లాస్ ఏంజల్స్ ప్రశాంత్ ఇంటి నుంచి డిస్నీ లాండ్ కు
వనం జ్వాలా నరసింహారావు
లాస్ ఏంజల్స్ లో ప్రశాంత్ వుండే ఫ్లాట్ నుంచి కాలిఫోర్నియా డిస్నీ లాండ్ పార్క్ వున్న "అనా హిమ్" ప్రదేశం సుమారు 40 మైళ్ల దూరంలో వుంటుంది. గంట సేపు ప్రయాణం. మర్నాడు అక్టోబర్ రెండు ఉదయాన్నే, ప్రశాంత్ కారులో, వాడు, మేం ముగ్గురం బయల్దేరాం. చంటిది-అదిథి (ప్రశాంత్ కూతురు) అక్కడి అడ్వంచర్స్ చూసి భయపడుతుందని, వాళ్లమ్మ శిల్ప చెప్పడంతో తల్లీ-కూతుళ్లను ఇంట్లోనే వుంచి మేం వెళ్లాం. అక్కడికి చేరుకుని, కారు పార్క్ చేసి, టికెట్ కొనుక్కుని పదింటి కల్లా డిస్నీ లాండ్ లోనికి వెళ్లాం. ప్రశాంత్ అంతకు ముందు ఒకటి-రెండు సార్లు వచ్చినా, మా అందరికి అదే మొదటిసారి.
అనా హిమ్, కాలిఫోర్నియా (అమెరికా) లోని "థీమ్ పార్క్” తో సహా, డిస్నీ లాండ్ పేరు మీద పారిస్, టోక్యో, హాంగ్ కాంగ్ లో కూడా థీమ్ పార్కులున్నాయి. రిసార్ట్స్ పేరు మీద, కాలిఫోర్నియా, పారిస్, హాంగ్ కాంగ్, అమెరికా-ఫ్లారిడాలోని ఆర్ లాండ్, జపాన్-టోక్యోకు సమీపంలోని ఉరయసులో వున్నాయి. 2014 లో షాంగాయిలో ఇలాంటిదే ఒకటి ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి చురుగ్గా.
థీమ్ పార్క్, అమ్యూజ్ మెంట్ పార్క్ ఒకరకమైనవే అనొచ్చు. పిల్లల దగ్గరనుంచి-పెద్దలవరకు, అన్ని వయసుల వారికి, స్త్రీ-పురుష భేదం లేకుండా, అందులోనూ, ఒక బృందంగా కలిసి వచ్చినప్పుడు, ఆనందాన్ని-ఆహ్లాదాన్ని అందించే ప్రదేశాలను థీమ్ పార్కనో-అమ్యూజ్ మెంట్ పార్కనో పిలుస్తారు. సాధారణంగా ప్రతిదినం మనం వుండే పరిసరాల్లో తీరిక సమయాల్లో వెళ్తుండే నగర పార్కులకు-ఆట స్థలాలకు, వీటికి చాలా తేడా వుంటుంది. అమ్యూజ్ మెంట్ పార్క్ కంటె థీమ్ పార్క్ లో ఎంటర్టైన్మెంట్ కు ఎక్కువ ప్రదేశంతో పాటు, విభాగాలు కూడా చాలా ఎక్కువగా వుంటాయి. ఎన్నో ఏళ్లు శ్రమ పడి రూపొందిస్తారు వీటిని. అక్కడున్న ప్రతి విభాగం వెనుక ఒక కథ-అడ్వంచర్స్-ఒక నిడివైన దృశ్యంతో పాటు, అక్కడ కొచ్చిన పర్యాటకులకు వివరణాత్మకంగా తెలియచేసే ఏర్పాట్లుంటాయి. అలాంటి అద్భుతమైన థీమ్ పార్కుల్లో, అత్యంత పరమాద్భుతమైంది కాలిఫోర్నియాలోని అనా హిమ్ డిస్నీ లాండ్ థీమ్ పార్క్. అమెరికా వెళ్లిన వారెవరైనా, ఏ మాత్రం వీలున్నా, ఇక్కడకు కాని-ఆర్ లాండ్ కు కాని పోకుండా వుండరు. ఇక పిల్లల సంగతి చెప్పనక్కరలేదు. అమెరికాలో నివసిస్తున్న వారైతే, ఏడాది పాసులనీ-నెల పాసులనీ తీసుకొని, వీలున్నప్పుడల్లా సందర్శిస్తుంటూనే వుంటారు.
