జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-XIII
శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"
వరుడింట్లో వేడుకలు-వధువింటికి మళ్ళీ ప్రయాణం
వనం జ్వాలానరసింహారావు
ఖమ్మంలోని మా ఇల్లే విడిదిల్లు కూడా కావడం వల్ల, గృహ ప్రవేశం సొంత ఇంట్లో జరిగినట్లే అయింది. మామ గారింటినుంచి మా ఇంటికి రావడానికి ఎక్కువ సమయం పట్ట లేదు. ఆ రోజుల్లో (ఇప్పటికీ ఆ సాంప్రదాయం ఇంకా కొనసాగుతూనే వుంది) కొన్ని ఖర్చులను ఆడ-మగ పెళ్ళి వారు సమానంగా పంచుకునేవారు. ఉదాహరణకు పెళ్ళి ఫొటోలు, సన్నాయి మేళం, రవాణా చార్జీలు నిర్మొహమాటంగా చెరి సగం అనుకునేవారు. రవాణా చార్జీలు పెళ్ళికి వచ్చేటప్పుడు మగ పెళ్ళి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ ఆడ పెళ్ళి వారు చేయించేవారు. అంటే పెళ్ళికి తీసుకుని రావాల్సిన బాధ్యత వాళ్లదని అర్థం. ఇక పెళ్ళైన తర్వాత పెళ్ళి కూతురుతో తిరుగు ప్రయాణంలో ఖర్చంతా మగ పెళ్ళి వారిది. సన్నాయి ఖర్చూ అంతే. మాకు గుర్తున్నంతవరకూ, మా పెళ్ళికి ముందు చాలా మందికి వారిళ్లల్లో జరిగిన పెళ్ళిళ్లకు ఫొటోలు తీయించడం ఇంకా అలవాటు కాలేదు. ఖమ్మంలో మాతో పాటే కాలేజీలో చదువుకున్న వెంకట్రావుకు ఫొటో స్టూడియో వుండేది. ఆయనతోనే తీయించారు (బ్లాక్ అండ్ వైట్లోల) ఫొటోలు. బహుశా అప్పట్లో అదొక్కటే స్టూడియో అనుకుంటా. పెళ్ళికి ముందు జరిగిన ఒప్పందం ప్రకారం చెరొక కాపీ ఫొటోలన్నీ ఇవ్వాలని, ఖర్చు చెరి సగమని మా నాన్న-మామ గారు అనుకున్నారు. చివరికి ఎవరిచ్చారో గుర్తులేదు. అసలు ఫొటోలు తీయించిన ప్రధాన ఉద్దేశం, మా మామ గారి పెద్దకొడుకు డాక్టర్ రంగారావు గారు ఇంగ్లాండులో వుండి పెళ్ళికి రాలేకపోయినందున, అక్కడకు పంపించడానికని తర్వాత మా ఆవిడ చెప్పింది.
