్రభుత్వ దమన కాండ తీవ్రతరమైంది. పంజాబ్ నుంచి లాలా లజపత్ రాయ్, సర్దార్ అజిత్ సింగ్ ల బహిష్కరణ, బాల గంగాధర తిలక్, అరబిందో ఘోష్ ల నిర్బంధం, బెంగాల్ విభజన వ్యతిరేక ఆందోళన, భారత జాతీయోద్యమానికి పునాదులు బలంగా నాటాయి. ఆద్య తన భవిష్యత్ లో, స్వాతంత్ర్యోద్యమం ఊపందుకునేందుకు సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపించసాగాయి.
ప్రధమ ప్రపంచ సంగ్రామంలో బ్రిటన్ కూరుకుపోయిన సమయంలోనే, స్వదేశీ ఉద్యమం బలపడ సాగింది. పూనా కేంద్ర కార్యాలయంగా, హోం రూల్ లీగ్ స్థాపించిన తిలక్ దేశ వ్యాప్తంగా పర్యటించి, దేశ ప్రజలందరూ ఐకమత్యంగా ఉద్యమించాలని చేసిన విజ్ఞప్తికి అన్నీ బీసెంట్ సహకారం లభించింది. హోం రూల్ ఉద్యమ లక్ష్యం పూర్ణ స్వరాజ్యమనేది స్పష్టమైపోయింది ఆంగ్లేయ పాలకులకు. ఇంతలో, మహాత్మా గాంధి నాయకత్వంలో స్వాతంత్ర్యోద్యమం బలపడ సాగింది. ఆయన "అహింస" నినాదంతో దూసుకు పోయారు. దక్షిణాఫ్రికాలో ఆపాటికే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించిన మోహన్ దాస్ కరంచంద్ గాంధి, బాంబేలో కాలుపెట్టిన వెనువెంటనే, జాతీయోద్యమానికి నాయకత్వం వహించమన్న నినాదం మొదలైంది. గాంధీ నిర్ణయం తీసుకునే లోపుగానే, రౌలట్ చట్టం తీసుకొని వచ్చిన బ్రిటీష్ ప్రభుత్వం, విచారణ జరపకుండా, రాజకీయ ఖైదీలను శిక్షించి, జైలుకు పంపించే అధికారాన్ని ప్రొవిన్షియల్ ప్రభుత్వాలకిచ్చింది. విశ్వసనీయతను కోల్పోయిన ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, "ఆత్మ గౌరవం" నినాదంతో. సత్యాగ్రహ ఉద్యమానికి పిలుపిచ్చారు మహాత్మా గాంధి.
పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్ లో, ఏకైక ఇరుకైన ద్వారమున్న ఒక ప్రదేశంలో, బైసాఖి పండుగను జరుపుకునేందుకు శాంతియుతంగా సమావేశమైన అమాయక ప్రజలపై దారుణ-మారణ కాండ జరిపించాడు జనరల్ డయ్యర్. వేలాదిమంది మరణించారా సంఘటనలో. దేశ వ్యాప్తంగా విషాదం చోటు చేసుకున్న ఆ సంఘటన దరిమిలా, సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు మహాత్మా గాంధి. ఆబాల గోపాలం మద్దతు లభించిందా ఉద్యమానికి. లక్షలాది మంది ప్రజలు, తారతమ్యాలు మరిచి, ఒక్క మాట మీద నిలబడి ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. దురదృష్ట వశాత్తు చౌరీచౌరా సంఘటనలో పాతిక మంది పోలీసులు ప్రజాగ్రహానికి గురై చంప బడడంతో, గాంధి ఉద్యమాన్ని నిలుపుదల చేశారు. ఆ నిర్ణయం వల్ల గాంధీని కొందరు విమర్శించినప్పటికీ, ఆయన తిరుగులేని నాయకత్వం కొనసాగింది. ప్రజల హృదయాల్లో ఆయనపై నున్న అభిమానం చెరిగిపోలేదు. జవహర్లాల్ నెహ్రూ పూర్ణ స్వరాజ్ నినాదంతో త్రి వర్ణ పతాకాన్ని రావి నది ఒడ్డున ఎగురవేయడం, శాసనోల్లంఘన ఉద్యమాన్ని గాంధి మొదలెట్టేందుకు సంపూర్ణ మద్దతును భారత జాతీయ కాంగ్రెస్ ప్రకటించడం, స్వతంత్రం పొందే దిశగా కదిలేందుకు దోహద పడింది.
