Friday, June 10, 2011

జనరిక్‌ ఔషధాలతో అందుబాటులో ఆరోగ్యం: వనం జ్వాలా నరసింహారావు

జనరిక్‌ ఔషధాలతో అందుబాటులో ఆరోగ్యం

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (10-06-2011)

అటకెక్కనున్న రాజీవ్‌ ఆరోగ్య శ్రీ?, నాలుగోవంతు వ్యయంతోనే జనరిక్‌ మందులు, ప్రభుత్వ రంగానికి అవకాశాలు, అవాంఛనీయ పోటీలో మందుల మార్కెట్‌, ఆసుపత్రులలో ఉచిత ఔషధాలకు అవకాశం….

ఆరోగ్య వైద్య రంగంలో సంస్కరణలంటే, ఇల్లు పీకి పందిరి వేయడమనే ఆలోచన తప్ప మరోటి కాదనే రీతిలో వ్యవహరిస్తోంది ప్రభుత్వం. ఆరోగ్య-వైద్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, కడప ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికే అన్నట్లు, దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమై, అశేష జనాదరణ పొందిన రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలను అటకెక్కించే దిశగా చర్యలు చేపట్టారు. కాకపోతే తద్వారా రాబోయే అపవాదునుంచి బయట పడేందుకు, మరో ఆచరణ సాధ్యం కాని ప్రణాళికను సిద్ధం చేసుకుని, దానికి ముఖ్య మంత్రి ఆమోద ముద్ర కూడా వేయించుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మందు చీటీలు ఇవ్వడం కాకుండా, అన్ని రకాల మందులను ఉచితంగా అక్కడికక్కడే అందచేయడం దాని లక్ష్యం. ఇక ముందు, రోగులు మందులను బయట మార్కెట్ కు వెళ్ళి కొనుక్కోవాల్సిన పనిలేదు. ఇలా ఉచితంగా ఇవ్వాల్సిన మందులను, ఆసుపత్రులే కంపెనీల ద్వారా కొనుగోలు చేసి, రోగులకు ఇవ్వనున్నదన్న మాట. దీని కొరకు మందుల కొనుగోలు బడ్జెట్ ను రు. 400 కోట్లకు పెంచారు. ఇంతవరకు బాగానే వుంది కాని, నాలుగు వందల కోట్ల రూపాయలను వ్యయం చేసి, "బ్రాండెడ్" మందులను కొనుగోలు చేసే బదులు, దానిలో నాలుగో వంతు వ్యయం చేస్తే, "జనరిక్" మందులను కొనగలమని, తద్వారా, ప్రభుత్వానికి ఖర్చు తగ్గించవచ్చని ఆలోచన చేసి వుండాల్సింది. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా "జనరిక్" మందుల అమ్మకం చేసే పథకం అమలు చేయగలిగితే, ఆసుపత్రులలో మందులు నిల్వ వున్నా లేకపోయినా, సరసమైన ధరలకు అవి లభ్యమయ్యే సదుపాయం కలిగించినట్లవుతుంది. బీద-సాద, ఆర్థికంగా వెసులుబాటు లేనివారికి ఇదెంతో ప్రయోజనకారి అవుతుంది.