తిరుగు ప్రయాణం కూడా ఎద్దుల బండ్లలోనే అట్టహాసంగా జరిగింది. మా ఇద్దరిని పల్లకిలో కూర్చొబెట్టారు. ఖమ్మం నుండి తెల్లవారు ఝామున బయలుదేరి, వెంకటగిరి, లక్ష్మీ పురం, చిరు మర్రి మీదుగా మా వూరికి చేరుకున్నాం. దారిలో గ్రామం వచ్చినప్పుడల్లా, వూరు దాటిందాకా, పల్లకి ముందు సన్నాయి వాయించడం సాంప్రదాయంగా జరిగింది. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతుందని భావించి, ప్రతి గ్రామంలో అలా చేయొద్దని చెప్పాల్సి వచ్చింది. ఆ ప్రయాణంలోనూ నేను ధోవతి కట్టుకునే వుండడం కూడా తనకు నచ్చలేదని చాలా కాలం తర్వాత చెప్పింది మా ఆవిడ. మే నెల మొదటి తేదీన, ఉదయం సుమారు పది గంటల సమయంలో మా వూరికి చేరుకున్నాం. సాధారణంగా, సాంప్రదాయం ప్రకారం సాయంత్రం సమయంలో పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును గృహప్రవేశం చేయించడం ఆచారంగావస్తున్నది. అందువల్ల మా ఉభయులను, మా ఇంటికి కాకుండా, నాకు వరుసకు "నాయనమ్మ" అయిన మా పాలివారింటికి (వనం రంగనాయకమ్మ గారు) తీసుకెళ్లారు. స్నానం చేసి అలసటగా వుండడంతో మధ్యాహ్నం వరకూ నిద్ర పోయాం. భోజనానంతరం కూడా మళ్లీ కునుకు తీసిన గుర్తు. మా అవిడతో పాటు, వధువుతో సాంప్రదాయం ప్రకారం రావాల్సిన పుట్టింటి వారు కొందరొచ్చారు. ఆవిడ అక్క గార్లు జ్యోతి, హైమ(కూతుళ్లు చిన పాప, రుక్కు, రాణి); తమ్ముడు వెంకన్న; చెల్లెలు జుబ్బి; వదిన గారు కరుణ (కొడుకు భరత్ బాబు); ఇంట్లో నలబై సంవత్సరాలుగా చేదోడు-వాదోడుగా వుంటున్న చుక్కి వచ్చారు. అలానే మా మేనమామలు-వారి పిల్లలతో సహా, ఇతర బంధువులందరూ మా వెంట వున్నారు. అంతా కోలాహలం-సంబరం.
చీకటి పడుతూనే పూల పల్లకి సిద్ధం చేశారు. సాంప్రదాయం ప్రకారం వధూవరులను "ఊరేగించి" ఇంటికి తీసుకెళ్లాలి. ఊరేగించడానికి కూడా అర్థం వుంది. దీన్నే "ఊరు ఎరిగించడం" అని అంటారు. ఫలానా వాళ్లు దంపతులయ్యారనీ, భారతీయ సంస్కృతీ-సాంప్రదాయాల ప్రకారం భార్యాభర్తలకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వాలనీ వారిని ఎరిగిన వూరి వారందరికీ ఎరుక పరచడం కొరకు ఊరేగింపు జరుపుతారని అంటారు. అదలా వుంటే, ఆ వేడుక కూడా ఎంతో సరదాగా జరుపుకునే వేడుక. పూలపల్లకి వెంట బంధుమితృల కోలాహలం వుంటుంది. బాణా సంచా కాల్చారు. కమలాపురంలో వుండే మా బాబాయి వనం నరసింగరావు బాణా సంచా ఏర్పాటు చేసిన సంగతి మాకెవరికీ చివరవరకు తెలియదు. అదో సంబరం మితృలకు. ఐదారు గంటల వూరేగింపు తర్వాత సుమారు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఇంటికి చేరాం. ఇంటిముందు నూతన వధూవరులకు "దిష్టి తీయడం" కూడా సాంప్రదాయంలో భాగమే. ఎర్ర నీళ్లు వధూవరుల చుట్టూ తిప్పి దిష్టి తీశారు. మా వూళ్లోని మా ఇల్లు రెండస్థుల భవనం. "లేక్ వ్యూ" భవనం అనొచ్చు. మేడ మీద కూచొని చూస్తే సమీపంలో చెరువు-నిండా ఎప్పుడూ నీళ్లతో దర్శనమిస్తుంది. ప్రస్తుతం ఎవరూ వుండడం లేనందున జీర్ణావస్థలో వుందా ఇల్లు.