అనా హిమ్-కాలి ఫోర్నియాలోని థీమ్ పార్క్, వాల్ట్ డిస్నీ సంస్థకు చెందిన "పార్కుల-రిసార్ట్సుల విభాగం" నిర్వహణలో నడుస్తుంది. వాల్ట్ డిస్నీ ప్రత్యక్ష పర్యవేక్షణ కింద రూపు దిద్దుకొని-నిర్మించబడిన ఈ ఏకైక డిస్నీ లాండ్ జులై 17, 1955 న పాత్రికేయుల ప్రివ్యూగా మొదలై, మర్నాటినుంచి పర్యాటకుల సందర్శన కొరకు ఆరంభమయింది. దేశాధ్యక్షులు, అధినేతలు, ప్రధాన మంత్రులు, ముఖ్యాతి ముఖ్యులతో సహా సుమారు పదికోట్లకు పైగా సందర్శకులు థీమ్ పార్కుకొచ్చారిప్పటివరకు. ఒక్క 2007 లోనే కోటిన్నరకు పైగా సందర్శకులొచ్చారని అంచనా. ఓ ఆదివారం నాడు, వాల్ట్ డిస్నీతన ఇద్దరు కూతుళ్లతో "గ్రిఫిత్ పార్క్" కు వెళ్లినప్పుడు, ఆయన మదిలో మొలకెత్తిన ఆలోచనే, అరవై ఏళ్ల తర్వాత డిస్నీ లాండ్ గా 1955 నాటికి రూపు దిద్దుకొంది.
జులై 17, 1955-ఆదివారం నాటి "అంతర్జాతీయ పాత్రికేయుల ప్రివ్యూ" ఆహ్వానితులైన అతిధులకు-పాత్రికేయులకు మాత్రమే పరిమితం చేశారు. హాలీవుడ్ కు చెందిన ముగ్గురు ప్రముఖ వాల్ట్ డిస్నీ స్నేహితులు-ఆర్ట్ లింక్ లెటర్, బాబ్ కమ్ మింగ్స్, రొనాల్డ్ రీగన్-యాంకర్లుగా వ్యవహరించిన అలనాటి ప్రివ్యూ ప్రత్యక్ష ప్రసారాలను అమెరికా వాసులెందరో వీక్షించారు. ఆ తర్వాత కొంతకాలానికి రొనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. ప్రపంచ చరిత్రలోనే క్లిష్టమైన-భారీ ప్రత్యక్ష టెలివిజన్ ప్రసారమది. మర్నాడు మొదటిసారి సందర్శకులను అనుమతించిన రోజున, తెల్లవారు ఝామునుంచే జనం మూగడం, మొదటి టికెట్ ను వాల్ట్ డిస్నీ సోదరుడు రాయ్ డిస్నీ స్వయంగా కొనుక్కోవడం, రెండో టికెట్ కొన్న వ్యక్తిని డేవిడ్ మెక్ ఫెర్సన్ గా గుర్తించడం జరిగింది. అతడికి జీవితాంతం అన్ని డిస్నీ పార్కులకు ఉచితంగా ఎప్పుడైనా వెళ్లేందుకు పాస్ ను ఇచ్చారు నిర్వాహకులు. సెప్టెంబర్ 1959 లో సోవియట్ రష్యా ప్రధాని నికితా కృశ్చేవ్ అమెరికాకు వచ్చినప్పుడు, డిస్నీ లాండ్ కు వెళ్లాలనుకున్న అతడి అభ్యర్థనకు అమెరికా అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా సానుకూలంగా స్పందించలేదు.
సర్వ సత్తాక ప్రతిపత్తి గల స్వతంత్ర రాజ్యాల భూభాగం తరహాలో పలు విభాగాలుగా-నాలుగు మూల స్థంబాల్లా, వుంటుంది పార్క్. ఒక విభాగంలో ప్రవేశించిన సందర్శకుడికి, అందులో పూర్తిగా మునిగిపోయి, దాన్నే తిలకిస్తూ, ఆనందిస్తూ, మరిన్ని విభాగాలున్నాయని గాని-వాటిని కూడా చూడాలని గాని అనుకోడు. వాటి ఉనికినే గుర్తించడు. ఆరంభంలోని "మెయిన్ స్ట్రీట్-యు. ఎస్. ఏ", "అడ్వంచర్స్ లాండ్", "ఫ్రాంటియర్ లాండ్", "ఫాంటసీ లాండ్", "టుమారో లాండ్" లకు తోడుగా దరిమిలా ఏర్పాటుచేసిన "హాలిడే లాండ్", "న్యూ ఆర్లియన్స్ స్క్వేర్", " క్రిట్టర్ కౌంటీ", "మిక్కీస్ టూన్ టౌన్" లు ఇక్కడి థీమ్ పార్క్ లోని ఆకర్షణలు.