భారతదేశంలోని అలోపతి ఔషధ ఉత్పత్తుల పరిశ్రమ, ప్రపంచంలోని ఐదు పెద్ద పరిశ్రమలలో ఒకటిగా చెప్పుకుంటారు. ఆ పరిశ్రమలో వున్న సంస్థలన్నీ వారు ఉత్పత్తిచేసే మందులకు, ఆకర్షణీయమైన పేర్లను పెట్టి, మార్కెటింగ్ విధానాలను చేపట్టి, అమ్మకాల ద్వారా లాభాలు చేసుకుంటారు. ఒకే రకమైన రసాయన మిశ్రమానికి సంబంధించి, అనేక పేర్లతో మందులు మార్కెట్లో వుండడం, ఒకే రకమైన శరీర రుగ్మతకు, ఒక్కో డాక్టర్, ఒక్కో మందు పేరును సూచించడం, రోగులు కూడా మందును "బ్రాండెడ్" పేరుతోనే (ఉదాహరణకు క్రోసిన్, కాంబీ ఫ్లాం) గా గుర్తుంచుకోవడం ఆనవాయితీ. అలాగే ధరల నిర్ణయం కూడా ఉత్పత్తిదారుల ఇష్టా ఇష్టాల మీదే ఆధారపడి వుండేది. భారత దేశంలో అనుసరిస్తున్న ఆ విధానం, అలా ఉత్పత్తి చేయగల సామర్థ్యం ప్రపంచ ఔషధ ఉత్పత్తుల పారిశ్రామిక వేత్తల దృష్టిని ఆకర్షించింది. విదేశీ బహుళజాతి సంస్థలు భారత దేశంలో ఉత్పత్తులు చేసి లాభాలను ఆర్జించడం మొదలెట్టారు. 1979 లో ప్రభుత్వం ఔషధ విధానం రూపొందించింది. ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వు (డిపిసిఓ) గా పిలువబడే ఆ విధాన నిర్ణయం దరిమిలా, వివిధ రకాల మందుల ధరలను ఒక పద్ధతి ప్రకారం నియంత్రించింది ప్రభుత్వం. ఆ విధానానికి అడపాదడపా మార్పులు-చేర్పులు కూడా చేస్తుంది ప్రభుత్వం. అయితే ఇక్కడో విషయం తెలుసుకోవాలి. అలోపతి ఔషధ విషయకమైన మందుల పరిధిలోని కీలక అంశాలపై అధ్యయనం చేసి, విచారణ జరిపి, దిద్దుబాటు చర్యలపై నివేదిక సమర్పించడానికి, 1974 సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం, రాజ్యసభ సభ్యుడు జైసుఖ్ లాల్ హాతి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. హాతీ కమిటీలోని అరవై మంది నిపుణులు, శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి రూపొందించిన సమగ్రమైన నివేదిక వాస్తవానికి వెలుగు చూడలేదనే అనాలి.

ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ ప్రజా వైద్యుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, సీపీఎం పక్షాన రాజ్యసభ సభ్యుడుగా వున్న రోజుల్లో, పదిమందితో కూడిన పార్లమెంటరీ హెల్త్ కన్సల్టేటివ్ కమిటీలో ఆరేళ్ల పాటు సభ్యుడుగా చేసింది ప్రభుత్వం. ఆ కమిటీ సభ్యుడుగా, డాక్టర్ రాధాకృష్ణమూర్తి, దేవెగౌడ, గుజ్రాల్, వాజ్‌పేయి ప్రభుత్వాలలో ఐదుగురు ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులతో సంప్రదింపులు చేసే అవకాశం కలిగింది.

ఎమర్జెన్సీ అమల్లో వున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నివేదికను తొక్కి పట్టింది ప్రభుత్వం. బడా పారిశ్రామిక వేత్తలకు లాభాలను ఆర్జించి పెట్టే పద్దతికి స్వస్తి చెప్పే రీతిలో నివేదిక వుందని వారంతా పసి గట్టారు. భారతీయ పద్దతులను అనుసరించి మందులను ఉత్పత్తి చేసే ఇతర పారిశ్రామిక వేత్తలకు సిఫార్సుల వల్ల మేలే జరుగుతుంది. హాతీ కమిటీ నివేదిక అమలవుతే, ఔషధాల ఉత్పత్తిలో నాణ్యత మెరుగయ్యే అవకాశాలతో పాటు, ధరల నియంత్రణకు మార్గం సుగమం అవుతుంది. ప్రయివేట్ రంగం వెనక్కు తగ్గి, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఎక్కువ అవకాశాలొచ్చే వీలు కూడా కలిగేది. భారతదేశ ప్రజల అవసరాలకు తగ్గట్లు ఔషధ ఉత్పత్తులు జరిగుండేవి. పటిష్టమైన ఔషధ నాణ్యతా పద్దతులను పాటించాలని, "బ్రాండ్ నేమ్" మిషతో రోగులను లూటీ చేసే విధానానికి స్వస్తి పలకాలని నివేదికలో సిఫార్సు చేసింది కమిటీ. ఎమర్జెన్సీ ఎత్తి వేసిన తర్వాత, అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం కూడా పారిశ్రామిక వేత్తల పక్షమే వహించి, నివేదికను కనుమరుగు చేసింది. నివేదిక ప్రతులను కొందరు స్వప్రయోజన పరులు తగుల బెట్టిన సందర్భాలు కూడా వున్నాయి. బహుశా ఆ నివేదిక ప్రతులు, ఒకటి-రెండే మైనా మిగిలి వుంటే, ఏదైనా మెడికల్ గ్రంథాలయంలో వుండొచ్చు.