పెళ్లికొడుకు ఇంట్లో చేయాల్సిన మూడు నిద్రలల్లా, అనివార్య కారణాల వల్ల-ఆడ పెళ్లి వారి వెంట వచ్చిన వారంతా పల్లెటూరు వాతావరణంలో మరికొంత కాలం గడపాలన్న కోరికున్నందువల్ల, ఐదు నిద్రలయ్యాయి. అలా, ఐదు రోజుల పాటు మా ఇల్లంతా కోలాహలం-సందడి-సంబరంగా నిండిపోయింది. మా మామయ్యలందరి కీ చీట్లపేకల ఆటంటే చాలా ఇష్టం. అందులో "రెమీ" (పదమూడు ముక్కల ఆట) డబ్బులు పెట్టి ఆడడం మరీ ఇష్టం. వారితో పాటు మరికొందరు చేరారు. రెండు-మూడు బృందాలుగా ఐదు రోజులూ వీలున్నప్పుడల్లా ఆట కొనసాగుతూనే వుండేది. కారప్పూస, బూందీ మిశ్రమం, అటుకులు-బొంగు బియ్యం మిశ్రమం, చక్కిలాలతో పాటు ప్రతిరోజూ చేసే వేడి-వేడి పదార్థాలను ఆస్వాదించుకుంటూ, పేకాట ఆడే వాళ్లు. మధ్యలో కోప-తాపాలు కూడా వచ్చేవి-సర్దుబాటయ్యేవి. అదేందోకాని, ఆ అయిదు రోజులూ కొద్దో-గొప్పో వర్షం కురుస్తూనే వుంది. ఆ వర్షంలోనే వూళ్లో వాళ్లందరూ (మహిళలు) రావడం, కాసేపు పెళ్లికూతురితో-వారి బంధువులతో ముచ్చడించడంతో ఆడ పెళ్లి వారందరికీ కూడా సరదాగా గడిచింది. మాకు ఆరోజుల్లో ఇంటి పక్కనున్న తోటలో "మల్లె పూలు" విరివిగా పూసేవి. చీకటి పడుతూనే మల్లె పూల సువాసనతో ఇల్లంతా మరింత ఆహ్లాదకరంగా మారిపోయేది. ఎండాకాలం-ఆరు బయట-ఇంటిముందు తాటాకు పందిళ్లు-మేడపైన-ఎదురుగా చెరువు కనపడుతుంటే, ఆ ఆనందమే ప్రత్యేకం. అదంతా అందరం అనుభవించాం ఆ అయిదు రోజులు. ఐదు రోజుల్లో కనీసం రెండు రోజులు వధూవరులతో కోలాహలం మధ్య "మేజువాణి" చేయించారు.
నాలుగో రోజున మా వూళ్లో అంతర్భాగమైన ముత్తారంలోని రామాలయానికి వెళ్లాం అందరం కలిసి. "ముత్తారం-వనం వారి కృష్ణా పురం-కోదండ రామపురం" అనే మూడు గ్రామాలు ఒకే రెవెన్యూ గ్రామం (ముత్తారం) కింద-ఒకే పంచాయితీ (కృష్ణా పురం) కింద వుంటాయి. ముత్తారంలో నాలుగు వందల ఏళ్లనాటి పురాతన రామాలయం (భద్రాచలం రామాలయాన్ని అన్ని విధాల పోలిన) వుంది. మా పూర్వీకులు (వనం కృష్ణ రాయలు గారు) కట్టించారు. ఆయన భక్తికి మెచ్చిన సాక్షాత్తు భద్రాచల రాముడు, భద్రాచలం గుళ్లో వున్నట్లే ఇక్కడా దర్శనం ఇచ్చే విధంగా, విగ్రహాల రూపంలో ఆయనకు కనిపించి దేవాలయంలో ప్రతిష్టించబడ్డాడు. జీర్ణావస్థలో వున్న ఆలయాన్ని గ్రామస్థులంతా కలిసి, పర్చూరు ప్రసాద్ గారిచ్చిన భారీ విరాళంతో ఇటీవలే పునర్మించారు. మా ఇంటిలో శుభకార్యాలు జరిగినప్పుడల్లా అక్కడకు, సమీపంలోనే మా నాన్నగారు కరిణీకం చేస్తున్న ఆమ్మ పేటలోని వెలగొండ వెంకటేశ్వర స్వామి గుట్టమీద కి దైవ దర్శనానికి వెళ్లడం అనాదిగా వస్తున్నది. ముత్తారానికి కూడా ఎద్దుల బండ్లు కట్టుకొని వెళ్లాం. "కచ్చడం" బండిలో వధూవరులిద్దరం, మా నాచేపల్లి తాతయ్య ముదిగొండ వెంకట్రామ నరసయ్య గారు వెళ్లాం. బండిలో మా ఇంటినుంచి అక్కడకు చేరడానికి పట్టిన అరగంట సమయంలో, ముత్తారం ఆలయం గురించి, వనం కృష్ణరాయల గురించి మా తాతయ్య వివరించారు.