గాంధీజీ పిలుపు మేరకు ఆరంభం కానున్న శాసనోల్లంఘన ఉద్యమం రూపురేఖలెలా వుండబోతున్నాయో తెలుసుకోవాలన్న ఆసక్తి కేవలం భారతీయులలోనే కాకుండా, బ్రిటీష్ ప్రభుత్వంలోనూ కలిగింది. అనుకున్న రోజునే, సబర్మతీ ఆశ్రమం నుంచి, ఉప్పు సత్యాగ్రహం కొరకు "దండి" యాత్ర గాంధీ సారధ్యంలో మొదలైంది. దాన్నంత పెద్దగా పట్టించుకోవద్దుకున్న బ్రిటీష్ ప్రభుత్వానికి ఉద్యమం ఉధృతం అవగాహనైంది. అరెస్టుల పర్వం మొదలైంది. గాంధి, త్యాబ్జీ, సరోజినీ నాయుడు లను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. "బ్రిటీష్ ప్రభుత్వం ఉద్యమాన్ని అదుపుచేసేందుకు ఆయుధాలను ఉపయోగించినప్పటికీ, అదరకుండా-బెదరకుండా, ఎదురుతిరగకుండా, వెనుకంజ వేయకుండా, భారతీయులు ముందుకు సాగడంతో, ఆంగ్లేయులు శక్తిలేని వారై పోవడం-భారతీయులు అజేయులు కావడం జరిగింది" అని శాసనోల్లంఘనం గురించి లూయి ఫిషర్ వర్ణించారు.
లండన్ లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధులెవరు హాజరు కాకపోవడంతో, నాటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ గాంధీజీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇరువురి మధ్య సమావేశం జరిగింది. గాంధి-ఇర్విన్ ఒప్పందం దరిమిలా రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు గాంధి. నిరాశతో స్వదేశానికి రావడం మినహా ఒరిగిందే మీ లేదు. ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో ఆంగ్లేయులకు మద్దతిచ్చి, ప్రతిఫలంగా, సంపూర్ణ స్వరాజ్యం పొందాలని భారత జాతీయ కాంగ్రెస్ భావించింది. ఇంతలో, జిన్నా ముస్లిం లీగుతో, కాంగ్రెస్ నాయకత్వానికి అభిప్రాయ బేధాలొచ్చాయి. పాకిస్తాన్ ఏర్పాటు తన లక్ష్యంగా ప్రకటించాడు జిన్నా. యుద్ధానంతరం డొమైన్ హోదా కల్పిస్తామని బ్రిటీష్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను గాంధి తిరస్కరించడంతో 1947 వరకు పరిష్కారం దొరకని స్థితికి పరిస్థితులు చేరుకున్నాయి.
గాంధీజీ నాయకత్వంపై భారత జాతీయ కాంగ్రెస్, ప్రజలు, యావత్ భారతావని, అపారమైన నమ్మకం పెట్టుకున్నారు. ఆయన పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమానికి, విజయమో-వీర స్వర్గమో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. నాటినుంచి కౌంట్ డౌన్ మొదలైంది. స్వాతంత్ర్యం సిద్ధించే సూచనలు కనపడ సాగాయి. 1946 లో లార్డ్ మౌంట్ బేటన్ ఢిల్లీకి రావడంతో రాజకీయ ప్రాధాన్యత పెరిగింది. ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో నేర్చుకున్న పాఠాలతో భారత దేశాన్ని వదిలిపెట్టి పోవాలన్న నిర్ణయానికొచ్చింది బ్రిటీష్ ప్రభుత్వం. హఠాత్తుగా వదిలిపెట్టకుండా, అధికార మార్పిడికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను మౌంట్ బేటన్ కు అప్ప చెప్పిన బ్రిటీష్ ప్రభుత్వం, భవిష్యత్ లో భారత దేశంతో సత్సంబంధాలు కొనసాగేట్లు చూడమని సూచించింది. విభజన తప్పని పరిస్థితులు అప్పటికే చోటు చేసుకున్నాయి.