హాతీ కమిటీ నివేదికలోని ఒక ప్రాముఖ్యతాంశం, ఆసుపత్రులలో వుంచాల్సిన "అత్యవసర ఔషధాల జాబితా" లో ఏమేమి వుండాలనేది. అదే విధంగా కెమికల్ ఫార్ములాతో కాకుండా, జనరిక్-బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి మందుల విడుదలకు సంబంధించిన అంశం. మార్కెట్లో ఇరవై ఐదు వేల రకాల మందులుండేవి. ఒక్క "బీ-కాంప్లెక్స్" ఫార్ములా మందు, వంద పేర్లతో లభ్యమవుతుంది. అలానే యాస్ప్రిన్, పారాసిటమాల్, యాంటీ బయాటిక్, ఇతర మందులు. ఏ విధమైన ఉపయోగం లేని మందులనేకం మార్కెట్లో వుంటాయి. టానికులు, మల్టీ విటమిన్ల సంగతి చెప్పాల్సిన పనే లేదు. అవాంఛనీయ పోటీలో మందుల మార్కెట్ ముందుంటుంది. అలాంటి లోపాలను అధిగమించే పలు చర్యలను కమిటీ సిఫార్సు చేసింది. ప్రాధమిక ఆరోగ్య రంగానికి సుమారు వందకు పైగా, ఆ పైన మరి కొన్ని అదనంగా, మొత్తం మీద వందల సంఖ్యలో మందులు సరిపోగా, మార్కెట్లో వేల సంఖ్యలో ఎందుకుండాలని కూడా నివేదిక ప్రశ్నించింది.

ఎప్పుడైతే ఆ నివేదికను-నివేదికలోని ముఖ్యమైన అంశాలను బుట్ట దాఖలా చేశారో, "ఢిల్లీ సైన్స్ ఫోరం", "మెడికో ఫ్రెండ్స్ సర్కిల్", ఫిజీషియన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్", సౌత్ ఇంటర్నెట్" లాంటి సంస్థలు, నివేదిక అమలుకు ఆందోళన చేయసాగాయి. ఆ సంస్థలన్నీ, నివేదిక సిఫార్సులు సమాజానికి అత్యంత లాభదాయకమైన వని విశ్వసించాయి. సీపీఎం వైద్య విభాగం, నెల్లూరుకు చెందిన డాక్టర్ జె. శేషా రెడ్డి, రాధాకృష్ణమూర్తి ప్రభృతులు ఆందోళనలో అగ్ర భాగాన నిలిచారు. పశ్చిమ బెంగాల్ సీపీఎం శాఖను సంప్రదించి వాళ్లనూ ఆందోళనలో దింపారు. నెల్లూరులో ఒక సమావేశాన్ని నిర్వహించి, పలువురు వైద్యులను ఆహ్వానించారు. వచ్చినవారిలో, పశ్చిమ బెంగాల్ నుంచి-కేరళ నుంచి ఇద్దరు డాక్టర్లు, ఒక అడ్వకేట్-డాక్టర్ బాంబే నుంచి వున్నారు. బాంబేకు చెందిన "శ్రీమతి డాక్టర్ అశోక్ ధవే అడ్వకేట్" ఎంబిబిఎస్ చేసి, ఎల్ ఎల్ డి పట్టా పుచ్చుకున్న అరుదైన వ్యక్తి.