సందర్శకులు మొట్ట మొదలు ప్రవేశించే ప్రదేశం "మెయిన్ స్ట్రీట్-యు. ఎస్. ఏ". అక్కడినుంచి నలు దిక్కులకు వారి-వారి అభిరుచులను బట్టి వెళుతుంటారు సందర్శకులు. మెయిన్ స్ట్రీట్ లో రైలు స్టేషన్, టౌన్ స్క్వేర్, సినిమా హాలు, సిటీ హాలు, ఎంపోరియం, దుకాణాలు, డబుల్ డెక్కర్ బస్ లాంటివి కనిపిస్తాయి. మేం ముఖ్యంగా "అడ్వంచర్స్ లాండ్" లోనే ఎక్కువ సమయం గడిపాం. వీటిలో "జంగిల్ క్రూజ్", "ఇండియానా జోన్స్ అడ్వంచర్", "టార్జాన్స్ ట్రీ హౌజ్" లున్నాయి. "జంగిల్ క్రూజ్" లో ఒక పడవలో ఎక్కించి సహజ సిద్ధంగా ఉన్న నదుల్లోంచి తీసుకెళ్తుంటే నిజంగా ఎంజాయ్ చేశాం. దారిలో నీళ్లల్లో-నీళ్ల పక్కన ఒడ్డుపైన, పాము, వినాయకుడి బొమ్మ, ఏనుగు, కోతి, ఎలుగుబంటులు, జిరాఫీ, సింహాలు, పులులు, రైనో, మొసలి, గిరిజన నృత్యం, మునులు --- ఇలా ఎన్నో కనిపిస్తాయి. ఒక చోట పక్కనున్న గోడమీద ఉర్దూలో ఏదో రాసి వుండడం కనిపించింది.
"ఇండియానా జోన్స్ అడ్వంచర్" భయంకరంగా అనిపించినా ఆహ్లాదకరంగా వుందనాలి. ఇండియానా జోన్స్ సినిమా ఆధారంగా రూపొందించారు దీన్ని. ఒక ఓపెన్ జీప్ లో కూర్చొబెట్టి, చీకటి గుహలగుండా, అత్యంత వేగంగా, బహుశా కంప్యూటర్ సహాయంతో తీసుకెళ్లారు. ఆసాంతం వ్యాఖ్యానం కొనసాగుతూనే వుంటుంది. జీపు అంతులేనన్ని కుదుపులుతో కదులుతుంటుంది. ఒక్కో చోట సరాసరి గుహను ఢీ కొట్టుకుంటున్నదా అనిపిస్తుంటుంది. కొద్ది నిమిషాల తర్వాత అక్కడినుంచి మరో చోటుకు వెళ్లాం. మరోచోట "టార్జాన్స్ ట్రీ హౌజ్" ను చూశాం. పెద్ద వట వృక్షం మీదకు నడుచుకుంటూ వెళ్ళే విధంగా అమర్చారు దీన్ని. పిల్లలు-ముఖ్యంగా మా అన్ష్ బాగా ఎంజాయ్ చేసాడిక్కడ.
కాసేపు డిస్నీ లాండంతా తిప్పే ట్రెయిన్ ప్రయాణం చేశాం. అది పోతుండే దారి పొడుగూ, అనేక దృశ్యాలు కనిపిస్తాయి. అన్నింటికన్నా ప్రధాన ఆకర్షణ "జలాంతర్గామి" లో ప్రయాణం. సగ భాగం నీటిలో-సగ భాగం నీటిపైనా ప్రయాణించే పడవలో సుమారు పావుగంట సాగిన ప్రయాణంలో సముద్ర గర్భంలో జరిగే అద్భుతాలెన్నో తిలకించే ఏర్పాట్లు చేసారు నిర్వాహకులు.
మధ్యలో దొరికిందేదో తిన్నాం. అప్పుడప్పుడు నేను-మా శ్రీమతి విశ్రాంతి తీసుకుంటుంటే, అన్ష్, ఆదిత్య, ప్రశాంత్ మరికొన్ని అడ్వంచర్స్ తిలకించారు. ఒకచోట ఎవరికి వారే నడుపు కొని పోయే ఆటోమేటిక్ కార్లలో రైడ్ చేశాం. నేను-మా శ్రీమతి ఒక దాంట్లో, ఆదిత్య-అన్ష్ ఒక దాంట్లో, ప్రశాంత్ ఒక్కడు ఒక దాంట్లో రైడ్ చేశాం. మరో ప్రదేశంలో వున్న "మిక్కీస్ టూన్ టౌన్" కు వెళ్లాం. అక్కడ "మిక్కీ మౌస్" ను కలిసి ఫొటోలు దిగాం. "నువ్వు నిజమైన మిక్కీ మౌస్ కాదు" అన్నాడు అతడితో అన్ష్. చీకటి పడుతుంటే, నీటి మధ్యలో ప్రదర్శకులు, పడవపై ఆహ్లాదకరమైన నృత్యం చేసుకుంటూ సందర్శకులకు కను విందు కలించేదే "ఫాంటాస్మిక్". ప్రధానంగా కాలిఫోర్నియా డిస్నీ లాండ్ లో ప్రదర్శించే దీన్ని తిలకించేందుకు సందర్శకులు కొన్ని గంటల ముందు నుంచే అక్కడకు చేరుకుంటారు. దొరికిన జాగాలో కూర్చుంటారు.
ఇదవుతూనే చివరిగా, ఆకాశంలో మన దీపావళి పండుగను మైమరిపించే టపాసుల కాల్పులు మధురానిభూతిని కలిగిస్తాయి. అవి అలా చూసుకుంటూ, విడిచి పోలేక, నడుచుకుంటూ కారు పార్క్ చేరుకొని ప్రశాంత్ ఇంటికి వెళ్ళిపోయాం రాత్రి పదకొండు గంటల సమయంలో.
No comments:
Post a Comment