అశేష ప్రజానీకం ఎదురు చూసిన రోజు ఆనంద-విషాదాల మధ్య రానే వచ్చింది. ఆగస్టు పదిహేను 1947 అర్థ రాత్రి ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కలిగింది భారత దేశానికి. మరో రెండు రోజులకు పాకిస్తాన్ మరో స్వతంత్ర దేశంగా ఏర్పాటవడంతో భారతావని రెండుగా చీలిపోయింది. చీలిక కోరుకున్న వారిలోను, కోరుకోని వారిలోను, ఎందరో తమకిష్టం వున్నా-లేకపోయినా, తర-తరాలుగా తాముంటున్న ప్రదేశాలను వదిలి, సుదూరంగా వెళ్లాల్సిన పరిస్థితులొచ్చాయి. జాతి పిత మహాత్మా గాంధికి మాత్రం, తాను కోరుకున్న స్వతంత్రం సిద్ధించినా, కోరుకున్న రీతిలో సిద్ధించనందుకు సంబరాలకు దూరంగా, శాంతిని కాంక్షిస్తూ గడిపారు. ఢిల్లీలో వుండమని ఆయనకు చేసిన విజ్ఞప్తికి స్పందించలేదాయన. “సంబరాలు జరుపుకునేందుకు ఏం మిగిలింది? దేశ విభజన తప్ప” అన్నారాయన. ఆగస్టు పదిహేను అర్థ రాత్రి జవహర్లాల్ నెహ్రూ "ట్రిస్ట్ విత్ డెస్టినీ" ఉపన్యాసం వినకుండా నిద్రించిన మహాత్మా గాంధి తెల్లవారు ఝామున నిద్రలేచి, ఆయన వుంటున్న "హైదరీ హౌజ్" నుంచి మార్నింగ్ వాక్ కు బయలు దేరగానే ఆయన్ను ఒక్క సారన్నా చూద్దామని అశేష జన వాహిని ఆయనను అనుసరించారట. నడక ముగించుకుని తిరిగి రాగానే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వపు నూతన మంత్రివర్గం ఆయన ఆశీస్సులకొరకు వచ్చారట. "ముళ్ళ కిరీటాన్ని" ధరించమని వారితో అన్నారట గాంధి. అహింసకు కట్టుబడమని, అసత్యం పలకొద్దని, వినయ విధేయతలతో మెలగమని, సహన శీలంతో మసలుకోవాలని, అధికారం అంటే అప్రమత్తంగా వుండాలని, భారతదేశంలోని గ్రామాల్లో నివసిస్తున్న పేద గ్రామీణులకు సేవచేసేందుకే అధికారమని వారికి బోధించారట మహాత్ముడు. ఆయన బోధనలను కొన్నైనా గుర్తుంచుకున్నప్పుడే, స్వతంత్ర భారతదేశంలో వుండే అర్హత మనకుందనుకోవాలి. ఆగస్టు పదిహేనున ఇదే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి.
anukokundaa 'koodali' tiragestunte- naa rendu blaagula naduma nee article kanipinchi chadivanu. bahusa ye patrkaku ayinaa pampivundaalsindi= bhandaru srinivasarao
ReplyDeleteTwo articles one on Quit India published by Andhra jyothy on 8th August and the other on Independence day published on 14th August could be seen by clicking:
ReplyDeletehttp://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/aug/8/edit/8edit3&more=2010/aug/8/edit/editpagemain1&date=8/8/2010
http://www.suryaa.com/main/s.howNews.asp?cat=1&subCat=7&ContentId=58580
Jwala