రెండు రోజుల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ పథకాన్ని రూపొందించుకున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి, పలు రాష్ట్రాలలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి మరికొందరు వీరితో కలిశారు. కర్నూలుకు చెందిన డాక్టర్ బ్రహ్మానందరెడ్డి, నెల్లూరుకు చెందిన డాక్టర్ విజయకుమార్, విజయవాడకు చెందిన డాక్టర్ ఎం రామారావు, గుంటూరుకు చెందిన అధ్యాపకుడు లక్ష్మారెడ్డి లాంటివారిని కలుపుకుని, మరో మారు 1986 లో సమావేశమైన డాక్టర్ రాధాకృష్ణమూర్తి ప్రభృతులు, బుట్ట దాఖలు చేసిన హాతీ కమిటీ నివేదికను వెలుగులోకి తెచ్చే ఉద్యమ్నాన్ని ఉదృతం చేయాలని నిర్ణయించారు. వ్యక్తిగతంగా డాక్టర్ రాధాకృష్ణమూర్తి, పలు ప్రదేశాలలో తిరిగి, డాక్టర్లను ఉద్యమంలోకి దింపేందుకు ప్రోత్సహించి, వారి మద్దతు కూడగట్టుకున్నారు. ఆ సంవత్సరాంతానికి కలకత్తాలో అఖిల భారత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఆందోళనను తీసుకెళ్లారు.

కలకత్తాలో జరిగిన రెండు రోజుల సమావేశానికి ఎంపిక చేసిన సుమారు వంద మంది డాక్టర్లు హాజరయ్యారు. సీపీఎం నాయకుడు స్వర్గీయ ఇఎంఎస్ నంబూద్రిపాద్, పశ్చిమ బెంగాల్ శాఖ కార్యదర్శి చౌదరి కూడా వున్నారు. సమావేశంలో పార్టీ సహాయం-సలహా అడిగారు డాక్టర్లు. హాతీ కమిటీ నివేదికలోని "ఔషధ విధానం" తో పాటు, వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ లకు సంబంధించిన పలు అంశాలపై కూడా ఆందోళన చేపట్టమని పార్టీ సూచించింది. అయితే, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ను కలుపుకుని పోతే మంచిదని, నంబూద్రిపాద్ అభిప్రాయ పడ్డారు. వీలైనంత మందిని ఉద్యమంలో భాగస్వామ్యులను చేసి, వైద్య-ఆరోగ్య వ్యవస్థను ప్రక్షాళన చేసే చర్యలు కూడా చేపట్టి తే మంచిదని సూచించారాయన. సీపీఎం అనుబంధ సంస్థగా వుండే కన్నా, విస్తృత సంస్థగా, అందరినీ కలుపుకొని పోతే మంచిదన్న నిర్ణయం తీసుకున్నారు. అలా డాక్టర్ల విశాల వేదిక మొదలైంది. డాక్టర్ రాధాకృష్ణమూర్తి తన వంతుగా ఖమ్మం జిల్లాలో బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. జిల్లాలో జరిగిన ప్రతి ఐఎంఏ సమావేశంలో వైద్య-ఆరోగ్య వ్యవస్థను ప్రక్షాళనకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తి చర్చకు పెట్టేవారు. అయితే, ఐఎంఏ సభ్యుల్లో అతి కొద్దిమంది మాత్రమే ప్రజాస్వామ్య భావాలున్న వారని, స్వలాభం చూసుకునేవారు ఎక్కువ మందని, నైతిక విలువలకు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా పలువురు వ్యతిరేకంగా మాట్లాడేవారని గ్రహించారు డాక్టర్ రాధాకృష్ణమూర్తి.

హాతీ కమిటీ ముఖ్యాంశాలు సజీవంగా వున్నప్పటికీ, బుట్ట దాఖలా మాత్రం అయ్యాయి. నివేదికలోని అంశాలు కనీసం కొంతవరకైనా వెలుగు చూసినట్లైతే బాగుండేదేమో. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, ఉచితంగా ఆసుపత్రులలో మందుల పంపిణీ చేయాలన్న నిర్ణయాన్ని, హాతీ కమిటీ సూచనలకు అనుగుణంగా చేసే ప్రయత్నం చేస్తే, అటు ప్రభుత్వానికీ లాభం-ఇటు ప్రజలకూ మేలు. ఆరోగ్య వైద్య శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి వైద్య పట్టా పుచ్చుకున్న వ్యక్తులై నందువల్ల ఈ విషయాలపై దృష్టి సారిస్తే మంచిదే మో! ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా మందులు పంపిణీ చేయాలన్న పథకం పది కాలాల పాటు అమలు కావాలంటే, ప్రభుత్వ నిధులు అనవసరంగా దుర్వినియోగం కాకుండా వుండాలంటే, జైసుఖ్ లాల్ హాతి కమిటీ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా అమలు చేయాలి.

No comments:

Post a Comment