ఐదోరోజు ఉదయం పెళ్లి సారె పట్టుకొని మా బావమరిది డాక్టర్ వేణు మనోహర రావు, తోడల్లుడు జూపూడి హనుమంత్ ప్రసాద్ మా వూరికి ప్రసాద్ కారులో చేరుకున్నారు. ఆడ పెళ్లి వారు సాంప్రదాయంగా తెచ్చిన సారెను ఆ సాయంత్రం లాంఛనంగా రెండు-మూడు ఇళ్లల్లో ఇవ్వడంతో ఆ వేడుకా అయిపోయింది. ఆ తర్వాత సారె తెచ్చిన వాళ్లిద్దరు ఖమ్మం వెళ్లిపోయారు.
ఆ రోజే సత్యనారాయణ వ్రతం జరుపుకున్నాం. వ్రతానికి వూళ్లో పెద్దలను కొందరిని, బంధువులను పిలిచాం. ఆ రోజున అందరి భోజనాలయ్యే సరికి సాయంత్రం అయిదు గంటలయింది. సత్యనారాయణ వ్రతానికి వచ్చిన వారిలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు చాలామంది వున్నారు. అమ్మ పేట గ్రామానికి చెందిన అలనాటి స్థానిక ప్రముఖ రాజకీయ నాయకుడు కోయ వెంకట రావు, తీవ్రస్థాయిలో మాతో విరోధం వున్నప్పటికీ, ఆ రోజున వచ్చి కొంత సేపు మాతో సరదాగా గడిపాడు. ఒకప్పుడు మా నాన్నకు అత్యంత ఆప్త మితృడు-ప్రాణ స్నేహితుడూ అయిన వెంకట రావు, మా వల్లా పురం పెద్దనాన్న వనం శ్రీరాం రావు గారితో వచ్చిన విభేదాల కారణంగా-పక్క వూరి బాబాయి వనం నరసింగ రావు తో విభేదించిన కారణంగా, అప్పట్లో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో, మాతోనూ విరోధం కావాలనే తెచ్చుకున్నాడు. ఎంతో రాజకీయ భవిష్యత్ కలిగిన వెంకట రావు, తాగుడుకు బానిసై-రాజకీయాలలో నిలకడ లేకుండా పోయి, హత్యా రాజకీయాలకు బలైపోయాడు రెండేళ్ల తర్వాత.
మర్నాడుదయం, మే నెల ఆరవ తేదీన, మళ్ళీ బండి మీద ప్రయాణమయ్యి ముదిగొండ చేరుకున్నాం. అక్కడ రావులపాటి సత్యనారాయణ రావు గారింట్లో కాసేపుండి, కాఫీ-టీలు తాగి, మా మామ గారు పంపించిన కారులో ఖమ్మం చేరుకున్నాం. ఇక ఆ తర్వాత మూడురోజులు మళ్ళీ వధువింట్లో సత్యనారాయణ వ్రతం లాంటి కార్యక్రమాలు జరిగాయి.
హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది. అదే మా ఇద్దరిమధ్యనా జరుగుతున్నది.(Concluded)
No comments:
Post a Comment